ఇస్రో: 'గగన్‌యాన్' వ్యోమగాముల ఎంపిక ఎలా జరుగుతుంది?

అంగారకుడిపై భారతదేశ జాతీయ జెండా ఎగురుతున్నట్లు తయారు చేసిన ఊహా చిత్రం ఇది

ఫొటో సోర్స్, ISRO/FACEBOOK

ఫొటో క్యాప్షన్, అంగారకుడిపై భారతదేశ జాతీయ జెండా ఎగురుతున్నట్లు తయారు చేసిన ఊహా చిత్రం ఇది
    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూనే ఇస్రో 2020లో నిర్ధేశించుకున్న లక్ష్యాలను ఆ సంస్థ ఛైర్మన్ శివన్ వెల్లడించారు. 2020లో గగన్‌యాన్ ప్రాజెక్టుతో పాటు... చంద్రయాన్-3 ప్రాజెక్టు పనులు కూడా సక్రమంగా సాగుతున్నాయని తెలిపారు.

తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో రూపొందించిన ప్రాజెక్టే గగన్‌యాన్. ఇందుకోసం భారత వైమానిక దళం నుంచి నలుగురు పైలెట్లను ఎంపిక చేశామని, జనవరి మూడో వారం నుంచి వారికి రష్యాలో శిక్షణ మొదలు కానుందని శివన్ ప్రకటించారు.

రాకెట్

ఫొటో సోర్స్, APa

2007 నుంచే గగన్‌యాన్...

గగన్‌యాన్ ప్రాజెక్ట్ గురించి ఇటీవలే ప్రకటన చేసినా... మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు ఇస్రో 2007లోనే శ్రీకారం చుట్టింది. అప్పట్లో నిధుల కొరత కారణంగా ఈ ప్రయోగాలు మరింత ముందుకు సాగలేకపోయాయి.

దీనికి తోడు, అప్పటి వరకూ ఇస్రో దగ్గరున్న శక్తిమంతమైన జీఎస్ఎల్వీ రాకెట్‌లకు మానవులను పంపే మాడ్యూల్‌ను తీసుకెళ్లే సామర్థ్యం లేదు. టన్నుల కొద్దీ బరువైన క్రూమాడ్యూల్‌ను తీసుకెళ్లే రాకెట్లు కానీ, క్రయోజనిక్ ఇంజిన్లు కానీ లేవు. దీంతో ఆ దిశగా ప్రయోగాలు కొనసాగించారు. 2014లో తయారు చేసిన జీఎస్ఎల్వీ మార్క్ టూతో ఆ సమస్య తీరిపోయింది. ఇక క్రయోజనిక్స్‌లో ఇస్రో ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయి.

తాజాగా జీఎస్ఎల్వీ మార్క్ త్రీ కూడా సిద్ధమవ్వడంతో ఇస్రో మరోసారి గగన్‌యాన్ ప్రయోగాన్ని తెరపైకి తెచ్చింది. ఇటీవల చంద్రయాన్-2 మాడ్యూల్‌ను తీసుకెళ్లిన రాకెట్ కూడా ఈ జీఎస్ఎల్వీ మార్క్ త్రీనే. చంద్రయాన్-2తో కలిపి మూడుసార్లు ఈ మార్క్ త్రీ రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ మళ్లీ 2017లో పునరుద్ధరించింది.

ఇస్రో రాకెట్

ఫొటో సోర్స్, ISRO/FACEBOOK

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

2018 ఆగస్టు 15న ఎర్ర కోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో.. త్వరలోనే భారత్ మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత... ఈ గగన్‌యాన్ కార్యక్రమానికి 10 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు.

ఆపై ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌ను బెంగళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసింది. ఇద్దరు లేదా ముగ్గురు భారతీయ వ్యోమగాముల్ని, ఏడు రోజులు పాటు అంతరిక్షంలోకి పంపి, తిరిగి వారిని క్షేమంగా వెనక్కి రప్పించేలా గగన్‌యాన్ తొలి ప్రయోగాన్ని రూపొందించింది. అన్నీ అనుకూలిస్తే 2021 డిసెంబర్ లోగా ఈ ప్రయోగాన్ని పూర్తి చేస్తామని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.

