కడుపులోని పసికందునూ కబళిస్తోన్న కాలుష్యం

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY
- రచయిత, కమ్లేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పిల్లలు ఆరుబయట ఆడుకుంటే అది వారి ఎదుగుదలకు మంచిదని అంటారు. కానీ, ఇప్పుడు వీధుల్లో ఆడుకునే ఆ ఆటలే వారి ప్రాణాలు తీస్తున్నాయి. వాయు కాలుష్యం కారణంగా ఏటా వేల మంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
అనేకమంది రకరకాల వ్యాధులతో పాటు మానసిక, శారీరక ఎదుగుదల సమస్యలతో బాధపడుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదక ప్రకారం 2016లో ఐదేళ్ల లోపు వయసున్న లక్షమందికి పైగా పిల్లలు కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కాలుష్యం వల్ల పెరుగుతున్న వ్యాధుల భారం గురించి ఆ నివేదిక హెచ్చరించింది. భారత్‌లో గాల్లోని పీఎం 2.5 కాలుష్య కారకాల కారణంగా ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు. దుమ్ము మురికి కలగలిసిన ఆ కాలుష్య పదార్థాలు ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనేక సమస్యలకు దారితీస్తున్నాయి.
ఈ కాలుష్యం కారణంగా భారత్‌లో 60,987, నైజీరియాలో 47,674, పాకిస్తాన్‌లో 21,136 మంది పిల్లలు చనిపోయారు.
భారత్‌లో ప్రాణాలు కోల్పోయినవాళ్లలో మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య 4వేలు ఎక్కువగా ఉంది. పుట్టిన పిల్లలపైనే కాదు, గర్భస్థ శిశువుల పైన కూడా ఈ కాలుష్య ప్రభావం పడుతోంది. కాలుష్యం కారణంగా గర్భిణులకు ప్రిమెచ్యుర్ డెలివరీతో పాటు, శిశువుకు మానసిక, శారీరక లోపాలు, తక్కువ బరువు లాంటి సమస్యలతో పాటు మరణాలు కూడా సంభవించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది.
కాలుష్య ప్రభావం అందరిపైనా ఉంటుంది. కానీ, ఆ నివేదిక ప్రకారం ఎక్కువ భారం పిల్లలపైనే పడతుంది. ఆఖరికి పుట్టబోయే బిడ్డపైన కూడా ఈ ప్రభావం ఉంటుందనే విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

పిల్లల ప్రాణాలు పోతున్నాయి
కాలుష్యం ప్రభావం గర్భస్థ శిశువుపైన, కాస్త పెద్ద పిల్లలపైన ఒక్కోలా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పసిపిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
‘పసిపిల్లల ఊపిరితిత్తులు పుట్టిన వెంటనే పూర్తిగా ఎదగవు. అలాంటి పరిస్థితుల్లో కాలుష్యం ప్రభావం వారిపైన ఎక్కువగా ఉంటుంది. మొదట దగ్గు, తుమ్ముల లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఆస్తమాతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తొచ్చు. మానసిక ఎదుగుదలపైన కూడా ఈ కాలుష్యం ప్రభావం చూపుతుంది’ అని ఊపిరితిత్తుల సంబంధిత వైద్యుడు డాక్టర్.ఎస్‌కే చాబ్రా అంటారు.
‘ఇళ్లలో ఉండే కాలుష్యం కారణంగా కూడా పసి పిల్లలు ఇబ్బంది పడతారు. వంట, ఏసీ, పెర్ఫ్యూమ్‌లు, ధూమపానం, అగరబత్తీలు లాంటి వాటివల్ల ఇళ్లల్లో కాలుష్యం నెలకొంటుంది. పల్లెల్లో కట్టెల పొయ్యిలు కూడా పిల్లలపైన చాలా ప్రభావం చూపుతాయి’, అని ఆయన చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక బయటి కాలుష్యంతో పాటు ఇంట్లోని కాలుష్యాన్ని వేరుగా లెక్కగట్టింది. 2016లో ఐదేళ్లలోపు పిల్లల్లో దాదాపు 66,900మంది ఇళ్లలోని కాలుష్యం కారణంగానే చనిపోయారని ఆ నివేదిక చెబుతోంది.
‘పసిపిల్లలు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటారు. నేలపైన పాకుతారు. తల్లులతో కలిసి వంట గదిలో ఉంటారు. ఇలాంటి కారణాల వల్ల పిల్లలకు బయటి కాలుష్యంతో పోలిస్తే ఇళ్లలోని కాలుష్యం ప్రభావమే వారిపైన ఎక్కువగా ఉంటుంది’ అని చాబ్రా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పెద్ద పిల్లలపై ప్రభావం
పెద్ద పిల్లలు ఇంట్లో కంటే వీధుల్లోనే ఎక్కువగా ఆడతారు. ఉదయం పూట కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలోనే వాళ్లు స్కూళ్లకు వెళ్తుంటారు. అందుకే ఆ వయసు పిల్లలు బయటి కాలుష్యం బారిన ఎక్కువగా పడతారని డా. ధిరేన్ గుప్తా అనే పీడియాట్రిషియన్ వివరిస్తారు.
ఈ రోజుల్లో చిన్న వయసులోనే పిల్లలకు కళ్లద్దాలు వస్తున్నాయని, కాలుష్యం కూడా దానికి ఓ కారణమని ఆయన అంటారు. ముందునుంచే శ్వాసకోశ సమస్యలున్న పిల్లలపైన కాలుష్యం ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన చెబుతారు.
కాలుష్య కారకాలు తక్కువ ఎత్తులో పోగై ఉంటాయని, అందుకే పిల్లలపైన వాటి ప్రభావం పడే అవకాశాలు ఎక్కువని అంటారాయన.
‘ఇటీవల నా దగ్గరకు వచ్చే పిల్లల సంఖ్య 30శాతం పెరిగింది. వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో మందుల డోసేజీ పెంచాల్సి వస్తోంది. వాళ్లలో ఇన్ఫెక్షన్లు కూడా పెరిగిపోయాయి’ అని ధిరెన్ వివరిస్తారు.

