అఫ్గానిస్తాన్: ‘డాక్టర్‌కి నా పేరు చెప్పినందుకు నా భర్త నన్ను చావగొట్టాడు’

లాలే ఒస్మానీ

ఫొటో సోర్స్, "Where is my name?" campaigners

ఫొటో క్యాప్షన్, లాలే ఒస్మానీ పేరును ‘వేరీజ్‌మైనేమ్?’ ఉద్యమ పోస్టర్ల మీద ప్రచురించారు
    • రచయిత, మెహ్‌జూబా నౌరోజీ
    • హోదా, బీబీసీ అఫ్గాన్ స‌ర్వీస్‌

ప‌శ్చిమ అఫ్గానిస్తాన్‌కు చెందిన రెబియా తీవ్ర‌మైన జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో ఆమె ఓ డాక్ట‌ర్‌ను సంప్ర‌దించారు.

ఆమెకు కోవిడ్‌-19 సోకిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

జ్వ‌రం, వొళ్లు నొప్పుల‌తో బాధ‌ప‌డుతూ ఇంటికి వ‌చ్చిన రెబియా.. వైద్యుడు ఇచ్చిన ర‌సీదును భ‌ర్త‌కు ఇచ్చి మందులు తీసుకురావాల‌ని కోరింది.

మందుల చీటీ మీద రెబియా పేరు చూసిన వెంట‌నే భ‌ర్తకు విప‌రీత‌మైన కోపం వచ్చింది. పేరును గుర్తు తెలియ‌ని వ్య‌క్తికి ఎందుకు చెప్పావంటూ ఆమెను అత‌డు తీవ్రంగా కొట్టాడు.

అఫ్గాన్‌లో డాక్ట‌ర్ల‌తో స‌హా బ‌య‌టి వ్య‌క్తులు ఎవ‌రికీ పేరు చెప్ప‌కూడ‌ద‌ని మ‌హిళ‌ల‌కు కుటుంబ స‌భ్యులు ఆదేశిస్తారు. దీనికి వ్య‌తిరేకంగా కొంద‌రు పోరాడుతున్నారు కూడా.

ఘజీల్ ఎనాయత్

ఫొటో సోర్స్, Social media campaigns

ఫొటో క్యాప్షన్, ఆఫ్ఘన్ గాయని, రచయిత ఘజీల్ ఎనాయత్ (ఎడమ) సహా చాలా మంది ‘వేరీజ్‌మైనేమ్’ ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్నారు

‘వేర్ ఈజ్‌ మై నేమ్‌?’

ఈ స‌మ‌స్య అమ్మాయి పుట్ట‌గానే మొద‌ల‌వుతుంది. నిజానికి ఆమెకు ఒక పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించ‌డానికే ఇక్క‌డ ఏళ్లు ప‌డుతుంది.

పెళ్లి అయ్యేట‌ప్పుడు కూడా.. ఇక్క‌డి ఆహ్వాన ప‌త్రిక‌ల్లో కూడా వ‌ధువు పేరు ముద్రించ‌రు. అనారోగ్యం పాలైన‌ప్పుడు కూడా కొన్నిసార్లు వైద్యులు రాసే మందుల చీటీపై ఆమె పేరు క‌నిపించ‌దు.

ఆమె చ‌నిపోయిన‌ప్పుడు జారీచేసే మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రంపైనా ఆమె పేరు క‌నిపించ‌దు. ఒక్కోసారి స‌మాధిపై కూడా పేరు ఉండ‌దు.

అందుకే అఫ్గానిస్తాన్ మ‌హిళ‌లు వేర్ఈజ్‌మైనేమ్‌? ఉద్యమం న‌డిపిస్తున్నారు. త‌మ పేరును స్వేచ్ఛ‌గా ఉప‌యోగించుకోనివ్వాల‌ని దీని ద్వారా వారు అభ్య‌ర్థిస్తున్నారు. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌లు గోడ‌ల‌పైన‌, సోష‌ల్ మీడియా వేదిక‌ల్లోను క‌నిపిస్తాయి.

