జాకిర్ నాయక్: ఈ వివాదాస్పద మత బోధకుడు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? - Ground Report

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వివాదాస్పద ముస్లిం ప్రచారకుడు జాకిర్ నాయక్ దాదాపు మూడేళ్ల క్రితం భారత్ వదిలి మలేసియాలో తన కొత్త జీవితం ప్రారంభించారు.
ఆ తర్వాత అప్పుడప్పుడూ మోదీ ప్రభుత్వం, హిందూ సమాజంపై విమర్శలు చేస్తూ చర్చల్లో నిలిచారు.
జాకిర్ నాయక్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మలేసియాలో ఆయన జీవితం ఎలా ఉంది. దీని గురించి తెలుసుకోడానికి మేం ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించాం.
ఆ ఇంటర్వ్యూ కోసం ముంబయిలో ఉన్న ఆయన పీఆర్ ఏజెన్సీని సంప్రదించి, అధికారికంగా అప్లికేషన్ ఇచ్చాం. కానీ, ఆ అప్లికేషన్‌ను ఆయన వెంటనే తిరస్కరించారు.


అయినా, జాకిర్ నాయక్‌ను కలవడానికి గత వారం కౌలాలంపూర్ చేరుకున్నాం.
జాకిర్ నాయక్ పుత్రజయ అనే నగరంలో ఉంటున్నట్లు మాకు తెలిసింది. కౌలాలంపూర్ నుంచి పుత్రజయ చేరుకోడానికి 40 నిమిషాలు పడుతుంది.
పుత్రజయలో మలేసియా ప్రభుత్వ ఆఫీసులు, నివాస భవనాలు ఉన్నాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఒకప్పుడు రబ్బర్ చెట్లు నిండిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం విలాసవంతమైన భవంతులు కనిపిస్తున్నాయి.
అక్కడి ఆకర్షణీయమైన భవనాలు, అందమైన దృశ్యాలు మలేషియా ఆర్థిక ప్రగతిని కళ్లకుకడుతూ కనిపిస్తాయి.
శుక్రవారం రోజున జాకిర్ నాయక్‌ను కలవాలని మేం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే జాకిర్ నాయక్ తరచూ శుక్రవారం ఆ నగరంలో ఉన్న ప్రధాన మసీదు దగ్గరకు వస్తుంటారని మాకు తెలిసింది.
మేం పుత్రజయ మసీదు చేరుకునేసరికే, అక్కడ నమాజు చేస్తున్నవారి కంటే ఎక్కువగా పర్యటకులు కనిపించారు. మసీదు దగ్గర సెక్యూరిటీ గార్డులు జాకిర్ నాయక్ ఒంటిగంటకు అక్కడకు వస్తారని చెప్పారు.
కానీ, చాలా సమయం ఉండడంతో, మేం నేరుగా జాకిర్ నాయక్ ఉంటారని చెప్పిన నివాస ప్రాంతం దగ్గరికే వెళ్లాలనుకున్నాం.
ఐదు నిమిషాల తర్వాత 'తమారా రెసిడెన్స్' ముందు నిలబడ్డాం. దాని చుట్టూ ఉన్న ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపిస్తున్నాయి.
అక్కడ సెక్యూరిటీ గార్డుల ద్వారా జాకిర్ నాయక్‌కు మా సందేశం పంపించాం. సెక్యూరిటీ గార్డులు మా పాస్‌పోర్టులు ఫొటో తీసుకున్నారు.

