నంబి నారాయణన్: ఒక నకిలీ ‘గూఢచార కుంభకోణం’ ఈ సైంటిస్టు జీవితాన్ని ఎలా నాశనం చేసిందంటే..

నంబి నారాయణన్

ఫొటో సోర్స్, Vivek Nair

ఫొటో క్యాప్షన్, నంబి నారాయణన్
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, తిరువనంతపురం

ఒకే ఒక ఘటనతో మీ జీవితం తలకిందులైపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆయన సాధారణ వ్యక్తి కాదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో కీలక శాస్త్రవేత్తల్లో ఒకరు. కానీ, ఉన్నట్టుండి ఓ రోజు పోలీసులు వచ్చి ఆయన ఇంటి తలుపుతట్టారు.

అసలేం జరిగింది?

ఆ శాస్త్రవేత్త పేరు నంబి నారాయణన్.

అది 1994 నవంబర్ 30. అప్పటికి ఆయన వయసు 53 ఏళ్లు. ఇస్రోలో క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్ తయారీ ప్రాజెక్టుకు అప్పుడు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఆ ఇంజిన్ తయారీకి సంబంధించిన సాంకేతికతను రష్యా నుంచి తీసుకురావడానికి ఆయన బాధ్యులుగా ఉన్నారు.

Presentational grey line
News image
Presentational grey line

ఓ రోజు మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఆయన నివాసానికి ముగ్గురు పోలీసులు వచ్చారు. వారు చాలా మర్యాదగా, గౌరవంగా మాట్లాడుతున్నారు.

తమ బాస్ డీఐజీ (పోలీసు) మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని వారు చెప్పారు.

"నన్ను అరెస్టు చేశారా?" అని నారాయణన్ అడిగారు.

"లేదు సార్" అని పోలీసులు అన్నారు.

బయట ఆగి ఉన్న పోలీసు జీపు దగ్గరికి నారాయణన్ నడుచుకుంటూ వెళ్లారు. జీపులో ముందు కూర్చోవాలా? వెనకనా? అని ఆయన అడిగారు. సాధారణంగా అనుమానితులను పోలీసులు జీపు వెనుక సీటులో కూర్చోమంటారు.

ముందే కూర్చోండని పోలీసులు చెప్పారు. జీపు పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. కానీ, అక్కడ పోలీసు బాస్ లేరు. దాంతో, ఆ అధికారి వచ్చేదాకా నారాయణన్‌ను అక్కడే బెంచీ మీద సాధారణ వ్యక్తిలా కూర్చోబెట్టారు.

ఏదో నేరం చేసినవాళ్లను చూసినట్లుగా అందరూ ఆయనను అదో రకంగా చూస్తున్నారు.

గంటల తరబడి ఆయన అక్కడే కూర్చోవాల్సి వచ్చింది. కానీ, ఆ పోలీస్ బాస్ రావట్లేదు. చీకటి పడింది. రాత్రంతా ఆ బెంచ్ మీదే పడుకున్నారు. ఉదయం లేవగానే, మిమ్మల్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

చూస్తుండగానే అనేక మంది జర్నలిస్టులు వచ్చారు. దేశద్రోహానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారంటూ వార్తా పత్రికలు రాశాయి. ఆయన పాకిస్తాన్‌కు రాకెట్ సాంకేతికతను అమ్మారని, మాల్దీవులకు చెందిన ఇద్దరు మహిళలు వేసిన హనీ ట్రాప్‌లో పడిపోయిన ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారంటూ పతాక శీర్షికల్లో ప్రచురించాయి.

అంతే, అప్పటి నుంచి ఆయన జీవితం సాధారణ స్థితికి రాలేదు.

1967లో నంబి నారాయణన్
ఫొటో క్యాప్షన్, 1967లో నంబి నారాయణన్

అరెస్టుకు ముందు

నంబి నారాయణన్‌ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఐదుగురు బాలికల తర్వాత ఆయన పుట్టారు. తండ్రి కొబ్బరి కుడకలు, పీచు అమ్మేవారు. తల్లి ఇంటిపట్టునే ఉంటూ పిల్లలను చూసుకునేవారు.

ఇంట్లో అందరికంటే చిన్నవారైన నంబి నారాయణన్... చదువులో బాగా రాణించారు. సీనియర్ క్లాసులో టాపర్‌గా నిలిచారు. తర్వాత ఇంజినీరింగ్ చదివారు. డిగ్రీ పూర్తి చేశాక కొంతకాలం చక్కెర కర్మాగారంలో పనిచేశారు. ఆ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరారు.

"ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎగిరే వస్తువులంటే నాకు చాలా ఆసక్తి ఉండేది" అని ఆయన చెప్పారు.

