భూటాన్: ఈ చిన్న దేశం భారత్‌కు ఎందుకంత ముఖ్యం?

భూటాన్ ప్రధానితో భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Hindustan Times

    • రచయిత, భూమిక
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అంతర్జాతీయ స్థాయిలో చాలా వివాదాలతో ప్రస్తుతం చైనా సతమతం అవుతోంది. కరోనావైరస్ సంక్రమణ, హాంకాంగ్‌లో కొత్త సెక్యూరిటీ చట్టం అమలు, వీగర్ ముస్లింలపై వేధింలపుల ఆరోపణలు, భారత్‌తో సరిహద్దు వివాదం.. ఇలా చాలా వివాదాలు చైనా చుట్టుముట్టాయి.

భూటాన్ తూర్పు వైపునున్న సక్తెంగ్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా తమదేనని చైనా వాదిస్తోంది. అంతేకాదు తూర్పువైపునున్న ఈస్టెర్న్ సెక్టార్ మొత్తం తమదని అంటోంది.

రెండు దేశాల మధ్య స్పష్టమైన సరిహద్దులు లేవని చైనా వాదిస్తోంది. తూర్పు, పశ్చిమ, మధ్య సెక్టార్లలో వివాదం ఉందని చెబుతోంది.

ఈ సరిహద్దు వివాదాలకు ఇప్పుడు ఓ పరిష్కారంతో చైనా ముందుకు వచ్చింది. అయితే ఒక్కసారిగా ఇలాంటి మెతక వైకరిని అనుసరించడానికి కారణం ఏమై ఉండొచ్చని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

తూర్పు భూటాన్‌లోని సక్తెంగ్ వన్యప్రాణుల అభయారణ్యంపై ఇదివరకు ఎప్పుడూ చైనా తమ హక్కుల గురించి ప్రస్తావించలేదు.

ఈ అభయారణ్యం.. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉంది.

1984 నుంచి నేటివరకు సరిహద్దు వివాదాల పరిష్కారంపై 24 దఫాలుగా చర్చలు జరిగాయి. అయితే వీటిలో ఈ అభయారణ్యం ప్రస్తావన లేదు.

''ఈ విషయంపై చైనా వైఖరి స్పష్టంగా ఉంది. రెండు దేశాల మధ్య సరిహద్దులు సరిగా లేవు. తూర్పు, పశ్చిమ, మధ్య సెక్టార్‌లలో వివాదాలు ఉన్నాయి'' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ రిపోర్టర్లతో చెప్పారు.

అయితే, ఈ వివాదాల గురించి ఇతర వేదికలపై చర్చించుకోవడం తమకు ఇష్టంలేదని ఆయన స్పష్టంచేశారు.

ఈ అంశంపై దిల్లీలోని భూటాన్ దౌత్యకార్యాలయం కూడా స్పందించింది.

‘‘ఇంతకు ముందెన్నడూ ఈ అభయారణ్యం తమదని చైనా చెప్పలేదు. గత నెల నుంచీ ఈ కొత్త వాదన వినిపిస్తోంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్త భూభాగాలు తమవేనని చైనా చెప్పగలదు. ఎప్పుడు వివాదాలు సృష్టిస్తారో చైనా పొరుగునున్న దేశాలకు అసలు అర్థం కాదు’’ అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలానీ వ్యాఖ్యానించారు.

గాల్వన్ లోయ వివాదాన్ని కూడా ఆయన ఉదహరించారు. ఇదివరకు ఈ ప్రాంతం తమదని చైనా చెప్పలేదని ఆయన వివరించారు.

''ఇది కచ్చితంగా చైనా వ్యూహమే. ఇలాంటి ప్రవర్తనలు చైనాకు కొత్తేమీ కాదు''

2019లో మోదీ భూటాన్‌లో పర్యటించినప్పుడు..

ఫొటో సోర్స్, UPASANA DAHAL

భారత్-భూటాన్ సంబంధాలు ఎంత దృఢమైనవి?

