ఇందర్‌జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళ ఇందర్‌జీత్ కౌర్
ఫొటో క్యాప్షన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళ ఇందర్‌జీత్ కౌర్
    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రశ్న: మీరు ఫెమినిస్టా (స్త్రీ సమానత్వవాదా)?

జవాబు: అవును. కానీ, బ్రాలు తగలబెట్టే రకం కాదు.

ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఇందర్‌జీత్ కౌర్‌ ఇచ్చిన సమాధానం ఇది.

మహిళల కోసం చాలా రంగాల్లో తలుపులు తెరిచిన ధీర వనిత ఆమె. ఏ భయం లేకుండా బయటి ప్రపంచాన్ని చూసే ధైర్యాన్ని అమ్మాయిలకు ఇచ్చారామె.

ఇందర్‌జీత్ గురించి చెప్పాలంటే, ‘తొలి’ అనే పదాన్ని చాలా సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తొలి మహిళా అధ్యక్షురాలు ఆమె. పంజాబ్ యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్స్‌లర్ కూడా.

ఆమె కథ 1923, సెప్టెంబర్ 1న మొదలైంది. ఆమె జన్మించింది అప్పుడే.

పంజాబ్‌లోని పటియాలా జిల్లాకు చెందిన కల్నల్ శేర్ సింగ్ సంధూ, కర్తార్ కౌర్‌ల మొదటి సంతానం ఇందర్‌జీత్.

మాములుగా అప్పట్లో అబ్బాయి పుడితే సంబరం చేసుకునేవారు. కానీ, ఇందర్‌జీత్ పుట్టినప్పుడు శేర్ సింగ్ అదే స్థాయిలో సంబరం చేసుకున్నారు.

శేర్ సింగ్ ప్రగతిశీల, ఉదారవాద భావాలున్న వ్యక్తి. ఛాందసవాదాన్ని ఆయన వ్యతిరేకించేవారు. అప్పట్లో చాలా ఇళ్లలో పరదా పద్ధతి పాటించేవారు. శేర్ సింగ్ మాత్రం తన పిల్లలకు ఆ దుస్థితి ఉండకూదని అనుకున్నారు. ఆయన ఆలోచనలు ఇందర్‌జీత్ వికాసానికి బాగా ఉపకరించాయి.

ఇందర్‌జీత్ కౌర్ ఓ వ్యక్తిగా, ఓ అధ్యాపకురాలిగా, అధికారిగా చాలా మంది జీవితాలను ప్రభావితం చేశారు
ఫొటో క్యాప్షన్, ఇందర్‌జీత్ కౌర్ ఓ వ్యక్తిగా, ఓ అధ్యాపకురాలిగా, అధికారిగా చాలా మంది జీవితాలను ప్రభావితం చేశారు

పటియాలాలోని విక్టోరియా గర్ల్స్ స్కూల్‌లో ఇందర్‌జీత్ తన చదువు మొదలుపెట్టారు. పదో తరగతి పూర్తయ్యాక ఇందర్‌జీత్ కుటుంబంలో ఆమె పైచదువుల గురించి చర్చ జరిగింది.

ఈ విషయంపై ఇందర్‌జీత్ కౌర్ కుమారుడు, జర్నలిస్ట్ రూపిందర్ సింగ్ ఇలా చెప్పారు.

‘‘అందమైన అమ్మాయిలకు యుక్తవయసులోనే పెళ్లి చేసేయాలని మా అమ్మ వాళ్ల అమ్మమ్మ అభిప్రాయపడ్డారు. కానీ, మా అమ్మ పైచదువులు చదవాలని గట్టిగా సంకల్పించుకున్నారు. తన తండ్రి మద్దతు కూడా ఉండటంతో ఆమెకు మార్గం సుగమమైంది’’ అని రూపిందర్ చెప్పారు.

అదే సమయంలో కల్నల్ శేర్ సింగ్‌ పెషావర్ బదిలీ అయ్యారు. ఇందర్‌జీత్ పైచదువుల కోసం లాహోర్ వెళ్లారు.