ఇక 2019లో ఆస్ట్రోనాట్ల ఎంపికతో పాటు, ఈ బృందం అంతరిక్షానికి వెళ్లి, తిరిగి భూమ్మీదకు వచ్చే క్రూ మాడ్యూల్‌ను కూడా విజయవంతంగా పరీక్షించింది. మానవ సహిత అంతరిక్ష వ్యోమనౌకల ప్రయోగ సమయంలో ఏదైనా లోపాలు తలెత్తితే... వ్యోమగాములకు ప్రమాదం కలగకుండా వారిని రాకెట్ నుంచి వేరుచేసే ప్యాడ్ అబార్ట్ టెస్ట్ కూడా విజయవంతంగా నిర్వహించింది.

ఇస్రో

ఫొటో సోర్స్, iSro

వ్యోమగాములను ఎలా ఎంపిక చేస్తారు?

నిజానికి ఈ ఆస్ట్రోనాట్ల ఎంపిక చాలాకాలం కిందటే మొదలైంది. 2019 మే 29న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లు రెండూ... గగన్‌యాన్ ప్రోగ్రామ్‌కు అవసరమైన ఆస్ట్రోనాట్ల ఎంపిక, శిక్షణ, ఇతర అంశాల కోసం ఒక అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఆనాటి ఒప్పందం ప్రకారం... ఈ ప్రాసెస్ 12 నుంచి 14 నెలల పాటు కొనసాగుతుంది. ఇందులో ఎంపికైన ఆస్ట్రోనాట్లకు ప్రాథమిక శిక్షణ భారత్‌లో ఇస్తామని, తదుపరి శిక్షణకు విదేశీ అంతరిక్ష సంస్థల సాయం తీసుకుంటామని శివన్ అప్పట్లో ప్రకటించారు.

పైలట్ వ్యోమగామి

ఫొటో సోర్స్, IAF/Twitter

ఫొటో క్యాప్షన్, గగన్‌యాన్ కోసం ఎంపికైన వ్యోమగామి (మూడో వ్యక్తి)

భారత దేశంలో అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినంత వరకూ వ్యోమగాముల ఎంపిక ప్రక్రియను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ నిర్వహిస్తోంది.

1957లో భారత వాయుసేనకు అనుబంధంగా ప్రారంభమైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్... భారత వాయుసేన పైలెట్లకు శిక్షణ ఇవ్వడంలో తన సేవలు అందిస్తోంది. అందుకే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల ఎంపిక బాధ్యతను కూడా ఈ సంస్థకే అప్పగించారు.

వ్యోమగాములు

ఫొటో సోర్స్, IAF/Twitter

"అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు... విమానం నడిపించడంలో పూర్తి స్థాయి అనుభవం ఉండాలి. దానితో పాటు, వారికి ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ కూడా అవసరమే. ముందుగా ఆస్ట్రోనాట్ల ఎంపిక కోసం ఉత్సాహం ఉన్న వాళ్ల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తారు. ఇందుకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ల విభాగంలో అంతర్గతంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు.

ఇలా వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి వారిలో తగిన అర్హతలున్న వారిని ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసుకున్న వారికి కొన్ని ప్రత్యేకమైన మెడికల్ టెస్ట్ లు నిర్వహిస్తారు. అంటే వారి శారీరక సామర్థ్యాలు అంతరిక్ష ప్రయాణానికి తగినట్లుగా ఉన్నాయా లేదా? అన్నది పరిశీలిస్తారు. మెడికల్ టెస్ట్ లో పాసైన వారిని.. తదుపరి దశకు పంపిస్తారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ రెండో దశలో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఎంపికైన పైలట్లకు ఇందులో ఫిజికల్ టెస్ట్ లు నిర్వహిస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్‌‌లో పాసైన వారిని ప్రాథమిక ఆస్ట్రోనాట్ల ట్రైనింగ్ కి ఎంపిక చేస్తారు.

