India GDP: మోదీ సర్కారుకు ఆర్థికవ్యవస్థను కాపాడే అవకాశం ఇంకా ఉంది - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆలోక్ జోషి
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
ప్రభుత్వం ఇప్పుడు తగినంత ధైర్యం చూపించాల్సిన సమయం వచ్చంది. ఎందుకంటే, జీడీపీ తాజా గణాంకాలు చాలా ఘోరంగా భయపెడుతున్నాయి.
భయం తర్వాత విజయం ఉంటుందని చెబుతారు. కానీ ఆ విజయం వరకూ చేరుకోవాలంటే దైర్యం చాలా అవసరం. గత 40 ఏళ్లలో మొదటిసారి భారత్ మాంద్యంలోకి వెళ్తోంది.
ఏప్రిల్ నుంచి జూన్ మధ్య భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందడానికి బదులు దాదాపు 24 శాతం క్షీణించింది. తర్వాత, అంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య త్రైమాసికం గణాంకాలపై వార్తలు వచ్చే సమయానికి కూడా ఈ పతనాన్ని వృద్ధిగా మార్చలేమని ఆందోళన చెందుతున్నారు.
అంటే అప్పటికి, 40 ఏళ్లలో భారత్ మొదటిసారి, అది కూడా భారత్ ‘విశ్వగురువు’ అయ్యే సన్నాహాలలో ఉన్నప్పుడు ఆర్థిక మాంద్యం గుప్పిట్లోకి వెళ్లిపోయి ఉంటుంది.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆర్థికవ్యవస్థ ఇంత ఘోరమైన పరిస్థితిలో ఎప్పుడూ లేదు. అయితే, ఇంతకు ముందు కూడా ఆర్థిక మందగమనం ప్రకంపనలు వచ్చాయి. కానీ ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES/ HINDUSTAN TIMES
1979 సంక్షోభం - గుణపాఠం
ఇంతకు ముందు దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నపుడు దానికి రెండే కారణాలు కనిపించాయి. ఒకటి వర్షాలు పడకపోవడం లేదంటే రుతుపవనాలు రాకపోవడమో అయితే.. రెండోది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం.
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1980 వరకూ ఐదు సార్లు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి బదులు క్షీణించింది. వీటిలో అతిపెద్ద దెబ్బ 1979-80 ఆర్థిక సంవత్సరంలో పడింది. ఆ సమయంలో దేశ జీడీపీ 5.2 శాతం పడిపోయింది.
దానికి కారణం కూడా ఉంది. ఒకవైపు భయంకరమైన కరువు. మరోవైపు ఆకాశాన్నంటిన చమురు ధరలు రెండూ దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాయి. ద్రవ్యోల్బణం రేటు 20 శాతానికి చేరుకుంది.
భారత్ ఆర్థిక వృద్ధి వేగం మూడు-మూడున్నర శాతంగా ఉంటున్న సమయంలో అది జరిగిందనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే రెండేళ్లకు పైగా సాధించిన వృద్ధిపై ఒకేసారి దెబ్బ పడడం లాంటిది.
అది, ఇందిరాగాంధీ ఘోర పరాజయం తర్వాత మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన సమయం. ఆమె ప్రభుత్వం రాగానే ఆర్థికవ్యవస్థ నుంచి ఈ తీవ్ర సవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఎమర్జెన్సీ తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి.. వ్యవసాయం, అనుబంధ రంగాలు - అంటే ఫార్మ్ సెక్టార్‌లో 10 శాతం పతనం, ఆకాశాన్ని అంటే చమురు ధరలు, దిగుమతులతో పోలిస్తే ఎగుమతులు తగ్గిపోవడంతో వరుసగా పెరుగుతున్న ఒత్తిడి వంటి కష్టాలు బహుమతిగా దక్కాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
'విపత్తు'ను 'అవకాశం'గా మార్చారు
అయితే, దీనికంతటికీ జనతా పార్టీ కిచిడీ ప్రభుత్వమే కారణం అని నిందించడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్నీ వదల్లేదు. కానీ దానితోపాటూ ఆమె ప్రభుత్వం విపత్తును అవకాశంగా మార్చే చర్యలూ చేపట్టింది. దేశం నుంచి ఎగుమతులు పెంచి, దిగుమతులు తగ్గించడానికి మొదటిసారి ప్రాధాన్యం ఇచ్చారు.