వేరీజ్‌మై నేమ్ ఉద్యమం పోస్టర్
ఫొటో క్యాప్షన్, నాలుగేళ్ల కిందట ‘వేరీజ్‌మై‌నేమ్?’ ఉద్యమం మొదలైంది

"నా సోద‌రుడు, తండ్రి గౌర‌వం కోసం.."

హెరాత్ ప్రావిన్స్‌కు చెందిన ఓ మ‌హిళ బీబీసీతో మాట్లాడారు. ఆమె త‌న పేరును వెల్ల‌డించ‌లేదు. రేడియోలోనూ మాట్లాడేందుకు ఆమె సుముఖత చూపించ‌లేదు.

మ‌గ‌వారు వ్య‌వ‌హ‌రించే తీరును ఆమె వెన‌కేసుకొచ్చారు.

"ఎవ‌రైనా పేరు చెప్పండ‌ని అడిగిన‌ప్పుడు.. నా సోద‌రుడు, నాన్న‌, కాబోయే భ‌ర్త‌ల గౌర‌వం గుర్తుకు వ‌స్తుంది. అందుకే నా పేరు చెప్ప‌ను"అని ఆమె వ్యాఖ్యానించారు.

"నేను నా కుటుంబానికి త‌ల‌వంపులు తీసుకురావాలా? ఇప్పుడు నా పేరు చెబితే వ‌చ్చే లాభ‌మేంటి? నేను మా నాన్న కూతురిగా, నా సోద‌రుడి చెల్లిగా, భ‌విష్య‌త్తులో పెళ్లి చేసుకోబోయే నా భ‌ర్త‌కు భార్య‌గా, పిల్ల‌ల‌కు త‌ల్లిగా.. న‌న్ను పిల‌వాల‌ని కోరుకుంటాను" అని చెప్పారు.

లాలే ఒస్మానీ పోస్టర్

ఫొటో సోర్స్, "Where is my name?" campaigners

ఫొటో క్యాప్షన్, #WhereIsMyName? ఉద్యమం పోస్టర్ల మీద లాలే ఒస్మానీ ఫొటోలు ప్రచురించారు

ఈ క‌థ‌లు కొంచెం విస్మ‌యానికి గురిచేయొచ్చు. కానీ అఫ్గాన్‌లో అమ్మాయి పేరు పైకి చెబితే.. క‌నుబొమ్మ‌లు పైకిలేపి చూస్తారు. కొన్నిసార్లు అయితే త‌ల‌వంపులుగా ప‌రిగ‌ణిస్తారు.

చాలామంది అఫ్గాన్‌వాసులు త‌మ సోద‌రీమ‌ణులు, భార్య‌లు, త‌ల్లుల పేర్లు బ‌హిరంగంగా చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కొంద‌రు దీన్ని అగౌర‌వంగా భావిస్తారు.

ఇక్క‌డి మ‌హిళ‌ల‌ను త‌ల్లి, చెల్లి, అక్క‌.. ఇలా కుటుంబ పెద్ద బంధుత్వంతో ఆమెకున్న సంబంధాన్ని అనుస‌రించి పిలుస్తారు.

జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రంలోనూ కేవ‌లం తండ్రి పేరు మాత్ర‌మే రాయాల‌ని అఫ్గాన్ చ‌ట్టాలు చెబుతున్నాయి.

ఫరీదా సాదత్, ఆమె కుమారుడు

ఫొటో సోర్స్, Farida Sadaat

ఫొటో క్యాప్షన్, ఫరీదా సాదాత్ జర్మనీకి వలస వెళ్లారు.. విడిపోయిన భర్త పేరు తన పిల్లల గుర్తింపు కార్డుల్లో కనిపించటం తనకు ఇష్టం లేదని చెప్తారు (చిత్రంలో కుమారుడితో ఫరీదా)

భావోద్వేగాల‌పైనా ప్ర‌భావం

ఇలాంటి నిబంధ‌న‌ల‌తో గుర్తింపులో ఇబ్బందుల‌తోపాటు భావోద్వేగాల‌పైనా ప్ర‌భావం ప‌డుతుంది.

