పోతిరెడ్డిపాడు: కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?

శ్రీశైలం
    • రచయిత, శంకర్ వి.
    • హోదా, బీబీసీ కోసం

వరుసగా రెండు ఏడాది ఏపీలోని ప్రధాన నదులు వరదలతో నిండిపోయాయి. అధిక వర్షపాతం ఓవైపు, భారీ వరదలు మరోవైపు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు గోదావరి, ఇటు కృష్ణా నదీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే రెండు నదులను కలుపుకుంటే 1500 టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలయ్యింది.

గోదావరి ప్రవాహంలో ఇదీ దాదాపుగా సాధారణ విషయమే. కానీ అప్పుడప్పుడూ మాత్రమే వరదలు వచ్చే కృష్ణా నదీలో కూడా వరుసగా రెండో ఏట అన్ని ప్రాజెక్టులు నిండిపోవడం, సుమారుగా 100 టీఎంసీల నీరు సముద్రంలోకి వదలడం విశేషంగా మారుతోంది.

ఓవైపు రాయలసీమలోని ప్రధాన కాలువలు వెలవెలబోతుండగా, దిగువన కృష్ణా నది పొంగిపొర్లడం పట్ల చర్చ సాగుతోంది. రాయలసీమకు వరదల జలాలు వినియోగం పట్ల ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరముందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఆశాజనకంగా వరదల జలాలు

కృష్ణా నదిలో భారీ వరదలు అరుదుగా వస్తుంటాయి. 2009 తర్వాత గత ఏడాది సుదీర్ఘకాలం పాటు వరదల ప్రవాహం కనిపించింది. ఆగష్ట్ మధ్య నుంచి అక్టోబర్ మధ్య కాలం వరకూ రెండు నెలల పాటు పలుమార్లు వరద కనిపించింది.

దాంతో రాయలసీమ, దక్షిణా తెలంగాణా ప్రాంతాలకు కూడా నీటి కొరత తీరింది. దానికి అనుగుణంగానే పంటల సాగు విశేషంగా పెరిగింది. గత ఏడాది ఖరీఫ్‌ లో రికార్డ్ స్థాయిన 1,00,44,463 ఎకరాలను ఒక్క ఏపీలోనే సాగు చేయగలిగారు.

ఈసారి కూడా మళ్లీ దాదాపుగా వరదల ప్రవాహం అదే స్థాయిలో కనిపిస్తుంది. దీర్ఘకాలం పాటు వరదలు కొనసాగకపోయినా భారీగా వరదలు వస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం , నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ లో దాదాపుగా పూర్తి స్థాయి నీటిమట్టం కనిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న మిగులు జలాలను ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదలాల్సి వస్తోంది.

ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల కూడా నిండిపోయిన నేపథ్యంలో రాబోయే నెల రోజుల్లో కూడా వర్షాలు కొనసాగితే మిగులు జలాలన్నీ సముద్రంలోకి వదలాల్సిందే అన్నట్టుగా మారింది.

శ్రీశైలం

ప్రధాన జలాశయాల్లో నీటిమట్టం ఎలా ఉంది..

మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా వరద నీటిని దిగువకు వదలడంతో అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి. సోమవారం 24వ తేదీ సాయంత్రానికి కృష్ణా నదిపై ప్రధాన ప్రాజెక్టుల నీటిమట్టం ఇలా ఉంది.

శ్రీశైలం 884 అడుగుల గరిష్ట నిటీమట్టంతో ఉంది. 210 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. 1,91,5665 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

నాగార్జున సాగర్ లో 587 అడుగుల వద్ద నీటిని నియంత్రిస్తున్నారు. 305 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు దిగువకు 1,28,944 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

పులిచింతల ప్రాజెక్టు 175 అడుగులకు నీటిమట్టం చేరింది. 45 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. 41,844 క్యూసెక్కుల మిగులు జలాలు దిగువకు వదులుతున్నారు.

