ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది

ఫొటో సోర్స్, Matt hahn
- రచయిత, హెలెన్ థామస్, ప్యాట్రిక్ కిటిలీ
- హోదా, బీబీసీ న్యూస్
కన్నంవేసిన ఇంటి నుంచి ఎత్తుకొచ్చిన బీరువాను తన ఇంటికి తెచ్చుకుని అటూఇటూ చూసి జాగ్రత్తగా తెరిచి చూశాడా దొంగ.
అందులో డబ్బూనగలు లేవు సరికదా అన్నీ పనికిరాని వస్తువులే.. ఆ పనికి రాని వస్తువుల మధ్య ఒక మెమొరీ కార్డు కనిపించిందా దొంగకు.
దాన్ని కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి చూశాడు.. అంతే, ఆ దొంగ కూడా అందులో ఉన్న ఫొటోలు చూసి ఆవేదనకు గురై పోలీసులకు వాటిని అప్పగించి మరో నేరస్థుడిని పట్టించాడు.


మాథ్యూ హాన్ టీనేజ్‌లోనే డ్రగ్స్‌కు బానిసయ్యాడు. డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బుల కోసం దొంగతనాలు చేస్తుండేవాడు. అలా హైస్కూలులో చదువుతూ మధ్యలో ఆపేశాడు. చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ, గంజాయి తాగుతూ జులాయిగా తిరుగుతుండేవాడు.
రెండు తీవ్రమైన కేసుల్లో అరెస్టయి అయిదేళ్లు జైలులో ఉండి 2001లో విడుదలయ్యాడు. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం మళ్లీ ఆయన ఏదైనా కేసులో అరెస్టయితే యావజ్జీవ శిక్ష పడే అవకాశాలే ఎక్కువ.

ఫొటో సోర్స్, Matt hahn
''చాలాకాలం నేను బాగానే ఉన్నాను. నాకు మంచి పని ఉండేది.. స్కూలుకు వెళ్తుండేవాడిని.. కానీ, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న విషాదం నన్ను కోలుకోలేకుండా చేసింది'' అంటూ తానెందుకిలా అయ్యాడో చెబుతుంటారు మాథ్యూ.
మాథ్యూ స్కూలు ఫ్రెండ్స్‌లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటన తనను ఎంతగానో బాధించిందని, ఆ బాధతోనే డ్రగ్స్‌కు.. డ్రగ్స్ కోసం దొంగతనాలకు అలవాటు పడేలా చేసిందని చెబుతారు మాథ్యూ.
ఇదంతా పక్కన పెడితే మాథ్యూ 2001లో జైలు నుంచి విడుదలైన తరువాత కూడా చిన్నచిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. అలా 2005లో కాలిఫోర్నియాలోని లాస్ గటోస్‌లోని ఓ ఇంటి నుంచి బీరువాను దొంగతనం చేశాడు. దాన్ని తెరిచి చూస్తే తడిసిపోయిన డైపర్లున్నాయి. ఒక తుపాకీ, కొన్ని ఫొటోలు అందులో దొరికాయి. ఆ ఇంటి యజమానికి సంబంధించిన కొన్ని కాగితాలు కూడా ఉన్నాయందులో.
ఇంకా ఏమైనా ఉందేమోనన్న ఆశతో బీరువాను వెతికిన మాథ్యూకు ఒక డిజిటల్ కెమేరా మెమొరీ కార్డు దొరికింది.
మాథ్యూ దాన్ని కుతూహలంగా తన కంప్యూటర్‌కు కనెక్ట్ చేశాడు.
''ఆ మెమొరీ కార్డు ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నాను. ఒక చిన్నారిని లైంగికంగా వేధిస్తున్న ఫొటోలు అందులో ఉన్నాయి. అలా వేధిస్తున్నది నేను దొంగతనం చేసిన ఇంటి యజమానే.. ఫొటోలన్నీ ఆ దారుణానికి సంబంధించినవే''నని చెప్పాడు మాథ్యూ.
మాథ్యూ తాను చూసింది పోలీసులకు చెప్పి ఆ నేరస్థుడిని పట్టించాలనుకున్నాడు. కానీ, అప్పుడు తాను ప్రజల ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న విషయం తెలిసిపోతుంది. అప్పటికే రెండు నేరాల్లో అరెస్టై మూడో నేరంలో దొరికితే యావజ్జీవ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
కానీ, చిన్నపిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తిని ఎలాగైనా పోలీసులకు అప్పగించాలని ఆయన మనసు చెబుతోంది.