అనతికాలంలోనే ఇస్రోలో అంచెలంచెలుగా ఎదిగారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్‌షిప్ పొందారు. ఆ కోర్సు పూర్తయ్యాక మళ్లీ ఇస్రోలో చేరారు.

ఇస్రోలో విక్రమ్ సారాబాయి, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి ఆయన పనిచేశారు.

"నేను ఇస్రోలో పనిచేయడం ప్రారంభించినప్పుడు, ఆ సంస్థ ఆరంభ దశలో ఉంది. అప్పట్లో సొంత రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఎలాంటి ప్రణాళికలూ వేసుకోలేదు. మన ఉపగ్రహాలను పంపేందుకు అమెరికా, ఫ్రాన్స్‌ల నుంచి రాకెట్లను దిగుమతి చేసుకునేవాళ్లం" అని నారాయణన్ గుర్తు చేసుకున్నారు.

కానీ, స్వదేశీ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టులో నారాయణన్ కీలక బాధ్యతలు తీసుకున్నాక ప్రణాళిక అంతా మారిపోయింది.

నంబి నారాయణన్‌ అరెస్టు చేసినప్పటి దృశ్యాలు

ఫొటో సోర్స్, Vivek Nair

ఫొటో క్యాప్షన్, నంబి నారాయణన్‌ అరెస్టు నాటి చిత్రం

1994లో తన జీవితం తలకిందులయ్యే వరకూ స్వదేశీ రాకెట్ల తయారీ కోసం ఎనలేని కృషి చేశారు.

వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదాను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఆయన అరెస్టుకు నెల రోజుల ముందు జరిగింది.

అనంతరం కొన్ని వారాల తర్వాత ఆమె స్నేహితురాలు ఫయూజియ్యా హసన్‌ను కూడా అరెస్టు చేశారు.

మాల్దీవులకు చెందిన ఆ మహిళలు గూఢచారులని, భారత రాకెట్ రహస్యాలను తస్కరించి దొంగచాటుగా పాకిస్తాన్‌కు అమ్ముతున్నారని, వారికి ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని పోలీసులు చెప్పినట్లు స్థానిక పత్రికలు రాశాయి.

ఆ మహిళలు వేసిన వలలో పడిన శాస్త్రవేత్తల్లో నంబి నారాయణన్ కూడా ఉన్నారని అప్పుడు పోలీసులు ఆరోపించారు.

1990లలో రష్యా శాస్త్రవేత్తలతో నంబి నారాయణన్ (కుడివైపున)
ఫొటో క్యాప్షన్, 1990లలో రష్యా శాస్త్రవేత్తలతో నంబి నారాయణన్ (కుడివైపున)

అరెస్టు తర్వాత

నారాయణన్‌ను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు.

"నేరాన్ని అంగీకరిస్తున్నారా? అని న్యాయమూర్తి నన్ను అడిగారు. 'నేరం ఏంటి?' అని నేను ప్రశ్నించాను. మీరు రాకెట్ సాంకేతికతను బదిలీ చేశారు కదా అని జడ్జ్ అన్నారు. నాకేమీ తెలియదు అని చెప్పాను" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఆయనకు న్యాయమూర్తి 11 రోజుల కస్టడీ విధించారు.

"నేను షాక్‌లో ఉన్నాను. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అచేతన స్థితిలోకి వెళ్లిపోయాను. నేను ప్రధాన పాత్రగా ఉన్న సినిమా చూస్తున్నానా? అని ఒకానొక సందర్భంలో అనిపించింది" అని ఆయన చెప్పారు.

తర్వాత కొన్ని నెలల్లో ఆయనకు ఉన్న గౌరవం, ప్రతిష్ట అన్నీ దెబ్బతిన్నాయి. భారత అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని, అవినీతికి పాల్పడ్డారని ఆయన మీద అభియోగాలు నమోదు చేశారు.

ఆయనపై విచారణ అధికారులు చేయిచేసుకున్నారు. చేతులకు బేడీలు వేసి పడుకోబెట్టారు. 30 గంటల పాటు నిలబెట్టి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని వేధించారు. లై డిటెక్టర్ పరీక్షల ఫలితాలను భారత కోర్టుల్లో ఆధారంగా పరిగణించరు. అయినా, ఆయనకు ఆ పరీక్షలు కూడా చేశారు.

తర్వాత భారీ భద్రత ఉన్న జైలులో బంధించారు. అందులో ఆయన్ను ఒక 'సీరియల్ హంతకుడి'తో కలిపి ఉంచారు.

