చెరకుతోటల చిరుతలు.. వీటికి అడవంటే తెలియదు

ఫొటో సోర్స్, Prof Anand
- రచయిత, ప్రవీణ్ థాక్రే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రాణులు మనుగడ సాగించాలంటే మార్పును అంగీకరించాల్సిందే. లేదంటే వాటి ఉనికే ప్రశ్నార్థకరమవుతుంది. మహారాష్ట్రలోని చిరుత పులులు ఈ సూత్రాన్ని అక్షరాలా ఆచరిస్తున్నాయి. అడవులు అంతరించి పోతుండటంతో అవి చెరకు తోటలనే ఆవాసంగా చేసుకుంటున్నాయి. నాసిక్, పుణె, అహ్మద్‌నగర్, సతారా వంటి ప్రాంతాల్లో ఇది ఇప్పుడు సాధారణమైన విషయం.
ఎందుకు ఇలా?
మానవుడు అభివృద్ధి పేరిట అడవులను విచక్షణా రహితంగా నరికేస్తున్నాడు. దీనితో అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. పెద్దపెద్ద రిజర్వాయర్లు నిర్మించినప్పుడు వేలాది ఎకరాలు నీటిలో మునిగి పోతున్నాయి. అడవుల్లో నివసించే కొన్ని రకాల జంతువులు అంతరిస్తున్నాయి. మరికొన్నింటి సంఖ్య తగ్గిపోతోంది.
అందువల్ల చిరుతలకు ఆహారం దొరకడం కష్టంగా మారుతోంది. దీనితో అవి ఆహార అన్వేషణలో అడవుల అంచులు దాటి బయటకు వస్తున్నాయి. కాబట్టి సహ్యాద్రి పర్వతాలకు దగ్గరల్లో ఉండే ప్రాంతాల్లో సాగు చేసే చెరకు తోటల్లో చిరుతలు మకాం వేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Prof Anand
చెరకు తోటలే ఎందుకు?
చిరుతలు చెరకు తోటలను ఎంచుకోవడానికి చాలా కారణాలున్నాయి. మొదటిది రక్షణ. చెరకు తోట చాలా దట్టంగా ఉంటుంది. ఇందులో వాటి ఉనికిని పసిగట్టడం చాలా కష్టం. వేటాడే ముందు నక్కి ఉండటానికి కూడా ఎంతో అనువుగా ఉంటుంది. చెరకు పంట చేతికి రావడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుంది. చిరుతలు చెరకు తోటల్లో ఉంటే చుట్టుపక్కల ఊళ్లలో ఉండే కుక్కలు, మేకలు, గొర్రెల వంటి వాటిని సులభంగా వేటాడగలవని స్థానిక అటవీశాఖ అధికారి సునీల్ వాడేకర్ అభిప్రాయపడుతున్నారు.
అడవుల కంటే చెరకు తోటల్లో ఉండటం వల్ల వాటికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నట్లు మహారాష్ట్ర వెటనరీ విభాగం డిప్యూటీ కమిషనర్, డాక్టర్ సంజయ్ గైక్వాడ్ అన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో వాటికి పుష్కలంగా ఆహారం లభిస్తుందని, వాటి పిల్లలకు ఇక్కడ భద్రత ఉంటుందని వివరించారు.
పిల్లలు కూడా అక్కడే
చెరకు తోటల్లోనే చిరుతలు పిల్లలను ఈనుతున్నాయి. వాటిని అక్కడే పెంచుతున్నాయని, ఎలా వేటాడాలో నేర్పుతున్నాయని స్వచ్ఛంద సంస్థ వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ ప్రతినిధి డాక్టర్ అజయ్ దేశ్‌ముఖ్ చెప్పారు.
చిరుత పిల్లలకు చెరకు తోటలు ఇళ్లు లాంటివి. ఒకోసారి తోటల బయట ఆడుకుంటూ కనిపిస్తుంటాయని అజయ్ వివరించారు.