వ్యోమగాముల ఎంపిక ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో.. తాము 30 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్లలో ఔత్సాహికులను ఎంపిక చేసి, వారిలో 15 మందికి ఆస్ట్రోనాట్లకు బేసిక్ ట్రైనింగ్ ఇస్తామని, వీరిలో 9 మందిని షార్ట్ లిస్ట్ చేసి, వారికి విదేశాల్లో పూర్తి స్థాయి ఆస్ట్రోనాట్ల శిక్షణ ఇప్పిస్తాం" అని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరో స్పేస్ మెడిసిన్ ఎయిర్ కామెడోర్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

వ్యోమగామి

ఫొటో సోర్స్, iaf/twitter

అత్యంత క్లిష్టంగా ఉండే ఈ ఎంపిక ప్రక్రియలో తొలిదశ

"ఈ ఆస్ట్రోనాట్ల శిక్షణకు దరఖాస్తు చేసుకున్న వారిలో 60 మంది మెడికల్ టెస్టులు పాసయ్యారు. వారిలో చివరికి 12 మందిని ఆస్ట్రోనాట్ల శిక్షణ కోసం ఎంపిక చేశారు. వారందరినీ గతంలో మరిన్ని పరీక్షల కోసం మూడు విడతల్లో రష్యా పంపారు. ఇప్పుడు ఇస్రో ఆ పన్నెండు మందిలో నలుగురిని... పూర్తి స్థాయి ఆస్ట్రోనాట్ల శిక్షణ కోసం రష్యా పంపిస్తోంది" అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు రఘునందన్ తెలియచేశారు.

అంతరిక్ష ప్రయోగాలకు పంపే వ్యోమగాముల బృందాన్ని క్రూ అంటారు. ఇలాంటి క్రూలను రెండు మూడు సిద్ధం చేస్తారు. చివరి నిముషంలో ఒక బృందానికి కానీ, బృందంలో ఎవరికైనా గానీ ఇబ్బందులు తలెత్తితే.. అప్పుడు బ్యాకప్ కింద రెండో క్రూ సిద్ధంగా ఉంటుందని రఘునందన్ తెలియచేశారు.

గగన్‌యాన్ ప్రోగ్రాంకి ఎంపికైన ఎయిర్ ఫోర్స్ పైలెట్లకు పూర్తి స్థాయిలో స్పేస్ షిప్ కంట్రోల్ చేయడంతో పాటు, సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలి, అంతరిక్షంలో ఎలా గడపాలి వంటి చాలా రకాల అంశాలపై శిక్షణ ఇస్తారు. ఆస్ట్రోనాట్లగా ఎంపికైన వారికి ఎలాంటి కొత్త స్పేస్ షిప్ నైనా, ఫైటర్ జెట్ నైనా నడిపించగలిగే శిక్షణ ఇస్తారు. ఇలా ట్రైనింగ్ పీరియడ్ పూర్తయ్యాక కూడా ఎన్నో కఠినమైన పరీక్షలు నిర్వహించి.. చివరికి వారిని అంతరిక్ష ప్రయోగానికి ఉపయోగిస్తారు.

వ్యోమగామి

ఫొటో సోర్స్, iSaf/twitter

నాసాలో ఆస్ట్రోనాట్ల ఎంపిక ఎలా..?

Nasa.gov వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నిర్వహించే ఆస్ట్రోనాట్ల ఎంపిక చాలా పకడ్బందీగా సాగుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ పన్నెండు మందిని చంద్రుడి మీదకు పంపింది. వందల సంఖ్యలో వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపింది. 1969లోనే చంద్రుడి మీదకు మానవుల్ని పంపిన నాసా.. ఇప్పుడు అంగారక యాత్ర కోసం ఆర్టిమిస్ అనే మిషన్ కూడా ప్రారంభించింది.

ఇలా అంతరిక్షంలోకి పంపే వ్యోమగాముల్ని ఎంపిక చేసేందుకు నాసా చాలా క్లిష్టమైన విధానాలు పాటిస్తుంది. వ్యోమగాములుగా ఎంపిక కాదల్చుకున్న వారు.. కచ్చితంగా STEM ప్రోగ్రాం ద్వారా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక మూడేళ్ల పాటు ఫైటర్ జెట్ నడిపిన అనుభవం ఉండాలి. ఆపై నాసా నిర్వహించే ఆస్ట్రోనాట్ల ఫిజికల్ టెస్ట్ లన్నీ పాసై ఉండాలి.

