కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది

కరోనావైరస్ పెళ్లి

ఫొటో సోర్స్, JOSEPH YEW

పెళ్లి వేడుకల్లో ఏవో కొన్ని లోటుపాట్లు ఉండటం సహజమే. కానీ, వధువు, వరుడు లేకుండా పెళ్లి జరుగుతుందా?

సింగపూర్‌లో ఓ వివాహ వేడుక మాత్రం అలాగే జరిగింది. కారణం కరోనావైరస్.

సింగపూర్‌కు చెందిన జోసెఫ్ యూ, కాంగ్ టింగ్ ఈ మధ్యే చైనా వెళ్లొచ్చారు. ఫిబ్రవరి 2న సింగపూర్‌లోనే వారి పెళ్లి జరిగింది.

కానీ, చైనాలో వ్యాపిస్తున్న కరోనావైరస్, వీళ్లకు చిక్కులు తెచ్చిపెట్టింది.

Presentational grey line
News image
Presentational grey line

వీళ్లిద్దరూ చైనాకు వెళ్లొచ్చిన కారణంగా, వీరి ద్వారా వైరస్ తమకు సోకుతుందేమోనన్న భయంతో చాలా మంది వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెనుకాడారు.

ఈ సమస్యకు జోసెఫ్, కాంగ్ ఓ పరిష్కారం ఆలోచించారు.

తమ వివాహ వేడుకకు వాళ్లే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

వివాహ వేదికలో ఓ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి వీడియో కాలింగ్ ద్వారా ఆ వేడుకలో పాల్గొన్నారు.

కరోనావైరస్ పెళ్లి

ఫొటో సోర్స్, JOSEPH YEW

చైనాలో కరోనావైరస్ బారినపడి 550 మందికి పైగా చనిపోయారు. మరో 20కి పైగా దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది.

సింగపూర్‌లో 28 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. చైనా, జపాన్ తర్వాత అత్యధిక కేసులు నమోదైంది ఇక్కడే.

వధువు కాంగ్‌ది చైనాలోని హునాన్ ప్రావిన్సు. చైనీస్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు యూతో కలిసి ఆమె జనవరి 24న అక్కడికి వెళ్లారు.

కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న హుబే ప్రావిన్సు పక్కనే హునాన్ ఉంది.

''మేం వెళ్లినప్పుడు హునాన్‌లో పరిస్థితి సాధారణంగానే ఉంది. పైగా మేం ఓ గ్రామీణ ప్రాంతానికి వెళ్లాం'' అని వరుడు యూ బీబీసీతో చెప్పారు.

జనవరి 30న ఈ జంట సింగపూర్‌కు తిరిగివచ్చింది. సెంట్రల్ సింగపూర్‌లోని ఎమ్ హోటల్‌లో ఫిబ్రవరి 2న వీరి వివాహం జరపాలని నిర్ణయించారు.

నిజానికి చైనాలో గత అక్టోబర్‌లోనే వీరి పెళ్లి జరిగింది. యూ కుటుంబం, స్నేహితులు చైనాకు రాలేకపోయారు. వారి కోసం సింగపూర్‌లో మరోసారి కాంగ్, యూ పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

వధువు వైపు అతిథుల కోసం ఒకసారి, వరుడి వైపు బంధువుల కోసం మరోసారి పెళ్లి చేసుకునే పద్ధతి చైనా లాంటి దేశాల్లో ఉంది.

కరోనావైరస్ పెళ్లి

ఫొటో సోర్స్, JOSEPH YEW

అయితే, సింగపూర్‌లో కాంగ్, యూ ఏర్పాటు చేసుకున్న వేడుకకు హాజరయ్యేందుకు అతిథులు వెనుకాడారు.

''పెళ్లి వాయిదా వేద్దామని అనుకున్నాం. కానీ, హోటల్ అంగీకరించలేదు. తాము అన్ని ఏర్పాట్లూ చేశామని, ఇప్పుడేమీ చేయలేమని చెప్పింది. ఇక మాకు మరో దారి కనిపించలేదు'' అని యూ చెప్పారు.

''మేం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేడుకలో పాల్గొంటాం అని అతిథులకు చెప్పాం. కొందరు షాక్ అయ్యారు. మేం అక్కడికి వెళ్లుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. వాళ్లు ఆందోళన చెందేవారు. మా అమ్మానాన్న ఈ నిర్ణయంపై ఆనందంగా లేరు. కానీ, చివరికి ఒప్పుకున్నారు'' అని యూ వివరించారు.

వైరస్ వ్యాప్తి వల్ల చైనాలో ప్రయాణ ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్ తల్లిదండ్రులు సింగపూర్‌లో జరిగిన వేడుకకు రాలేకపోయారు.

చివరికి కాంగ్,‌ యూల పెళ్లికి 110 మంది హాజరయ్యారు. 80 మంది దాకా వివిధ కారణాలతో డుమ్మా కొట్టారు.

వివాహం జరిగిన హోటల్‌లో ఉన్న ఓ గది నుంచే కాంగ్, యూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేడుకలో పాల్గొన్నారు.

''అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపాం. విందును ఆస్వాదించాలని కోరాం. మాకు బాధేమీ లేదు. కొంచెం నిరాశకు గురయ్యాం అంతే. మాకు ఇంకో దారి లేకపోయింది'' అని యూ అన్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)