తన అక్రమ అరెస్టు వల్ల రాకెట్ ప్రాజెక్టుకు నష్టం జరిగిందని నంబి నారాయణన్ అంటున్నారు

ఫొటో సోర్స్, Vivek Nair

ఫొటో క్యాప్షన్, తన అక్రమ అరెస్టు వల్ల రాకెట్ ప్రాజెక్టుకు నష్టం జరిగిందని నంబి నారాయణన్ అంటున్నారు

ఆ రాకెట్ రహస్యాలను 'పేపర్‌ ద్వారా బదిలీ చేయడం సాధ్యం కాదు' అని పోలీసులకు నారాయణన్ చెప్పారు. అదే విషయాన్ని ఆయన ఎప్పుడూ చెబుతూ వచ్చారు. వాస్తవానికి, అప్పటికి శక్తిమంతమైన రాకెట్ ఇంజిన్ల తయారీ కోసం క్రయోజెనిక్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఇంకా భారత్ తంటాలు పడుతోంది.

నారాయణన్ దాదాపు నెల రోజులు జైలుతో కలిపి 50 రోజుల పాటు బందీగా గడిపారు. ఆయన్ను పోలీసులు కోర్టుకు తీసుకెళ్లిన ప్రతిసారీ అనేక మంది జనాలు ఆయన గూఢచారి, దేశద్రోహి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తుండేవారు.

కానీ, ఆయన అరెస్టు అయ్యాక నెల రోజుల తర్వాత ఆ కేసును కేరళ ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయ్యింది. ఇస్రోలో తాను చూస్తున్న వ్యవహరాలకు సంబంధించి ఎలాంటి సమాచారమూ బయటకు ఇవ్వలేదని నారాయణన్ సీబీఐ అధికారులకు స్పష్టం చేశారు.

"మీ మీద ఎందుకు కేసు పెట్టారో, పరిస్థితి ఇందాక ఎందుకు వచ్చిందో నాకేమీ తెలియదు. మమ్మల్ని క్షమించండి" అని విచారణ అధికారి ఒకరు ఆయన అన్నారు.

చివరికి, 1995 జనవరి 19న రాత్రి ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన ఇంటికి చేరుకునే సరికి అర్ధరాత్రి అయ్యింది.

తాను జైలు నుంచి విడుదలై వచ్చానన్న విషయాన్ని తన భార్యతో చెప్పేందుకు పై అంతస్తుకు వెళ్లారు. అప్పటికి ఆమె చీకటి గదిలో నేలపై నిద్రపోతున్నారు. ఆయన రెండు సార్లు పేరుపెట్టి పిలిచాక ఆమె లేచారు.

"నా భార్య ఒక్కసారిగా లేచి అటు ఇటు చూసింది. తల పైకెత్తి నా కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ కాసేపు అలా ఉండిపోయింది. నేనేదో తప్పు చేశాను అన్నట్లుగా చూసింది. గట్టిగా... నువ్వు మనిషివా లేక జంతువువా? అని అన్నది. బిగ్గరగా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది" అని నారాయణన్ గుర్తు చేసుకున్నారు.

తన భర్త అరెస్టవ్వడం, దాదాపు రెండు నెలలు కనిపించకుండా పోవడం వల్ల మీనాక్షి అమ్మళ్‌ మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. అంతకు ముందు 30 ఏళ్ల క్రితం వారికి వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, నారాయణన్ అరెస్టు తర్వాత ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి, మాట్లాడటం మానేశారు.

అక్రమ కేసుల వల్ల జీవితాలు చిన్నాభిన్నమైన ప్రముఖుల కథనాల సిరీస్‌లో మొదటి కథనం ఇది
ఫొటో క్యాప్షన్, అక్రమ కేసుల వల్ల జీవితాలు చిన్నాభిన్నమైన ప్రముఖ వ్యక్తుల కథనాలను ఒక సిరీస్‌‌గా అందిస్తున్నాం

ముఖ్యమైన తేదీలు

1994 - నారాయణన్‌ను అరెస్టు చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 1995 జనవరిలో ఆయన బెయిల్ వచ్చింది.

1996 - ఈ కేసులో డాక్టర్ నారాయణన్ నిర్దోషి అని సీబీఐ ప్రకటించింది.

1998 - కేరళ ప్రభుత్వ అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

2001 - ఆయనకు పరిహారం చెల్లించాలని న్యాయస్థానం కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

2018 - తప్పుడు కేసు బనాయించడంపై సమగ్ర విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

2019లో నంబి నారాయణన్ భారత ప్రతిష్టాత్మక పద్మా పురస్కారం అందుకున్నారు

ఫొటో సోర్స్, Shahbaz Khan

ఫొటో క్యాప్షన్, 2019లో నంబి నారాయణన్ భారత ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు

నంబి నారాయణన్‌తో పాటు మరో ఐదుగురి మీద కూడా అభియోగాలు నమోదు చేశారు. వారందరూ నిర్దోషులేనని 1996లో సీబీఐ ప్రకటించింది. ఇస్రోకు చెందిన రహస్య పత్రాలను తస్కరించి పాకిస్తాన్‌కు చేరవేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.

