తాలిబాన్లతో చర్చలు జరిపిన మహిళ ఫాజియా కూఫీ కథ ఇదీ... - అఫ్ఘానిస్తాన్ శాంతి చర్చలు

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఫాజియా కూఫీ చిన్ననాటి కల డాక్టర్ కావాలని. కానీ అఫ్ఘానిస్తాన్ పాలన 1990లలో తాలిబాన్ మిలిటెంట్ల చేతుల్లోకి వెళ్లటంతో ఆమె కల చెదిరిపోయింది. మహిళలు బయట పనులు చేయకూడదని తాలిబాన్లు నిషేధించారు. ఆమె భర్తను జైలులో పెట్టారు. అనంతరం ఆమె రాజకీయ నాయకురాలిగా మారినపుడు ఆమెను చంపటానికి కూడా ప్రయత్నం చేశారు.
ఇప్పుడు అదే తాలిబాన్లతో ఆమె చర్చలు జరుపుతున్నారు. తమను అధికారం నుంచి కూలదోసిన అమెరికా సైనిక బలగాలతో శాంతి ఒప్పందం చేసుకోబోతున్నారు తాలిబాన్లు.
''నేను భయపడలేదు. నేను దృఢంగా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడు అఫ్ఘానిస్తాన్ మహిళలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
''మహిళలను చర్చలకు తీసుకురావాలంటే.. వాళ్లు నవ్వేశారు''
అఫ్ఘానిస్తాన్ మాజీ పాలకులైన అతివాద ఇస్లామిక్ బృందంతో.. నెలల తరబడి అమెరికా నిర్వహించిన శాంతి చర్చలతో పాటు సంప్రదింపులు జరుపుతున్న అఫ్ఘాన్ ప్రతినిధి బృందంలోని కొద్ది మంది మహిళల్లో ఫాజియా ఒకరు.
గత ఏడాది ఫాజియాతో పాటు, మానవ హక్కుల ఉద్యమకారిణి లైలా జాఫారి.. మాస్కోలో 70 మంది పురుషులతో నిండివున్న ఒక హోటల్ గదిలోకి అడుగుపెట్టారు.
ఆ గదిలో ఒకవైపు తాలిబాన్లు ఉన్నారు. మరోవైపు అందరూ మగవాళ్లే అయిన అఫ్ఘాన్ రాజకీయ నాయకులు, కార్యకర్తలతో పాటు ఈ ఇద్దరు మహిళలు కూర్చున్నారు.
''అఫ్ఘానిస్తాన్ ఇప్పుడు విభిన్న అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహిస్తోందని, దేశం ఒక సిద్ధాంతానికి పరిమితం కాలేదని నేను వారికి చెప్పాను'' అని ఆమె తెలిపారు.
''తాలిబాన్ ప్రతినిధుల్లో కొందరు నన్ను చూస్తున్నారు. కొంతమంది నోట్స్ రాసుకుంటున్నారు. ఇంకొందరు దిక్కులు చూస్తున్నారు'' అని పేర్కొన్నారు.
సుదీర్ఘ చర్చల ప్రక్రియలో తాలిబన్లు.. అఫ్గాన్‌లో 'కీలుబొమ్మ ప్రభుత్వాన్ని' తాము గుర్తించబోమంటూ ఆ ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరపటానికి తిరస్కరించారు.
కానీ అమెరికా, రష్యాల నుంచి నిరంతర ఒత్తిడి కారణంగా రాజీకి వచ్చారు. అనధికారిక అఫ్ఘాన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరపటానికి తాలిబాన్లు ఒప్పుకున్నారు.
ఆ బృందంలో ఫాజియా కూఫీ మూడుసార్లు భాగస్వామిగా పాల్గొన్నారు.
తాలిబాన్ల వల్ల తన జీవితం నాటకీయంగా మారిపోయిన ఒక మహిళగా.. మహిళల హక్కుల గురించి తాలిబాన్లతో నేరుగా ఆమె తలపడ్డారు. శాంతి ప్రక్రియలో మరింత మంది మహిళలకు చోటివ్వాలని పట్టుపట్టారు.

