అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్లతో శాంతి చర్చలకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అర్థంతరంగా ముగింపు పలికారు. పట్టువిడుపులకు అంగీకరించకుండా గీతకు అటొకరు, ఇటొకరు అన్నట్లుగా రెండు వర్గాలు మిగిలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
అసలు అఫ్గాన్‌లో యుద్ధం ఎందుకు జరుగుతోంది? దీనితో అమెరికాకు సంబంధం ఏంటి?
2001, సెస్టెంబరు 11 (9/11)న అమెరికాపై మిలిటెంట్ దాడి జరిగింది. దీనిలో దాదాపు 3,000 మంది మరణించారు. దాడి చేసింది తామేనని ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అల్ ఖైదా ప్రకటించింది.
ఆనాడు అఫ్గాన్‌లో అతివాద ఇస్లామిస్టులైన తాలిబాన్లు అధికారంలో ఉండేవారు. వీరు లాడెన్‌కు రక్షణ కల్పించారు. అమెరికాకు అతణ్ని అప్పగించబోమని తెగేసిచెప్పారు. దీంతో 9/11కు నెల రోజుల తర్వాత అఫ్గాన్‌లో అమెరికా వైమానిక దాడులు చేసింది.
ఇతర దేశాలు కూడా అమెరికాతో చేతులు కలిపాయి. వీరంతా కలిసి తాలిబాన్లను గద్దె దింపించారు. అయితే, అక్కడితో తాలిబాన్ల ప్రాబల్యం తగ్గిపోలేదు. వారు అజ్ఞాతంలోకి వెళ్లి మళ్లీ బలం పుంజుకున్నారు.
అప్పటినుంచీ తాలిబాన్ల దాడులను అడ్డుకోవడంతోపాటు అఫ్గాన్‌లో ప్రభుత్వం కుప్పకూలకుండా చూసేందుకు మిత్రదేశాలతో కలిసి అమెరికా పోరాడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
తాలిబాన్ సైనిక స్థావరాలే లక్ష్యం
''దాడులు చేద్దామని ఎవరినీ అడగలేదు. విజయవంతంగా వాటిని పూర్తిచేశాం''అని అఫ్గాన్‌లో దాడుల అనంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ వ్యాఖ్యానించారు. న్యూయార్క్, వాషింగ్టన్, పెన్సిల్వేనియాలలో 2997 మంది అమాయకులను బలి తీసుకున్నందుకు స్పందనగా ఈ దాడులు చేసినట్లు తెలిపారు.
''మిలిటెంట్ల స్థావరంగా అఫ్గాన్‌ను ఉపయోగించుకోకుండా చూడటమే మా లక్ష్యం. తాలిబాన్ల సైనిక సామర్థ్యానికీ అడ్డుకట్ట వేయాలని భావించాం''అని ఆనాడు ఆయన వివరించారు.
మొదటగా తాలిబాన్ల సైనిక సదుపాయాలను ఆనాడు అమెరికా లక్ష్యంగా చేసుకుంది. లాడెన్ నడుపుతున్న అల్ ఖైదా శిక్షణ కేంద్రాలపైనా దాడులు చేసింది.
అయితే 18 ఏళ్లు గడుస్తున్నా అమెరికా మిషన్ పూర్తయిందని చెప్పలేం. ఒకవేళ శాంతి చర్చలు సఫలం అయితే అఫ్గాన్‌లో మళ్లీ తాలిబాన్లు అధికారంలోకి వచ్చేందుకు అవకాశం దొరికినట్లు అయ్యుండేది.

ఫొటో సోర్స్, Reuters
బహిరంగంగానే ఉరి తీసేవారు
1996లో అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను తాలిబాన్లు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. తర్వాత రెండేళ్లలోనే చాలా ప్రాంతాలు వారి పాలనలోకి వచ్చేశాయి. వారు అతివాద ఇస్లాం విధానాలను అనుసరించేవారు. బహిరంగంగానే ఉరి తీసేవారు.
అఫ్గాన్‌లో అమెరికా, దాని మిత్ర పక్షాలు దాడులు మొదలుపెట్టిన రెండు నెలల్లోనే తాలిబాన్ల ప్రభుత్వం కుప్పకూలింది. క్రమంగా తాలిబాన్లు తలదాచుకొనేందుకు పాకిస్తాన్ వైపు వెళ్లిపోయారు.
2004లో అమెరికా మద్దతుతో అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే పాక్ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలపై తాలిబాన్లకు అప్పటికీ గట్టి పట్టుండేది. మత్తుమందుల రవాణా, ఖనిజాల తవ్వకం, పన్నుల వసూలు పేరుతో ఏటా వారు కొన్ని వందల మిలియన్ల డాలర్లు సంపాదించేవారు.
