సోనూ పంజాబన్: ఈ మహిళకు వ్యభిచారం ‘ప్రజాసేవ’, 'కామం' ఒక భారీ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చింకీ సిన్హా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది ఆరేళ్ల క్రితం జరిగింది. అప్పుడు చలికాలం. బహదూర్‌గఢ్‌లో బస్సు దిగిన ఒక 17 ఏళ్ల బాలిక ఆ దారిలో వెళ్తున్న ఒక వ్యక్తిని దగ్గర్లో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా అని అడిగింది. నజఫ్‌గఢ్ పోలీస్ స్టేషన్ అక్కడ ఎదురుగానే ఉంది.
2014 ఫిబ్రవరి 9న ఉదయం ఆ బాలిక పోలీస్ స్టేషన్లోకి వెళ్లింది. పోలీసులతో రోహ్‌తక్‌కు చెందిన రాజ్‌పాల్ దగ్గర తన పత్రాలు ఉన్నాయని. వాటిని ఇప్పించాలని కోరింది.
తనపై జరిగిన హింస గురించి పోలీసులకు మొత్తం చెప్పింది. తనను బంధించారని, లైంగికంగా వేధించారని, హింసించారని ఫిర్యాదు చేసింది. పోలీసులు అదంతా తమ డైరీలో నోట్ చేసుకున్నారు.
తన గోడు చెప్పుకుంటున్న ఆ బాలిక మాటల మధ్యలో సోనూ పంజాబన్ పేరు కూడా చెప్పింది. తనతో వ్యభిచారం చేయంచినవారిలో ఆమె కూడా ఉందని చెప్పింది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆ కేసు నమోదు చేస్తున్నప్పుడు దిల్లీలో సెక్స్ రాకెట్ నడిపిన సోనూ పంజాబన్ పోలీసుల అదుపులో ఉన్నారు. కొన్ని నెలల తర్వాత సోనూ బాధితురాలు అయిన ఆ బాలిక మాయమైంది. కానీ 2017లో అంతుపట్టని విధంగా మళ్లీ కనిపించింది. దాంతో పోలీసులు సోనూ పంజాబన్‌ను మళ్లీ అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత మూడేళ్లకు దిల్లీలోని ఒక కోర్టు ఆమెను దోషిగా ఖరారు చేసి, 24 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
“సభ్య సమాజంలో ఉండడానికి ఆమెకు అర్హత లేదని” అప్పుడు జడ్జి చెప్పారు. కానీ దిల్లీలోని ఈ అమ్మాయిల ‘బ్రోకర్’ మాత్రం ఎప్పుడూ ఒకే వాదన వినిపిస్తూ వచ్చారు. “వేధింపులకు గురైన అమ్మాయలకు ఆశ్రయం ఇచ్చాను. కఠిన పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలకు అండగా నిలిచాను” అని చెప్పారు.
మహిళలకు తమ శరీరంపై హక్కు ఉంటుందని కూడా సోనూ వాదిస్తున్నారు. దానిని అమ్ముకునే హక్కు తనకు ఉందన్నారు. ఆ పనికి మాత్రమే తాను సాయం చేశానని చెబుతున్నారు. “చివరికి మేమంతా కూడా ఎంతోకొంత అమ్ముకోగలుగుతున్నాం. వాటిలో మా నైపుణ్యం, శరీరం, ఆత్మ, ప్రేమ ఇంకా చాలా ఉన్నాయి” అన్నారు.
కానీ ఈసారీ, ఈ వ్యాపారంలో బాధితురాలు ఒక మైనర్ బాలిక. దాంతో సోనూ పంజాబన్‌ను జైలుకు పంపించాలని జడ్జి ప్రీతమ్ సింగ్ తన తీర్పు వినిపించారు.
“మహిళ గౌరవం కూడా, తన ఆత్మలాగే చాలా విలువైనది. దోషి గీతా ఆరోరా ఉరఫ్ సోనూ పంజాబన్ మహిళగా అన్ని పరిమితులూ అతిక్రమించారు. చట్టప్రకారం ఆమె అత్యంత కఠిన శిక్షకు అర్హురాలే” అన్నారు.