ఫొటో సోర్స్, Reuters
''మావైపు మహిళా ప్రతినిధులు ఉన్నారు కాబట్టి.. వారు (తాలిబాన్లు) కూడా మహిళలను చర్చలకు తీసుకురావాలని నేను సూచించాను. వాళ్లు వెంటనే నవ్వేశారు'' అని ఆమె తెలిపారు.
1996 నుంచి 2001 వరకూ అఫ్ఘాన్‌ను పాలించిన తాలిబాన్లు.. మహిళలు చదువుకోరాదని, ఉద్యోగం చేయరాదని నిషేధించారు. మహిళలను రాళ్లతో కొట్టి చంపటం, కొరడాలతో కొట్టటం వంటి తమ సొంత ఇస్లామిక్ చట్టాలను అమలుచేశారు.
ఇటువంటి శిక్షలు అనుభవించిన మహిళలను.. జీవితమంతా అఫ్ఘానిస్తాన్‌లోనే జీవించిన ఫాజియా కూఫీ వీక్షించారు.
లింగ సమానత్వం కోసం చర్చల్లో ఆమె చేసిన డిమాండ్ల మీద తాలిబాన్ ప్రతినిధి ఒకరు స్పందించారు.
''ఒక మహిళ ప్రధానమంత్రి కావచ్చు కానీ అధ్యక్షురాలు కావటానికి వీలు లేదని వారు అన్నారు. మహిళలు న్యాయమూర్తు కూడా కాజాలరని చెప్పారు'' అని ఫాజియా వివరించారు.
అయితే.. ఆ చర్చల విధానంలో ఇరువైపులా వాదప్రతివాదనలకు అవకాశం లేదు. ''నేను అంగీకరించలేదు. కానీ వారితో వాదించలేదు'' అని ఆమె చెప్పారు.
ఇప్పుడు.. మహిళలు పనిచేయవచ్చు, చదువుకోవచ్చు - కానీ అది 'ఇస్లామిక్ చట్టం, అఫ్ఘాన్ సంస్కృతి పరిధికి లోబడి మాత్రమే' ఉండాలి అనేది తాలిబాన్ల అధికారిక వైఖరి.
ఫాజియా వంటి వారికి ఇదే అసలు సమస్య. ఇస్లామ్‌కు ఒకే పవిత్ర గ్రంథం ఉంది కానీ సైద్ధాంతిక ఆలోచనా స్రవంతులు చాలా ఉన్నాయి.
''ఇస్లామ్ బోధన గురించి విభిన్న నిపుణులు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు చెప్పటం నేను విన్నాను. తాలిబాన్లు ఖురాన్‌కు అత్యంత అతివాద వ్యాఖ్యానాలు చెప్తారు'' అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
''నేను ఎన్నడూ బురఖా కొనలేదు''
ఫాజియా కూఫీ మొదటిసారి ఒక తాలిబాన్ ఫైటర్‌ను 1996 సెప్టెంబర్‌లో చూశారు.
''కాబూల్ నగరాన్ని తాలిబాన్లు తమ స్వాధీనంలోకి తీసుకున్నపుడు నేను అక్కడ మెడిసిన్ చదువుతున్నాను. ఐదో అంతస్తులోని నా ఫ్లాట్ నుంచి నేను వారిని చూశాను. రోడ్డు మీద కాల్పులతో పోరాటం జరుగుతోంది. మిలిటెంట్ల చేతుల్లో ఆటోమేటిక్ రైఫిళ్లు ఉన్నాయి'' అని ఆమె తెలిపారు.
కొన్ని రోజుల్లోనే ఆమె చిన్నప్పటి కలలు చిన్నాభిన్నమయ్యాయి. మిలిటెంట్ల ఆదేశాలను పాటించిన మెడికల్ కాలేజీ.. ఆమెను బయటకు పంపించేసింది. ఆమె కాబూల్‌లోనే ఉండిపోయారు. స్కూలు నుంచి గెంటివేతకు గురైన బాలికలకు ఇంగ్లిష్ బోధించేవారు.