క్రమంగా తాలిబాన్లు చేసే విధ్వంసకర దాడులు పెరిగాయి. వారు మళ్లీ పూర్వస్థితికి రాకుండా చూసేందుకు అఫ్గాన్ బలగాలతో కలిసి అంతర్జాతీయ దళాలు పనిచేశాయి.
అయితే, 2011 నుంచి చేస్తున్న పోరాటానికి ముగింపు పలుకుతూ 2014లో నాటో దళాలు ఇక్కడి నుంచి నిష్క్రమించాయి. దీంతో తాలిబాన్లతో అఫ్గాన్ సైన్యం ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది.
ఇదే అదునుగా తాలిబాన్లు విజృంభించారు. పెద్దయెత్తున ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు, పౌరులే లక్ష్యంగా బాంబులతో దాడులు చేశారు. గత ఏడాది అఫ్గాన్‌లోని 70 శాతం ప్రాంతాల్లో తాలిబాన్లు క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
వీరు ఎక్కడి నుంచి వచ్చారు?
యుద్ధంలో అమెరికా అడుగుపెట్టడానికి 20ఏళ్ల ముందునుంచే అఫ్గాన్‌లో యుద్ధ వాతావరణం ఉండేది. ఇక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వానికి సోవియట్ యూనియన్ అండగా నిలిచేది. ముజాహిదీన్ పేరుతో చెలరేగిన తిరుగుబాటుకు అమెరికా, పాకిస్తాన్, చైనా, సౌదీ అరేబియా తదితర దేశాలు మద్దతు పలికేవి. 1979లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తిరుగుబాటును అణచివేసేందుకు సోవియట్ యూనియన్ సైనిక చర్యకు ఉపక్రమించింది.
1989లో సోవియట్ దళాలు ఇక్కడి నుంచి నిష్క్రమించాయి. అయితే అంతర్యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఆందోళనల నడుమ తాలిబాన్ పురుడుపోసుకుంది. తాలిబాన్ అంటే పష్తో భాషలో విద్యార్థులు అని అర్థం.
1991లో ఉత్తర పాకిస్తాన్ సరిహద్దులు, వాయువ్య అఫ్గాన్‌లోని ప్రాంతాలపై తాలిబాన్లు పట్టుసాధించారు. అవినీతిపై పోరాడతామని, భద్రతా పరిస్థితులను మెరుగు పరుస్తామని వారు హామీ ఇచ్చారు. అప్పటికే ముజాహిదీన్‌తో ఏళ్లుగా పోరాడిన అఫ్గాన్‌వాసులు తీవ్రంగా అలసిపోయారు.
సౌదీ అరేబియా ఆర్థిక సాయంతో ఏర్పాటయ్యే అతివాద ఇస్లామిక్ పాఠశాలల్లో తాలిబాన్ల మూలాలున్నట్లు చెబుతుంటారు.
కఠినమైన తమదైన షరియా లేదా ఇస్లామిక్ చట్టాన్ని తాలిబాన్లు అమలుచేసేవారు. క్రూరమైన శిక్షలను విధించేవారు. మగవారంతా గెడ్డం పెంచాలని, మహిళలందరూ బుర్ఖా ధరించాలనే నిబంధనలు తీసుకొచ్చారు.
టీవీ, పాటలు, సినిమాలపై నిషేధం విధించారు. బాలికలు చదువుకొనేందుకు ఒప్పుకొనేవారు కాదు.
అల్ ఖైదా మిలిటెంట్లకు ఆశ్రయం ఇవ్వడంతో 9/11 దాడుల అనంతరం వీరు అమెరికాకు లక్ష్యంగా మారారు.

ఫొటో సోర్స్, EPA
యుద్ధం ఇంత దీర్ఘకాలం ఎందుకు?
దీనికి చాలా కారణాలున్నాయి. అఫ్గాన్ ప్రభుత్వం, భద్రతా బలగాల పరిమితులు, ఇక్కడ దీర్ఘకాలం దళాలను మోహరించేందుకు ఇతర దేశాల విముఖత, తాలిబాన్ల ప్రతిఘటన, ఇలా చాలానే కారణాలున్నాయి.
2009లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. అఫ్గాన్‌లో తమ దళాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడి అమెరికా సైనికుల సంఖ్య లక్ష వరకూ పెరిగింది.
దక్షిణ అఫ్గాన్‌లోని కొన్ని ప్రాంతాలను తాలిబాన్ల నుంచి విడిపించేందుకు బలగాల పెంపు తోడ్పడింది. అయితే క్రమంగా మళ్లీ బలగాల సంఖ్యను అమెరికా తగ్గించడం మొదలుపెట్టింది.
ఫలితంగా తాలిబాన్లు మళ్లీ పుంజుకున్నారు.