మైనర్ బాలిక ఫిర్యాదుతో అరెస్ట్
సోనూ పంజాబన్‌కు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్ఐఆర్‌ను 2015లోనే క్రైం బ్రాంచ్‌కు పంపించారు. కానీ 2017లో క్రైమ్ విభాగం డీసీపీ భీష్మ సింగ్ ఆ కేసును తీసుకోగానే, 2014లో గాంధీ నగర్ నుంచి ఇల్లు వదిలి వెళ్లిపోయిన బాలికను వెతకడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత ఆ బాలిక మాయమైంది. ఆమె తండ్రి, తన కూతురు కనిపించడంలేదని అప్పుడు పోలీస్ రిపోర్టు ఇచ్చారు.
నవంబర్‌లో పోలీసులు ఆ బాలికను యమూనా విహార్‌లో వెతికి పట్టుకున్నారు. అక్కడ ఆమె తన స్నేహితులతో కలిసి ఉంది. అప్పటికే సోనూ పంజాబన్ 2014లో నమోదైన మోకా కేసులో ఆధారాలు లేకపోవడంతో విడుదలైంది. కానీ బాలిక ఆచూకీ తెలీగానే, 2017లో సోనూను మళ్లీ అరెస్ట్ చేశారు.
శిక్ష పడిన రోజు సోనూ పంజాబన్ చాలా పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకురావడంతో, కొన్ని గంటల తర్వాత ఆమె పరిస్థితి కుదుటపడింది.
“కఠిన శిక్ష నుంచి తప్పించుకోడానికి, జడ్జికి తనపై కాస్త జాలి కలుగుతుందని ఆమె అలా చేసుండవచ్చు” అని భీష్మ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, THINKSTOCK
బాధితురాలికి డ్రగ్స్ ఇంజెక్షన్
బాధితురాలు భయపడి తన మాట వినేలా చేసేందుకు సోనూ ఆ బాలిక స్తనాలపై కారప్పొడి కూడా వేసిందని విచారణ సమయంలో జడ్జి చెప్పారు. వాంగ్మూలం ఇచ్చిన బాలిక తనకు డ్రగ్స్ కూడా ఇచ్చారని చెప్పింది.
ఆ బాలికకు ఆవులు, బర్రెల నుంచి పాలు తీయడానికి ఇచ్చే ఇంజెక్షన్లు ఇచ్చేవారు అని భీష్మ సింగ్ చెప్పారు.
సోనూ దారుణాలకు ఇవి శాంపిల్ మాత్రమే అని, మాటల్లో చెప్పలేని ఆమె నేరాల జాబితా చాలా పెద్దదని పోలీసులు చెబుతున్నారు. కానీ, ఆమె అంతకంటే దారుణంగా హింసించినట్లు తెలుస్తోంది. సోనూపై ఫిర్యాదు చేసి, చివరికి శిక్ష పడేలా చేసిన బాలికను ఆమె కొనుగోలు చేసిందని చెప్పారు.
ఆమె సెక్స్ రాకెట్లో ఎంతోమంది గృహిణులు, కాలేజీకి అమ్మాయిలు కూడా ఉండేవారు. వారితో వ్యభిచారం చేయించడానికి ఆమె రకరకాల సౌకర్యాలు సమకూర్చి, కమీషన్ తీసుకునేవారు. అదంతా పరస్పర అంగీకారంతో జరిగేది. కానీ, మిగతా బ్రోకర్ల నుంచి చిన్న వయసు బాలికలను కొనుగోలు చేసిన ఆమె వారిని తన కస్టమర్లకు సరఫరా చేసేది.
ఆ బాలికలను అమ్మేసేవరకూ సోనూ వారిని బంధించి ఉంచేవారు. బ్రోకర్లు తమ ప్రాంతాల్లో సరఫరా చేయడానికి ఏ ఇబ్బందీ లేకుండా ఆమె ఆ బాలికలను ఒక్కొక్కరుగా బయటకు పంపేవారు.
ఆమె ఒక మహిళకు ఉన్న అన్ని పరిమితులూ ఉల్లంఘించారు, మహిళాజాతికే కళంకం అయ్యారు అని ఆమె కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి అన్నారు.
సోనూ పంజాబన్ ఒక క్రూర మహిళ, ఆమెలో ఎలాంటి భయంగానీ, పశ్చాత్తాపంగానీ కనిపించేది కాదు అని డీసీపీ సింగ్ చెప్పారు.
“మైనర్ బాలికలను అమ్మడం, కొనడం నేరం అని నేను అన్నప్పుడు, ఆమె ‘నాకు తెలీదు’ అన్నారు. ఆమె కావాలనే అలా చెబుతోంది. తను చేస్తున్నది తప్పని ఆమెకు తెలుసు. మన సమాజంలో ఒక మహిళ మరో మహిళకు ఇలా ఎలా చే యగలదు అనుకుంటారు” అన్నారు.

