జీశాట్-11: భారతదేశ అత్యంత భారీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

జీశాట్ 11

ఫొటో సోర్స్, ISRO

భారత దేశానికి చెందిన అత్యంత బరువైన ఉపగ్రహం జీశాట్-11 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.08 గంటలకు ఫ్రెంచ్ గియనా నుంచి యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన అరియేన్-5 రాకెట్లో జీశాట్-11ను ప్రయోగించారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకారం ఈ ఉపగ్రహం బరువు 5,854 కిలోలు. ఇప్పటిదాకా ఇస్రో తయారు చేసిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే.

భారత్‌లో ఇంటర్నెట్ పరిధిని పెంచే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని తయారు చేశారు.

భూమికి 36వేల కిలోమీటర్ల దూరంలో ఈ జియో స్టేషనరీ ఉపగ్రహం కక్ష్యలో నిలిచి ఉంటుంది. ఈ ఉపగ్రహం ఎంత పెద్దదంటే, దీనికి అమర్చిన సోలార్ ప్యానెళ్లు ఒక్కోటి నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడవుంటుంది. అంటే, ఒక సెడాన్ కారు కంటే పెద్దగా ఉండే ప్యానెళ్లను దీనికి అమర్చారు.

జీశాట్-11లో కేయూ-బ్యాండ్, కేఏ-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో పనిచేసే 40 ట్రాన్స్‌పాండర్లు అమర్చారు. అవి సెకనుకు 16 జీబీ స్పీడుతో డేటాను సరఫరా చేయడంతో పాటు హై బ్యాండ్ విడ్త్‌తో కూడిన కనెక్టివిటీనీ అందిస్తాయి.

ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు భారత్‌కు సేవలందించనుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ ఉపగ్రహం ప్రత్యేకతలేంటి?

భారత్ ఇప్పటిదాకా ప్రయోగించిన ఉపగ్రహాలతో పోలిస్తే జీశాట్-11లో ఎన్నో ప్రత్యేకతలున్నాయని, భారత్ తయారు చేసిన భారీ ఉపగ్రహం ఇదేనని ప్రముఖ సైన్స్ జర్నలిస్ట్ పల్లవ్ బాగ్లా అన్నారు.

భారీ ఉపగ్రహం అంటే అది తక్కువ పనిచేస్తుందని కాదని, కమ్యూనికేషన్ రంగంలో భారీ ఉపగ్రహాలు చాలా శక్తిమంతమైనవని, అవి ఎక్కువ సేపు పనిచేస్తాయని ఆమె చెప్పారు. ఇప్పటిదాకా అత్యధిక బ్యాండ్ విడ్త్‌ను వెంట తీసుకెళ్లిన ఉపగ్రహం కూడా ఇదే.

దీని వల్ల దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ మరింత సులువుగా, విస్తారంగా అందుబాటులోకి వస్తుంది.

నిజానికి ఈ ఉపగ్రహాన్ని గత మార్చి-ఏప్రిల్ నెలల్లోనే ప్రయోగానికి సిద్ధం చేశారు. కానీ, కొన్ని అదనపు పరీక్షలు జరిపేందుకు ఫ్రెంచ్ గియనా నుంచి దీన్ని మళ్లీ వెనక్కు తీసుకొచ్చారు.

జీశాట్-6ఏ ఉపగ్రహ ప్రయోగం విఫలం కావడంతో, అలాంటి పరిస్థితి మళ్లీ ఎదురువకుండా జీశాట్-11 ప్రయోగాన్ని వాయిదా వేశారు. మార్చి 29న ప్రయోగించిన జీశాట్-6 నుంచి సిగ్నళ్లు విఫలం కావడంతో ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లో సమస్య ఉత్పన్నమైంది.

దాంతో జీశాట్-11లో కూడా అలాంటి సమస్యలు ఎదురవుతాయేమోనన్న అనుమానంతో దాని ప్రయోగాన్ని అప్పుడు నిలిపివేశారు. ఆ తరువాత అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించారు.