అప్పటివరకూ, స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అదే. ఆ సమయంలో కొత్త నోట్లు ముద్రించి నష్టాన్ని భర్తీ చేసే విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రయత్నించింది.
కానీ, నష్టాన్ని భర్తీ చేయడానికి ఆ విధానంపై తక్కువగా ఆధారపడాలని ఇందిర సర్కారు నిర్ణయించింది. సిమెంట్, స్టీల్, ఎరువులు, వంట నూనెలు, పెట్రోలియం లాంటివి దిగుమతి చేసుకోవచ్చనే భరోసాతో ఉండడం అనేది దేశానికి ప్రమాదకరం అని, వాటిని మన దేశంలోనే తయారు చేయాల్సిన అవసరం ఉందని భావించింది.
అయితే, ఆ తర్వాత కూడా నోట్లు ముద్రించి నష్టాలను భర్తీ చేసే విధానం కొనసాగింది. కానీ ఆ పద్ధతిని తగ్గించాలనే ఆందోళన వ్యక్తమైంది. తర్వాత, నోట్లు ముద్రించి నష్టాలను భర్తీ చేసే పని చేయకూడదని ప్రభుత్వం 1997లో రిజర్వ్ బ్యాంకుతో ఒక ఒప్పందం చేసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశం 90వ దశకం ప్రారంభంలో మరోసారి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కానీ, అది మాంద్యం వరకూ వెళ్లలేదు. భారత్ దగ్గర విదేశీ కరెన్సీ తక్కువ కావడంతో ఆ సంక్షోభం ఎదురైంది.
ఆ సమయంలో కూడా గల్ఫ్ యుద్ధం వల్ల చమురు ధరలు హఠాత్తుగా పెరిగాయి. ఫలితంగా భారత్ దగ్గర కొన్ని రోజులకు చమురు కొనుగోలు చేయడానికి సరిపడా విదేశీ కరెన్సీనే ఉంది. ఆ పరిస్థితిలో చంద్రశేఖర్ ప్రభుత్వం దేశం దగ్గరున్న బంగారాన్ని అమ్మాలని, కుదువ పెట్టాలని కఠిన నిర్ణయం తీసుకుంది.
అదే ఏడాది ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పీవీ నరసింహారావు ప్రభుత్వం భారత ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి కారణమైనవిగా భావించే ఆర్థిక సంస్కరణల పూర్తి ప్యాకేజీని అమలు చేసింది.
లైసెన్స్ రాజ్‌ను తొలగించి, మార్కెట్లలో ఓపెన్ కాంపిటీషన్ మార్గాన్ని తెరవడం కూడా అదే సమయంలో జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈసారి సవాలు చాలా తీవ్రమైనది
కానీ, ప్రస్తుత పరిస్థితి ఇప్పటివరకూ వచ్చిన అన్ని సంక్షోభాల కంటే భిన్నమైనది. ఎందుకంటే చమురు ధరలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. రుతుపవనాలు గత కొన్నేళ్ల కంటే చాలా బాగా వీస్తున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు కూడా నిండుగా ఉన్నాయి. అయినా దేశ ఆర్థికవ్యవస్థ పతనం దిశగా వెళ్లడమంటే అర్థమేంటి?
దీని వెనుక ఉన్న ఒకే ఒక కారణం కరోనా మహమ్మారి. ఈ కారణం చాలా పెద్దది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికవ్యవస్థ పతనం ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ లేదా ‘దైవిక విపత్తు’ ఫలితమని చెప్పారు.