ఫొటో సోర్స్, ANI
సభ్య సమాజంలో ఉండే అర్హత లేదు
సోనూ పంజాబన్‌కు 24 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఆమెకు ఐపీసీ సెక్షన్ 328, 342, 366ఎ, 372, 373, 120బి సహా అనైతిక వ్యాపారాలను అడ్డుకునే చట్టంలోని సెక్షన్ 4, 5, 6 ప్రకారం శిక్ష విధించారు.
పిల్లలపై లైంగిక వేధింపులు జరగకుండా రక్షించే పోక్సో చట్టం కింద కూడా సోనూను దోషిగా నిర్ధరించారు. శిక్ష విధించిన అదనపు సెషన్స్ జడ్జి ప్రీతమ్ సింగ్, సోనూకు 64 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. ఆమె సహ నిందితుడు సందీప్ బెడ్‌వాల్‌కు కూడా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధిత బాలికకు ఏడు లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.
“సోనూ పంజాబన్ దారుణాలకు బలైన బాలిక 2014లో తనకు తానుగా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. మాదకద్రవ్యాలకు బానిసైంది. తర్వాత ఆ కళంకం భరించలేకపోయింది. అప్పుడు, ఆమె సోదరికి పెళ్లి జరగబోతోంది. దానికి తన గతం అడ్డుకాకూడదనే ఆమె అలా చేసింది” అని పోలీసులు చెప్పారు.
విచారణ తర్వాత తీర్పు ఇచ్చే సమయంలో ఎలాప్రెక్స్ అనే మందు ప్రస్తావన వచ్చింది. బాధితురాలు అప్పుడు డిప్రెషన్‌లో ఉండేదని, ఆ మందు ఉపయోగించేదని పోలీసులు చెప్పారు. కొంతమంది తనను బెదిరించేవారని కూడా బాధితురాలు ఎఫ్ఐఆర్‌లో చెప్పింది.
చాలా కాలం పాటు కనిపించకుండా పోయిన బాధితురాలు దొరికిన తర్వాత ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె కొత్త జీవితం ప్రారంభించేందుకు సాయం చేశారు. తర్వాత ఆమెకు పెళ్లి కూడా అయ్యింది. ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆమె తన అమ్మనాన్నలతో ఉంటున్నారు.
“పెళ్లైన తర్వాత అత్తింటివారు ఆమెను వెళ్లగొట్టారు. ఆమె గతాన్ని అంగీకరించడానికి వారు ఒప్పుకోలేదు. ఆ బాలిక ఫోన్లో మాట్లాడేది. కానీ, చివరకు తను గెలిచానని, ఇప్పుడు తనకు ఊరటగా ఉందని ఆమె భావిస్తోంది” అని దర్యాప్తు అధికారి పంకజ్ నేగీ చెప్పారు.
“ఒక మహిళ ఒక మైనర్ బాలిక గౌరవానికి అలా ఎలా భంగం కలిగిస్తుంది. ఆమె జీవితాన్ని అంత భయంకరంగా నాశనం చేస్తుంది. సిగ్గుతో తలవంచుకోవాల్సిన తన పనులకు సోనూ పంజాబన్‌ను ఏ కోర్టూ క్షమించదు. మహిళ అయినా పురుషుడు అయినా ఇలాంటి భయంకరమైన నేరాలు చేసేవారు సభ్య సమాజంలో ఉండడానికి తగరు. అలాంటి వారిని ఉంచడానికి మంచి చోటు జైలు మాత్రమే” అని కోర్టు తన ఆదేశాల్లో చెప్పింది.
సోనూ పంజాబన్ మొదటిసారి 2011లో దిల్లీలోని ఒక కోర్టులో కనిపించారు. జడ్జి ముందు చేతులు జోడించి, అలసటగా కనిపించారు. పోలీసులు ఆమె డ్రగ్స్ నుంచి బయటపడే కోర్స్ చేస్తోందని చెప్పారు. ఆమె ఎక్కువగా తీహార్ జైల్లో ఉన్న తన సెల్‌లో నిద్రపోతుంటారు.