ప్రకాశం బ్యారేజ్ వద్ద 57 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. 3 టీఎంసీ ల నీటిని నిల్వ ఉంచి , 1,81,384 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

అంటే అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో ఉండగా, ఎగువ నుంచి వస్తున్న వరద జలాలు, క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో నదిలో చేరుతున్న నీరు పూర్తిగా సముద్రం పాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

కృష్ణా జలాలు
ఫొటో క్యాప్షన్, పోతిరెడ్డిపాడు కాలువ

రాయలసీమలో పరిస్థితి ఏమిటి?

రెండేళ్లుగా రాయలసీమలో కూడా కొంత ఆశావాహక వాతావరణం కనిపిస్తోంది. వర్షాలు సానుకూలంగా ఉండడంతో రైతుల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. గత ఏడాది సుదీర్ఘకాలం పాటు శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తరలించే అవకాశం రావడంతో కాలువల నుంచి కూడా నీరు రావడంతో పంటల దిగుబడి పెరిగింది.

ఈసారి వర్షపాతం కూడా దాదాపుగా అన్ని రాయలసీమ జిల్లాల్లోనూ సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. అందులో చిత్తూరు 70, కర్నూలు 65, అనంతపురం 63, కడప 38 శాతం అధిక వర్షపాతం ఈ సీజన్ లో నమోదయ్యింది.

కానీ కాలువల నుంచి ఆశించిన నీరు రావడం లేదని రాయలసీమ రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాల సమయంలో పంటలకు లోటు లేకుండా పోయిందని అంటున్నారు. అదే సమయంలో భూగర్భ జలాలు కూడా పెరగడం సంతృప్తికరంగా ఉందని చెబుతున్నారు. కానీ పంటలకు అవసరమైన నీటిని కాలువల ద్వారా తరలించేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవడం లేదని వాపోతున్నారు.

గుత్తి మండలం ఈశ్వరపల్లెకి చెందిన రైతు రామయ్య గౌడ బీబీసీతో మాట్లాడుతూ తమ సమస్యలను వివరరించారు. ‘‘వర్షాలు పడుతున్నంత సమయం మాకు నీళ్ల అవసరం కనిపించదు. వర్షాలు, వరదలతో నిరుడు అంతా సంతృప్తిగా ఉన్నాం. వలసలు పోవాల్సిన అవసరం రాలేదు మా వాళ్లకి. కానీ వానలు ఆగిపోతే నీళ్లు కావాలి. కానీ కాలువల నుంచి అలాంటి అవకాశం కనిపించడం లేదు. చెరువులు నిండినా ఎన్నాళ్లు సరిపోతాయో చెప్పలేం. హంద్రీ నీవా, గాలేరు నగరి లాంటి ప్రాజెక్టులన్నీ పూర్తయితేనే రాయలసీమ రైతుకి మేలు జరుగుతుంది’’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పోతిరెడ్డిపాడు
ఫొటో క్యాప్షన్, పోతిరెడ్డిపాడు కాలువ

పోతిరెడ్డిపాడు మీద ఆంక్షలు ఎందుకు?

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ పెట్టిన ఆంక్షలతో వరద జలాల వినియోగం సాధ్యం కావడం లేదన్నది నీటిపారుదల శాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వరద జలాలను రాయలసీమకు తరలించేందుకు అనుగుణంగా నిర్మించిన పోతిరెడ్డిపాడు నుంచి ఈ ఏడాది 9 టీఎంసీలకు మించి వినియోగించరాదని కేఆర్ఎంబీ ఆంక్షలు పెట్టింది.

శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం లేకుండానే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తున్నారంటూ తెలంగాణా అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో కేఆర్ఎంబీ స్పందించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఏపీకి 17 టీఎంసీలు, తెలంగాణాకి 37.67 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్రాకి కేటాయించిన నీటిలో రాయలసీమ, చెన్నైకి తాగునీటిని తరలించే తెలుగుగంగ ప్రాజెక్టులకు కలిపి 9 టీఎంసీలు, హంద్రీ-నీవా కోసం 8 టీఎంసీలు కేటాయించింది. ఆగష్ట్ చివరిలోగా వినియోగించుకోవాలని సూచించింది.