క్రయోజెనిక్ ఇంజిన్లకు సంబంధించిన డ్రాయింగులేవీ చోరీకి గురికాలేదని ఇస్రో చేపట్టిన అంతర్గత దర్యాప్తులోనూ తేలింది. 1998లో నిర్దోషిగా తేలిన తరువాత డాక్టర్ నారాయణన్ మళ్లీ ఇస్రోలో చేరారు. అయినా, ఆయనకు ఇబ్బందులు తప్పలేదు. ఆ కేసును సీబీఐ మూసివేసినా. స్థానిక ప్రభుత్వం మళ్లీ కేసును తెరిచేందుకు ప్రయత్నించింది, సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. చివరికి, ఆ కేసును 1998లో దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

తనపై అక్రమంగా కేసును బనాయించి, వేధించిన కేరళ ప్రభుత్వంపై డాక్టర్ నారాయణన్ కేసు వేశారు. ఆయనకు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది.

అయితే, తాను అనుభవించిన 'బాధ'.. నగదు పరిహారంతో తీరిపోయేది కాదని, 50 లక్షలు కాదు.. ఐదు కోట్ల రూపాయలైనా ఆ గాయం మానిపోదు' అని నారాయణన్ అన్నారు.

ఉపాధ్యాయురాలు అయిన తన కుమార్తె గీతతో నంబి నారాయణన్

ఫొటో సోర్స్, Vivek Nair

ఫొటో క్యాప్షన్, ఉపాధ్యాయురాలు అయిన తన కుమార్తె గీతతో నంబి నారాయణన్

అన్యాయంగా అరెస్టు చేసి, వేధించినందుకు ఆయనకు మరో కోటి 30 లక్షల రూపాయలు కూడా పరిహారంగా చెల్లిస్తామని ప్రభుత్వం 2019 డిసెంబర్‌లో తెలిపింది.

అయితే, ఈ 78 ఏళ్ల శాస్త్రవేత్త దృష్టిలో ఈ కేసు ఇంకా ముగిసిపోలేదు. ఆయనపై అక్రమ కేసు పెట్టడంలో కేరళ పోలీసుల పాత్రపై విచారణ జరపాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ విచారణలో ఏం తేలుతుందో చూసేందుకు నారాయణన్ ఆసక్తిగా ఉన్నారు.

"నా మీద అక్రమ కేసుకు బాధ్యులైన వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఒక అధ్యాయం ముగిసింది, కానీ మరో అధ్యాయం ఇంకా మిగిలి ఉంది" అని ఆయన అంటున్నారు.

ఆయనపై తప్పుడు కేసు పెట్టడం వెనకున్న కారణమేంటన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. క్రయోజెనిక్ రాకెట్ సాంకేతికత అభివృద్ధితో భారత్ ముందుకెళ్తుందన్న అక్కసుతో మరే శక్తి అయినా తనపై కుట్ర పన్నిందేమో అని డాక్టర్ నారాయణన్ అనుమానిస్తున్నారు.

నంబి నారాయణ్
ఫొటో క్యాప్షన్, 2002లో నంబి నారాయణ్ ఇస్రో నుంచి రిటైర్ అయ్యారు

"ఏదేమైనా, నా జీవితం, నాకున్న గౌరవం, ప్రతిష్ట, ఆనందాలు పోయాయి. అందుకు బాధ్యులైన వారు ఇంకా బయట తిరుగుతున్నారు" అని ఆయన చెప్పారు.

1994లో డాక్టర్ నారాయణన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేయటం వల్ల, రాకెట్లలో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజన్లను దేశీయంగా అభివృద్ధి చేసే ప్రక్రియ రెండు దశాబ్దాల కాలం వెనుకబడిందని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతారు.

''భారత్‌లో అత్యధిక పీడనంతో కూడిన ఇంజన్‌ను తక్కువ కాలంలో డాక్టర్ నారాయణన్ అభివృద్ధి చేశారు. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్లకు అది చాలా కీలకమైన ఇంజన్. ఆయన సామర్థ్యం, ఆయన అందించిన సేవలను అది చాటుతుంది'' అని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ మాధవన్ నాయర్ 2018 నవంబర్‌లో బీబీసీతో చెప్పారు.

(అక్రమ కేసుల వల్ల జీవితాలు చిన్నాభిన్నమైన ప్రముఖ వ్యక్తుల కథనాలను ఒక సిరీస్‌‌గా అందిస్తున్నాం. మొదటి కథనం ఇది)

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)