ఆరోజు కోర్టులో విచారణ తర్వాత మధ్యాహ్నం ఆమెను బస్సులో తీహార్ జైలుకు తీసుకెళ్లారు. బస్సు కిటికీలకు గ్రిల్స్ ఉన్నాయి. సోనూ పంజాబన్ నేరుగా వెళ్లి బస్సు వెనక సీట్లో కూర్చున్నారు. అప్పుడు నేను పార్కింగ్ దగ్గరున్నాను.
ఆమె నావైపు చూడగానే.. నేను తనతో “మిమ్మల్ని కలవడానికి వచ్చేవారి పేర్లలో నా పేరు కూడా రాయండి” అన్నాను. ఆమె నా పేరు అడిగారు. తర్వాత చాలా రోజుల వరకూ నేను తీహార్ జైలుకు ఫోన్ చేసి సోనూ విజిటర్స్ లిస్టులో నా పేరు రాసిందా అని అడుగుతూ వచ్చాను. కానీ ఆమె లిస్టులో ఆరు పేర్లే ఉన్నాయని, నా పేరు లేదని చెప్పేవారు.

ఫొటో సోర్స్, Getty Images
అరెస్ట్ చేసినప్పుడు వయసు 30 ఏళ్లు
సోనూ పంజాబన్ కేసును దర్యాప్తు చేసిన కైలాష్ చంద్ 2011లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉండేవారు. సోనూ పంజాబన్ నుంచి నిజాలు రాబట్టడానికి తను ఏం చేశారో ఆయన చెప్పారు.
“అదుపులో ఉన్న సోనూతో నేను రాత్రంతా మాట్లాడేవాడిని. ఐదు రోజుల వరకూ ఆమెను స్టేషన్‌లోనే ఉంచాం” అని చెప్పారు. సోనూ కోసం కైలాష్ చంద్ సిగరెట్, టీ, భోజనం తీసుకొచ్చేవారు. ఆమె వారికి తన కథంతా చెప్పేది.
మెహ్రౌలీలో కైలాష్ చంద్ మొదట సోనూ పంజాబన్‌ను అరెస్ట్ చేసినపుడు ఆమె అందం తనకు షాక్ ఇచ్చిందని చెప్పారు. ఆయన అప్పుడు తన మొబైల్ ఫోన్ కెమెరాతో సోనూ ఫొటో తీశాడు. అయితే ఇప్పుడు అది మసకబారిపోయింది.
2011లో అరెస్టు చేసినప్పుడు సోనూ వయసు 30 ఏళ్లు. మొదటిసారి వ్యభిచారంలోకి దిగిన ఏడాదిన్నర తర్వాత ఆమె దానిని వదిలిపెట్టింది. ఆమె అప్పటికే సొంతంగా సిండికేట్ నడిపేందుకు కావల్సిన నెట్‌వర్క్ ఏర్పాటుచేసుకుంది.
కైలాష్ చంద్ ఒక డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో సోనూ కస్టమర్లు, ఆమెను కాంటాక్ట్ అయ్యేవారి పేర్లు ఉండేవి. ఆమె మొబైల్ ఫోన్‌బుక్ కూడా చెక్ చేశారు. సోనూ రాకెట్‌లో నగరంలోని పెద్ద పెద్ద కాలేజీల్లో చదివే అమ్మాయిల పేర్లు కూడా ఉన్నాయి. వారంతా ఆమెతో కాంట్రాక్టుపై పనిచేసేవారు.
కైలాష్ చంద్‌తో సోనూ పంజాబన్ “వ్యభిచారం ప్రజాసేవ” అని చెప్పేది. మేం మగవాళ్లకు ఒక దారి చూపిస్తున్నాం. వారి కలలు నెరవేర్చుకోడానికి మేం సాయం చేస్తున్నాం. మన దగ్గర అమ్ముకోడానికి శరీరం తప్ప వేరే ఏదీ లేదంటే, దాన్ని కచ్చితంగా అమ్ముకోవాలి. జనం ప్రతిసారీ ఏదో ఒకటి అమ్ముకుంటూనే ఉంటారు” అన్నారు. ఆమె చెప్పిందంతా లిఖితపూర్వకంగా నమోదు చేశారు.
పోలీసులతో మాట్లాడేటపుడు తరచూ సమజానికి అవసరమైన ఒక సేవను అందిస్తున్నానని సోనూ వాదించేవారు. తను, తనలాంటి మహిళలు లేకపోతే ఎన్నో అత్యాచారాలు జరిగేవని చెప్పేవారు.
