రుకేయా షకావత్: అమ్మాయిల జీవితాలను మార్చిన ‘మహిళా రామ్మోహన్ రాయ్’
- రచయిత, నాసిరుద్దీన్
- హోదా, బీబీసీ కోసం
రుకేయా షకావత్‌కు.. స్త్రీవాది, కథకురాలు, వక్త, రచయిత్రి... ఇలాంటి గుర్తింపులు చాలా ఉన్నాయి.
బెంగాల్‌లో ముస్లిం బాలికలను విద్యావంతులుగా మార్చేందుకు ఆమె చాలా కృషి చేశారు. ముస్లిం మహిళల సంఘాలు ఏర్పాటు చేశారు. ముస్లిం బాలికల కోసం పాఠశాలలు నిర్మించారు. వాటి ద్వారా వేల మంది అమ్మాయిల జీవితాల్లో మార్పులు వచ్చాయి.
ఆమె సేవలు ముస్లిం మహిళల వరకే పరిమితం కాలేదు. మహిళా జాతికి గౌరవం కోసం ఆమె కృషి చేశారు. అందరూ కలిసికట్టుగా ఉండే సమాజాన్ని ఆమె నిర్మించాలనుకున్నారు. అధికారం మహిళల చేతుల్లో ఉండాలని ఆకాంక్షించారు.
1880లో బ్రిటీష్ ఇండియాలోని రంగ్‌పూర్ జిల్లాలోని పైరాబంద్ ప్రాంతంలో 1880లో రుకేయా జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌లో ఉంది.
వాళ్లది జమీందారీ కుటుంబం. ఆ కుటుంబంలో అబ్బాయిలను ఆధునిక చదువులు చదివించేవారు. అమ్మాయిలకు మాత్రం ఆ అవకాశం ఉండేది కాదు.
రుకేయాకు చదుకోవాలని బాగా ఆసక్తి ఉండేది. వాళ్ల పెద్దన్న అందరి కళ్లుగప్పీ, ఆమెకు చదువు చెప్పేవారు. రాత్రి అందరూ పడుకున్నప్పుడు, ఇంట్లో ఓ మూలన ఆయన రుకేయాకు చదువు చెప్పేవారు.
రుకేయా చాలా తెలివైన అమ్మాయి. ప్రపంచాన్ని ఆమె చూసే కోణం భిన్నంగా ఉండేది. రుకేయా పెద్దన్నకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే, ఆమె పెళ్లి విషయమై ఆయన చాలా ఆందోళనపడ్డారు.
చివరికి ఎలాగోలా ఒప్పించి, రుకేయా 18 ఏళ్ల వయసులో ఉండగా, ఆమెను బిహార్‌లోని భాగల్‌పుర్‌కు చెందిన షకావత్ హుస్సేన్‌కు ఇచ్చి పెళ్లి చేశారు.

షకావత్ వయసులో రుకైయా కన్నా చాలా పెద్ద. ఆయన బాగా చదువుకున్నారు. ఆస్తిపరుడు, ఆఫీసర్ కూడా. రుకేయాకు ఆయన బాగా సహకరించారు. అయితే, వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1909లో ఆయన చనిపోయారు.
ప్రపంచానికి రుకేయా మొదట రచయిత్రిగా పరిచయమయ్యారు. షఖావత్ హుస్సేన్ చనిపోక ముందే, బెంగాల్ సాహిత్యంలో రుకేయా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రచనల ద్వారా మహిళల పరిస్థితులను అర్థం చేసుకునేందుకు, వేరేవారికి అర్థం చేయించేందుకు ఆమె కృషి చేశారు.
‘స్త్రీ జాతిర్ అబోనతి’ పేరుతో ఆమె రాసి ఓ వ్యాసం చర్చనీయమైంది. మహిళల పరిస్థితి గురించి ఓ మహిళే చర్చిస్తున్నట్లుగా ఉన్న వ్యాసం అది. నిజానికి మగవారి ఆధిపత్య ధోరణికి అద్దం పట్టే వ్యాసం అది. సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దిగజారి ఉందో అందులో చర్చించారు. భారత్‌లో రుకేయాకు ముందు ఎవరూ అంతటి నిబద్ధతతో మహిళల హక్కుల కోసం అలాంటి ప్రశ్నలు అడగలేదు. ఆ వ్యాసం రాసే సమయానికి ఆమె వయసు 22-23 ఏళ్లు.
‘సుల్తానాస్ డ్రీమ్స్’ అనే రచన కూడా రుకేయా చేశారు. ఇంగ్లీష్‌లో రాసిన పెద్ద కథ ఇది. దీన్ని ఓ చిన్న నవల అని కూడా అనుకోవచ్చు.
దేశంలోని కార్యకలాపాలన్ని మహిళలే నడిపేంచే సమాజం గురించి ఆ కథ ఉంటుంది. అందులో మహిళలు శాస్త్రవేత్తలుగా ఉంటారు. పురుషులు ఇళ్లకే పరిమితమవుతారు. దీన్నొక స్త్రీవాద సైన్స్ ఫిక్షన్ కథగా చెబుతుంటారు.
115 ఏళ్ల క్రితం మద్రాస్‌లో నడిచిన ఇండియన్ లేడీస్ మ్యాగజైన్‌లో ఈ కథ అచ్చైంది. అప్పట్లో అదో ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.
ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత
- రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత
- ఇందర్జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు
- సుగ్రా హుమాయూన్ మీర్జా: బురఖా లేకుండా బయటకు వచ్చిన తొలి మహిళ.. దక్కన్ మహిళల గొంతుక
- అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ

రుకేయా రచనలు ఎక్కువగా బెంగాలీలోనే ఉండేవి. అందుకే, ఇప్పటికీ చాలా మంది హిందీ పాఠకులకు ఆమె గురించి తెలియదు.
ఒకవేళ ఆమె ఇంగ్లీష్‌లో ఎక్కువ రచనలు చేసుంటే, స్త్రీవాదం విషయంలో ప్రపంచంలోనే గొప్ప నాయకురాలిగా మారేవారు.

మహిళల కోసం రుకేయా కృషి రచనలతోనే ఆగిపోలేదు. క్షేత్రస్థాయిలో వారి అభ్యున్నతి కోసం కూడా ఆమె పనిచేశారు.
షకావత్ హుస్సేన్‌కు స్మారకంగా 1910లో భాగల్‌పుర్‌లో, 1911లో కోల్‌కతాలో ఆమె పాఠశాలల ప్రారంభించారు. ఆమె ప్రయత్నాలతో బెంగాల్‌లో ముస్లిం బాలికలు విద్యావంతులయ్యారు.
ఎన్నో అడ్డంకులు ఎదురైనా రుకేయా ఈ పాఠశాలలను నడిపించారు. బెంగాల్ ముస్లిం అమ్మాయిలకు ఈ పాఠశాలలు ఓ వరంలా మారాయి. రుకేయా స్థాపించిన షకావత్ మెమోరియల్ గవర్న్‌మెంట్ గర్ల్స్ హైస్కూల్ కోల్‌కతాలో ఇప్పటికీ నడుస్తోంది.
ముస్లిం బాలికలకు ఆధునిక విద్యను అందించే విషయంలో రుకేయా ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
భారత్‌లో స్త్రీవాదానికి బలమైన తోడ్పాటు అందించిన వ్యక్తుల్లో రుకేయా కూడా ఒకరు.
ఆమె నుంచి స్ఫూర్తి పొంది చాలా మంది మహిళలు రాయడం మొదలుపెట్టారు. సమాజ సంస్కరణ, మహిళల హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు.
1932 డిసెంబర్ 9న 52 ఏళ్ల వయసులో కోల్‌కతాలో రుకేయా మరణించారు. మరణానికి కొన్ని గంటల ముందు కూడా ‘మహిళల హక్కులు’ పేరుతో ఆమె ఓ వ్యాసం మొదలుపెట్టారు.
బెంగాల్‌లో స్త్రీవాదం, మహిళల జీవితాల్లో మార్పుల కోసం పనిచేసినవారిలో రామ్మోహన్ రాయ్, ఈశ్వర్‌చంద్ విద్యాసాగర్ లాంటి వారితో సమానంగా రుకేయాను చూస్తారు.
ఇవి కూడా చదవండి:
- చైనా - రష్యా దేశాలు అమెరికన్ డాలర్‌కు చెక్ పెడుతున్నాయా... డాలర్ పడిపోతే ఎవరికి నష్టం, ఎవరికి లాభం?
- రియా చక్రవర్తిపై బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యలపై దుమారం
- కరోనావైరస్తో విలవిల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- వాట్సాప్: అప్డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
- తండ్రి అమ్మేశాడు... ముగ్గురితో పెళ్లి... ముగ్గురు పిల్లలు... 16 మంది అత్యాచార నిందితులు
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