''ఆ కాలంలో చాలా కుంగిపోయాను. మనల్ని ఎవరో అణచివేయటానికి, మనకు అవకాశాలు నిరాకరించటానికి ప్రయత్నిస్తున్నపుడు.. అది చాలా బాధాకరంగా ఉంటుంది'' అని ఆమె గుర్తుచేసుకున్నారు.
మహిళలు బయటికి వచ్చినపుడు శరీరం మొత్తం కప్పివేసే బురఖా ధరించాలని తాలిబాన్లు ఆజ్ఞ జారీచేశారు.

''నేను ఎన్నడూ బురఖా కొనలేదు. ఎందుకంటే మా సంస్కృతిలో భాగం కాదని నేను భావించే దానికోసం నేను డబ్బులు ఖర్చు పెట్టను'' అని ఫాజియా చెప్పారు.
ఈ ధిక్కారానికి ఆమె మూల్యం చెల్లించక తప్పలేదు. తాను క్షేమంగా ఉండటం కోసం తన కదలికలను చాలా పరిమితం చేసుకున్నారు.
''తాలిబాన్ల 'నీతినియమాల విభాగం' వీధుల్లో గస్తీ కాసేది. మహిళలు బురఖా వేసుకోకపోతే వారిని కొట్టేది'' అని ఆమె తెలిపారు.
అమెరికాలో 9/11 దాడుల అనంతరం అమెరికా సారథ్యంలో అఫ్ఘానిస్తాన్ ఆక్రమణతో తాలిబాన్లను అధికారం నుంచి కూలదోయటంతో చాలా మంది ప్రజలు తమకు స్వేచ్ఛ లభించినట్లు ఊపిరి పీల్చుకోవటం ఆశ్చర్యం కలిగించదు.
''తాలిబాన్లు పట్టుకుని కొడతారనే భయం లేకుండా మేం వీధుల్లో నడవగలిగాం, షాపింగ్ చేయగలిగాం'' అని ఫాజియా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
''నా కాన్వాయ్ మీద కాల్పులు జరిగాయి''
తాలిబాన్లు పతనమైన తర్వాత ఫాజియా కూఫీ ఐక్యరాజ్యసమితి కోసం పనిచేశారు. మాజీ బాల సైనికులకు పునరావాసం కల్పించటానికి కృషి చేశారు.
ఆమెకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ఆమె భర్త జైలులో క్షయ వ్యాధి బారిన పడి, అనంతరం మరణించటంతో ఇద్దరు పిల్లలను తానే పెంచాల్సిన పరిస్థితి.
అయినప్పటికీ.. 2005లో పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించినపుడు.. రాజకీయాల్లోకి రావాలని ఫాజియా నిర్ణయించుకున్నారు. ఆమె తండ్రి గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. ఆయన మద్దతుదారుల సాయంతో ఆమె ఓట్లు గెలుచుకున్నారు.
''కానీ నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకోవటం అప్పుడు నాముందన్న ముఖ్యమైన సవాలు'' అంటారామె.
రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆమె మొదటిసారి పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆ సమయంలో తనను చంపటానికి తాలిబాన్లు చేసిన హత్యా ప్రయత్నం నుంచి ఫాజియా తప్పించుకున్నారు.
''నేను 2010 మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనటానికి నాన్‌గర్హార్ వెళ్లాను. తిరిగి వచ్చేటపుడు నా కాన్వాయ్ మీద తుపాకీ కాల్పులు జరిగాయి'' అని ఆమె చెప్పారు.
నదికి అవతలి వైపు నుంచి, కొండ పై నుంచి తూటాలు పేల్చారు. ఫాజియాను, ఆమె ఇద్దరు కూతుర్లను భద్రతా సిబ్బంది కాపాడారు. వారి కారును ఒక పర్వత సొరంగంలోకి నడిపించారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కాబూల్ తరలించారు.