కామం అనేది ఒక మార్కెట్ అని ఆమె చెప్పేవారు. ఆ మార్కెట్ లేకపోతే సమాజంలో అరాచకం పెరిగిపోతుందని అనేవారు. నైతికత అనే ప్రశ్నను చాలా ముందే వదిలేసి వచ్చానని తెలిపారు.
నా పాత నోట్‌బుక్‌లో పోలీసులు వినిపించిన ఒక కథ దొరికింది. సోనూను ఆమె భర్త కొట్టేవాడని, ఆమెతో బలవంతంగా సెక్స్ చేసేవాడని అందులో ఉంది. అతడు ఆమెకు డబ్బు కూడా ఇచ్చేవాడు కాదని, అయినా ఆమె తన బిడ్డను చదివించాలని కోరుకునేదని చెప్పారు.
ఆ పోలీసులు “ఆ మహిళ తప్పేముంది. ఆమె వివాహిత. అందుకే ఆమె తన కోరికలు, ఆశలు అన్నీ తనలోనే ఉంచుకుంది. పెళ్లి పేరుతో ఇంట్లో బంధించి కొట్టే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. వాటన్నిటి నుంచి తప్పించుకోడానికి ఆమె శరీరాన్నే నమ్ముకుంది. సమాజంలో దృష్టిలో మాత్రం ఆమె చేస్తోంది తప్పుడు పని” అని కైలాష్ చంద్‌కు చెప్పారు.
సోనూ పంజాబన్ చాలా చురుకుగా ఉండేవారు. మంచి బట్టలు వేసుకునేవారు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. 2017లో ఆమె మళ్లీ పట్టుబడ్డారు. ఆమె నుంచి విషయం రాబట్టాలంటే ఆమెతో బాగా ప్రవర్తించాలని పోలీసులకు తెలుసు. దాంతో ఆమెకు వాళ్లు రెడ్ బుల్ డ్రింక్, శాండ్ విచ్, బర్గర్, పిజ్జాలు, సిగరెట్లు కూడా కొనుక్కొచ్చి ఇచ్చేవారు. ఆమె వారికి కూడా తన కథ వినిపించేవారు. కానీ ఈసారీ ఆమెకు అదృష్టం కలిసిరాలేదు.
అనైతిక వ్యాపారాన్ని అడ్డుకునే చట్టం ప్రకారం సోనూను 2007లో ప్రీత్ విహార్‌లో అరెస్ట్ చేశారు. బెయిలుపై ఉంటున్న సమయంలో 2008లో ఆమె మరోసారి పాత నేరాలే చేస్తూ దొరికిపోయారు.
2011లో వ్యభిచారం చేస్తూ మరోసారి పట్టుబడిన తర్వాత ఆమెకు వ్యతిరేకంగా మోకా కేసు నమోదైంది. గాంగ్‌స్టర్, తీవ్రవాదులను అణచివేసేందుకు మోకా చట్టాన్ని తీసుకొచ్చారు. 2002లో దానిని దిల్లీలో కూడా ఉపయోగించడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, iStock
ఆమె దృష్టిలో వ్యభిచారం ప్రజాసేవ
2019లో సోనూ పంజాబన్ పెరోల్ మీద విడుదలయ్యారు. ఆ సమయంలో ఆమె తన టీవీ ఇంటర్వ్యూల్లో పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారని, తను బ్రోకర్ అని ఏ బాలికా ఆన్-రికార్డ్ చెప్పలేదని అన్నారు. తను వారికి సౌకర్యాలు మాత్రమే అందించానని చెప్పారు.
విఫలమైన వివాహాల నుంచి బయటపడాలని, ఇళ్లలో పరిస్థితికి విసిగిపోయిన వారికి తను అండగా నిలిచానన్నారు. జీవితంలో ఆనందం అనుభవించాలనుకునేవారికి సాయం చేశానని సోనూ చెప్పారు. తన కథ పతాక శీర్షికల్లో నిలిచేదనే విషయం తనకు తెలుసన్నారు.
నేరస్థురాలిగా, బాధితురాలుగా రెండు పాత్రల గురించి ఆమెకు తెలుసు. ఆమె ఆ పరిస్థితుల్లో ఉన్నారు. 2013లో వచ్చిన ‘ఫక్రే’, 2017లో వచ్చిన ‘ఫక్రే రిటర్న్స్’ లో భోలీ పంజాబన్ పాత్రను ఈమె కథ నుంచే తీసుకున్నారు. ఆ రెండు పాత్రలను రిచా చద్దా చేశారు.