ఫొటో సోర్స్, Prof Ananad
30 ఏళ్ల కిందటే
ఒకో చిరుత జీవిత కాలం సగటున 15 ఏళ్లు ఉంటుంది. ప్రస్తుతం రెండు తరాల చిరుతలు ఇక్కడ కనిపిస్తున్నట్లు అటవీశాఖ అధికారి సునీల్ వాడేకర్ అంటున్నారు.
అంటే 30 ఏళ్ల కిందటే అవి చెరకు తోటల్లో నివాసం ఏర్పరచుకోని ఉండొచ్చని తెలిపారు. ప్రస్తుతం మూడోతరం చిరుతలు కూడా కనిపిస్తున్నాయని వివరించారు.

ఫొటో సోర్స్, Prof. Anand
తెలివి మీరుతున్నాయి కూడా
చిరుతలు పగలంతా చెరకు తోటల్లో విశ్రాంతి తీసుకుంటాయి. రాత్రుళ్లు వేటాడతాయి. ఇవి ఒకరకంగా తెలివైనవి కూడా. మనుషుల కదలికలపై అవి ఒక కన్నేసి ఉంచుతాయి. వారి కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి.
మనుషుల కదలికలను అవి నిశితంగా పరిశీలిస్తున్నాయని అజయ్ దేశ్‌ముఖ్ చెప్పారు. గ్రామస్థులు ఇతర పనుల్లో ఉన్నప్పుడు మాత్రమే పశువులను వేటాడుతున్నాయని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవి తమను తాము మార్చుకుంటున్నట్లు వివరించారు.

ఫొటో సోర్స్, Prof. Anand
ఆహారపు అలవాట్లలో మార్పు
అంతేకాదు వాటి ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటున్నాయి. ఉడుతలు, ఎలుకలు, పందికొక్కులు వంటి వాటిని కూడా వేటాడటం ప్రారంభించాయి.
కొత్త జాతి ఆవిర్భావం
ఈ పరిణామం సరికొత్త చిరుతలు, అంటే "చెరకుతోటల చిరుతల" పుట్టుకకు దారి తీస్తోంది. చెరకు తోటల్లో పుట్టిన చిరుతలకు అడవి గురించి తెలియదు.

ఫొటో సోర్స్, Prof Ananad
రణమా.. రాజీనా?
మనుషులకు దగ్గరగా నివసించడాన్ని చిరుతలు నేర్చుకుంటున్నాయి. అయితే ఇది తరచూ మనిషితో ఘర్షణకు దారి తీస్తోంది.
ఒకోసారి ఆహారం కోసం అవి ఇళ్లలోకి చొరబడుతుండటం, ఇందుకు ప్రధాన కారణం.
అయితే చిరుతలతో కలిసి జీవించేందుకు ప్రజలు సిద్ధపడాలని డాక్టర్ అజయ్ దేశ్‌ముఖ్ సూచిస్తున్నారు.
చిరుతలు మనుషులపై దాడులు చేసిన సంఘటనలు చాలా తక్కువ. అక్కడక్కడా కొన్ని జరిగాయి. కానీ అవి కావాలని చేసిన దాడులు కావు. చిరుతలకు హాని కలిగించకుండా వాటితో కలిసి జీవించేలా స్థానికులకు అవగాహన కల్పించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. మహారాష్ట్ర అటవీశాఖ, స్వచ్ఛంద సంస్థలు ఈ బాధ్యతను తలకెత్తుకున్నాయి.

ఫొటో సోర్స్, Utopia_88
ఇళ్ల చుట్టూ కంచెలు
ప్రస్తుతం ప్రజలు ఇంటి చుట్టూ కంచెలు నిర్మించుకుంటున్నారు. కోళ్లు, మేకలు, గొర్రెలు వంటి పెంపుడు జీవాలను జాగ్రత్త చేసుకుంటున్నారు. మనుషులు, క్రూరమృగాల మధ్య ఘర్షణను తగ్గించేందుకు ఇటువంటి చర్యలు కొంత మేరకు తోడ్పడతాయి.
అడవులు అంతరిపోతున్న తరుణంలో మనుషులు క్రూరమృగాలతో కలిసి జీవించాల్సిన సమయం ఇక ఆసన్నమైనట్లేనా?
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









