బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్‌తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం? - అభిప్రాయం

బడ్జెట్ 2020

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆలోక్ జోషి
    • హోదా, బీబీసీ కోసం

డిమాండ్ ఏమవుతుంది? గ్రోత్ ఏమవుతుంది? ఉపాధి ఏమవుతుంది?

బడ్జెట్ ముందు అందరి మనసులో ఇవే ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి. సూటిగా, స్పష్టమైన సమాధానాలు లభిస్తాయనే వారంతా అనుకున్నారు.

దీనిపై భారీ ఆశలు పెట్టుకున్నవారైతే, ఆర్థికవ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేసే అద్భుత ప్రకటనలు వినడానికి సన్నద్ధమయ్యారు.

Presentational grey line
News image
Presentational grey line

కానీ, రెండు గంటలా 41 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలూ లభించలేదు.

బదులుగా, దీనానాథ్ కౌల్ కశ్మీరీ కవితలు, తమిళంలో తిరువళ్లువర్, సంస్కృతంలో కాళిదాసు కోట్‌లు వినే అవకాశం మాత్రం కచ్చితంగా లభించింది.

చరిత్ర గురించి కూడా జ్ఞానం వచ్చింది. సరస్వతి, సింధు సంస్కృతి నాగరికత నుంచి కూడా వాణిజ్యానికి ప్రేరణ తీసుకోవచ్చనే విషయం తెలిసింది.

ఆదాయపన్ను

ఫొటో సోర్స్, Getty Images

ఆదాయపన్ను చెల్లింపు ఆప్షన్

ఇవన్నీ చెప్పిన తర్వాత, ఆదాయ పన్ను నంబర్ వచ్చింది.

ఇక్కడ మీరు కావాలనుకుంటే పన్ను చెల్లింపుల్లో లభించే మినహాయింపులు త్యాగం చేయవచ్చని, దానికి బదులు, సుమారు 5 శాతం తక్కువ పన్ను చెల్లిస్తే చాలని ప్రత్యామ్నాయం అందించారు.

అది మీరే ఎంచుకోవాల్సి ఉంటుంది, దీనిని ఎవరైనా ఎంపిక ఎంచుకోవచ్చు. కానీ 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే టాక్స్ రేట్ కూడా మారదు.

అందుకే, అత్యధికంగా టాక్స్ చెల్లించేవారు, అంటే టాప్ టాక్స్ బ్రాకెట్లో ఉన్న వారిలో ఎవరైనా ఈ వైపు మొగ్గు చూపుతారనే ఆశలు లేవు.

మరోవైపు రెండున్నర నుంచి ఐదు లక్షల రూపాయలు సంపాదించేవారు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు ప్రారంభించినవారు, హోమ్ లోన్ లాంటి భారం, టాక్స్ నుంచి బయటపడేందుకు, ప్రతి ఏటా డబ్బు పెట్టేలా, ఇన్సూరెన్స్ పాలసీలు లాంటి ఏర్పాట్లు చేసుకోనివారు సులభంగా ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు.

అలాంటి వారికి, ఈ కొత్త ఫార్ములా మొదటి చూపులోనే నచ్చేస్తుంది. వారిని ఊరించేలా, 15 లక్షలు సంపాదించేవారు ఇలా 73 వేలు పొదుపు చేయవచ్చని కూడా ఆర్థికమంత్రి చెప్పారు.

బడ్జెట్ 2020

ఫొటో సోర్స్, Getty Images

డబ్బులు ఖర్చు పెట్టేయండి

అంటే, ఈరోజు ఆ మార్గాన్ని ఎంచుకుంటే సంపాదన 15 లక్షలు అయ్యేవరకూ ఏ దిగులూ అక్కర్లేదన్నమాట . రిటర్న్ కూడా ముందే నింపేయచ్చు. శ్రమ కూడా తప్పుతుంది.

అయితే ఇంకేం, ఫోన్ తీసి స్విగీకి లేదా ఉబర్ ఈట్స్‌లో ఆర్డర్ ఇచ్చేయండి. అంత డబ్బు మిగిలింది కదా, ఖర్చు చేయరా?