ఫొటో సోర్స్, Matt hahn
అప్పుడు మాథ్యూకు ఒక ఆలోచన వచ్చింది. చిల్లర దాచుకునే ఒక చిన్న పర్సులో ఆ మెమొరీ కార్డును పెట్టి.. తాను దొంగతనం చేసిన ఇంటి యజమాని పేరు, అడ్రస్ రాసిన కాగితం కూడా అందులో పెట్టి దాన్ని పోలీసులకు అందేలా పోస్ట్ చేశాడాయన.
అలా పోలీసులకు పంపిన కవర్లో ''దయచేసి ఈ మృగాన్ని వీధుల్లో తిరగనివ్వకండి'' అని రాశాడు మాథ్యూ.
ఇదంతా జరిగాక మాథ్యూ.. వార్తాపత్రికల్లో ఇలాంటి కథనమేదైనా కనిపిస్తే తనకు చెప్పమని తల్లితో చెప్పాడు. అయితే, దొంగతనం చేసిన విషయం మాత్రం తల్లికి చెప్పలేదు. గ్యారేజ్ సేల్‌లో దొరికిందని మాత్రమే చెప్పాడు.
వారం రోజుల తరువాత రాబర్ట్సన్ అయిట్కెన్ అనే వ్యక్తి అరెస్టయినట్లు కొడుకుతో ఆమె చెప్పారు.
కథ అక్కడితో అయిపోలేదు.. మాథ్యూ ఆ తరువాత కూడా దొంగతనాలు చేస్తూ.. అలా దొంగిలించిన వస్తువును 'ఈబే'లో అమ్మే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు.
దాంతో మూడో నేరం కింద యావజ్జీవ శిక్షకు గురయ్యే ప్రమాదంలో పడ్డాడు.
మాథ్యూను అరెస్ట్ చేసిన అధికారి అతడికి తెలిసి ఉండడంతో ఆయన మాథ్యూను ''నీకేమైందసలు.. బాగుండేవాడివి కదా'' అన్నారు.
ఆ మాటల్లో భాగంగా మాథ్యూ.. ''అవును.. మీకు రాబర్ట్ అయిట్కెన్‌ను పట్టించాను కదా'' అంటూ జరిగిందంతా ఆ పోలీసు అధికారితో చెప్పాడు.
మాథ్యూ జైలులో ఉన్నప్పుడు రాబర్ట్ కేసు వాదిస్తున్న న్యాయవాది ఆయన్ను సంప్రదిస్తూ బీరువా దొంగతనం చేసినట్లు ఒప్పుకుంటావా అని అడిగారు.
అప్పటికే వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న మాథ్యూ ఈ కేసులో నేరం అంగీకరించాడు. ఆయనకు 14 ఏళ్లు శిక్ష పడింది.
రాబర్ట్ అయిట్కెన్ చేసిన నేరానికి ఆయన 25 ఏళ్ల శిక్షను ఎదుర్కొన్నాడు.
ఒక దశలో మాథ్యూ, రాబర్ట్ ఇద్దరూ ఒకే జైలులో ఉన్నారు. ఒక్కోసారి ఇద్దరూ ఒకేసారి కోర్టుకు హాజరయ్యేవారు. రాబర్ట్ కేసులో మాథ్యూ సాక్షి.

ఫొటో సోర్స్, Matt hahn
''మా ఇద్దరినీ జైలుకు తీసుకెళ్లడానికి బస్ వచ్చేటప్పుడు రాబర్ట్‌ను ఒక బోనులో ఉంచి తెచ్చేవారు. నాకు మాత్రం చేతులకు బేడీలు వేసేవారు. రాబర్ట్‌కు నేను తెలియదు కానీ, ఆయన నాకు తెలుసు'' అన్నాడు మాథ్యూ.
జైలులో ఉంటుండగా మాథ్యూ చాలా మారిపోయాడు. డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడ్డాడు. రాబర్ట్ అయిట్కెన్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన చిన్నారి తల్లి ఇచ్చిన పుస్తకాలను మాథ్యూ చదివేవాడు. ధ్యానం కూడా చేసుకునేవాడు. ఇవన్నీ ఆయనలో పరివర్తన తెచ్చాయి.
జైలు నుంచి బయటకొచ్చాక మాథ్యూ బర్క్‌లీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశాడు. నేరస్తుడిని కావడం వల్ల తనకు ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదని చెప్పే మాథ్యూ చివరకు ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు.
''హాయిగా పనిచేసుకుని బతుకుతున్నాను'' అని బీబీసీతో చెప్పాడు మాథ్యూ. అంతేకాదు.. ఈ మధ్యే మాథ్యూ, ఆయన భార్య కలిసి సొంత ఇల్లు కొనుక్కొన్నారు.
ఇతరుల ఇళ్లను కొల్లగొట్టడం తన జీవితంలో తాను చేసిన అత్యంత పెద్ద తప్పని చెప్పే ఆయన.. తన జీవితాన్ని అందరికీ తెలియజెప్పి తనలా ఇంకెవరూ డ్రగ్స్‌కు బానిసలు కాకుండా నివారించాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- పిల్లల ఆరోగ్యం: 131వ స్థానంలో భారత్.. ఉత్తర కొరియా, భూటాన్, మయన్మార్ల కంటే దిగువన
- కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు?
- ట్రంప్ భారత పర్యటన: ప్రవాస భారతీయుల ఓట్లు రాబట్టుకోవాలన్న కోరిక నెరవేరుతుందా?
- కమల్ హాసన్ 'భారతీయుడు-2' సినిమా సెట్లో ప్రమాదం, ముగ్గురు మృతి
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- వివాదాస్పద మత బోధకుడు జాకిర్ నాయక్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు: Ground Report
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- మహాశివరాత్రి: మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









