విశాఖపట్నంలో దళిత యువకుడికి శిరోముండనం: ‘నూతన్ నాయుడి కుటుంబీకుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీశారు’

శిరోముండనం
    • రచయిత, శంకర్.వి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో మరో దళిత యువకుడికి బలవంతంగా శిరోముండనం చేసిన ఘటన సంచలనంగా మారింది.

సినీ నిర్మాత, బిగ్‌బాస్ సీజన్-2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి.

బాధితుడికి న్యాయం చేయాలని, నిందితులను అరెస్ట్ చేయాలంటూ నిరసనలు తెలిపారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నూతన్ నాయుడి భార్య సహా ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.

కర్రి శ్రీకాంత్
ఫొటో క్యాప్షన్, బాధితుడు కర్రి శ్రీకాంత్(ఆకుపచ్చ టీ షర్ట్ యువకుడు)

కొద్దిరోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన కలకలం రేపింది.

దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది. అది జరిగిన నెల రోజుల వ్యవధిలోనే ఈసారి విశాఖ జిల్లాలో కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేసినట్లు ఆరోపణలు రావడంతో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఉదంతంలో పేరు వినిపిస్తున్న నూతన్ నాయుడు ఇటీవలే రాంగోపాల్ వర్మపై ‘పరాన్న జీవి’ అనే సినిమా తీశారు. గతంలో ఈయన బిగ్‌బాస్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న విశాఖ పోలీస్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా
ఫొటో క్యాప్షన్, వివరాలు వెల్లడిస్తున్న విశాఖ పోలీస్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా(కుడి)

పోయిన సెల్ ఫోన్ విషయం మాట్లాడాలని పిలిచి గుండు గీశారు: సీపీ మనీశ్ సిన్హా

శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కర్రి శ్రీకాంత్ ఉపాధి కోసం విశాఖకు వలస వచ్చాడు. ఆ క్రమంలోనే నూతన్ నాయుడి ఇంట్లో నాలుగు నెలల పాటు పనిచేశాడు.

అక్కడ కొనసాగడం ఇష్టం లేక ఆగస్ట్ 1 నుంచి పని మానేశాడు. అయితే ఇంట్లో ఓ ఖరీదైన సెల్ ఫోన్ కనిపించడం లేదంటూ బాధితుడిని నూతన్ నాయుడు కుటుంబీకులు మళ్లీ తమ ఇంటికి పిలిపించినట్టు పోలీసులు చెబుతున్నారు.

విశాఖ పోలీస్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా ఈ వివాదం గురించి ‘బీబీసీ’కి వివరాలు వెల్లడించారు.

‘‘పెందుర్తి పరిధిలోని సుజాతనగర్ లో నూతన్ నాయుడి ఇల్లు ఉంది. తమ ఇంట్లో చోరీకి గురయిన సెల్ ఫోన్ గురించి మాట్లాడాలని నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి ఈ నెల 27 రాత్రి శ్రీకాంత్‌ని పిలిపించారు.

ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌తో సెల్‌ఫోన్ విషయమై ప్రశ్నించారు. ఫోన్ కనిపించకపోవడంతో తనకు సంబంధం లేదని, పోలీసులు ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి శ్రీకాంత్ వెళ్లిపోయాడు.

మళ్లీ 28వ తేదీ మధ్యాహ్నం తమ సూపర్‌వైజర్ ద్వారా శ్రీకాంత్‌ను మరోసారి తమ ఇంటికి రప్పించారు నూతన్ నాయుడు కుటుంబీకులు.

అప్పుడే నూతన్ నాయుడు భార్యతో పాటు ఇంట్లో పని చేస్తున్న సిబ్బంది కూడా అతన్ని గట్టిగా కొట్టారు’’ అని మనీష్ సిన్హా చెప్పారు.

‘‘క్షురకుడిని పిలిపించి ఇంట్లోనే శ్రీకాంత్‌కు గుండు గీయించారు. రాడ్‌తో దాడి చేసి అతన్ని గాయపరిచారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి పంపించేశారు’’ అని సిన్హా చెప్పారు.

శ్రీకాంత్‌కు నూతన్ నాయుడి ఇంట్లోనే ఆయన భార్య, సిబ్బంది సమక్షంలో గుండు కొట్టిస్తున్న దృశ్యాలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా పోలీసులు విడుదల చేశారు.

కర్రి శ్రీకాంత్
ఫొటో క్యాప్షన్, తనకు జరిగిన అవమానంపై పోలీసుల సమక్షంలో వివరాలు చెబుతున్న బాధితుడు కర్రి శ్రీకాంత్

‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు’

నూతన్ నాయుడి ఇంట్లో తనకు జరిగిన అవమానంపై బాధితుడు శ్రీకాంత్ బీబీసీతో మాట్లాడారు.