పుత్రజయలో జాకిర్ మకాం
ఆ తర్వాత మేం జాకిర్ నాయక్‌ను కలవడానికి వేచిచూస్తున్నాం. కాసేపటి తర్వాత ఒక వ్యక్తి ఫోన్లో జాకిర్ నాయక్ సాయంత్రం 5 గంటలకు మమ్మల్ని కలుస్తాడని చెప్పారు.
ఆలోపు మేం తిరిగి మసీదు దగ్గరకు వచ్చాం. కాసేపటి తర్వాత, అంటే దాదాపు ఒంటిగంటకు జాకిర్ నాయక్ తన సెక్యూరిటీ గార్డులతో మసీదులోకి ప్రవేశించారు.
జాకిర్ నాయక్‌ను చూడగానే అక్కడ నమాజుకు వచ్చిన వారందరూ తలలు వంచారు, ఆయనతో చేతులు కలిపారు.
అది చూడగానే నాయక్ నిజంగానే ఆ మసీదుకు చాలా ముఖ్యమైన వ్యక్తి అని, అంత జనం మధ్య ఆయన్ను కలవడం సాధ్య కాదని మాకు అర్థమైంది.
నేను నా సహచరుడు దీపక్‌తో "ఏం ఫర్వాలేదు. మనం సాయంత్రం 5 గంటలకు ఆయన్ను కలవబోతున్నాం" అన్నాను.
తర్వాత మేం సాయంత్రం 5 గంటలకు మరోసారి ఆయన నివాసం దగ్గరకు చేరాం. ఈసారీ సెక్యూరిటీ గార్డులు మమ్మల్ని లోపలికి వెళ్లడానికి అనుమతించారు.
ఆ భవనం లోపలకు చేరుకోగానే ఒక వ్యక్తి జాకిర్ నాయక్ సహచరుడిని అని చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు.

ప్రార్థనలకు నేతృత్వం
ఆ వ్యక్తి మాతో రెండు పెద్ద భవనాల మధ్య ఉన్న ఒక చిన్న మసీదులోకి వెళ్లమని కోరాడు. జాకిర్ నాయక్ మధ్యాహ్నం తర్వాత ప్రార్థనల్లో పాల్గొంటారని, వాటికి నాయకత్వం వహిస్తారని చెప్పారు.
ఆ మసీదులోపలికి వెళ్లేసరికి జాకిర్ నాయక్ ముందు 50-60 మంది నిలబడి ఉండడం కనిపించింది.
నమాజు తర్వాత మమ్మల్ని జాకిర్ నాయక్ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు ఆయన మసీదు నుంచి బయటికొస్తున్నారు. ఆయన మాతో మాట్లాడుతాడు అని మాకు అనిపించింది.
కానీ, జాకీర్ నాయక్ మాతో నేరుగా "ఏంటి, నేను మీకు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వనన్నానో ఆరిఫ్ (ముంబైలో జాకిర్ నాయక్ మనిషి) మీకు చెప్పలేదా. బీబీసీని నమ్మలేం. మిమ్మల్ని కూడా నమ్మలేం. మీరు నా పట్ల పక్షపాత వైఖరి చూపిస్తున్నారు" అన్నారు.
నేను జాకిర్ నాయక్ మాట విని షాక్ అయ్యా. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి మమ్మల్ని పక్షపాతి అనడం సాధారణంగా జరగదు.
నేను ఆయన్ను అడ్డుకుంటూ "బీబీసీ పక్షపాతంతో ప్రవర్తించదు. నేను నా 30 ఏళ్ల సుదీర్ఘ కెరియర్‌లో మొదటిసారి ఈ మాట వింటున్నాను" అన్నాను.
"అలా ఎందుకన్నానంటే, ఎప్పుడూ నిజాలు మాట్లాడే ఒక వ్యక్తిని మొదటిసారి కలుస్తున్నారు" అని జాకిర్ నాయక్ చెప్పారు.