కానీ.. కరోనా వ్యాపించిన తర్వాత కూడా దాని తీవ్రతను అర్థం చేసుకుని, దానిని ఎదుర్కునే విధానాలను రూపొందించటానికి ఇంత సమయం ఎందుకు పట్టింది.. అందుకు ఏ ‘గాడ్’ బాధ్యుడు అనే ప్రశ్న కూడా వస్తుంది.
మీరు, కరోనా సంక్షోభం, దానివల్ల ఉత్పన్నమైన అన్ని సమస్యలను ‘దేవుడి ఆగ్రహం’గా పరిగణించినా, కరోనా ప్రభావం కనిపించడానికి ముందు నుంచే మన దేశం అంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు.
మాజీ ఆర్థికమంత్రి చిదంబరం, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి ఈ విషయంలో దాదాపు ఒకేలా మాట్లాడారు. ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అనేదానిపై స్వామి నేరుగా ప్రశ్నించారు. “జీడీపీ గ్రోత్ రేట్ 2015లో 8 శాతం నుంచి ఈ ఏడాది జనవరిలో 3.1 శాతానికి పడిపోవడం కూడా ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అంటారా?” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ముందున్న దారేది?
సంక్షోభం తీవ్రంగా ఉందనేది సుస్పష్టం. ముందే కష్టాల్లో ఉన్న ఆర్థికవ్యవస్థ కరోనా వల్ల పూర్తిగా కుప్పకూలింది. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ముందు ముందు కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకూ ఇచ్చిన ఉపశమనం లేదా ఉద్దీపన ప్యాకేజీల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనేది స్పష్టంగా కనిపిస్తోంది.
ఆర్థిక సంక్షోభం ప్రధానంగా రెండు చోట్ల కనిపిస్తోంది. ఒకటి- డిమాండ్ ఎలా పెంచాలి. రెండు- పరిశ్రమలు, వ్యాపారులు లేదా ప్రభుత్వం వైపు నుంచి కొత్త ప్రాజెక్టుల్లో కొత్త పెట్టుబడులు ఎలా పెట్టాలి. ఈ రెండింటికీ పరస్పరం సంబంధం ఉండడమే కాదు, ఇవి ఒకదానిపై ఒకటి పూర్తిగా ఆధారపడి ఉన్నాయి.
డిమాండ్ లేకపోతే, అమ్మకాలు ఉండవు. అమ్మకాలు లేకుంటే పరిశ్రమలు నడవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. వారి దగ్గర డబ్బులు రాకపోతే, తర్వాత వారు తమ కార్మికులకు డబ్బు ఎక్కడ్నుంచి ఇవ్వగలరు.
అన్ని వైపులా ఇదే పరిస్థితి ఉంటే ఉద్యోగాలు పోతాయి, జనాల వేతనాల్లో కోత పడతాయి. లేదంటే అలాంటి వేరే విధానాలు ఏవైనా పాటిస్తారు.
అలాంటప్పుడు ప్రభుత్వం దగ్గర పెద్దగా దారులేవీ ఉండవు. కానీ చాలా మంది నిపుణులు సూచిస్తున్న ఒక్క దారి మాత్రం ఉంది.
ప్రభుత్వం కొంతకాలం తమకు నష్టం వస్తుందనే దిగులు పక్కనపెట్టి నోట్లు ముద్రించాలి. వాటిని ప్రజల జేబుల్లోకి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం కూడా అవసరం.
అప్పుడే, ఎకానమీకి కొత్త ఊపిరులు ఊదవచ్చు. ఒకసారి ఆర్థికవ్యవస్థ కోలుకుంటే, తర్వాత ఆ నోట్లు తిరిగి వెనక్కు రావచ్చు కూడా.
ఇవి కూడా చదవండి:
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