సోనూ పంజాబన్ మోకా కేసులో అరెస్ట్ అయినపుడు ఆర్ఎం తుఫైల్ ఆమె తరఫున కేసు వాదించారు. నిర్దోషిగా బయటికొచ్చేలా చేశారు.
ఆమెకు పడిన 24 ఏళ్ల శిక్షన చాలా ఎక్కువ కాలం అని ఆయన చెప్పారు. సోనూను వెనకేసుకొచ్చారు. కోర్టు తీర్పుపై అపీల్ చేస్తామని తెలిపారు.
“భిక్షాటన, వేశ్యావృత్తి ప్రపంచంలో అత్యంత పురాతనమైన వృత్తులు. వీటి గురించి సరిగా ఎవరికీ ఏమీ తెలీదు. అందరూ నైతికత గురించి మాట్లాడతారు. అవన్నీ ఇప్పుడు చికాకు పుట్టిస్తున్నాయి” అంటారు తుఫైల్.
సోనూకు చాలా కాలం శిక్ష విధించారు
తూర్పు, దక్షిణ దిల్లీలో కోట్ల రూపాయల సెక్స్ రాకెట్ నడిపిన సోనూ పంజాబన్ 2011లో మోకా కింద అరెస్టైనప్పటి నుంచి వార్తల్లో నిలిచారు. పత్రికల్లో వచ్చిన స్టోరీల ప్రకారం ఆమె చాలా విలాసవంతమైన జీవితం గడిపారు. ఆమెకు చాలా మంది ప్రియులు, నలుగురు భర్తలు ఉన్నారు. అందరూ గాంగ్‌స్టర్లే. వారిలో చాలామంది పోలీస్ ఎన్‌కౌంటర్లలో చనిపోయారు.
సోనూ తన సంబంధాలు పెళ్లి కోసమే అనడాన్ని ఒప్పుకోలేదు. పోలీసులే తనకు సోనూ పంజాబన్ అనే పేరు పెట్టారని చెప్పారు. బాల్యంలో తల్లిదండ్రులు తనను సోనూ అని పిలిచేవారన్నారు. పోలీసుల మాత్రం ఆమె తన భర్తల్లో ఒకరైన హేమంత్ అలియాస్ సోనూ పేరునే పెట్టుకుందని చెబుతున్నారు.
2003లో ఆమె మరో భర్త విజయ్ యూపీలో పోలీస్ ఎన్‌కౌంటర్లో చనిపోయాడు. ఆ తర్వాత ఆమె కార్లు దొంగిలించే ఫ్రెండ్ దీపక్‌తో కలిసి ఉండేవారు. పోలీసులు అతడిని గువాహటిలో ఒక ఎన్‌కౌంటర్లో కాల్చిచంపారు. తర్వాత ఆమె అతడి సోదరుడు హేమంత్ అలియాస్ సోనూతో ఉండేవారు. అతడు తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి బహదూర్‌గఢ్‌లో ఒక హత్య కూడా చేశారు. హేమంత్ కూడా ఒక ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని ఆమె చెబుతున్నారు.
సోనూ చనిపోయిన తర్వాత ఆమెకు తోడు లేనట్లు అనిపించింది. ఆమె ఇద్దరు సోదరులు ఉద్యోగాలు లేకుండా ఉండేవారు. తండ్రి చనిపోయాడు. దాంతో, తన తల్లి, కొడుకు బాధ్యతలు ఆమెపై పడ్డాయి. అదే సమయంలో ఆమె కాల్ గర్ల్ అయ్యారు. మొదట దిల్లీలో బ్యూటీషియన్‌గా పనిచేసిన ఆమె ఒక స్నేహితురాలి సాయంతో వ్యభిచారంలోకి అడుగుపెట్టారు.
“సోనూ ఫోన్‌లో వాళ్లతో కలిసి తీసుకున్న చాలా ఫొటోలు ఉన్నాయి. వాటిలో ఆమె పాపిట్లో బొట్టుతో కనిపిస్తున్నారు. దానిని బట్టి వాళ్లు భార్యాభర్తలని తెలుస్తోంది” అని దర్యాప్తు అధికారి పంకజ్ నేగీ చెప్పారు.

