తెలంగాణ ఎన్నికలు 2018: ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ల జోరు.. ఏ పార్టీ నాయకులు ఎక్కువగా తిరుగుతున్నారు?

ఫొటో సోర్స్, Facebook/KCR
- రచయిత, శరత్ బెహరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార హోరుతో పాటు హెలికాప్టర్ల జోరు కూడా పెరిగిపోయింది. డిసెంబర్ 7న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన ప్రధాన నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
సమయం తక్కువ, ప్రచార సభలు, ప్రచారం చేయాల్సిన నియోజకవర్గాలు ఎక్కువగా ఉండటంతో స్టార్ క్యాంపైనర్లంతా హెలికాప్టర్లనే ఆశ్రయిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌నే తీసుకుంటే, ఆయన రోజుకు ఐదారు నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఒక నియోజకర్గం నుంచి మరో సభకు వెళ్లడానికి ఆయన హెలికాప్టర్‌నే ఉపయోగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ ప్రచారకురాలు విజయశాంతి కూడా హెలికాప్టర్‌లోనే ప్రయాణిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
వివిధ పార్టీలకు చెందిన స్టార్ క్యాంపైనర్లతో పాటు, కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలకు చెందిన జాతీయ నాయకులు ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రయాణానికి హెలికాప్టర్లనే వినియోగిస్తున్నారు.
హెలికాప్టర్ల వినియోగం వల్ల సమయం ఆదా అయినా, ఖర్చు మాత్రం ఎక్కువ. సాంకేతికంగానూ శ్రమతో కూడిన విషయం.

ఫొటో సోర్స్, Facebook/TelanganaCMO
‘డబ్బు సమస్య కాదు’
రాజకీయాలే చాలా ఖరీదైన వ్యవహారంలా మారిపోయాయని, అందులో ఈ హెలికాప్టర్ల ప్రయాణం కూడా ఓ భాగమని ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ కృష్ణారావు అన్నారు.
‘ఇప్పుడు అన్ని పార్టీల దగ్గరా డబ్బుంది. అన్ని రంగాలలానే రాజకీయ రంగంలోనూ సంపద సృష్టి జరిగింది. కాబట్టి ఎవరూ ఖర్చుకు వెనకాడట్లేదు. గతంలో డబ్బు పెట్టి హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవాలన్నా ఆ సదుపాయం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు వాటిని అద్దెకిచ్చే సంస్థలు చాలా వచ్చాయి. దాని వల్ల పార్టీలు సులువుగా హెలికాప్టర్లను అద్దెకు తీసుకోగలుగుతున్నాయి.
మరోపక్క తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌కు పోలింగ్ తేదీకి మధ్య చాలా తక్కువ గడువుంది. అంత తక్కువ వ్యవధిలో ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలంటే వేగవంతమైన ప్రయాణం తప్పదు. అందుకే స్టార్ క్యాంపైనర్లు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇది డబ్బుకు సంబంధించిన విషయమే తప్ప నాయకుల స్థాయికి సంబంధించినది కాదు.
ఈ వినియోగం తగ్గాలంటే ఎన్నికల నిబంధనలు మారాలి. కానీ, దానికి అవకాశం లేదు. ఎందుకంటే, రాజకీయ నాయకులందరికీ హెలికాప్టర్‌లో ప్రయాణం అవసరమే కదా’ అని కృష్ణారావు వివరించారు.
ఏ పార్టీ - ఎన్ని హెలికాప్టర్లు?
తెలంగాణలో ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం మొత్తం 6 హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి. టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 3, బీజేపీ ఒక హెలికాప్టర్‌ను ప్రచారం కోసం వాడుతున్నాయి. టర్బో ఏవియేషన్, గ్లోబల్ వెక్ట్రా, స్పాన్ ఎయిర్, తుంబీ ఏవియేషన్ లాంటి సంస్థలకు చెందిన హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నారు.
సాధారణంగా ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్లలో ఇద్దరు సిబ్బందితో పాటు మరో 8 మంది ప్రయాణించే వీలుంటుంది. ఇతర నేతలు ఉపయోగించే హెలికాప్టర్లో 5-6 ప్రయాణించొచ్చు.
ఎవరు ఉపయోగిస్తున్నారు?
టీఆర్ఎస్, కాంగ్రెస్, భాజపా... ఈ మూడు పార్టీలకు చెందిన స్టార్ క్యాంపైనర్లు ప్రస్తుతం ప్రచారం కోసం హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి, విజయశాంతి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భాజపా తరఫున స్వామి పరిపూర్ణానంద ప్రధానంగా తమ పర్యటనల కోసం హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.
వీరికి తోడు రాహుల్ గాంధీ, అమిత్ షా, మాయావతి లాంటి జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో ప్రచారానికి వచ్చినప్పుడు ఆయా పార్టీలు హెలికాప్టర్లను సమకూరుస్తున్నాయి.
ఇప్పటిదాకా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తెరాస అధినేత కేసీఆర్ అందరికంటే ఎక్కువగా ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్‌ను ఉపయోగించారు.