ఫ‌రీదా సదాత్‌కు బాల్యంలోనే వివాహ‌మైంది. ఆమెకు 15 ఏళ్ల‌ వయసులోనే తొలి బిడ్డ జన్మించారు. న‌లుగురు పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత‌.. ఆమె భ‌ర్త నుంచి వేరు ప‌డి ఉంటున్నారు. ఇప్పుడామె పిల్ల‌ల‌తో కలిసి జ‌ర్మ‌నీ వెళ్లిపోయారు.

"నా పిల్ల‌ల భావోద్వేగాల‌నూ నా భ‌ర్త ప‌ట్టించుకోడు. అస‌లు ఆయ‌న‌తో వారికి ఎలాంటి బంధ‌మూ లేదు. మా పిల్ల‌ల గుర్తింపు కార్డుల్లో ఆయ‌న పేరు ఉండాల్సిన అవ‌స‌రం ఏముంది?" అని ఆమె వ్యాఖ్యానించారు.

"నా పిల్ల‌ల్ని నేనే పెంచుకున్నాను. నా భ‌ర్త నాకు విడాకులు ఇచ్చేందుకు నిరాక‌రించాడు. దీంతో రెండో పెళ్లి చేసుకోవ‌డ‌మూ కుద‌ర‌దు. ఇప్పుడు ఆయ‌న పేరు మా పిల్ల‌ల గుర్తింపు కార్డుల్లో ఉండ‌కుండా చూస్తున్నాను. నా భ‌ర్త లాంటివారు అఫ్గాన్‌లో కొంత‌మంది ఉన్నారు. వారు ఒక్కొక్క‌రికి ఇద్ద‌రు-ముగ్గురు భార్య‌లుంటారు. వారు పిల్ల‌ల్ని అస‌లు ప‌ట్టించుకోరు" అని ఆమె తెలిపారు.

"చ‌ట్టాల‌ను మార్చాల‌ని అఫ్గాన్ అధ్య‌క్షుణ్ని నేను వేడుకొంటున్నా. పిల్ల‌ల గుర్తింపు కార్డులు, జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌పై తల్లి పేరు ఉండేలా చూడాల‌ని అభ్య‌ర్థిస్తున్నా" అన్నారామె.

లాలే ఒస్మానీ

ఫొటో సోర్స్, Laleh Osmany

ఫొటో క్యాప్షన్, మహిళల అత్యంత ‘ప్రాధమిక హక్కు’ను తిరిగి కల్పించటానికి ఈ ఉద్యమం ప్రారంభించినట్లు లాలే ఒస్మానీ చెప్తున్నారు

ఉద్య‌మం అలా మొద‌లైంది

ఈ సంప్ర‌దాయాన్ని ఇలా కొన‌సాగ‌నివ్వకూడ‌ద‌ని తీర్మానించుకున్న‌ట్లు 28 ఏళ్ల అఫ్గాన్ మ‌హిళ లాలే ఒస్మానీ వివ‌రించారు.

ఈ విధానాల‌తో విసిగిపోయిన హెరాత్‌కు చెందిన ఒస్మానీ.. ‘వేర్ఈజ్‌మైనేమ్‌?’ క్యాంపెయిన్‌ మొదలుపెట్టారు. ఇది మ‌హిళ‌ల మౌలిక హ‌క్క‌ని ఆమె చెబుతున్నారు.

‘మీకు ఎందుకు గుర్తింపు ఇవ్వ‌డం లేదు?’ అని అఫ్గాన్ మ‌హిళ‌ల‌ను తాము ప్ర‌శ్నించాల‌ని భావిస్తున్న‌ట్లు బీబీసీ అఫ్గాన్ సర్వీస్‌తో ఆమె చెప్పారు.

జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌పై తండ్రితో పాటు త‌ల్లి పేరునూ న‌మోదు చేసేలా అఫ్గాన్ ప్ర‌భుత్వాన్ని ఒప్పించ‌డంలో తాము ఒక అడుగు దూరంలో ఉన్నామని ఆమె వివ‌రించారు.