నాసా ఇచ్చిన ఆస్ట్రోనాట్ సెలక్షన్ బోర్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 1978లో నాసా నిర్వహించిన ఆస్ట్రోనాట్ల పరీక్షకు 8వేల మంది అప్లై చేశారు. ఆపై 2012లో నిర్వహించిన పరీక్షలకు 6100 మంది అప్లై చేశారు. కాగా 2016లో మాత్రం రికార్డు స్థాయిలో 18,300 అప్లికేషన్లు వచ్చాయి.

వీరిలో 120 మంది హైలీ క్వాలిఫైడ్ అభ్యర్థులను టెక్సాస్ లోని హ్యూస్టన్ లో నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో ఇంటర్వూలు నిర్వహించి... వారిలో సమర్థులను తుది ఎంపిక చేస్తారు. వారికి రెండేళ్ల పాటు శిక్షణ ఇస్తారు.

ఇలా శిక్షణ పొందిన వారిని స్పేస్ స్టేషన్లతో పాటు, చంద్రుడి మీదకు, త్వరలో అంగారకుడి మీదకు మానవుల్ని పంపబోయే ప్రయోగాల్లో భాగస్వాముల్ని చేస్తారు.

వ్యోమగామి

ఫొటో సోర్స్, Iaf/twitter

ఎంపికకు ఈ మూడు అర్హతలూ తప్పనిసరి

నాసా 1959లో ఆస్ట్రోనాట్లను తొలిసారిగా ఎంపిక చేసింది. ఇందుకోసం నాసా, అమెరికన్ మిలటరీ సాయంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇందులో ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ తో జెట్ ఎయిర్ క్రాఫ్ట్ నడిపిన అనుభవం ఉన్న పైలెట్లను ఎంపిక చేసింది.

ఆపై వారిలో ఐదు అడుగుల 11 అంగుళాల ఎత్తులోపు ఉన్న వారిని మాత్రమే ఆస్ట్రోనాట్ల శిక్షణకు ఎంపిక చేసింది. ఈ ఎత్తు పరిమితి ఎందుకంటే... అప్పటికి నాసా ప్రయోగిస్తున్న మెర్క్యురీ స్పేస్ క్రాఫ్ట్‌లో ప్రయాణించడానికి అంతకు మించి ఎత్తు ఉన్న ఆస్ట్రోనాట్లు ఇబ్బంది పడాల్సి వస్తుందని... నాసా గరిష్టంగా అంత ఎత్తు ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేసింది.

తర్వాత ఈ ఎత్తు పరిమితిని తొలగించినా.. ఆస్ట్రోనాట్ల ఎంపికలో అదనపు అర్హతల్ని చేర్చింది. ఇందులో ఇంజినీరింగ్, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, లేదా మ్యాధమాటిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారికి అవకాశం కల్పించింది. వాటితో పాటు... కనీసం మూడేళ్ల ప్రొఫెషనల్ అనుభవం కలిగి ఉండటం లేదా వెయ్యి గంటలకి పైగా జెట్ ఎయిర్ క్రాఫ్ట్ నడిపిన అనుభవం తప్పనిసరి చేసింది.

ఇక సుదీర్ఘ కాలం అంతరిక్షంలో ప్రయాణించేందుకు అవసరమైన కఠినమైన ట్రైనింగ్ పరీక్షలు తప్పనిసరిగా పూర్తి చేసిన వారినే ఆస్ట్రోనాట్లుగా ఎంపిక చేస్తూ వచ్చింది. వ్యోమగాముల దృష్టి కచ్చితంగా 20/20 ఉండాలి. కళ్లద్దాలు వాడే వారిని తొలినాళ్లలో వ్యోమగాములుగా నాసా ఎంపిక చేసేది కాదు. కానీ, తర్వాత కాలంలో కళ్లద్దాల వాడకాన్ని అనుమతించింది.

వ్యోమగాముల.. శారీరక సామర్థ్యం, విద్యార్హతలతో పాటు, వారి నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్, టీమ్ వర్క్, మానసిక స్థిరత్వం వంటి లక్షణాలు కూడా పరిశీలిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)