జీడీపీ వృద్ధిరేటులో పతనం మొదలైతే ఏం జరుగుతుంది

ఫొటో సోర్స్, copyrightNURPHOTO
- రచయిత, అలోక్ జోషి
- హోదా, సీఎన్‌బీసీ మాజీ ఎడిటర్
జీడీపీలో ప్రతికూల వృద్ధి అంటే ఏంటి, భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దాని పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పుడిదే అంశం చర్చనీయాంశంగా మారింది.
అయితే జీడీపీలో ప్రతికూల వృద్ధి గురించి చర్చించే ముందు అసలు జీడీపీ వృద్ధి అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. చాలామంది జీడీపీ వృద్ధి అంటే ఏంటి, దానివల్ల ఏం జరుగుతుందని చాలామంది ప్రశ్నిస్తుంటారు.
ముఖ్యంగా జీడీపీ వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సందేహాలు ఎక్కువగా వస్తుంటాయి.
1990లో జీడీపీ వృద్ధిరేపు 3.5% వరకు ఉండేది. దీనిని హిందూ వృద్ధి రేటు (హిందూ రేట్ ఆఫ్ గ్రోత్) అని అనే వారు. ప్రొఫెసర్ రాజ్‌కృష్ణ ఈ పదాన్ని వాడుకలోకి తెచ్చారు. అప్పట్లో దీని మీద ఎవరూ పెద్దగా అభ్యంతరాలు లేవనెత్తలేదు.
కానీ ప్రస్తుత కాలంలో మేథావులు ముఖ్యంగా చరిత్ర, ఎకనామిక్స్ మీద బాగా పట్టున్నవారు ఈ భావనను వ్యతిరేకిస్తున్నారు.
అయితే దీనిపై చర్చ ముదరక ముందే జీడీపీ వృద్ధి రేటు పెరుగుదల స్థానంలో తగ్గుదల మొదలైంది. దీంతో ఇప్పుడు అంతా అంశంపై చర్చ మొదలుపెట్టారు.
జీడీపీ వృద్ధి రేటులో నిలకడ లేదా స్తబ్ధత ఉంటే పెద్ద సమస్య అయ్యేది కాదు. కానీ దేశంలో ఆర్ధిక సంక్షోభం మొదలైందని గత ఏడాదికాలంగా చాలా మంది భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఆర్ధిక నిపుణులు అనేక అంశాలను పరిశోధించి ఇది ఆర్ధిక సంక్షోభం కాదని, మందగమనమని తేల్చారు. అయితే తమ చర్చలన్నీ త్వరలో వృథా కాబోతున్నాయని అప్పటికి చాలా మంది గుర్తించలేకపోయారు.
ఈ చర్చనంతా వృథా చేసిన అంశం ఏదైనా ఉందంటే అది ప్రపంచాన్ని పట్టికుదిపేస్తోన్న కరోనా వైరస్, దాని భయంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్.
లాక్‌డౌన్ కారణంగా అనేక ఉద్యోగాలు పోయాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో ‘ప్రతికూల వృద్ధి’ అనే కొత్త మాట చర్చల్లోకి వచ్చింది.
వృద్ధి అంటే పెరుగుదల లేదా ముందుకు కదలడం. అలాంటప్పుడు ప్రతికూల వృద్ధి (నెగెటివ్ గ్రోత్) అంటే దానికి వ్యతిరేకంగా జరగడం. దీన్ని మనం వ్యాపార కోణంలో చూసినప్పుడు ఒక వ్యాపారం పెరగకుండా తగ్గుతోంది అని భావించవచ్చు. వ్యాపారంలో క్షీణత అంటే తక్కువ అమ్మకాలు, తక్కువ లాభాలు అని అర్ధం.

ఫొటో సోర్స్, Getty Images
అసలు జీడీపీ అంటే ఏంటి?
జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. స్థూల జాతీయోత్పత్తి. ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు.
జీడీపీలో వృద్ధి ఉంది అంటే దేశం అభివృద్ధి పథంలో ఉన్నట్లు లెక్క. కానీ దేశం మొత్తంలో ప్రగతి ఒకేలా ఉందని అర్ధం కాదు. అయితే జీడీపీలో అధిక వృద్ధి రేటు అన్నది దేశానికి ఒక శుభ సూచకంలాంటిది.
కొన్ని ప్రాంతాలు వృద్ధిలో వెనకబడినా, మరికొన్ని ప్రాంతాలు గతంకన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతాయి. అవే ప్రభుత్వానికి అధికంగా పన్నులు రాబడతాయి. వాటిద్వారా మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టిపెట్టవచ్చు.
మరి ఒకవేళ వృద్ధి ఆగిపోయనా, లేదా ఇప్పుడు జరుగుతున్నట్లు ప్రతికూలా దిశలో పయనిస్తుంటే ఏమవుతుంది? ముందు దీని గురించి మనం తెలుసుకోవాలి.
