అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ

- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అందరూ ఆమెను మోటాబెన్ (పెద్దక్క)గా పిలుస్తుండేవారు. ఆ పేరును జీవితాంతం ఆమె నిలబెట్టుకోగలిగారు. ప్రముఖ భారత కార్మిక ఉద్యమ నేతల్లో అనసూయ సారాభాయ్ కూడా ఒకరు.

అహ్మదాబాద్‌లోని ఓ ధనిక కుటుంబంలో 1885లో అనసూయ జన్మించారు. చిన్న వయసులోనే ఆమె తల్లిదండ్రులను కోల్పోయారు. పినతండ్రే ఆమెను పెంచారు.
అప్పటి సంప్రదాయాల ప్రకారం 13ఏళ్ల వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు. అయితే ఆ పెళ్లి నిలబడలేదు. కొన్ని రోజులకే ఆమె మళ్లీ వెనక్కి వచ్చేశారు.
దీంతో సోదరుడు అంబాలాల్ చదువుకోవాలని ఆమెను ప్రోత్సహించారు. ఉన్నత విద్య కోసం ఆమెను లండన్ కూడా పంపించారు.

సోదరుడంటే అనసూయకు అమితమైన ప్రేమ. తన ఆకాంక్షలు భవిష్యత్‌లో తమ మధ్య చిచ్చు పెడతాయని ఆమె ఎప్పుడూ ఊహించలేదు.
లండన్‌లో చదువు ఆమెపై చాలా ప్రభావం చూపింది. సోషలిజంలోని ఫేబియన్ ఫిలాసఫీ నుంచి ఆమె స్ఫూర్తి పొందారు. ఇంగ్లండ్‌లోని మహిళా హక్కుల ఉద్యమంలోనూ ఆమె పాల్గొన్నారు. ఈ ఘటనలే ఆమె భవిష్యత్‌ను మార్చివేశాయి.
అనసూయ జీవిత చరిత్రను ఆమె మేనకోడలు గీతా సారాభాయ్ రాశారు. ఇంగ్లండ్‌లో వీధుల్లో అనసూయ ఒంటరిగా ఎలా తిరిగేవారు, బెర్నార్డ్ షా, సిడ్నీ, బియట్రీస్ వెబ్ లాంటి మేధావుల ఉపదేశాలను ఎలా వినేవారు, బాల్‌రూమ్ డ్యాన్స్ ఎలా నేర్చుకున్నారు? లాంటి అంశాలు ఈ జీవిత చరిత్రలో కనిపిస్తాయి.
అయితే, భారత్ వచ్చాక అనసూయ జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఆమె మహాత్మా గాంధీని అనుసరించారు.

కుటుంబ సమస్యల కారణంగా చదువు మధ్యలోనే ఆమె భారత్‌కు రావాల్సి వచ్చింది. వచ్చిన వెంటనే ప్రజా సంరక్షక కార్యక్రమాల్లో ఆమె నిమగ్నమయ్యారు. మహిళా కార్మికులు, వారి పిల్లలకు కాలికో మిల్‌ను ఇప్పించేందుకు ఆమె కృషిచేశారు. అయితే ఆ మిల్లు ఆమె కుటుంబ యాజమాన్యంలో ఉండేది. మహిళలు, వారి రాజకీయ హక్కుల పేరుతో ఆమె కరపత్రాలనూ ప్రచురించారు.
ఒక ఘటన ఆమె జీవితాన్నే మార్చేసింది. ''ఒకరోజు ఉదయం, 15 మంది కార్మికులు విస్మయానికి గురై కనిపించారు. అసలు ఏమైందని వారిని ప్రశ్నించాను. వారిలో ఒకరు మాట్లాడారు. అక్కా.. మేం ఎలాంటి విరామం లేకుండా 36 గంటలు పనిచేశాం. రెండు రోజులు, ఒక రాత్రి మొత్తం పనిచేశాం అని చెప్పారు''అని ఆమె వివరించారు.

వారి గాథవిని అనసూయ చలించిపోయారు. నూలు పరిశ్రమ కార్మికుల కోసం ఆమె అప్పుడే పోరాటం ప్రారంభించారు. వారి దయనీయ పరిస్థితులు, పని గంటలు, పేదరికం, ఒత్తిడి, అణచివేతకు గురించి మరింత తెలుసుకున్నప్పుడు.. ఆమెలో పోరాడాలనే ఆకాంక్ష మరింత పెరిగింది. అంటే ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా తనను ఎంతగానో ప్రోత్సహించిన సోదరుడికి వ్యతిరేకంగా నడుచుకోవాల్సి వచ్చింది.
కార్మికులకు మెరుగైన వసతులు, నిర్దిష్ట పని గంటల కోసం ఆమె పోరాటం చేశారు. 1914లో అయితే డిమాండ్ల కోసం ఆమె 21 రోజుల సమ్మె చేపట్టారు.
ఆమె చేపట్టిన సమ్మెల్లో ముఖ్యమైనది 1918నాటి సమ్మె. సారాభాయ్ కుటుంబానికి సన్నిహితుడైన మహత్మా గాంధీ ఆనాడు అనసూయకు మార్గదర్శిగా మారారు.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.
ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత
- రుకేయా షకావత్: వేల మంది అమ్మాయిల జీవితాల్లో మార్పు తెచ్చిన రచయిత్రి
- చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత
- ఇందర్జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు
- సుగ్రా హుమాయూన్ మీర్జా: బురఖా లేకుండా బయటకు వచ్చిన తొలి మహిళ.. దక్కన్ మహిళల గొంతుక
- అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది

1917లో అహ్మదాబాద్‌లో ప్లేగు మహమ్మారి విజృంభించింది. చాలామంది నగరాన్ని వదిలి గ్రామాలకు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. కార్మికులు వెళ్లిపోకుండా చూసేందుకు జీతాలకు అదనంగా 50 శాతం ప్లేగు బోనస్ ఇస్తామని మిల్లు యజమానులు ప్రకటించారు.
దీంతో మహమ్మారి విజృంభిస్తున్నా కార్మికులు పనిచేయడం మొదలుపెట్టారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే.. బోనస్‌ను మిల్లు ఓనర్లు రద్దుచేశారు. అయితే అప్పటికే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. జీతాలు కోసేయడంతో కార్మికులపై ప్రభావం పడింది. దీంతో 50 శాతం జీతాలను పెంచాలంటూ అనసూయ సమ్మె చేపట్టారు.