ఒకవైపు భూటాన్‌తో చైనా వివాదాలు పెంచుకుంటూ, చర్చలకు రావాలని పిలుస్తుంటే.. మరోవైపు భూటాన్‌తో సత్సంబంధాలు, బంధాల బలోపేతంపై భారత్ దృష్టి కేంద్రీకరించింది.

తాజా పరిణామాలను చూసుకుంటే... జులై 15న భారత్, భూటాన్‌ల మధ్య కొత్త వాణిజ్య మార్గం కూడా తెరచుకుంది.

దీనితోపాటు భూటాన్‌లో శాశ్వత ఉపరితల రవాణా సుంకాల విధింపు కేంద్రాన్ని తెరచేందుకూ భారత్ అంగీకరించింది. భూటాన్ ఎగుమతులు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది.

రెండు దేశాల మధ్య వాణిజ్య కేంద్రాలు, ముజ్‌నాయి-న్యోయెన్‌పాలింగ్ రైలు మార్గం నిర్మాణానికీ పనులు జరుగుతున్నాయి.

భారత్-భూటాన్‌ల మధ్య బంధాల బలోపేతం కొత్తేమీ కాదు.

స్వాతంత్ర్యం అనంతరం.. రెండు దేశాల మధ్య ఫ్రెండ్‌షిప్ ట్రీటీ కుదిరింది. దీనిలో చాలా నిబంధనలున్నాయి. వాటిలో విదేశీ వ్యవహారాలు, రక్షణ అవసరాల కోసం భారత్‌పై భూటాన్ ఆధారపడటమూ ఒకటి.

తర్వాతి కాలంలో ఈ ఒప్పందంలో మార్పులు చేశారు. కాలం చెల్లిన నిబంధనలను తొలగించారు. ఆర్థిక సహకారంతోపాటు సంస్కృతి, ఆరోగ్యం, స్పోర్ట్స్, టెక్నాలజీ తదితర రంగాల్లో బంధాలను బలోపేతం చేసుకొనేందుకు కొత్త నిబంధనలు చేర్చారు.

భారత్, చైనా సైనికులు

ఫొటో సోర్స్, AFP

భూటాన్‌పై చైనా ఒత్తిడి చేస్తోందా?

చైనాతో సరిహద్దు వివాదాలున్న దేశాల్లో భారత్, భూటాన్ ఉన్నాయి.

మరోవైపు దక్షిణాసియాలో భారత్-భూటాన్.. అత్యంత సన్నిహిత దేశాలు.

భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బ తీయడమే లక్ష్యంగా భూటాన్‌తో చైనా తాజా వివాదాన్ని తెరపైకి తెచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.

''భూటాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చైనా ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. భూటాన్‌తో సరిహద్దులపై చైనాకు పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా పశ్చిమ సెక్టార్‌లో మూడు దేశాల కూటమిలో వివాదంపై చైనా ఎక్కువ దృష్టిపెట్టింది. ఈ ప్రాంతంలో వివాదంతో భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలు ప్రభావితమయ్యే ముప్పుంది'' అని భూటాన్‌లో మాజీ భారత రాయబారి పవన్ వర్మ వ్యాఖ్యానించారు.

''చైనా ఇలాంటి పనులు ఏళ్ల తరబడి చేస్తోంది. భారత్‌ను పక్కన పెట్టి తమ వైపు భూటాన్‌ను రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటికీ రెండు దేశాల మధ్య ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవు.''

2017లో మూడు దేశాల కూటమిలో భారత్-చైనా ఢీ అంటే ఢీ అని ఎదురెదురు పడ్డాయి. ఇది 75 రోజులపాటు కొనసాగింది.

అప్పటినుంచీ భూటాన్ భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు చైనా ప్రయత్నిస్తోంది.

''చైనా విస్తరణ కాంక్ష ఫలితమే ఇవన్నీ.. అందుకే అన్నిచోట్లా భూభాగాలు తమవేనని చైనా చెబుతోంది'' అని భూటాన్‌లో మాజీ భారత రాయబారి ఇంద్రపాల్ ఖోస్లా వ్యాఖ్యానించారు.