‘‘నెల రోజుల క్రితమే పని మానేశాను. కానీ నేను వాట్సప్ స్టేటస్ లో పెట్టుకున్న ఫోటో చూసి, వారింట్లో పోయిన ఫోన్ తోనే తీశానంటున్నారు. నాకు సంబంధం లేదని చెప్పాను. ఎంత చెప్పినా వినలేదు. వద్దు అని బతిమలాడినా లెక్కచేయలేదు. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.

మధ్యాహ్నం 2 గంటలకు తీసుకెళ్లి, రాత్రి 7 గంటల వరకూ కొడుతూనే ఉన్నారు.

ఫోన్ గురించి సైబర్ క్రైమ్ వాళ్లకు ఫిర్యాదు చేశాం.. వాట్సాప్ లో నువ్వు మెసేజ్ పెట్టావంటూ, మహిళలను వేధించావని కేసు పెడతామని బెదిరించారు. నన్ను చిత్రహింసలు పెట్టారు. ఏదో పనిచేసుకుని ఇంట్లో సాయంగా ఉందామనుకున్నాను. కానీ నన్ను ఇలా చేశారు’’ అంటూ వివరించాడు.

నూతన్ నాయుడు

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, నూతన్ నాయుడు

సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల అరెస్ట్

దళిత యువకుడికి గుండు కొట్టించిన ఉదంతంపై పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితులను అరెస్ట్ చేయాలంటూ విశాఖలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు తెలిపారు. అనంతరం బాధితుడితో కలిసి పోలీస్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. దాడికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేయాలని కోరారు.

మరోవైపు పోలీసులు రంగంలో దిగి సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.

‘‘ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేశారు.

ఏడుగురిని గుర్తించి అరెస్ట్ చేశాం. నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి, ఇందిరా రాణి , వరహాలు, బాల గంగాధర్, ఝాన్సీ, సౌజన్య, రవికుమార్ అరెస్ట్ అయ్యారు.

వారిపై ఐపీసీ సెక్షన్లు 307, 342, 324, 323, 506,రెడ్ విత్ 34 కేసు నమోదు చేశాం. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 3(1)(e).3(2)(v) కింద కేసు నమోదైంది. నిందితుల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తాం. కోర్టులో వారిని హాజరుపరుస్తాం’’ అంటూ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వివరించారు.

పోలీస్ స్టేషన్లలో శిరోముండనం చేయించి, కొట్టి చంపేస్తుంటే బయట రక్షణ ఏముంటుంది?’

పెందుర్తి ఘటనపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత యువకుడు వరప్రసాద్‌కి శిరోముండనం, కిరణ్‌ని పోలీసులు కొట్టి చంపిన రోజే కఠినంగా వ్యవహరించి ఉంటే విశాఖ జిల్లా పెందుర్తిలో మరో దళిత యువకుడు శ్రీకాంత్‌కి శిరోముండనంతో అవమానం జరిగి ఉండేది కాదు. ఈ ఘటన కి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.

పవన్ కల్యాణ్, జనసేన పేరు ప్రస్తావిస్తే న్యాయపరమైన చర్యలు: జనసేన

కాగా నూతన్ నాయుడి ఇంట్లో జరిగిన ఘటనకు జనసేన, పవన్ కల్యాణ్‌తో ముడిపెట్టి చేస్తున్న ప్రచారం సరికాదని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రధాన నిందితులు జనసేనలో ఉన్నారనే ప్రచారంలో వాస్తవం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ బీబీసీకి తెలిపారు.

‘‘ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనలో పవన్ కల్యాణ్ పేరును తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాం. నిందితులు జనసేన పార్టీలో కనీసం సభ్యులు కూడా కారు. పవన్ కల్యాణ్ ఇలా అన్యాయానికి కొమ్ము కాసే నేత కాదని ప్రతి ఒక్కరికీ తెలుసు. అన్యాయం ఎక్కడ జరిగినా జనసేన వ్యతిరేకిస్తుంది. బాధితులకు బాసటగా నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో దళితులపై జరిగిన అకృత్యాలపై స్పందిస్తున్నాం. నిందితుడు పవన్ కల్యాణ్ అభిమాని అయినంత మాత్రాన ఇలాంటి దురదృష్టకర సంఘటనలో ఆయన పేరు తీసుకు రావడం సరికాదు. ఈ కేసులో తగిన విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలని జనసేన కోరుతోంది. ప్రమేయంలేని విషయాలలో పార్టీనిగాని లేదా పార్టీ అధ్యక్షులు, నాయకుల పేర్లను ప్రస్తావించిన పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామ’’ని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)