ఫొటో సోర్స్, Getty Images
''అందరూ శాంతి కావాలని కోరుకుంటున్నారు''
పదేళ్లు గడచిపోయాయి. తాలిబాన్లు, అమెరికా శాంతి ఒప్పందానికి చేరువగా ముందుకు సాగుతున్నాయి. ఈ వారాంతంలో దానిపై సంతకాలు చేయవచ్చు. మిలిటెంట్లు మళ్లీ సంఘటితమై ఎదురుతిరగటానికి కేవలం కొన్నేళ్ల సమయమే పట్టింది. 2001 తర్వాత ఇప్పుడు అత్యధిక భూభాగం వారి నియంత్రణలో ఉంది.
ఈ సంఘర్షణలో మానవ మరణాలు భారీగా ఉన్నాయి. వేలాది మంది పౌరులు చనిపోయారు. గాయపడ్డారు. అఫ్ఘానిస్తాన్ ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటిగానే ఉండిపోయింది. సుమారు 25 లక్షల మంది అఫ్ఘాన్లు విదేశాల్లో శరణార్థులుగా నమోదు చేసుకున్నారు. మరో 20 లక్షల మంది దేశంలోనే నిర్వాసితులుగా మిగిలివున్నారు. మరో 20 లక్షల మంది వితంతువులుగా మారి మనుగడ సాగించటానికి కష్టాలు పడుతున్నారని అంచనా.
''అందరూ శాంతి నెలకొనాలని కోరుకుంటున్నారు. మేం యుద్ధ కాలంలో పుట్టాం. యుద్ధంలోనే పెరిగాం. నా తరం వారికి కానీ, నా పిల్లల తరం వారికి కానీ శాంతి అంటే ఏమిటో తెలియదు'' అంటారు ఫాజియా.
కానీ శాంతి కోసం ఎంత మూల్యమైనా చెల్లించటానికి సిద్ధంగా లేరు.
''శాంతి అంటే గౌరవప్రదంగా, స్వతంత్రంగా, న్యాయంగా జీవించగలిగటం. ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయమేదీ లేదు'' అని ఆమె పేర్కొన్నారు.
ఇందుకు తాలిబాన్లు అంగీకరిస్తారా అనేది వేచి చూడాలి. వారు ఎంత వరకూ మారారనేది అస్పష్టంగానే ఉంది.
''శాంతిని వ్యతిరేకిస్తున్న వారు చర్చల ప్రక్రియను పట్టాలు తప్పించటానికి మహిళల హక్కులను వాడుకుంటున్నారు'' అని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ బీబీసీతో వ్యాఖ్యానించారు.
''మహిళలు ఇప్పటికే చాలా కోల్పాయరు. మేం ఇంకెంత నష్టపోగలం?'' అని ఫాజియా ప్రశ్నిస్తున్నారు.
ఆమె కుమార్తెలిద్దరూ కాబూల్ యూనివర్సిటీల్లో చదువుతున్నారు. మీడియా, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న జీవితంలో పెరిగారు.
''నా కూతుర్లు, వారి వయసులోని ఇతర బాలికలు ఇంటికే పరిమితమయ్యేలా ఎవరూ బలవంతం చేయలేరు. దేశాన్ని పరిపాలించాలనుకునే వారు ఎవరైనా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది'' అని ఫాజియా స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- దిల్లీ హింస: అశోక్ నగర్లో మసీదుపై జాతీయ జెండా, కాషాయ జెండా ఎగరేసింది ఎవరు? - గ్రౌండ్ రిపోర్ట్
- దిల్లీ హింస: ఆర్ఎస్ఎస్, అమిత్ షాల పేర్లు చెప్పవద్దన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్
- దిల్లీ హింస: తుపాకీ పట్టుకుని పోలీసులపై కాల్పులు జరుపుతున్న ఈ వ్యక్తి ఎవరు?
- బాలాకోట్ వైమానిక దాడి జరిగి ఏడాది.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
- పాకిస్తాన్ ఎవరికి భయపడి భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టింది?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది
- హోస్నీ ముబారక్: కటిక పేదరికంలో పుట్టారు, 30 ఏళ్లు దేశాన్ని ఏలారు.. ఆ తర్వాత కటకటాల పాలయ్యారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