ఆరబీ సోహన్ లాల్ ట్రైనింగ్ కాలేజ్‌లో ఆమె బేసిక్ ట్రైనింగ్ కోర్సు చేశారు. లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఫిలాసఫీలో ఎమ్.ఏ. పూర్తి చేశారు.

ఆ తర్వాత విక్టోరియా గర్ల్స్ ఇంటర్మీడియట్ కాలేజ్‌లో ఆమె తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేశారు. 1946లో పటియాలాలోని గవర్నమెంట్ కాలేజ్ ఫర్ వుమెన్‌లో ఫిలాసఫీ అధ్యాపకురాలిగా చేరారు.

Presentational grey line

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.

ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

Presentational grey line

ఆ తర్వాత కొన్ని నెలలకు భారత్, పాకిస్తాన్ విభజన జరిగింది. పాకిస్తాన్ నుంచి వందల సంఖ్యలో శరణార్థులు రావడం మొదలైంది.

‘‘ఆ సమయంలో ఇందర్‌జీత్ చాలా కీలకపాత్ర పోషించారు. ఓ కార్యకర్తగా ఆమె పనిచేయడం మొదలుపెట్టారు. మాతా సాహిబ్ కౌర్ దళం ఏర్పాటుకు తోడ్పడ్డారు. ఆ సంస్థ కార్యదర్శిగా ఉన్నారు. అధ్యక్షురాలు సరద్దార్నీ మన్మోహన్ కౌర్‌ సాయంతో పటియాలాలో దాదాపు 400 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు తోడ్పడ్డారు. వారికి ఆర్థిక సాయం చేసేందుకు... బట్టలు, రేషన్ వంటివి అందించేందుకు స్నేహితులు, బంధువుల సాయం తీసుకున్నారు. ఆ సమయంలో సహాయ చర్యల్లో పాలుపంచుకునేందుకు అమ్మాయిలు కూడా ముందుకువచ్చారు. అప్పట్లో అమ్మాయిలు అలా రావడం అరుదు. మొదట్లో ఇందర్‌జీత్ తన ఇంట్లోనే వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని రూపిందర్ సింగ్ చెప్పారు.

మాతా సాహిబ్ కౌర్ దళం సహాయ సామగ్రితో నాలుగు ట్రక్కులను కశ్మీర్‌లోని బారాముల్లాకు పంపించిందని, స్థానికులను రక్షించేందుకు వెళ్లిన పటియాలా సైనికులు అక్కడ ఉన్నారని రూపిందర్ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఇందర్‌జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు

ఆ తర్వాత శరణార్థుల పిల్లల కోసం మాతా సాహిబ్ కౌర్ దళ్ స్కూల్‌ ఏర్పాటు చేయడంలోనూ ఇందర్‌జీత్ పాత్ర ఉంది. శరణార్థుల పిల్లల్లో అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం ఆమె అవసరమైన శిక్షణ కూడా ఇప్పించారు.

1955లో ఇందర్‌జీత్ పటియాలాలోని స్టేట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ అయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్... అక్కడ ఇందర్‌జీత్ దగ్గర విద్యార్థినిగా ఉన్నారు.

1958లో ఇందర్‌జీత్ చండీగఢ్‌లోని బేసిక్ ట్రైనింగ్ కాలేజ్‌లో ప్రొఫెసర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌గా నియమితులయ్యారు. ఇదే కాలేజ్‌కు ఆమె వైస్ ప్రిన్సిపాల్ కూడా అయ్యారు.

దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం ఇందర్‌జీత్ కౌర్ సహాయ కార్యక్రమాలు నిర్వహించారు
ఫొటో క్యాప్షన్, దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం ఇందర్‌జీత్ కౌర్ సహాయ కార్యక్రమాలు నిర్వహించారు

ప్రముఖ పంజాబీ రచయిత జ్ఞానీ గురుదీత్ సింగ్‌తో ఇందర్‌జీత్‌కు వివాహమైంది. గురుదీత్ పంజాబ్ శాసన మండలి సభ్యుడిగానూ పనిచేశారు.

గురుదీత్‌కు తాను తోడుగా, స్నేహితురాలిగా, మార్గదర్శకురాలిగా కూడా ఉండేదాన్నని ఇందర్‌జీత్ అంటుండేవారు. వీరికి ఇద్దరు కొడుకులు.