ఈసారి కేఆర్ఎంబీ ఆదేశాలు ఎలా ఉన్నప్పటికీ వరదలు ఎక్కువగా రావడంతో భారీగా మిగులు జలాలు నమోదవుతున్నాయి. శ్రీశైలం నుంచి 10 గేట్లను ఎత్తి రోజుకి 20 నుంచి 25 టీఎంసీల నీటిని దిగువకు వదిలే పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి సాగర్ కి, పులిచింతలకు, ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఈ మిగులు జలాలు సముద్రం పాలవుతున్నాయి. కానీ ఆ నీటిని రాయలసీమకు తరలించే అవకాశం పరిశీలించాల్సి ఉందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు.

వరద జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులకు కూడా ఆంక్షలు పెట్టడం వల్ల వృధా పెరుగుతోందని ఇరిగేషన్ నిపుణుడు శివ రాచర్ల అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఒకప్పటి తో పోలిస్తే ప్రస్తుతం వరద సమయం తగ్గింది. తక్కువ సమయంలోనే వస్తున్న వరదలను వినియోగించుకోవాలి. జూలై , ఆగష్ట్ మాసాలలో ఇరు రాష్ట్రాల అవసరం మేరకు నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలి. కానీ కేఆర్ఎంబీ ఆదేశాలు దానికి భిన్నంగా ఉన్నాయి. వరద నీటిని వినియోగించుకోవద్దని చెప్పడం అంటే వృధా చేయడానికి అంగీకరించడమే. ఓవైపు రాయలసీమకు నీళ్ళుండవు. మరోవైపు రాయలసీమ మీదుగా నీళ్లు సముద్రం వైపు పోతున్నాయి. ఇలాంటి సమస్యకు పరిష్కారం అవసరం. వివాదాలు కాకుండా సామరస్యంగా సాగునీటికి ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా పోతిరెడ్డిపాడు ద్వారాఅవకాశం మేరకు నీటిని తరలించేలా అనుమతినివ్వాలి. ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తాయనే లెక్కల ఆధారంగా వాటాలను పెంచుకుంటే అందరికీ మంచిది’’ అని అభిప్రాయపడ్డారు.

రాయలసీమ లిప్ట్ పూర్తి పరిష్కారం కాదు

రాయలసీమకు తుంగభద్ర నుంచి రావాల్సిన నీటిని సద్వనియోగం చేసుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. హెచ్ ఎల్ సీ, ఎల్ ఎల్ సీ నుంచి వస్తున్న నీటిని నిల్వ చేసే మార్గం లేకపోవడంతో అవి మళ్లీ కృష్ణా నదీలో కలుస్తున్నాయని చెప్పవచ్చు.

అదే సమయంలో శ్రీశైలం ప్రాజెక్ట్ వాస్తవ నిల్వ సామర్థ్యం 308 టీఎంసీల నుంచి ప్రస్తుతం పూడిక కారణంగా 216 టీఎంసీలకు పరిమితం అయ్యింది. తద్వారా 92 టీఎంసీల సామర్థ్యం పడిపోవడం కూడా రాయలసీమకు చట్ట ప్రకారం రావాల్సిన వాటా కోల్పోతున్నట్టు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. రాయలసీమకు 132.5 టీఎంసీల కృష్ణా జలాల కేటాయింపు లో మూడొంతులు మాత్రమే ఇప్పుడు వినియోగించుకునే అవకాశం ఉంటుందని రాయలసీమ అభివృద్ధి వేదిక ప్రతినిధి మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినప్పటికీ కాలువల సామర్థ్యం పెంచలేదు. దాంతో ఏటా 90 టీఎంసీలకు మించి రాయలసీమకు తరలించడం సాధ్యం కావడం లేదు. తుంగభద్ర నీటి కోసం 1952లో అనుమతిచ్చిన గుండ్రేవుల పూర్తి చేయలేదు. దాంతో మళ్లీ తుంగభద్ర నీరు కూడా కృష్ణాలో కలిసిపోతుంది.