భారత్ తమ అవసరాల కోసం భూటాన్‌ను ఉపయోగించుకుంటోందని ఎప్పటి నుంచో చైనా ఆరోపిస్తూ వస్తోంది.

డోక్లాం వివాద సమయంలో.. భారత్ అనవసరంగా భూటాన్ సరిహద్దు శిబిరంలో కాలు పెడుతోందని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది.

''చైనా, భూటాన్ సరిహద్దుల్లో ఇదివరకు కూడా చాలా వివాదాలు వచ్చాయి. రెండు దేశాల సైన్యాలు కూర్చుని ఈ సమస్యలను పరిష్కరించుకున్నాయి. ఇక్కడ భారత సైనికులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు''అని గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది.

''భూటాన్‌లో భారత సైనికులు పనిచేస్తున్నారు. భూటాన్ సైన్యానికి భారత్ నిధులు, శిక్షణ ఇస్తోంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. భూటాన్ భద్రత కోసం భారత్ ఈ పని చేయడం లేదు. చైనాకు వ్యతిరేకంగా వ్యూహాత్మక లక్ష్యాల కోసమే ఈ సాయం అందిస్తోంది''

భారత్ సైన్యం

ఫొటో సోర్స్, Yawar Nazir

ఎందుకు అంత ముఖ్యం?

భారత్, చైనాల మధ్య భూటాన్ ఉంది.

భూటాన్‌కు భారత్ ఎంతో ప్రధాన్యం ఇస్తోంది. భారత ప్రధాని, విదేశాంగ మంత్రి, విదేశాంగ కార్యదర్శి, సైన్యం, నిఘా విభాగాల అధిపతుల తొలి విదేశీ పర్యటన భూటాన్‌తో మొదలు కావడం ఓ ఆనవాయితీ.

''భారత్‌కు భూటాన్ ఎంత ముఖ్యమో మ్యాప్‌ను చూస్తే అర్థం అవుతుంది. భూటాన్‌తో సత్సంబంధాలు.. మన భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలకు చాలా కీలకం. అందుకే ప్రపంచంలో ఏ దేశంతో లేనంత మంచి సంబంధాలు భూటాన్‌తో మనకున్నాయి'' అని పవన్ వర్మ చెప్పారు.

భూటాన్‌తోనున్న 605 కి.మీ. పొడవైన సరిహద్దు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. భారత్-భూటాన్ వాణిజ్య సంబంధాల్లోనూ దీనికి ప్రత్యేక స్థానముంది. 2018లో రెండు దేశాల వాణిజ్యం 9,228 కోట్ల రూపాయలుగా ఉంది.

భూటాన్ నుంచి భారత్‌కు జల విద్యుత్ కూడా భారీగా సరఫరా అవుతోంది. భారత్ సాయంతో భూటాన్‌లో చాలా అభివృద్ధి కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి.

మరోవైపు భూటాన్, చైనాలకు ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలూ లేవు.

చైనాకు భూటాన్ ఎందుకు ముఖ్యమంటే.. భూటాన్‌ లోపలికి రాగలిగితే... భారత్‌ సరిహద్దును సమీపించినట్లే. భారత్, భూటాన్ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను చేరుకోగలిగితే... భారత్‌కు వ్యూహాత్మకమైన చికెన్-నెక్ ప్రాంతం చైనాకు అందుబాటులోకి వస్తుంది. దీంతో భారత్‌పై మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదముంది. అందుకే భూటాన్‌పై చైనా పదేపదే ఒత్తిడి తీసుకొస్తోంది అని పవన్ వర్మ చెప్పారు.

భూటాన్‌తో సంబంధాలను మెరుగు పరచుకొనేందుకు ఏళ్లుగా చైనా ప్రయత్నిస్తోందని, ఇంకా ఈ ప్రయత్నాలు కొనసాగుతాయని పవన్ వర్మ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)