ఇందర్‌జీత్ కౌర్ ఓ వ్యక్తిగా, ఓ అధ్యాపకురాలిగా, అధికారిగా చాలా మంది జీవితాలను ప్రభావితం చేశారు.

అప్పట్లో సమాజంలో వస్తున్న మార్పులను ఆమె గమనించారు. అందుకు అనుగుణంగా తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నారు.

పరదా పద్ధతి విరివిగా ఉన్న సమయంలో ఆమె దీనికి దూరంగా ఉంటూ... అమ్మాయిల విద్య కోసం, హక్కుల కోసం కృషి చేశారు.

అంతకుముందెప్పుడూ మహిళలు చేపట్టని పదవులను, బాధ్యతలను ఆమె చేపట్టారు.

ఇందర్‌జీత్ పటియాలా గవర్న్‌మెంట్ కాలేజ్ ఫర్ వుమెన్ ప్రిన్సిపాల్ అయ్యారు. ఆమె అసలు కెరీర్ ఇక్కడి నుంచే మొదలైంది.

మూడేళ్లలో కాలేజ్‌లో సైన్స్ విభాగాన్ని తెరిపించారు. దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. చదువుతోపాటు ఆమె సాంస్కృతిక కార్యకలాపాలను కూడా ప్రోత్సహించారు. పంజాబీ జానపద నృత్యం గిద్దా పునరుజ్జీవం పోసుకునేందుకు తన వంతు పాత్ర పోషించారు.

ఇందర్‌జీత్ కౌర్ ఓ వ్యక్తిగా, ఓ అధ్యాపకురాలిగా, అధికారిగా చాలా మంది జీవితాలను ప్రభావితం చేశారు

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో అమ్మాయిలు పాల్గొనేలా చేయడంలో ఇందర్‌జీత్ ప్రధాన పాత్ర పోషించారు. పరేడ్‌లో గిద్దా ప్రదర్శనల ద్వారా పంజాబీ జానపద కళలకు జాతీయ వ్యాప్త గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత అమృత్‌సర్‌లో కుటుంబంతో పాటు ఉండేందుకు ఆమె బదిలీపై వెళ్లారు. అక్కడి గవర్న్‌మెంట్ కాలేజ్ ఫర్ వుమెన్ ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ తర్వాత పటియాలాకు తిరిగివచ్చారు. పంజాబ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ పదవి చేపట్టారు. ఉత్తర భారతంలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమెను భావిస్తారు.

ఇందర్‌జీత్ వైస్ ఛాన్స్‌లర్ పదవి చేపట్టడానికి ముందు రోజు యూనివర్సిటీలో యువకుల మధ్య ఓ గొడవ జరిగింది. వారిలో ఒక గుంపు ఫిర్యాదు చేసేందుకు ఇందర్‌జీత్ ఉంటున్న గెస్ట్ హౌస్‌కు వచ్చారు.

‘‘మేడం, వాళ్లు కింగ్స్ పార్టీ వాళ్లు కాబట్టి, వారిపై చర్యలేమీ తీసుకోరని మాకు తెలుసు’’ అని గాయంతో ఉన్న ఓ అబ్బాయి ఇందర్‌జీత్‌తో అన్నాడు.

అందుకు ఆమె.... ‘‘ఇక్కడ కింగ్ ఎవరూ లేరు. కింగ్స్ పార్టీ ఎలా ఉంటుంది?’’ అని బదులిచ్చారు. ఇది విన్నాక ఫిర్యాదు చేసేందుకు వచ్చిన విద్యార్థులు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

చాలా అంతర్జాతీయ సదస్సుల్లో ఇందర్‌జీత్ కౌర్ పాల్గొన్నారు. చాలా విశ్వవిద్యాలయాల్లో లెక్చర్లు ఇచ్చారు. పంజాబ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా తన పదవీకాలం ముగియకముందే, ఆమె ఆ పదవికి రాజీనామా ఇచ్చారు.

రెండేళ్లు ఆమె విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత 1980లో కేంద్ర ఉద్యోగ నియామకాల సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళ ఆమె.

(బొమ్మలు: గోపాల్ శూన్య్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)