త‌మ ప్ర‌చారం గురించి అఫ్గాన్ పార్ల‌మెంట్‌లో ఎంపీ మ‌రియ‌మ్ సామా మాట్లాడేందుకు బీబీసీ అఫ్గాన్ సర్వీస్ రాసిన వార్త‌లు ఎంతో దోహ‌ద‌ప‌డ్డాయ‌ని ఆమె వివ‌రించారు.

జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల్లో త‌ల్లి పేరు కూడా న‌మోదు చేయాల‌ని పార్ల‌మెంటులో సామా కోరారు. ఈ విష‌యానికి మ‌ద్ద‌తుగా ఆమె ట్వీట్ కూడా చేశారు.

మరియం సామా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్ఘానిస్తాన్ పార్లమెంటులో ‘వేరీజ్‌మైనేమ్?’ ఉద్యమానికి మద్దతుగా మరియం సామా ప్రసంగించారు

వ్య‌తిరేక‌తా వ్య‌క్త‌మైంది

బీబీసీతో త‌న ఇంట‌ర్వ్యూను ఒస్మానీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దాని కింద కొన్ని వ్యాఖ్య‌లు ఆమెకు మ‌ద్ద‌తుగా వ‌చ్చాయి. అయితే చాలా వ్యాఖ్య‌ల్లో ఆమెను తీవ్రంగా విమ‌ర్శించారు.

వ‌చ్చేసారి కుటుంబ స‌భ్యుల అంద‌రి పేర్ల‌నూ జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల్లో చేర్చాల‌ని ఉస్మానీ డిమాండ్ చేస్తార‌ని కొంద‌రు ఎగ‌తాళి చేశారు.

కుటుంబంలో మ‌న‌శ్శాంతికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు.

త‌న తండ్రి ఎవ‌రో తెలియ‌దు కాబ‌ట్టే.. గుర్తింపు కార్డుల‌పై త‌న పేరు రావాల‌ని ఆమె కోరుకుంటున్న‌ట్లు కొంద‌రు ఎగ‌తాళి చేశారు.

బాగా చ‌దువుకున్న అఫ్గాన్ యువ‌కులు కూడా ఇలాంటి చెత్త వ్యాఖ్య‌లు చేయ‌డంతో తాను కాస్త బాధ‌ప‌డిన‌ట్లు ఉస్మానీ వివ‌రించారు.

ఫర్హాద్ దార్య, ఆయన భార్య సుల్తానా

ఫొటో సోర్స్, Farhad Darya

ఫొటో క్యాప్షన్, ఫర్హాద్ దార్య, ఆయన భార్య సుల్తానాలు అమెరికాలో నివసిస్తున్నారు.. అఫ్ఘాన్ మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు

ప్ర‌ముఖుల మ‌ద్ద‌తు

ఈ ప్ర‌చారానికి గాయ‌కులు ఫ‌ర్హాద్ దార్య‌, ఆర్య‌నా స‌యీద్ లాంటి ప్ర‌ముఖులు మొద‌ట్నుంచీ మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు.

వేరొక‌రి త‌ల్లి, చెల్లి, కుమార్తె.. ఇవి మ‌హిళ‌కు గుర్తింపు కాదు అని దార్య వ్యాఖ్యానించారు.

"ఇలాంటి పేర్ల‌తో మ‌నం ఆమెను పిలిచామంటే.. ఆమె నిజమైన గుర్తింపు పోయిన‌ట్లే" అని బీబీసీతో ఆయ‌న అన్నారు.

"మొద‌ట్లో ఆడ‌వారు పేరు బ‌య‌ట పెట్ట‌కుండా మ‌గ‌వారు అడ్డుకొనేవారు.. ఇప్పుడైతే ఆడ‌వారూ దీనికి అల‌వాటు ప‌డిపోయారు. కొంద‌రు త‌మ‌ పేరు కూడా చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు."

ఈ ప్ర‌చారానికి తను మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్లు మ‌హిళా హ‌క్కుల ఉద్య‌మ‌క‌ర్త‌, ప్ర‌ముఖ గాయ‌కురాలు ఆర్య‌నా చెప్పారు. అయితే ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు తాము చాలా క‌ష్ట‌ప‌డాల‌ని ఆమె అన్నారు.

