జింకల వేటకు పెంపుడు చిరుతలు... క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు

నులక మంచాలపై చీతాలు

ఫొటో సోర్స్, leelavati jadhav

ఫొటో క్యాప్షన్, నులక మంచాలపై చీతాలు
    • రచయిత, ఓంకార్ కారంబేల్కర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో చీతాల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి వాటిని ఇక్కడకు తేవడానికి సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించింది. జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ) పిటిషన్ నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.

భారత్‌లో చీతాల ఉనికి శతాబ్దాలుగా ఉంది, కానీ, 20వ శతాబ్దంలో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు అనుమతితో ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను రప్పించి ఇక్కడ అనుకూల ఆవాసాల్లో వాటి సంతతి పెంచే అవకాశమేర్పడింది.

మొఘలుల కాలం నుంచి భారతీయ రాజులకు చీతాలను పెంచడం, తాము వేటకు వెళ్లినప్పుడు వాటిని కూడా తీసుకెళ్లడం అలవాటుగా ఉండేది.

మొఘల్ పాలకుల మాదిరిగానే అనేకమంది ఇతర రాజులు కూడా వీటిని పెంచేవారు. కొల్హాపూర్, బరోడా, భావ్‌నగర్ రాజులు ఈ విషయంలో ముందుండేవారు.

అక్బర్ చక్రవర్తి వద్ద పెద్దసంఖ్యలో చీతాలు ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ కాలంలో రాజులు సాగించిన వేటకు సంబంధించిన అనేక చిత్రాలలో ఇవి కనిపిస్తాయి.

Presentational grey line
News image
Presentational grey line

చీతాలను మచ్చిక చేసుకునే చిత్తేవాన్ సామాజికవర్గం

చత్రపతి సాహు మహారాజ్ తరువాత కొల్హాపూర్ రాజ్యంలో రాజారామ్ మహారాజ్ వేట కోసం చీతాలను పెంచే అభిరుచిని కొనసాగించారు.

భావ్‌నగర్ రాజు రాజా భావ్‌సింహ్‌జీ మహారాజ్.. సాహు మహారాజ్‌కు సహాధ్యాయి. భావ్‌నగర్‌లో వేట కోసం చీతాలను వినియోగించడాన్ని సాహు మహారాజ్ చూడడంతో కొల్హాపూర్‌లోని తమ సామ్రాజ్యంలోనూ అలా చేయాలని అనుకున్నారు. దీంతో ఆయన భావ్‌నగర్ నుంచి కొల్హాపూర్ రాగానే తన వద్ద పనిచేసే కొందరిని చీతాల కోసం ఆఫ్రికా పంపించారని రచయిత యశోదన్ జోషి తన 'మరచిపోలేని వేట'(అథవానిథిల్ షికార్) పుస్తకంలో రాసుకొచ్చారు.

ఆ కాలంలో కొల్హాపూర్‌లో ఉండే ఒక సామాజికవర్గానికి చెందినవారు చీతాలను పెంచడంతో పాటు వాటికి వేటలో శిక్షణ ఇచ్చేవారు. వీరిని చిత్తేవాన్‌లు అనేవారు. స్వాతంత్ర్యానికి ముందు ఇస్మాయిల్ చిత్తేవాన్, దోండీ లింబాజీ పాటిల్ వంటి చిత్తేవాన్ వర్గానికి చెందిన కొందరికి చీతాల శిక్షణలో మంచి పేరుండేదని యశోదన్ జోషి తన పుస్తకంలో రాశారు.

అప్పట్లో కొల్హాపూర్ రాజుల వద్ద 35 చీతాలు ఉండేవని టాక్సీడెర్మిస్ట్ బోథా వాన్ ఇంగెన్ తన రచనల్లో ప్రస్తావించారు. బోథా వాన్ 1936లో కొల్హాపూర్‌ను సందర్శించారు.

ఇస్మాయిల్ చిత్తేవాన్

ఫొటో సోర్స్, leelavati jadhav

ఫొటో క్యాప్షన్, ఇస్మాయిల్ చిత్తేవాన్

''మా తాత, ముత్తాత కూడా చీతాలను పెంచి వాటి సంరక్షణ బాధ్యతలు చూసుకునేవారు. చీతాలను పట్టుకుని వాటిని పెంచేవారు. అందుకే మమ్మల్ని 'చిత్తే పార్థి' అనేవారు. చత్రపతి సాహు మహారాజ్ రాజ ఆస్థానంలో చిత్తేపార్ధీలకు స్థానం కల్పించి తమ వేట కోసం చీతాల పెంపకం, శిక్షణకు వారిని వినియోగించేవారు. రాజారామ్ మహారాజ్‌కు వేటంటే బాగా ఇష్టం ఉండేది. ప్రస్తుతం కొల్హాపూర్ బస్‌స్టాండ్ సమీపంలో ఉన్న విక్రమ్ హైస్కూల్ వద్ద 'చిత్తే ఖానా'(చీతాల శాల) ఉండేది'' అని ఇస్మాయిల్ చిత్తేవాన్ మనవడు సలీం జమాదార్ 'బీబీసీ'కి చెప్పారు.

చీతాతో షాలిన్ రాజె

ఫొటో సోర్స్, leelavati jadhav

ఫొటో క్యాప్షన్, చీతాతో షాలిన్ రాజె(కొల్హాపూర్‌లోని షాలిన్ ప్యాలస్‌కు ఈమె పేరే పెట్టారు)

మచ్చిక.. పెంపకం

చీతాలను పట్టుకున్నాక అవి కోపంతో రగిలిపోతుంటాయి.. తమను బంధించిన బోను నుంచి ఎలాగైనా తప్పించుకుని పారిపోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. అలాంటి అడవి జంతువులను చిత్తేవాన్‌లు మెల్లగా మచ్చిక చేసుకుని తమ మాట వినేలా చేసుకునేవారు.