నీకు మాత్రం ఇవ్వను
"మీరు మా ఇంటర్వ్యూ అప్లికేషన్‌ను తిరస్కరించినప్పటికీ, మేం ఇంత దూరం వచ్చి మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించామంటే, మీపై వచ్చిన అభియోగాలపై మీ వాదన తెలుసుకోవాలని మేం ఎంత బలంగా కోరుకుంటున్నామో ఇదే మీకు చెబుతుంది" అన్నాను.
దానిపై ఆయన "నేను ముస్లిమేతరులకు ఇంటర్వ్యూ ఇవ్వగలను, కానీ నీకు మాత్రం ఇవ్వను" అన్నారు.
ఆయన స్కూల్ ఆధారంగా 2016లో నేను రాసిన ఒక కథనం గురించి ప్రస్తావించిన జాకిర్ "నేను మీకు స్కూల్లోకి రావడానికి అనుమతి ఇచ్చాను. ఎందుకంటే మీరు ముస్లిం అని, మీరు నా గురించి మరింత మెరుగ్గా తెలుసుకుంటారని అనుకున్నాను" అన్నారు.
ఆ మాట చెబుతున్నప్పుడు జాకిర్ నాయక్ కాస్త ఇబ్బంది పడ్డట్టు కనిపించారు, తనను తాను ఒక బాధితుడు అయిపోయినట్లు కనిపించారు.
నేను ఆయన్ను కలిసిన సమయంలో జాకిర్ నాతో అన్న ఆఖరి మాట "మీరు బీబీసీని వదిలేసినప్పుడు, నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తాను".
మేం కలిసి నిమిషం కూడా కాలేదు. ఆయనకు కోపం నా మీదనా, లేక బీబీసీ మీదా అనేది అర్థం కావడం లేదు.
బ్రిటన్ ప్రభుత్వం ఒకప్పుడు యూకేలో ఆయన ప్రవేశించకుండా నిషేధం విధించింది. కానీ, దానికి బీబీసీపై కోపం చూపించాల్సిన అవసరం ఏముంది.
2016లో దుబాయిలో ఉంటున్నప్పుడు ఆయన అసలు బీబీసీకి ఇంటర్వ్యూ ఇస్తానని ఎలా హామీ ఇచ్చారా, అని ఆశ్చర్యంగా కూడా వేసింది. అప్పుడు, మేం ఎయిర్‌పోర్టు వెళ్లడానికి ముందే ఆ ఇంటర్వ్యూ రద్దు చేశారన్నది వేరే విషయం.

ఫొటో సోర్స్, Getty Images
మలై సమాజంలో గౌరవం
జాకిర్ ఒకవేళ ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకున్నా, మలేషియా ప్రభుత్వం తరఫున మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయనను అనుమతిస్తారని కూడా నాకు నమ్మకం లేదు.
మలేసియాలో హిందువులు ఆ దేశ ప్రధానమంత్రి మొహమ్మద్ మహాతిర్ కంటే మోదీపట్ల ఎక్కువ భక్తి చూపిస్తున్నారని గత ఏడాది ఆయన అనడం వివాదం సృష్టించంది. ఆ వివాదం సమయంలో ఇలాంటి వ్యాఖ్యలకు బదులు ఇస్లాం బోధనలపై దృష్టి పెడితే మంచిదని ఆయనకు చాలామంది చెప్పారు.
మలేషియాలో జాకిర్ నాయక్ ప్రభావం చూపగలిగేంత ఒక స్థానం సంపాదించారనే విషయం మాకు అక్కడ ఉన్న వారం రోజుల్లోనే అర్థమైంది.
"జాకిర్ నాయక్ మలేసియాలో ఒక అవతార పురుషుడి వ్యక్తిత్వం సంపాదించారు" అని మలేషియాలోని పెనాంగ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వై.బి.కుమారసామి చెప్పారు.
మలై సమాజానికి చెందిన యువతకు ఆయన పట్ల చాలా భక్తిశ్రద్ధలు ఉన్నాయి. మేం కౌలాలంపూర్‌లో ఒక ముస్లిం యువకుల బృందాన్ని కలిశాం.
వారితో మాట్లాడినప్పుడు, మీకు తెలిసిన భారత ప్రముఖుల పేర్లు చెప్పమని మేం కొందరిని అడిగాం.
ఒక యువకుడు "నాకు వారిలో జాకిర్ నాయక్, గాంధీ మాత్రమే తెలుసు" అన్నాడు. మరో యువకుడు షారూఖ్ ఖాన్, జాకిర్ నాయక్ పేరు చెప్పాడు. మరొకరు భారత ప్రముఖుల్లో తనకు జాకిర్ నాయక్ పేరు మాత్రమే తెలుసని చెప్పాడు.

