భారత జీడీపీ భారీ పతనం.. తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలు.. ఆర్థిక మాంద్యం రాబోతోందా?

జీడీపీ కుదేలు

ఫొటో సోర్స్, Getty Images

భారత ఆర్థికవ్యవస్థను కరోనావైరస్ గట్టి దెబ్బ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏకంగా 23.9 శాతం కుంచించుకుపోయినట్లు అధికార అంచనాలు వెల్లడించాయి.

2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 23.9 శాతానికి పడిపోయిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం సాయంత్రం వెల్లడించింది.

దీనికి ముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతం వృద్ధి నమోదైంది.

అదే.. గత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.2 శాతంగా ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు తిరోగమించింది. ఏకంగా 23.9 శాతం కుంచించుకుపోయిందంటే కరోనావైరస్ ఎంత తీవ్రంగా దెబ్బతీసిందో అర్థమవుతోంది.

జీడీపీ
ఫొటో క్యాప్షన్, జీడీపీ పడిపోతూ వచ్చిందిలా...

కరోనావైరస్ వ్యాప్తి, దాన్ని అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వం 21 లక్షల కోట్ల రూపాయల మేర నగదు, ద్రవ్య సహాయం చేసినా.. వ్యాపారాలు, ఉద్యోగాలు, జీవనోపాధులు దారుణంగా దెబ్బతిన్నాయి.

1996లో భారత్ త్రైమాసిక గణాంకాలు విడుదల చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇంత ఘోరమైన పతనం ఎప్పుడూ రాలేదు. దీంతో దేశంలో ఆర్థిక మాంద్యం మొదలవుతుండవచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తదుపరి త్రైమాసికం - అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే (ఆర్థికవ్యవస్థ కుంచించుకుపోతే) ఆర్థిక మాంద్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు. అలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

ఏదైనా దేశంలో వరుసగా రెండు త్రైమాసికాలు ఆర్థికవ్యవస్థ కుంచించుకుపోతే, ఆ దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నట్లుగా పరిగణిస్తారు. భారతదేశంలో చివరిసారి 1980లో ఆర్థిక మాంద్యం వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన మాంద్యాల్లో అది నాలుగోది.

భారత్‌లో ఇప్పటివరకూ 36 లక్షలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఆదివారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 78,761 కొత్త కేసులు వచ్చాయి. ప్రపంచంలోని మరే దేశంలోనూ రోజు వారీగా కేసులు ఇంతగా పెరగలేదు.

అయినప్పటికీ.. దేశంలో కార్యకలాపాలు తిరిగి మొదలవుతున్నాయి. కారణం.. ఆర్థికపరంగా రెండో లాక్‌డౌన్‌ను భరించే స్థితిలే భారత్ లేదని నిపుణులు అంటున్నారు. తొలి త్రైమాసికంలో చాలా రోజులు అమలులో ఉన్న లాక్‌డౌన్ ప్రభావం తాజా జీడీపీ గణాంకాల్లో ప్రతిఫలిస్తోంది.

తొలి త్రైమాసికంలో అత్యధిక భాగం లాక్‌డౌన్‌లో ఉన్నందువల్ల ఈ గణాంకాలు ఆశ్చర్యం కలిగించవు.

జీడీపీ

వాస్తవ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండొచ్చు

- నిఖిల్ ఈనామ్దార్, బీబీసీ ఇండియా బిజినెస్ కరెస్పాండెంట్

‘‘రికార్డుల్లో ఎన్నడూ లేనంతగా జీడీపీ తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, లాక్‌డౌన్ వల్ల సమాచార సేకరణ సరిగ్గా జరగలేదు. ఈ గణాంకాలను మరిన్ని సార్లు సవరించే అవకాశం ఉంది.

చాలా మంది విశ్లేషకుల అంచనాల్లోని గరిష్ఠ స్థాయికి దగ్గర్లోనే అధికారిక గణాంకాలు ఉన్నాయి. కానీ, రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు) డేటా లేకపోవడం వల్ల, వాస్తవంగా దేశంలో ఉన్న ఆర్థికపరమైన దుస్థితికి ఈ గణాంకాలు అద్దం పట్టుండకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

హోటళ్లు, వాణిజ్యం, విద్యుదుత్పత్తి, తయారీరంగం, భవననిర్మాణ రంగం.. ఇలా భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రతి విభాగంలో తొలి త్రైమాసికంలో తీవ్రమైన పతనాలు నమోదయ్యాయి. సానుకూల వృద్ధి నమోదైంది ఒక్క వ్యవసాయ రంగంలోనే. ఆ రంగం 3.4 శాతం మేర వృద్ధి చెందింది.