అలాంటి చీతాల వేటలో పాల్గొన్న లీలావతి యాదవ్ అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. చీతా నడుముకు తాడు కట్టి అదుపు చేసేవారని ఆమె చెప్పారు. చీతాలను వేటాడి మచ్చిక చేసుకున్న ఆ తరం వారిలో ప్రస్తుతం బతికున్నది లీలావతి జాదవ్ మాత్రమే. యశోదన్ జోషి రాసిన 'మరచిపోలేని వేట' పుస్తకంలో ఆమెతో మాట్లాడి తెలుసుకున్న అనేక వివరాలను పొందుపరిచారు.

చీతాల శాల

ఫొటో సోర్స్, leela jadhav

ఫొటో క్యాప్షన్, చీతాల శాల

నులక మంచాలపై చీతాలను పడుకోబెట్టి ఇద్దరు మనుషులు నిరంతరం వాటి వీపు నిమురుతుండేవారని.. చెక్క చెమ్చాలతో వాటికి ఆహారం తినిపించేవారని.. ఆ తరువాత వాటిని భూమిలో పాతిన కొయ్యలకు తాళ్లతో కట్టేసేవారని లీలావతి చెప్పినట్లుగా 'మరచిపోలేని వేట' పుస్తకంలో ఉంది.

ఆ ప్రాంతంలో ఉండే కృష్ణ జింకలను వేటాడటంలో శిక్షణ ఇవ్వడంలో భాగంగా కట్టేసిన చీతాల ముందు నల్లని రగ్గులు కప్పుకొని కొందరు పరుగులు తీసేవారు. అలా చేస్తూ నల్ల రంగుకు, మాంసానికి సంబంధం ఉందనిపించేలా చీతాలకు భ్రమ కల్పించేవారు. ఇదంతా వాటికి ఆహారంగా మాంసం పెట్టడానికి ముందు చేసేవారని లీలావతి చెప్పారు.

వేటకు వాడే గుర్రపు బళ్లు

ఫొటో సోర్స్, leelavati jadhav

గుర్రపు బండిపై గురి తప్పని వేట..

శిక్షణ పొందిన చీతాలను, వాటి సంరక్షణ చూసే చిత్తేవాన్‌లను తీసుకుని రాజులు వేటకు వెళ్లేవారు. గుర్రపు బళ్లపై వాటిని కూర్చోబెట్టి అడవిలోకి వెళ్లేవారు. జింకల మందను చూడగానే ఈ చీతాలు బండిపై నుంచి దూకి వెళ్లి వాటిని నోట కరిచేవి. ఆ వెంటనే చిత్తేవాన్‌లు గుర్రాలపై అక్కడికి చేరుకుని జింకలను విడిపించి పట్టుకొచ్చేవారు.

స్టార్, భవానీశంకర్, వీరమతి, లక్ష్మి, గణప్యా వంటి పేర్లు ఆ చీతాలకు పెట్టేవారని లీలావతి గుర్తు చేసుకున్నారు.

కొల్హాపూర్ చుట్టుపక్కలున్న గడ్డి మైదానాలు, అడవుల్లో ఈ వేట సాగించేవారు.

బ్రిటిష్ అధికారులు కానీ, ఇతర రాజ్యాల నుంచి అతిథులు కానీ వచ్చినప్పుడు ఇలా వేటాడేవారని.. అతిథులు దూరం నుంచి బైనాక్యులర్స్‌తో ఈ వేటను చూసి ఆనందించేవారని లీలావతి చెప్పారు.

కొల్హాపూర్‌లోని చిట్టచివరి చీతా 1960లో మృతిచెందిందని లీలావతి జాదవ్ తెలిపారు.

చీతాలతో సాహు మహారాజ్ కుమార్తెలు

ఫొటో సోర్స్, leelavati jadhav

ఫొటో క్యాప్షన్, చీతాలతో సాహు మహారాజ్ కుమార్తెలు

చీతాలు, చిరుతలకు మధ్య తేడా ఇదీ..

చూడ్డానికి ఒకేలా కనిపించే చీతా, చిరుతలు ఒకటే అనుకుంటారు చాలామంది. కానీ, ఈ రెండు జంతువులు వేర్వేరు.

చీతాలు, చిరుతలపై ఉండే మచ్చల్లో తేడా కనిపిస్తుంది. అలాగే, చీతాల ముఖంపై రెండు కళ్లకు లోపలి అంచుల నుంచి మూతి అంచుల వరకు నిలువుగా నల్లని రెండు చారలు ఉంటాయి. చిరుతల ముఖంపై ఇలాంటి చారలు ఉండవు.

చీతాల ఒంటిపై నల్లని చుక్కలు విడివిడిగా ఉంటాయి.. చిరుతల శరీరంపై నాలుగైదు నల్లని చుక్కలు కలిసి వలయాలుగా ఉంటూ అలాంటివి అనేకం ఉంటాయి.

చీతాలు గడ్డి మైదానాల్లో ఉండేందుకు ఇష్టపడతాయి.. అందుకు భిన్నంగా చిరుతలు దట్టమైన పొదలు, చెట్లు ఉండే ప్రాంతాల్లో ఉంటాయి.

చీతాల కంటే చిరుతలు ఎక్కువగా చెట్లపై ఉంటాయి. మగ చీతాలు సుమారు 54 కేజీలు, ఆడ చీతాలు సుమారు 43 కేజీల బరువుంటాయి.

ఇక చిరుతల విషయానికొస్తే మగవి 60 నుంచి 70 కేజీలు.. ఆడవి 30 నుంచి 40 కేజీలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)