ఇస్లాం, మిగతా మతాలకు పోలిక
జాకిర్ నాయక్ ప్రభావం అన్ని వయసుల వారిపై స్పష్టంగా కనపిస్తోంది.
హాజావాన్ సాయ్ఫిక్ జాకీర్ నాయక్ గురించి మాట్లాడుతూ ఆయనను ఒక ఇస్లాం పండితుడుగా చెప్పారు. "జాకిర్ లోతైన జ్ఞానం, తార్కిక వాదనలు ఇస్లాంకు సంబంధించిన నా భ్రమలను దూరం చేశాయి" అన్నారు.
జాకిర్ నాయక్ అభిమాని అయిన హాజావాన్ "ఆయన ఇస్లాంకు సంబంధించిన సమాచారం మాత్రమే కాదు, హిందూ, బౌద్ధ, క్రైస్తవ మతాల గురించి కూడా జ్ఞానం అందిస్తారు" అని చెప్పాడు.
కానీ, మలేసియాలో చాలా మంది, ముఖ్యంగా హిందువులు, బౌద్ధులు జాకిర్ నాయక్ ద్వారా ఇస్లాంతో తమ మతాలను పోల్చడం, ఇతర మతాలను విమర్శించడం సరికాదని భావిస్తున్నారు.
జాకిర్ నాయక్ మలేషియా సమాజంలోని సాంస్కృతిక విలువలను ధ్వంసం చేస్తున్నారు అని సోషల్ మీడియాలో జాకిర్ నాయక్ అతివాద సమర్థకులతో వాద- ప్రతివదాలు నడిపే అరుణ్ అన్నారు.
"జాకీర్ బోధనలు మరో మతాన్ని వ్యతిరేకించేలా, వాటిని భయంకరంగా చూపించేలా ఉంటాయి. అది నాలాంటి వారికి నచ్చదు. ఎందుకంటే మానవత్వం, అన్ని జాతుల సమానత్వం అనే ఆలోచనలను మేం విశ్వసిస్తాం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇతరులపై పరువు నష్టం దావాలు
జాకిర్ నాయక్, ఆయన మద్దతుదారుల వేసిన పరువు నష్టం దావాలను ఎదుర్కుంటున్న మలేషియాలోని భారత సంతతి వారిలో అరుణ్ ఒకరు
మూడేళ్లుగా ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తున్న అరుణ్ చాలా అలిసిపోయినట్లు కనిపిస్తున్నారు.
"ఇది మానసిక తీవ్రవాదం. దానివల్ల నాకు నేనుగా మానసికంగా ప్రభావితం అవుతాను. మిగతావారు కూడా అలాగే ఆలోచిస్తారు. సులభంగా చెప్పాలంటే మనం బలంగా లేకపోతే, మన జీవితం నాశనం అయిపోతుంది" అన్నారు.
జాకిర్ వైపు నుంచి పరువు నష్టం కేసు ఎదుర్కుంటున్నవారిలో పెనాంగ్ స్టేట్ ఉప ముఖ్యమంత్రి వైబీ కుమారసామి కూడా ఉన్నారు.
"జాకిర్ నాయక్ బోధనల గురించి నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ హిందూ మతాన్ని విమర్శించే హక్కు ఆయనకు లేదు" అని ఆయన అన్నారు.
జాకిర్ నాయక్ చాలామంది అతివాద మద్దతుదారులు ఉన్నారు. వారిని ఆయన శిష్యులుగా చెబుతుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో వాద ప్రతివాదనలు
వీరిలో 35 ఏళ్ల జమ్రీ వినోద్ కూడా ఉన్నారు. అతడు ఒక తమిళ భారతీయుడు.
వినోద్ 16 ఏళ్ల వయసులో ఇస్లాం మతం స్వీకరించాడు. ఇస్లాం గురించి తెలుసుకోవాలని ముంబయిలో ఉన్న ఆయన స్కూల్లో చేరాడు.
"జాకిర్, నేను, ఆయన శిష్యుల్లో ఎవరూ హిందూమతం, లేదా వేరే ఏ మతం గురించి ఏమాత్రం తప్పుగా మాట్లాడడం లేదు. వేరువేరు మతాల పోలిక చెబుతూ మేం అందరినీ దగ్గరచేయడానికి ప్రయత్నిస్తాం" అన్నారు.
జమ్రీ వినోద్ సోషల్ మీడియాలో తన బలమంతా చూపించి జాకిర్ నాయక్‌ను వెనకేసుకొస్తుంటారు. మలేసియాలో కొందరు తప్ప, చాలామంది జాకిర్ నాయక్ మాటలను స్వాగతిస్తుంటారని చెబుతున్నారు.
"ఇక్కడ హిందూ సమాజానికి చెందిన కొంతమంది ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వారంతా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారు" అన్నారు.
తన కుటుంబ సభ్యులు ఇప్పటికీ హిందువులే అని చెప్పిన వినోద్, అన్ని మతాల గురించి జాకిర్ నాయక్ చెప్పే పోలికలపై తన హిందూ స్నేహితులు కూడా ఎలాంటి అభ్యంతరాలూ చెప్పరని తెలిపాడు.
"మలై సమాజంలో ఎక్కువమంది జాకిర్ నాయక్ మద్దతుదారులనేది నిజమే. మలేషియాలో 3.3 కోట్ల జనాభా ఉంది. వీరిలో 65 శాతం మంది మలై సమాజం వారు. వీరిలో ఎక్కువ మంది ముస్లిం మతాన్ని విశ్వసిస్తారు. 20 శాతం మంది చైనీయులు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. 7 శాతం మంది భారత సంతతి వారిలో ఎక్కువ తమిళ హిందువులే ఉన్నారు"