ఏ రకంగా చూసుకున్నా భారత్ ఈ పరిస్థితి నుంచి వేగంగా కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత మూడు నెలల్లో వృద్ధి రేటు మళ్లీ ధనాత్మకంగా మారుతుందని ఆశించారు. కానీ, దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి.

వినియోగదారుల నుంచి డిమాండ్ ఇప్పుడప్పుడే పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. జనాలు అత్యవసరమైన వస్తువులను కొనేందుకు మాత్రమే బయటకు వస్తున్నారు. జీడీపీలో 60 శాతాన్ని ప్రభావితం చేసేది డిమాండే.

Presentational grey line
జీడీపీ

ఆర్థిక, ద్రవ్యపరంగా మరింత ఉద్దీపన కార్యక్రమాలు ఉండొచ్చని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ సంస్థ రీసెర్చ్ హెడ్ అభిమన్యు సోఫత్ బీబీసీతో అన్నారు.

ప్రభుత్వానికి పన్నులు, పన్నేతర ఆదాయాలు బాగా తగ్గిపోవడం, వ్యయం పెరగడం వంటి కారణాలతో ఆర్థికవ్యవస్థను గాడినపెట్టేందుకు తీసుకోగలిగే చర్యలు కూడా పరిమితంగానే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

కోవిడ్-19 రాకముందే భారత ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉంది. గత ఏడాది నిరుద్యోగ రేటు 45 ఏళ్ల అత్యధిక స్థాయిని తాకింది. వృద్ధి రేటు 4.7 శాతానికి పడిపోయింది. గత ఆరేళ్లలోనే అది అత్యల్పం. డిమాండు తగ్గిపోవడం, బ్యాంకులపై రుణాల భారం పెరిగిపోవడం వల్ల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది.

ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా కరోనావైరస్ మహమ్మారి మొదలైంది. మార్చి చివర్లో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. పరిశ్రమలు, వ్యాపారాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి.

లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి నెలలో 12.1 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్‌ఐఈ) అనే స్వతంత్ర మేధో సంస్థ లెక్కగట్టింది.

అయితే జూన్‌లో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి మొదలవడంతో కోట్ల మందికి మళ్లీ ఉపాధి దొరికిందని సీఎమ్ఐఈ పేర్కొంది.

ఇలా ఉపాధి తిరిగి పొందినవాళ్లలో చాలా వరకూ అసంఘటిత రంగాలకు చెందినవారని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చెందినవారని నిపుణులు అంటున్నారు.తయారీ మొదలుకొని, సేవలు, రిటైల్ వంటి రంగాల వరకూ చాలా సంస్థలు, పరిశ్రమలు ఇంకా కుదుటపడలేదు.

వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు బాగానే నడిచాయి. లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాలకు కోవిడ్ ఆలస్యంగా వ్యాపించడం ఇందుకు కారణాలు కావొచ్చు.

జీడీపీ

ఫొటో సోర్స్, Getty Images

జీడీపీ అంటే ఏమిటి?

ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు.

''జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా వంటిద''ని రీసెర్చ్ అండ్ రేటింగ్స్ సంస్థ కేర్ రేటింగ్స్‌కు చెందిన ఆర్థికవేత్త సుశాంత్ హెగ్డే అభివర్ణిస్తారు.

ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి పనితీరును, ఆయా పాఠ్యాంశాల్లో సదరు విద్యార్థి బలాబలాలను మార్కుల జాబితా ఎలా చెబుతుందో.. దేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాలు, అంశాల బలాబలాలను జీడీపీ ప్రతిఫలిస్తుంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవ్యవస్థ బాగుందో లేదో ఇది చూపుతుంది. మందగమనం ఉన్నట్లు జీడీపీ గణాంకాలు చూపుతున్నట్లయితే దానర్థం దేశ ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని. అంటే దేశంలో గడచిన సంవత్సరంతో పోలిస్తే దేశంలో తగినన్ని సరకులు, సేవలు ఉత్పత్తి కావటం లేదని.

భారతదేశంలో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) ప్రతి ఏటా నాలుగు సార్లు జీడీపీని లెక్కిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కించే ఈ గణాంకాలను ఆర్థిక పరిభాషలో త్రైమాసిక గణాంకాలు అంటారు.

అలాగే ప్రతి ఏటా వార్షిక జీడీపీ వృద్ధి గణాంకాలను కూడా సీఎస్ఓ విడుదల చేస్తుంది.

భారత్ వంటి అల్పాదాయ, మధ్యాదాయ దేశాలు.. పెరుగుతున్న జనాభా అవసరాలు తీరటానికి ప్రతి ఏటా అధిక జీడీపీ సాధించటం ముఖ్యమని భావిస్తారు.

వీడియో క్యాప్షన్, ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)