ఇస్రో

ఫొటో సోర్స్, ISRO

ఇస్రోలో అత్యంత ఎక్కువ బరువు ఉన్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లే రాకెట్ జీఎస్ఎల్వీ-3. అది 4వేల కిలోల బరువున్న ఉపగ్రహాన్ని తీసుకెళ్లగలదు. అంతకంటే ఎక్కువ బరువున్న ఇస్రో ఉపగ్రహాలను యురోపియన్ స్పేస్‌పోర్ట్‌లోని ఫ్రెంచ్ గియానా నుంచి ప్రయోగిస్తారు.

ఇస్రో సామర్థ్యం కంటే జీశాట్-11 ఎక్కువ బరువుండటంతో దాన్ని ఫ్రెంచ్ గియనా నుంచి ప్రయోగించాలని నిర్ణయించారు.

‘అన్ని ఉపగ్రహాలను బయటి నుంచి ప్రయోగించాలని అనుకోరు. కానీ, ఇలాంటి భారీ ఉపగ్రహాలు ఉన్నప్పుడు తప్పదు’ అని సైన్స్ జర్నలిస్ట్ పల్లవ్ బాగ్లా తెలిపారు.

‘మనం బస్సులో ప్రయాణిస్తాం. అంతమాత్రాన బస్సును ఇంట్లో పెట్టుకోం కదా. అవసరమైనప్పుడు దాన్ని అద్దెకు తీసుకుంటాం. ఇదీ అలాంటిదే. ప్రస్తుతం ఇస్రో భారీ శాటిలైట్లను పంపే ఆలోచనలో లేదు. కానీ, కొన్నేళ్ల తరువాత సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ తయారైనప్పుడు ఆ అవసరం రావొచ్చు.’

జీశాట్ 11

ఫొటో సోర్స్, ISRO

‘కానీ, ఈ ఉపగ్రహం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందని భావిస్తున్నారు. అలా జరగదు. ఎందుకంటే ఇంటర్నెట్ స్పీడ్ ఆప్టికల్ ఫైబర్‌పైన ఆధారపడి ఉంటుంది. కానీ, ఈ ఉపగ్రహం కారణంగా ఇంటర్నెట్ పరిధి విస్తరిస్తుంది. సుదూర ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందుతుంది. ఫైబర్ ద్వారా ఇంటర్నెట్‌ను అందించడానికి వీల్లేని ప్రాంతాల్లో కూడా దీని సాయంతో ఇంటర్నెట్‌ను అందించొచ్చు’ అని పల్లవ్ బాగ్లా వివరించారు.

ఈ ఉపగ్రహం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. నిత్యం ఫైబర్ ద్వారా నడిచే ఇంటర్నెట్ వ్యవస్థలో సమస్యలు తలెత్తినప్పుడు ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోకుండా ఈ ఉపగ్రహం సాయంతో నడిపించే వీలుంది. ముఖ్యంగా భారత్‌లోని ప్రధాన ప్రాంతాలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో మల్టీ స్పాట్ బీమ్ కవరేజ్‌ను అందించేందుకు జీశాట్-11 ఉపయోగపడుతుంది.

మరోపక్క జీఎస్‌ఎల్వీ సామర్థ్యాన్ని పెంచే దిశగా కూడా ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది.

ఇన్‌శాట్ లాంటి సంప్రదాయ శాటిలైట్లు ఉపయోగించే సిగ్నల్ బీమ్ మొత్తం దేశాన్ని కవర్ చేయడానికి సరిపోదు. కానీ, జీశాట్-11 ప్రధానంగా ఒక భౌగోళిక ప్రాంతంపైనే ఫోకస్ పెడుతుంది. దేశం మొత్తాన్ని కవర్ చేసేందుకు ఇది బీమ్ లేదా సిగ్నల్‌ను రెండోసారి ఉపయోగించి వేగవంతంగా డేటాను సరఫరా చేస్తుంది.

గ్రామాల్లో ఈ-గవర్నెన్స్‌కు సహకరించేందుకు అనువైన డేటాను ఈ ఉపగ్రహం అందించనుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)