ఫ్లోరిడా టీవీ రిపోర్టర్ మెడపై క్యాన్సర్ కణితిని గుర్తించి అప్రమత్తం చేసిన ప్రేక్షకురాలు

విక్టోరియా ప్రైస్

ఫొటో సోర్స్, Instagram/victoria price

ఫొటో క్యాప్షన్, విక్టోరియా ప్రైస్

ఫ్లోరిడాకు చెందిన ఒక రిపోర్టర్ మెడపై అసాధారణంగా పెరుగుతున్న కణితిని చూసి ఆమె ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకురాలు ఒకరు అప్రమత్తం చేశారు. వెంటనే చికిత్స తీసుకోవాలని సూచిస్తూ ఈమెయిల్ పంపించారు.

''గత నెలలో వీక్షకుల్లో ఒకరు నాకు ఈమెయిల్ పంపించారు'' అంటూడబ్ల్యూఎఫ్ఎల్ఏ రిపోర్టర్ విక్టోరియా ప్రైస్ గురువారం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

''తనకు క్యాన్సర్ ఉంది. నాకు కూడా'' అని చెప్పిన విక్టోరియా ఈ వ్యాధితో పోరాడేందుకు గాను కొన్నాళ్ల పాటు ఉద్యోగానికి దూరంగా ఉంటానని ప్రకటించారు.

ఆ కణితిని తొలగించుకోవడానికి సోమవారం శస్త్రచికిత్స చేయించుకుంటున్నట్లు విక్టోరియా వెల్లడించారు.

ఫ్లోరిడాలోని టాంపాలో కరోనావైరస్ ప్రబలడంతో ఆ వార్తలు కవర్ చేసే పనిలో పడి తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని విక్టోరియా చెప్పారు.

విక్టోరియా ప్రైస్

ఫొటో సోర్స్, INSTAGRAM/ VICTORIA PRICE

ఫొటో క్యాప్షన్, విక్టోరియా ప్రైస్

''కరోనా వైరస్ మొదలయ్యాక జర్నలిస్టుగా విరామం లేకుండా పనిచేయాల్సి వచ్చింది. నిరంతర వార్త స్రవంతిలో రాత్రీపగలు లేకుండా పనిచేశాం.. ఈ శతాబ్దంలోనే అత్యంత ముఖ్యమైన హెల్త్ స్టోరీని కవర్ చేశాను కానీ నా ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోలేదు'' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె రాశారు.

మెడ మధ్య భాగం నుంచి ఆ కణితి పెరుగుతోందని.. శస్త్రచికిత్స చేసి తొలగించాలని వైద్యులు చెప్పారు. కణితితో పాటు థైరాయిడ్ గ్రంథి, కొన్ని లింఫ్ నోడ్స్ కూడా తొలగించక తప్పదని చెప్పారు.

''వీక్షకురాలి నుంచి నాకు ఆ మెయిల్ రాకపోతే నేను డాక్టరును సంప్రదించేదాన్ని కాను. క్యాన్సర్ మరింత ముదిరేది. ఆలోచిస్తేనే భయమేస్తోంది'' అన్నారు విక్టోరియా.

''నన్ను హెచ్చరించిన ఆమెకు ధన్యవాదాలు. ఆమె ఎవరో నాకు తెలియకపోయినా, నా పట్ల బాధ్యత లేకపోయినా కూడా తాను గుర్తించిన విషయాన్ని నాకు చెప్పి ఎంతో మేలు చేశారు'' అంటూ విక్టోరియా కృతజ్ఞతలు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

థైరాయిడ్ క్యాన్సర్ మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా వస్తుందని.. ఈ ఏడాది అమెరికాలో ఈ క్యాన్సర్ బారిన పడినవారిలో 75 శాతం మహిళలేనని విక్టోరియా చెప్పారు.

''కాబట్టి ఆడవాళ్లూ.. మీ మెడను తనిఖీ చేసుకోండి'' అని సూచన చేశారు.

మౌసా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మౌసా(ఎడమవైపు వ్యక్తి)

టీవీ బ్రాడ్‌కాస్టర్లకు వీక్షకులు ఆరోగ్య హెచ్చరిక చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో 'బీబీసీ వన్' కార్యక్రమంలో పాల్గొన్న లివర్‌పూల్ ఫుట్ బాల్ క్లబ్ డిఫెండర్ మార్క లారెన్సన్‌ను చూసి ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించి హెచ్చరించారు ఒక వైద్యుడు.

2013లో కేబుల్ న్యూస్ హోస్ట్ తారిక్ మౌసా మెడపై ఉన్న కణితిని చూసి ఒక నర్సు హెచ్చరించారు. తారిక్ ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ నుంచి కోలుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)