ఉదాహరణకు ఒక షాపు రూ. 1 లక్ష విలువ చేసే సరుకు అమ్మి, అందులో రూ.15 వేలు లాభం పొందితే ఆ షాపు 15 శాతం లాభం సాధించినట్లు లెక్క. అంటే ఆ షాపు రూ.100 అమ్మకాల మీద అది రూ.15 రూపాయల లాభం సంపాదించిందని అర్ధం. కానీ అమ్మకాలు అదే స్థాయిలో ఉండి, లాభంలో తక్కువ కనిపిస్తే అక్కడ ఏదో సమస్య ఉంది.
అలాగే అదే షాపు రూ.90 వేలు విలువ చేసే సరుకు అమ్మి మునుపటిలాగే రూ.15 వేలను లాభంగా పొందితే ఆ షాపు యజమాని తెలివిగా వ్యాపారం చేశాడని, ఎక్కడా ఎలాంటి నష్టం రాకుండా జాగ్రత్త పడ్డాడని అర్ధం.
వాస్తవానికి ఈ రెండింటిలోనూ క్షీణత సమాంతరంగా ఉంటుంది.
లాక్‌డౌన్ కారణంగా ఒక నెల రోజుల పాటు అన్ని మార్కెట్లు మూసేస్తే అమ్మకాలు, కొనుగోళ్లు, లాభాలు ఎలా ఉంటాయో ఒక్క ఊహించుకుందాం. ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. జూన్ నాటికి ప్రభుత్వం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. సమీప భవిష్యత్తులో చేరుకుంటుందన్న ఆశ కూడా లేదు.
కరోనా లాక్‌డౌన్ ఫలితంగా వృద్ధిబాటలో ఉండాల్సిన జీడీపీ తిరోగమనంలోకి మారింది. దీనర్ధం, దేశంలో ఉత్పత్తి, వ్యాపారం, మార్పిడిలాంటివన్నీ క్షీణత దిశలో లేదంటే క్షీణిస్తూ ఉన్నాయి.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ఈ ప్రతికూల వృద్ధి ఏ స్థాయిలో ఉంటుంది?
జీడీపీ వృద్ధి రేటు ప్రతికూల స్థితికి చేరుతుందని గత రెండు మానిటరీ పాలసీల ప్రకటన సందర్భంగా ఆర్బీఐ హెచ్చరించింది. అంటే భారతదేశపు వృద్ధి రేటు ప్రతికూల గమనంలోకి వెళుతుందన్న మాట.
అయితే అది ఏ స్థాయిలో ఉంటుందన్న విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించలేదు. కరోనా ప్రభావం ఎప్పుడు పోతుందో ఎవరైనా చెప్పగలిగితే, తాను కూడా ప్రతికూల వృద్ధి రేటు కూడా ఏ స్థాయి వరకు వెళుతుందన్నది అంచనా వేయగలనని ఆర్బీఐ గవర్నర్ అన్నారు.
ఆర్బీఐ గవర్నర్ చెప్పింది అక్షరాలా నిజమని, వ్యాపారాలను కరోనా ఏ స్థాయిలో దెబ్బకొడుతుందో అంచనా వేయలేమని సీఎంఐఈ బ్యాంక్ అధిపతి మహేశ్ వ్యాస్ అన్నారు. అయితే భారతదేశంలో వృద్ధి రేటు క్షీణత 5.5 శాతం నుంచి 14 శాతం వరకు ఉండొచ్చని ఆయన సంస్థ అంచనా వేస్తోంది.
కాస్త ఆశావహమైన అంచనా ఏంటంటే భారతదేశంలో వృద్థి రేటు క్షీణత 3.2 వరకు ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు తేల్చింది. అయితే రాబోయే రెండు నెలల్లో విడుదల చేయబోయే నివేదికల్లో భారతదేశ వృద్ధి రేటు క్షీణత 3.2 శాతం కన్నా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది.
ఆగస్టు 31న భారతదేశం తన జీడీపీ గణాంకాలను వెల్లడించనుంది. ఇది భారతదేశపు ఆర్ధిక వ్యవస్థ మీద కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందన్నది తెలుసుకునే తొలి అధికారిక నివేదిక కానుంది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో భారత వృద్ధి రేటులో క్షీణత 45 శాతం వరకు ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్’ అంచనా వేస్తోంది. వార్షిక వృద్ధి రేటు క్షీణత 5 శాతం వరకు ఉంటుందని కూడా క్రిసిల్ అంచనా.
అనేక ఇతర రేటింగ్ ఏజెన్సీలు కూడా భారతదేశపు జీడీపీ గురించి భిన్నమైన అంచనాలను ప్రకటించాయి. కానీ వాస్తవ అంచనాలు ప్రభుత్వం ప్రకటించబోయే నివేదికల్లోనే వెల్లడి కాబోతున్నాయి. తాజాగా ప్రకటించబోయే జీడీపీ అంచనాలు తొలి అంచనాలు.

ఫొటో సోర్స్, Getty Images
జీడీపీ వృద్ధి రేటు క్షీణిస్తే ఏం జరుగుతుంది?