ఫొటో సోర్స్, EPA
గర్భస్థ శిశువుపై ప్రభావం
గర్భంలోని శిశువును కూడా కాలుష్యం వదలట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రిమెచ్యుర్ డెలివరీతో పాటు పుట్టుకతో కొన్ని లోపాలకు కాలుష్యం కారణమవుతోందని అది అంటోంది.
ఆ నివేదికలో చెప్పింది అక్షర సత్యం అని డా.అనితా చందనా అనే గైనకాలజిస్ట్ అన్నారు. తల్లి ద్వారా పిల్లలపై కాలుష్య ప్రభావం ఎలా ఉంటుందో ఆమె వివరించారు.
‘గర్భం దాల్చిన తొలి నెలలో బిడ్డపైన కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తల్లి ఊపిరి తీసుకున్నప్పుడు కాలుష్యం ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. కొన్ని సూక్ష్మ పదార్థాలు ఊపిరితిత్తుల గోడలకే అంటుకుపోతాయి. కొన్ని రక్తంలో కలిసిపోతాయి. కొన్ని ప్లాసెంటా (మాయ) వరకూ చేరతాయి. అక్కడి కాలుష్య పదార్థాలు పొగైతే వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా గర్భస్థ శిశువుకు రక్త ప్రసరణలో ఇబ్బంది కలుగుతుంది.
బిడ్డకు పోషకాలు ఆ రక్తం ద్వారానే అందుతాయి. తక్కువ రక్త ప్రసరణ వల్ల బిడ్డ ఎదుగుదల మందగిస్తుంది. ఫలితంగా శారీరక, మానసిక లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్లాసెంటాకు రక్తప్రసరణ సరిగా లేకపోతే అది త్వరగా మెచ్యూర్ అవడంతో ప్రిమెచ్యుర్ డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది’ అంటూ కాలుష్య ప్రభావం గర్భస్థ శిశువుపైన ఎలా ఉంటుందో డా.అనితా వివరించారు.
సమస్య మరీ తీవ్రమైతే అది బిడ్డ మరణానికీ దారితీయొచ్చని అన్నారు.
అయితే వీటన్నింటికీ కాలుష్యం ఓ కారణమని, కేవలం దానివల్లే ఈ సమస్యలు తలెత్తుతాయని కూడా చెప్పలేమని అనిత చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు
ఐదేళ్లలోపు పిల్లలు కాలుష్యానికి వీలైనంత దూరంగా ఉండాలి. 2016లో 5-14ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 4,360మంది కాలుష్యం కారణంగా చనిపోయారని ఆ నివేదిక చెబుతోంది.
తక్కువ, మధ్య స్థాయి ఆదాయమున్న దేశాల్లో 98శాతం మంది పిల్లలు పీఎం 2.5 పదార్థాల ప్రభావానికి లోనవుతున్నారు. ఎక్కువ ఆదాయమున్న దేశాల్లో ఆ సంఖ్య 52శాతం.
వాతావరణానికి వాయు కాలుష్యం ప్రధాన ముప్పులా మారింది. మొత్తం వాయు కాలుష్యం కారణంగా ఏటా ప్రపంచంలో దాదాపు 70లక్షల ముందస్తు మరణాలు సంభవిస్తున్నాయి.

సురక్షితంగా ఎలా ఉండాలి?
గర్భిణులు కాలుష్యానికి దూరంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యం.
గృహ కాలుష్యాన్ని వీలైనంత తగ్గించుకోవాలి.
తల్లిపాల వల్ల బిడ్డ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్, జామ, నిమ్మకాయ లాంటి పదార్థాలను పిల్లల ఆహారంలో భాగం చేయాలి.
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, దీపావళి సమయంలో రాత్రంతా దీపాలను వెలిగించకపోవడం మంచిది.
టపాసుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించొచ్చు.
ఇవి కూడా చదవండి:
- మనుస్మృతి ఎందుకు వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది?
- రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ: ‘కాంగ్రెస్తో చేయి కలపడం ప్రజాస్వామిక అనివార్యత'
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- రఫేల్ డీల్: విమానం ధర ఎంతో చెప్పాలన్న సుప్రీంకోర్టు, కుదరదన్న కేంద్రం
- ఫేక్ న్యూస్: నకిలీ వార్తలను సృష్టించేదెవరు? వారి ప్రయోజనాలేమిటి?
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