ఫొటో సోర్స్, Getty Images
అప్పగించని మలేషియా
మలేసియాలోని మైనారిటీలు జాకిర్ నాయక్ ఉనికిని తమకు ప్రమాదంగా భావిస్తున్నారు. ఆయన్ను భారత్‌కు అప్పగించాలని కోరుతున్నారు.
కానీ, ఆ దేశ ప్రధానమంత్రి మహాతిర్ మొహమ్మద్‌కు అదంత సులభం కాదు. ఆయన పూర్వీకులు భారత్‌కు చెందినవారు కావడమే దానికి కారణం.
మలై సమాజానికి దగ్గర కావడానికి ఆ దేశ ప్రధాని మహాతిర్ తన భారత వంశవృక్షాన్ని స్వయంగా దూరం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
"మా ప్రధానమంత్రికి అలా చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే అది మలై సమాజం భావనలకు విఘాతమే అవుతుంది" అని రామసామి చెప్పారు.
అంతే కాదు, భారత ప్రభుత్వం నాయక్‌ను అప్పగించడానికి భారత్ తమకు అందించిన ఆధారాలు చాలా బలహీనంగా ఉన్నాయని, కల్పితమని మలేసియా ప్రభుత్వం అంటోంది.
జాకిర్ నాయక్‌కు భారత్‌లో న్యాయం లభించదని కూడా మలేషియా ప్రధానమంత్రి భావిస్తున్నారు.
జాకిర్ నాయక్‌పై భారత్ వారెంట్ జారీ చేసింది. మతం పేరిట యువతను రెచ్చగొడుతున్నాడని ఆయనపై అభియోగాలు నమోదు చేసింది.
ఈ అభియోగాల ఆధారంగా మలేషియా ప్రభుత్వం జాకిర్ నాయక్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరింది.

ఇవి కూడా చదవండి:
- ఇస్లాంను మార్చేస్తున్న చైనా.. ఇందుకోసం పంచవర్ష ప్రణాళిక
- హఫీజ్ సయీద్‌కు అయిదున్నరేళ్ల జైలు శిక్ష విధించిన లాహోర్ కోర్టు
- కరోనావైరస్ వైరస్ సోకిన వాళ్ల దగ్గరకు వెళ్లారా లేదా అన్నది చెప్పే యాప్
- దిల్లీ అసెంబ్లీ ఫలితాలు: మూడోసారి ముఖ్యమంత్రి కానున్న కేజ్రీవాల్
- దేశ విభజన: "ఆ ముస్లింలు ఇక్కడే ఉండిపోవడం దేశానికి మేలు చేసినట్టేం కాదు" - యోగి ఆదిత్యనాథ్
- మహిళలను భారత సైన్యంలో కమాండర్లుగా అంగీకరించే పరిస్థితి లేదా?
- ఎలక్ట్రిక్ కారు కొనాల్సిన టైమ్ వచ్చేసిందా...
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