ఇప్పుడు అతి పెద్ద సందేహం ఏంటంటే, ఈ పడిపోతున్న వృద్ధి రేటు సామాన్యుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది. భారతదేశపు ఐదు ట్రిలియన్ డాలర్ల కల ఏమవుతుంది? ఈ సమస్య నుంచి బైటపడే మార్గాలేంటి?
జీడీపీ వృద్ధి రేటులో క్షీణత సామాన్యుల జీవితాలపై నేరుగా ప్రభావం చూపించకపోవచ్చు. అయితే సామాన్యులు పడుతున్న ఇబ్బందులను.. పడిపోతున్న జీడీపీ గణాంకాలు ప్రతిఫలిస్తాయి.
ఇలాంటి పరిణామాలు భవిష్యత్తుకు మంచిది కాదు. ఆర్ధికవ్యవస్థ మందగమనంతో నిరుద్యోగిత పెరిగే ప్రమాదం ఉంది. ఆదాయం ఉండదన్న భయంతో ప్రజలు ఖర్చు తగ్గిస్తారు. పొదుపు పెరుగుతుంది.
ప్రజలే కాదు, కంపెనీలు, ప్రభుత్వాలు కూడా ఇదే పద్దతిని అనుసరిస్తాయి. కొత్త ఉద్యోగాలు రావు, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తారు. సీఎంఐఈ అంచనా ప్రకారం ఒక్క జూలై నెలలోనే దేశంలో 50 లక్షల మంది నిరుద్యోగులుగా మారారు.
ఇది ఒక విషవలయంలాగా మారుతుంది. ప్రజలు ఖర్చులు తగ్గించుకుంటారు. ఇది అన్ని రకాల వ్యాపారాల మీదా ప్రభావం చూపుతుంది. ఉత్పత్తి సంస్థల నుంచి వస్తువుల కోసం డిమాండ్ తగ్గుతుంది.
ప్రజలు ఎంత పొదుపు చేసినా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ లభిస్తుంది. మరోవైపు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కూడా తగ్గుతుంది. దానికి బదులు ప్రజలు తమ అప్పులను తీర్చి వడ్డీలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు.
అప్పుల నుంచి బయటపడటం ప్రజలకు మంచిదే. కానీ దీన్ని ఆందోళనతో, భయంతో చేస్తున్నారంటే మాత్రం అది వారి భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో తాము ఈ అప్పులను తీర్చలేమేమోనన్న భయంతో ఉంటారు. ప్రజలు అసలు రుణాలు తీసుకోడానికి ఇష్టపడరు.
ఇదే ఆలోచన కంపెనీలను నడిపించే వ్యక్తులలో కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా కంపెనీలు తమ అప్పులను తీర్చడానికి మార్కెట్‌లో తమ వాటాలను అమ్ముకున్నాయి.
భారతదేశంలోని వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇందుకు అతి పెద్ద ఉదాహరణ. ఈ మధ్యనే రిలయన్స్ 1.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తీర్చి రుణ విముక్తమైంది.

ఫొటో సోర్స్, PMO INDIA
భారతదేశపు 5 ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థ లక్ష్యం ఏమవుతుంది?
ఈ పరిస్థితుల్లో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారాలన్న భారతదేశపు కల ఎలా నిజమవుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రశ్న కాస్త అసందర్భం అనొచ్చు. సాధించలేని పరిస్థితి ఉంటే ఎవరైనా దాన్ని వదిలేసుకోవాల్సిందే.
సంక్షోభ పరిస్థితుల్లో మెరుగైన అవకాశాల కోసం ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అవి గతంలో కూడా అందుబాటులో ఉన్నాయి.
చైనా వ్యాపార సంస్థలను, వ్యాపారాలను ఇండియాతో పోల్చడం కొత్త విషయమేమీ కాదు. అసలు ప్రశ్న ఏంటంటే, విదేశీ కంపెనీలు పెట్టుబడులతో వస్తే వాటికి అవసరమైన సదుపాయాలను భారతదేశం కల్పించగలదా? అన్నది ప్రశ్న. అలా వస్తే దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు వీలు పడుతుంది. అప్పుడు ఐదు ట్రిలియన్ డాలర్ల స్వప్నాన్ని సాధించడం పెద్ద సమస్య కాదు.
పెద్ద కలలు కనడం తప్పు కాదు. కానీ విదేశీ కంపెనీల కోసం భారతీయ శ్రామికులు త్యాగం చేయాలనడం కూడా సరికాదు.
ఆర్ధిక రంగ నిపుణులు అనేక ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు. వీటన్నింటిలో ఏది మంచిది, ఎప్పుడు అమలు చేస్తే ప్రభావవంతంగా ఉంటుందన్న దాని తేల్చుకోవడమే ఒక పెద్ద సవాల్.
ఆర్ధిక పరిస్థితులును చక్కదిద్దడానికి ఉద్దీపనలు ప్రకటించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలిచ్చింది. అయితే తొందరపడి ప్రకటిస్తే అవి వృథా కావచ్చని, మహమ్మారి తగ్గుముఖం పడుతుందేమోనని ప్రభుత్వం ఎదురు చూస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