అయితే, దీనికి మిల్లు యజమానులు సిద్ధంగా లేరు. లాకౌట్‌ను ప్రకటించి, మిల్లులను మూసేందుకు వారు సిద్ధమయ్యారు. దీంతో కార్మికులు సమ్మె ప్రకటించారు.
సమ్మెను ఎదుర్కొనేందుకు మిల్లు యజమానులు కూడా ఒక సంఘం ఏర్పాటుచేశారు. అనసూయ సోదరుడు అంబాలాల్‌ను తమ సంఘం అధ్యక్షుడిగా వారు ఎన్నుకున్నారు. దీంతో కథ బాలీవుడ్ సినిమాను తలిపించింది. సోదరి కార్మిక ఉద్యమానికి నేతృత్వం వహిస్తే.. సోదరుడు పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించారు. తోబుట్టువులే విరోధులుగా మారిపోయారు.

16,000 మంది కార్మికులు, చేనేత కళాకారులకు అనసూయ అండగా నిలిచారు. గాంధీ మేనల్లుడు ఛగన్‌లాల్‌తో కలిసి ప్రతి రోజూ ఉదయం వారితో ఆమె మాట్లాడేవారు. ఆ సమ్మే దాదాపు నెల రోజులు నడిచింది.

ప్రతిరోజూ ఉదయం ప్లకార్డులు పట్టుకొని కార్మికులు ప్రదర్శనలు చేసేవారు. మేం వెనక్కి తగ్గబోమని రోజూ వారు ప్రతినబూనేవారు. ఒక్కోసారి ఈ ప్రదర్శనలకు అనసూయ నేతృత్వం వహించేవారు. కార్మికులపై విసుగుచెందే నగరవాసులు.. ఈ సమ్మెలో క్రమశిక్షణ చూసి ఆశ్చర్యపోయేవారు.

రెండు వారాలు గడిచినా ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ఒకవైపు అనసూయ, మరోవైపు అంబాలాల్ వెనక్కి తగ్గలేదు. అప్పుడు పరిష్కారంతో గాంధీజీ వచ్చారు. ఆయన కార్మికులవైపు మొగ్గుచూపినప్పటికీ.. ఆయనంటే అంబాలాల్‌కు అమితమైన ప్రేమ ఉండేది.

రోజూ మధ్యాహ్నం భోజనానికి రావాలంటూ అనసూయ, అంబాలాల్‌లను గాంధీ తన ఆశ్రమానికి ఆహ్వానించేవారు. అక్కడ అంబాలాల్‌కు అనసూయ భోజనం వడ్డించేవారు. ఇది కొంతవరకూ పరిష్కారం చూపినట్టే అనిపించింది. ఎందుకంటే ఈ ఘటనల తర్వాత మధ్యవర్తిత్వానికి ఇటు మిల్లు యజమానులు, అటు కార్మికులు ఒప్పుకున్నారు.
చివరగా 35 శాతం జీతాల పెంపుకు సయోధ్య కుదిరింది.

1920లో మజ్దూర్ మహాజన్ సంఘ్‌ను అనసూయ స్థాపించారు. సంఘానికి ఆమె తొలి అధ్యక్షురాలు కూడా.1927లో కార్మికుల కుమార్తెల కోసం కన్యాగృహ్ పేరుతో ఓ పాఠశాలను కూడా ఆమె స్థాపించారు.

అనసూయ ఓ అసాధారణ కార్మిక నాయకురాలు. ఆమె యజమానుల కుటుంబంలో పుట్టి కార్మికుల కోసం పోరాడారు. 1972లో ఆమె మరణానికి ముందు రెండు లక్షల మంది కార్మికులకు ఆమె ప్రాతినిధ్యం వహించారు.
(పరిశోధనలో సాయం చేసినవారు: పార్థ్ పాండ్య, బొమ్మలు: గోపాల్ శూన్య )
ఇవి కూడా చదవండి:
- మహిళా రిజర్వేషన్ల మీద ఎందుకు ప్రశ్నించరు... :అభిప్రాయం
- న్యూడ్ బీచ్‌లో గ్రూప్ సెక్స్ పార్టీలు... ఫ్రాన్స్‌లో కరోనా వ్యాప్తికి కొత్త కేంద్రాలు
- ఆఫ్రికాలో కరోనావైరస్ తక్కువగా ఉండటానికి కారణమేంటి? పేదరికమే కాపాడుతోందా?
- కొత్త ‘బాబ్రీ’ మసీదు కట్టేది ఎక్కడ? ఎలా ఉంటుంది?
- డాక్టర్ తవ్వా వెంకటయ్య.. వ్యవసాయ కూలీ: తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ చేసినా ఉద్యోగం దొరక్క ఇబ్బందులు
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- జీడీపీ పతనం భయపెడుతున్నా.. ‘మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను కాపాడొచ్చు.. ఎలాగంటే...‘
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