ఫొటో సోర్స్, Facebook/RevanthReddy
నవంబర్ 19 నుంచి 25 మధ్య రోజుకు సగటున నాలుగు ట్రిప్పుల చొప్పున ఆయన మొత్తం 28సార్లు హెలికాప్టర్లో ప్రయాణించారు. ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ఆయన ఆ తరువాతి నుంచి దూకుడు పెంచారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 మధ్య నాలుగు రోజుల వ్యవధిలో 27 ట్రిప్పులు వేశారు.
మొత్తంగా గత శుక్రవారం వరకు కేసీఆర్ ప్రచారం కోసం 73సార్లు హెలికాప్టర్లో ప్రయాణించారని, ఆయన తరువాతి స్థానంలో కాంగ్రెస్ స్టార్ ప్రచారకురాలు విజయశాంతి (దాదాపు 40సార్లు) ఉన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఒకటి తెలిపింది.
ఎన్నికల కమిషన్ డేటానే తీసుకుంటే కేసీఆర్ అందరికంటే ఎక్కువగా దాదాపు 85సార్లు తన ప్రచార పర్యటనల కోసం హెలికాప్టర్‌ను ఉపయోగించుకునేందుకు ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ రేవంత్ రెడ్డి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 3 మధ్య 36సార్లు హెలికాప్టర్లను ఉపయోగించుకునేందుకు అనుమతి కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
అద్దె ఎంత? అనుమతులు ఎలా?
సాధారణంగా హెలికాప్టర్ల సంస్థలు గంటకు రెండు లక్షల దాకా అద్దె వసూలు చేస్తాయి. కానీ ఎన్నికల వేల అది రూ.4లక్షల దాకా ఉంది. ఉదాహరణకు కేసీఆర్ రోజుకు సగటున 6-7గంటల పాటు హెలికాప్టర్‌ను ఉపయోగిస్తున్నారు. అంటే రోజుకు ఒక హెలికాప్టర్ కోసం దాదాపు రూ.28లక్షలు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు.
రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారికి దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాకే నేతలు ప్రచారం కోసం హెలికాప్టర్లను ఉపయోగించాలి. దాంతోపాటు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలకు కూడా హెలికాప్టర్ వినియోగానికి సంబంధించిన సమాచారం అందాలి.
రాష్ట్రంలో ప్రధాన పార్టీలు హెలికాప్టర్లను వినియోగిస్తున్న, ఆ సంఖ్య పెద్ద ఎక్కువేం కాదని తుంబీ ఏవియేషన్ సంస్థ సీఎండీ కెప్టెన్ కేఎన్‌జీ నాయర్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో దాదాపు 42 హెలికాప్టర్లు వినియోగంలో ఉండేవని ఆయన పేర్కొన్నారు.
అన్ని పార్టీల తరఫున ప్రధాన స్టార్ క్యాంపైనర్లే ఈ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.
ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం కాంగ్రెస్ తరఫున తెలంగాణలో 40మంది స్టార్ ప్రచారకులు ఉంటే, టీఆర్ఎస్ తరఫున కేవలం 16మంది మాత్రమే స్టార్ ప్రచారకులు ఉన్నారు. మరోపక్క తెలుగు దేశం పార్టీ తరఫున తెలంగాణలో 27మంది స్టార్ క్యాంపైనర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