ఫొటో సోర్స్, iStock
గీతా మగ్గూ నుంచి సోనూ పంజాబన్
సోనూ పంజాబన్ 1981లో గీతా కాలనీలో పుట్టారు. ఆమె అసలు పేరు గీతా మగ్గూ. ఆమె తాత పాకిస్తాన్‌కు నుంచి వచ్చిన ఒక శరణార్థి. ఆయన రోహ్‌తక్‌లో స్థిరపడ్డారు. సోనూ తండ్రి ఓం ప్రకాశ్ దిల్లీలో ఆటో నడిపేవారు. ఆమె కుటుంబం తూర్పు దిల్లీలో ఉండేది.
సోనూకు అక్క, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. సోనూ అక్క సతీష్ అనే వ్యక్తిని పెళ్లాడితే, అతడి తమ్ముడు విజయ్‌ను గీతా 1996లో పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 15 ఏళ్లు. తర్వాత ఆమెకు కొడుకు పుట్టాడు.
నేను సోనూ ఇంటికి వెళ్లినపుడు ఆమె కొడుకు పారస్ వయసు తొమ్మిదేళ్లు. అప్పటి నుంచి అతడు తల్లి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. తల్లి జైలు నుంచి అప్పుడప్పుడూ ఫోన్ చేసేదని చెప్పాడు. పారస్‌కు ఇప్పుడు 17 ఏళ్లు. అతడికి తన తల్లి గురించి అంతా తెలుసని పోలీసులు చెబుతున్నారు.
తర్వాత ఆమె రోహిణీలో ఉండే కిరణ్ అనే మహిళ దగ్గర సెక్స్ వర్కర్‌గా పనిచేశారు. మొదట్లో అద్దెకు గది తీసుకుని తన వ్యాపారం చేసిన ఆమె తర్వాత సైదుల్లాజాబ్‌లో సంజయ్ మఖీజా పేరుతో ఒక అపార్టుమెంట్ కొనే స్థాయికి చేరుకున్నారు. అతడు ఆమె పాత స్నేహితుడని పోలీసులు చెబుతున్నారు.
సోనూ పంజాబన్ మొదట సెక్స్ వర్కర్ నుంచి తర్వాత హైక్లాస్ బ్రోకర్ అయ్యారు. ఆమెకు మొదట సహాయకుడుగా ఉన్న రాజు తర్వాత ఆమెకు వ్యాపారంలో సాయం చేసేవాడు. అది విస్తరించేసరికి అతడు అవుట్ స్టేషన్ కస్టమర్లను చూసుకునేవాడు. ఇద్దరూ తమ ఏజెంట్ల ద్వారా వివిధ నగరాల్లో కూడా తమ వ్యాపారం ప్రారంభించారు.
పోలీసుల విచారణలో ఆమె మిగతా ప్రాంతాల్లో ఉన్న తన ఏజెంట్ల పేర్లు కూడా చెప్పారు. ఆమె ఈ వ్యాపారంలో తన ప్రత్యర్థులు కూడా కలిసి పనిచేసేవారు. ఆ వ్యాపారంలో వారికి సెక్యూరిటీ అందించడానికి తన నెట్‌వర్క్ కోసం సంపాదనలో దాదాపు 60 శాతం కమిషన్ తీసుకోవడం ప్రారంభించారు.
ఆమె కారు రాత్రిళ్లు నగరంలో 500 కిలోమీటర్లు పరుగులు తీసేది. ఆ కారులో అమ్మాయిలను వారి లొకేషన్ నుంచి పికప్ చేసుకుని, కస్టమర్ల సర్వీస్ కోసం రకరకాల ప్రాంతాల్లో డ్రాప్ చేసేవారు. ఆమె తను కొనుగోలు చేసిన బాలికల ద్వారా ఎక్కువ సంపాదించేవారు. ఒక మైనర్ బాలిక ఆమెపై ఎఫ్ఐఆర్‌లో ఆ విషయం చెప్పింది.
దిల్లీలో హై ప్రొఫైల్ బ్రోకర్ అయిన ఒక దొంగ బాబా కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. పోలీసులకు ఆయన సమాచారం అందించి, పట్టించింది సోనూనే అని చెబుతున్నారు.
“ఇలాంటి నేరాల్లో ఎప్పుడు ఖాళీ ఏర్పడినా, ఎవరో ఒకరు దానిని భర్తీ చేస్తారు. ఇది కూడా అంతే. బాబా అరెస్టవగానే, సోనూ తన వ్యాపారాన్ని విస్తరించారు” అని నేగీ అన్నారు.