రాయలసీమకు రావాల్సిన నీటి వాటా దక్కడం లేదు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ అదే శాశ్వత పరిష్కారం కాదు. సిద్దేశ్వరం వంటి పరిష్కారం వెదకాలి. సమాంతర కాలువను సిద్ధం చేయాలి. తద్వారా రాయలసీమకు చట్ట ప్రకారం కేటాయించిన నీటి నిల్వలను వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులకే ప్రాధాన్యం

ఇప్పటికే చేపట్టిన గాలేరు-నగరి, హంద్రీ నీవా, వెలిగొండ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాయలసీమ వాసులు కోరుతున్నారు. తద్వారా వరదల సమయంలో కృష్ణా జలాలను వీలయినంతగా వినియోగించుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు పెద్దగా ఈ ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

ఆయన మాట్లాడుతూ ‘‘నీటిపారుదల రంగానికి ప్రాధాన్యతనిస్తున్నాం. వెలిగొండ తొలిదశ పూర్తికావస్తోంది. రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తున్నాం. సాంకేతిక సమస్యలన్నీ పరిష్కరించుకుంటాం. కేఆర్ఎంబీ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వ వాదన వినిపిస్తున్నాం. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతోనే సాగుతున్నాం’’ అని తెలిపారు.

వరద జలాలను పూర్తిగా నిల్వ చేసుకునే అవకాశం ఎవరికీ సాధ్యం కాదు. గానీ అవసరాలకు తగ్గట్టుగా మళ్లించడం అత్యవసరంగా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణా ప్రాంత వాసులకు కూడా కృష్ణా జలాలను మళ్లించడం ద్వారానే అభివృద్ధి జరుగుతుందన్నది కాదనలేని వాస్తవం. ఈ విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాధాన్యతా క్రమంలో సంయుక్తంగా పనిచేయాల్సి ఉంటుంది. వివాదాలను పక్కన పెట్టి వరద జలాల వినియోగంపై దృష్టి పెడితే అందరికీ మేలు కలుగుతుందని అంతా చెబుతున్నారు.

వృధాగా సముద్రంలోకి పోతే ఏమొస్తుంది

రాయలసీమలో మొదటి పంటకు క్రిష్ణా జలాల్లోనూ హక్కు కల్పించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘వరద జలాలు సముద్రానికి పోతున్నాయి. కానీ రాయలసీమకు నీరు విడుదల చేయబోమనడం తగదు. కృష్ణా, తుంగభద్ర జలాలతో పాటుగా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కూడా కృష్ణా డెల్టాకే వస్తున్నాయి. కృష్ణా డెల్టాలో రెండో పంట పండించుకున్నా అభ్యంతరం లేదు. కానీ అన్ని ప్రాంతాలతో సమానంగా రాయలసీమలో మొదటి పంటకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు.

‘‘రాయలసీమలో తాగు నీటి కొరత కూడా ఉంటుంది. నిరుడు పది రోజులు ఆలశ్యంగా పోతిరెడ్డిపాడు కు నీటి విడుదల చేశారు. ఇప్పుడు కూడా సముద్రంలోకి వదులుతాం గానీ రాయలసీమకు ఇవ్వకూడదనడం అన్యాయం. క్రిష్ణా, తుంగభద్ర క్యాచ్ మెంట్ ఏరియాల నుంచి ఎంత వరద, ఎన్ని రోజులు రాబోతుందనే అనే అంచనా ప్రభుత్వం, అధికారులు వేయకపోవడం దురదృష్టకరం. ఏ ప్రభుత్వమైనా మొదటి రాయలసీమ గురించి ఆలోచించాలి’’ అని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)