షాక‌ర్‌దోఖ్త్ జాఫ‌రీ

ఫొటో సోర్స్, Shakardokht Jafar

ఫొటో క్యాప్షన్, ఈ ఉద్యమానికి ప్రభుత్వ మద్దతు అవసరమని అఫ్గాన్ మాన‌సిక వైద్య నిపుణురాలు షాక‌ర్‌దోఖ్త్ జాఫ‌రీ అంటారు

"సూర్య‌, చంద్రుల వెలుగూ ఆమెపై ప‌డ‌దు"

"మ‌హిళ‌ల హ‌క్కులను తిర‌స్క‌రించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. అఫ్గాన్ ఓ పురుషాధిక్య స‌మాజం. శ‌రీరాల‌తోపాటు పేర్లు కూడా బ‌య‌ట‌కు రాకుండా వారు అడ్డుకుంటారు" అని అఫ్గాన్ సోషియాల‌జిస్ట్ అలీ క‌వే వ్యాఖ్యానించారు.

"ఎవ‌రూ చూడ‌ని, ఎవ‌రికీ విన‌ప‌డ‌ని వారినే ఉత్త‌మ మ‌హిళ‌లుగా అఫ్గాన్ స‌మాజం గుర్తిస్తుంది. సూర్య‌, చంద్రుల వెలుగు కూడా ఆమెపై ప‌డ‌దు.. అని ఓ నానుడి కూడా ఉంది" అని ఆయ‌న అన్నారు.‌

"క‌ఠినంగా ఉండే మ‌గ‌వారిని స‌మాజంలో ఎక్కువ గౌర‌విస్తారు. కుటుంబంలోని మ‌హిళ‌ల్లో లౌకిక‌వాద భావ‌న‌లుంటే.. అందులోని పురుషుల్ని చేత‌కాని వారిలా చూస్తారు" అని పేర్కొన్నారు.

"అఫ్గాన్ మ‌హిళ‌ల‌కు స్వ‌తంత్ర‌మైన గుర్తింపు కావాలి. ఆర్థికంగా, సామాజికంగా, మాన‌సికంగా వారు స్వ‌తంత్రంగా ఉండాలి" అని యూకేలోని సర్రే టెక్నాల‌జీ సెంట‌ర్‌లో ప‌నిచేస్తున్న అఫ్గాన్ మాన‌సిక వైద్య నిపుణురాలు షాక‌ర్‌దోఖ్త్ జాఫ‌రీ వ్యాఖ్యానించారు.

మ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాసే వారిపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

తాలిబన్ ఫైటర్
ఫొటో క్యాప్షన్, 2001లో అమెరికా ఆక్రమణతో అధికారం కోల్పోక ముందు తాలిబన్లు అఫ్ఘాన్ మహిళలపై చాలా కఠినమైన ఆంక్షలు విధించారు

రెండు ద‌శాబ్దాల క్రితం తాలిబాన్ల ప్ర‌భుత్వం ప‌త‌న‌మైన త‌ర్వాత‌.. ఇక్క‌డి మ‌హిళల జీవితాల‌ను పూర్వ‌స్థితికి తీసుకొచ్చేందుకు జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

అయితే, రెబియా లాంటి మ‌హిళ‌ల‌ను వైద్యుల‌కు పేరు ఎందుకు చెప్పావంటూ భ‌ర్త‌లు వేధిస్తున్నారు.

"అఫ్గాన్ లాంటి సంప్ర‌దాయ‌, పురుషాధిక్య స‌మాజంలో ప్ర‌చారాలు, ఉద్యమాలు మార్పు తీసురాలేక‌పోతే.. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి" అని జాఫ‌రీ వ్యాఖ్యానించారు.

ఈ అంశాన్ని అఫ్గాన్ పార్ల‌మెంటులో ఇప్ప‌టికే ప్ర‌స్తావించారు. అయితే దీనిపై రాజ‌కీయ నాయ‌కులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)