దేశంలో వినియోగం కూడా పెరగాలిగా, ఆర్థికవ్యవస్థ పుంజుకునేది ఖర్చు చేసినప్పుడే కదా?

పూర్తిగా పూల్ ప్రూఫ్ ఫార్ములా... కదా. ఇలా, మీ పొదుపు, దేశాభివృద్ధి ఒకేసారి జరుగుతుంది. దానికి తోడు రుచి కూడా అందుతుంది.

అలా జరిగితే బావుణ్ణు. కానీ ఇది అలా లేదు. వీటన్నిటి మధ్య ఏ మాట చెప్పారో.. దాని గురించి కాస్త ఆలోచిస్తే అర్థమవుతోంది. అది ఏంటంటే, ఈ మార్గం ప్రజలను చీకటి భవిష్యత్తు వైపు తీసుకెళ్తోంది.

పొదుపును ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఇలాంటి మినహాయింపులు ఇస్తుంది. పొదుపు చేసిన దానికి ఇప్పుడు టాక్స్‌లో మినహాయింపులు లభిస్తాయి. భవిష్యత్తులో ఒక పెద్ద మొత్తం చేతికి అందేది.

అలాంటి మొత్తం ప్రభుత్వానికి రుణం రూపంలో అందేది. అది తిరిగి ఇచ్చే తేదీ కూడా ఫిక్స్ అయి ఉండేది. ఆ రుణం మార్కెట్ రేటుతో పోలిస్తే చాలా తక్కువ వడ్డీకే లభించేది.

అయితే, జమ చేసినవారికి ఇచ్చే వడ్డీ కూడా తక్కువేం కాదు. ఎందుకంటే దానితోపాటు టాక్స్ నుంచి వచ్చే మినహాయింపుల అకౌంట్ కూడా జోడించేవారు.

బడ్జెట్ 2020

ఫొటో సోర్స్, Getty Images

పొదుపు వైపు ఆకర్షణ ఏదీ?

ఇప్పుడు ఈ మినహాయింపులు లభించకపోతే పొదుపు వైపుగా ప్రజలను ఆకర్షించేది ఏదీ ఉండదు. ఆ బలవంతం కూడా లేదు.

దీని నష్టం వారికి అర్థమయ్యేసరికి, అప్పటికే చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది.

"ఈ నిర్ణయం లేదా ఈ మార్గం యువతకు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరినవారి భవిష్యత్తుతో చెలగాటం లాంటిది" అని టాక్స్ నిపుణులు శరత్ కోహ్లీ అన్నారు.

ఆయన దీనికి ఆసక్తికరమైన గణాంకాలు కూడా ఇచ్చారు. 70 శాతం జీవిత బీమా లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు జనవరి నుంచి మార్చి మధ్యలోనే కొనుగోలు చేస్తారని చెప్పారు.

శరద్ లాంటి సలహాదారులు టాక్స్ ఆదా చేయడానికి జనాలకు సలహాలు ఇచ్చే సమయం కూడా ఇదే.

చాలా సందర్భాల్లో 15-20 ఏళ్ల తర్వాత అలా పాలసీలు చేసిన వారు తన దగ్గరకు వచ్చి, కృతజ్ఞతలు తెలియజేస్తారని ఆయన చెప్పారు.

"మీరు అవి చేయించకపోయుంటే, ఈరోజు ఈ డబ్బు నిలిచుండేది కాదు" అని అంటారు.

ఎవరైనా పాలసీ చేయించిన ఒక సంపాదనపరుడు ఏదైనా ప్రమాదంలో చనిపోతే, దురదృష్టవశాత్తూ అతడిని కోల్పోయిన కుటుంబాలు అంతకంటే ఎక్కువ కృతజ్ఞత వ్యక్తం చేస్తుంటాయి.

అందుకే, ప్రభుత్వం దీని విషయంలో మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ఒకవైపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో డబ్బులు పెట్టే 100 శాతం విదేశీ నిధులకు మొత్తం పన్ను మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, భారత యువత భవిష్యత్తును సురక్షితం చేసే ఈ మార్గాన్ని మూసివేసి, వారితో చెలగాటం ఎందుకు ఆడుతున్నారో తనను తానే ప్రశ్నించుకోవాలి.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)