సోనూ పంజాబన్ అరెస్ట్ పతాక శీర్షికల్లో నిలిచింది. గులాబీ మోడ్రన్ డ్రెస్, బ్లూ జీన్స్ వేసుకున్న ఆమె ఫొటోలు మీడియాలో వచ్చాయి. తన మిగతా ఇంటర్వ్యూలలో ఆమె లెదర్ జాకెట్, పసుపు జంపర్, శాలువ కప్పుకుని కనిపించారు.
టీవీ చానళ్లలో ఇప్పుడు ఆమె ముఖం చూపిస్తున్నారు. ఆమె నేరాల గురించి చెబుతున్నారు. ఆమెను వ్యవస్థీకృత సెక్స్ రాకెట్‌కు ‘క్వీన్’గా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, PTI
ఇప్పటికీ అసంపూర్తిగా సోనూ కథ
“సోనూ పంజాబన్ అరెస్ట్, మిగతావారు ఇలాంటి నేరాలు చేయకుండా అడ్డుకోడానికి ఉపయోగపడుతుంది. కానీ, ఇలాంటి సెక్స్ రాకెట్ నడిపే వారిని కోర్టు వరకూ తీసుకెళ్లి శిక్ష వేయించడం చాలా కష్టం” అని పోలీసులు చెబుతున్నారు.
ఆరోజు, ఆ మైనర్ బాలిక ముందుకొచ్చి సోనూకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయకుంటే ఆమెను పట్టుకోవడం కష్టం అయ్యేదని భీష్మ సింగ్ చెప్పారు.
సోనూ పంజాబన్‌ను నేను కలిసినప్పుడు ఆమె వయసు 31 ఏళ్లు. ఇప్పుడు తనకు 40 ఏళ్లు ఉంటాయి. జైలు నుంచి బయటికొచ్చే సమయానికి ఆమెకు 64 ఏళ్లు వస్తాయి. బహుశా, అప్పటికి ఆమె చాలామందికి గుర్తు కూడా ఉండదు. కొన్ని రోజుల తర్వాత ప్రపంచం తన పని తాను చేసుకుంటుంది.
ప్రస్తుతం సోనూ చేసిన ఘోరమైన నేరాలను చాలామంది ఖండించారు. ఆమెను సభ్య సమాజానికి తగరు అన్నారు. బహుశా ఆ రోజు ఆమె తన విజిటర్స్ జాబితాలో నా పేరు రాసుంటే, ఆమెను కలిసి, ఆమె అభిప్రాయం తెలుసుకునే అవకాశం నాకు ఉండేది. మీడియా ఇన్ని చెబుతున్నా, ఆమె నిజంగా వాటి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేదాన్ని.
అయితే, ఆమె తన మాట చెప్పేవరకూ, ఈ కథకు ముగింపు ఉండదు. ఇప్పటివరకూ ఈ కథకు పోలీసుల ఫైల్లో ఉన్న విషయాలు, ఆమె గురించి చెబుతున్న వార్తలు, ప్రజల అభిప్రాయాలు, తీర్పులు ఆధారం అయ్యాయి. వాటితో, ఎట్టి పరిస్థితుల్లో ఈ కథ పూర్తి కాదు.
“నేను ఏదో, దానికి నా పనికి ఎలాంటి సంబంధం లేదు. నా వ్యాపారాన్ని బట్టి నన్ను ఎవరూ అంచనా వేయలేరు” అని సోనూ 2011లో సబ్ ఇన్‌స్పెక్టర్ కైలాష్‌చంద్‌కు చెప్పిన మాటలు నాకు గుర్తుకు వస్తున్నంత వరకూ ఈ కథ అసంపూర్తిగానే ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- #రక్షాబంధన్: చెల్లెలి కోసం సోదరుడు 'విటుడి'గా మారి..
- ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- #UnseenLives: పీరియడ్స్ సమయంలోనూ మాతో ‘సెక్స్ వర్క్’ చేయించేవారు!
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- వీడియో గేమింగ్‌లో విపరీతంగా పెరుగుతున్న మహిళల సంఖ్య
- టీవీ రిపోర్టర్ మెడపై క్యాన్సర్ కణితిని గుర్తించి అప్రమత్తం చేసిన ప్రేక్షకురాలు
- సోనూ సూద్ ట్రాక్టర్ ఇచ్చిన రైతు నాగేశ్వరరావు రాజకీయ నాయకుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