ఇప్పటికీ యుద్ధం కొనసాగడానికి బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రతినిధి దావూద్ అజామీ చెబుతున్న ఐదు కారణాలివీ...
- 18 ఏళ్లుగా అమెరికా అనుసరిస్తున్న వ్యూహాల సామర్థ్యంపై ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు ఇక్కడ గందరగోళ రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి.
- ప్రతిష్టంభనను తొలగించాలని రెండు వర్గాలూ కోరుకుంటున్నాయి. అయితే, తమకు చేకూరే ప్రయోజనాలను మరింత పెంచుకొనేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు.
- అఫ్గాన్‌లో పెరుగుతున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల హింస. ఇటీవలి కాలంలో వారు విధ్వంసకర దాడులకు తెగబడ్డారు
- ప్రతిష్టంభనలో పొరుగునున్న పాకిస్తాన్ పాత్ర కూడా ఉంది. పాక్‌లోనూ తాలిబాన్ మూలాలున్నాయని చెప్పడంలో సందేహం లేదు.
- అమెరికా దాడుల అనంతరం వీరు ఇక్కడే మళ్లీ బలం పుంజుకున్నారు. అయితే, వీరికి సాయం చేస్తున్నామని అంగీకరించేందుకు పాక్ నిరాకరిస్తోంది.

ఫొటో సోర్స్, Shamarai/afp
వారికి ఆదాయం ఎలా?
ఏడాదికి 1.5 బిలియన్ల డాలర్ల వరకు తాలిబాన్ ఆర్జిస్తోంది. గత దశాబ్ద కాలంలో వీరి రాబడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఆదాయంలో మాదకద్రవ్యాల వాటా ఎక్కువైంది. ప్రపంచంలో నల్లమందును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం అఫ్గానే. హెరాయిన్ తయారీలో ఉపయోగించే నల్లమందు మొక్కలను చాలావరకూ తాలిబాన్ల నియంత్రణలోని ప్రాంతాల్లోనే పండిస్తారు.
తమ ప్రాంతాల గుండా వెళ్లే వాహనాలపై తాలిబాన్లు పన్నులు కూడా వేస్తుంటారు. టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, ఖనిజాల తవ్వకం తదితర రంగాల్లో వీరికి వ్యాపారాలున్నాయి.
తాలిబాన్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారనే వార్తలను పాక్, ఇరాన్ ఖండించాయి. అయితే ఈ దేశాల్లోని ప్రైవేటు వ్యక్తుల ద్వారా తాలిబాన్లకు నిధులు అందుతున్నట్లు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత మంది మరణించారు?
యుద్ధంలో ఎంత మంది మరణించారో చెప్పడం కాస్త కష్టమే. అయితే 2014 నుంచీ 45,000 మంది భద్రతా దళాల సభ్యులు చనిపోయినట్లు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తెలిపారు.
2001 నుంచి నేటివరకు 3500 మంది విదేశీ సైనికులు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అమెరికన్ సైనికుల సంఖ్య 2,300కు పైనే.
అఫ్గాన్ పౌరుల మరణాలు లెక్కపెట్టడం మరింత కష్టం. 32,000 మందికి పైగా పౌరులు యుద్ధంలో మరణించినట్లు 2019, ఫిబ్రవరిలో ఐక్యరాజ్యసమితి ఓ నివేదిక విడుదల చేసింది.
మరోవైపు 42,000 మంది తాలిబాన్లు మరణించినట్లు ది వాట్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బ్రౌన్ యూనివర్సిటీ తెలిపింది. అఫ్గాన్, పాక్, సిరియా, ఇరాక్‌లలో ఘర్షణల వల్ల 5.9 ట్రిలియన్ల డాలర్ల నష్టం సంభవించినట్లు వివరించింది.
ఇప్పటికీ తాలిబాన్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేస్తూనే ఉంది. అయితే వచ్చే ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరిగేనాటికల్లా ఇక్కడ బలగాల సంఖ్యను బాగా తగ్గించేయాలని ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భావిస్తున్నారు.
అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోతే మిలిటెంట్ దాడులు మరింత పెరగొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మంగాయమ్మ: కవల పిల్లలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ
- ఆర్థిక వృద్ధి అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి
- పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న వదంతులతో గర్భిణిపై దాడి
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- మోదీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్ల నిధులు ఎందుకు తీసుకుంది?
- దళితుడి శవాన్ని వంతెన మీంచి కిందకు తాళ్ళు కట్టి ఎందుకు దింపారు...
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- బలూచిస్తాన్ స్వతంత్ర దేశ ఉద్యమానికి భారత్ 'రా' సహకారం ఇస్తోందా?.. పాకిస్తాన్‌కు ఇప్పటికీ ఆ ప్రాంతంతో చిక్కులు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








