India vs New Zealand: వరుసగా రెండో టై.. నాలుగో టీ20లోనూ సూపర్ ఓవర్‌లో భారత్ విజయం

కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్ న్యూజీలాండ్‌ల మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.

ఈ సిరీస్‌లో మ్యాచ్ టై అయ్యి, సూపర్ ఓవర్ ఆడాల్సి రావడం ఇది వరుసగా రెండో సారి. రెండు సార్లూ టీమ్ ఇండియాకే విజయం దక్కింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 165 పరుగులు చేసింది.

అనంతరం ఛేదనకు దిగిన న్యూజీలాండ్ కూడా 165 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సూపర్ ఓవర్‌లో న్యూజీలాండ్ 13 పరుగులు చేసింది.

భారత్ ఇంకో బంతి మిగిలుండగానే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసింది. రాహుల్, కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చారు.

తొలి బంతినే సిక్సర్ బాదిన రాహుల్, రెండో బంతిని బౌండరీకి తరలించాడు. కానీ తర్వాత బంతికే ఔటయ్యాడు. నాలుగో బంతికి రెండు పరుగులొచ్చాయి.

ఐదో బంతిని బౌండరీకి తరలించిన కోహ్లీ భారత్‌కు సిరీస్‌లో వరుసగా నాలుగో విజయాన్నందించాడు.

Presentational grey line
News image
Presentational grey line

అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (39), మనీష్ పాండే (50 నాటౌట్) రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. న్యూజీలాండ్ బౌలర్ ఇష్ సోది మూడు వికెట్లు పడగొట్టాడు.

ఛేదనలో న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ మున్రో (64), సీఫెర్ట్ (57) అర్ధ శతకాలు చేశారు.

మళ్లీ ఆఖరి ఓవర్‌లో..

ఆఖరి ఓవర్‌లో న్యూజీలాండ్ జట్టు చేయాల్సింది ఏడు పరుగులే. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయి.

సీఫెర్ట్‌తోపాటు టేలర్ (24) క్రీజులో బాగా కుదురకుని ఉన్నారు.

కానీ, శార్దూల్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి టేలర్ ఔటయ్యాడు.

అతడి స్థానంలో వచ్చిన మిచెల్ ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టాడు కానీ, మరుసటి బంతికి సీఫెర్ట్ రనౌట్ అయ్యాడు.

నాలుగో బంతికి శాంట్నర్ ఒక పరుగు తీశాడు. ఐదో బంతికి మిచెల్ క్యాచౌట్ అయ్యాడు.

చివరి బంతికి రెండు పరుగులు సాధించాల్సి ఉండగా.. శాంట్నర్ ఒక పరుగు పూర్తి చేసి, రెండో పరుగు సాధించే క్రమంలో రనౌట్ అయ్యాడు.

దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

కేన్ విలియమ్సన్

ఫొటో సోర్స్, Getty Images

కివీస్‌కు కలిసిరాని సూపర్ ఓవర్లు

న్యూజీలాండ్ జట్టు గత ఏడాది కాలంలో మూడు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు ఆడింది. వీటిలో రెండు తాజా మ్యాచ్‌లు కాగా, ఒకటి చారిత్రక వరల్డ్ కప్ ఫైనల్.

ఈ మూడింటిలోనూ కివీస్ జట్టుకు పరాజయాలే దక్కాయి.

ఇంగ్లండ్‌తో ఆడిన వరల్డ్ కప్ ఫైనల్‌లోనైతే సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమమయ్యాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బౌండరీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఆ జట్టును విజేతగా ప్రకటించారు.

అప్పట్లో ఈ విధానంపై క్రీడాభిమానుల నుంచి చాలా విమర్శలు వచ్చాయి.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)