2020: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు 'బంగారం' పంట పండిస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పరాగ్ పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక పోటీలలో అద్భుతమైన ప్రదర్శనలతో రాణిస్తున్న భారత క్రీడాకారులు నూతన సంవత్సరానికి సిద్ధమవుతున్నారు.
ఈ ఏడాది జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక క్రీడా సంగ్రామం ఒలింపిక్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించాలని 130 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు. ఒలింపిక్స్ మాత్రమే కాదు, ఇంకా ఈ ఏడాది ముఖ్యమైన క్రీడా పోటీలు ఏమున్నాయి? వాటి విశేషాల గురించి చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్
భారత అండర్ -19 జట్టు జనవరి 19న దక్షిణాఫ్రికాలో యాత్ర ప్రారంభిస్తుండటంతో ఈ కొత్త సంవత్సరం యువ ఉత్సాహంతో మొదలవుతోందని చెప్పొచ్చు. ఫిబ్రవరి 9న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
గ్రూప్- ఎలో జపాన్, న్యూజిలాండ్, శ్రీలంకలతో పాటు భారత్ ఉంది. నాలుగు బృందాలుగా పదహారు జట్లు తలపడనున్నాయి. టోర్నమెంట్ సాధించగలమన్న ధీమాతో భారత జట్టు ఉంది.
భారత్ డిఫెండింగ్ ఛాంపియన్. 2000, 2008, 2012 & 2018 సంవత్సరాల్లో భారత్ ఈ టోర్నమెంట్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీతోనే మొహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా స్టార్లుగా ఎదిగారు.
ఈసారి ప్రియమ్ గార్గ్ జట్టుకు నాయకత్వం వహించనున్నారు. ముంబయికి చెందిన యశస్వి జైస్వాల్ కూడా ఈ సారి కీలకంగా మారే అవకాశం ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో అతడు ద్విశతకం సాధించి అందరినీ ఆకర్శించాడు.
పరాస్ మాంబ్రే హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
షూటింగ్ ప్రపంచ కప్ (దిల్లీలో)
అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ కప్ (రైఫిల్/ పిస్టల్/ షాట్‌గన్)కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
మార్చి 15 నుంచి 26 వరకు ఈ టోర్నమెంట్ సాగుతుందని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే, ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచకప్ నుంచి మొత్తం 16 కోటాలనూ ఉపసంహరిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయించింది. దీంతో, టోక్యో ఒలింపిక్స్ కోసం భారత షూటర్లు బెర్తులు సాధించేందుకు అవకాశం ఉంది.
ఆతిథ్య హక్కులను భారత్ నుంచి వెనక్కి తీసుకోవాలని అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ యోచిస్తోంది.
భవిష్యత్తులో క్రీడలు, ఒలింపిక్ సంబంధిత టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు బిడ్డింగ్‌లో భారత్ పాల్గొనకుండా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిషేధించింది. షూటింగ్ ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు రావాలనుకున్న ఇద్దరు పాకిస్తాన్ షూటర్లకు, వారి కోచ్‌లకు భారత్ వీసాలను నిరాకరించడమే ఈ పరిణామాలకు కారణం.

ఫొటో సోర్స్, TOKYO 2020
మిషన్ టోక్యో
అత్యంత ప్రతిష్టాత్మక క్రీడా సంగ్రామంగా భావించే ఒలింపిక్స్‌కు ఈ సారి టోక్యో ఆతిథ్యం ఇస్తోంది.
నాలుగేళ్ల కిందట జరిగిన రియో ఒలింపిక్స్‌లో 15 క్రీడా విభాగాల్లో 117 మంది భారతీయ క్రీడాకారులు పాల్గొన్నారు. రెండు పతకాలు మాత్రమే వచ్చాయి. దాంతో, పతకాల జాబితాలో భారత్ 67వ స్థానంలో నిలిచింది.
బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు రజతం సాధించి చరిత్ర సృష్టించింది. బాక్సర్ సాక్షి మాలిక్ కాంస్యం సాధించింది. జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్ వరకూ పోరాడిన దీపా కర్మాకర్‌కు ఆఖర్లో పతకం చేజారింది.
ఇప్పుడు భారత క్రీడాకారుల ముందున్న సవాల్ టోక్యో ఒలింపిక్స్. ఇది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగనుంది. ఇప్పటివరకు 62 మంది ఆటగాళ్లు (35 మంది పురుషులు, 27 మంది మహిళలు) ఇందులో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

ఫొటో సోర్స్, AFP
భారత ప్రభుత్వం టాప్స్ (టార్గెట్ ఒలింపిక్ )పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దేశంలోని అథ్లెట్లకు అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ముఖ్యమైన కార్యక్రమం ఇది.
అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలున్న సంస్థలలో ప్రసిద్ధ కోచ్‌ల దగ్గర క్రీడాకారులు శిక్షణ పొందేందుకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం సాయం చేస్తుంది. అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేందుకు కూడా తోడ్పాటు అందిస్తుంది. క్రీడా పరికరాలు కొనేందుకు సహాయం చేస్తుంది. కోచ్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, మెంటల్ ట్రైనర్, ఫిజియోథెరపిస్టు వంటి సహాయక సిబ్బందిని నియమించుకునేందుకు ఆటగాళ్లకు ఈ పథకం దోహదపడుతుంది. అంతేకాదు, క్రీడాకారుల చేతి ఖర్చులకు కూడా ఆర్థిక సాయం చేస్తుంది. ఈ పథకం కోసం 87 మంది ఆటగాళ్ళను ఎంపిక చేశారు.

ఫొటో సోర్స్, HOCKY INDIA
ఒలింపిక్స్ విషయానికొస్తే షూటింగ్‌పైనే ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో మను భాకర్, సౌరభ్ శర్మ ప్రధానంగా కనిపిస్తారు.
బ్యాడ్మింటన్ మీద కూడా చాలానే ఆశలున్నాయి. ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అతి పిన్న వయస్కురాలు, తొలి భారత మహిళా క్రీడాకారిణి పీవీ సింధు. ఈ పతకం ఆమె జీవితాన్నే మార్చేసింది. సింధు 2019లో నిలకడగా బాగానే ఆడినా, పతకాల సంఖ్య తగ్గింది. కానీ, ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించగలిగింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. దాంతో, ఈ ఒలింపిక్స్‌లో ఆమె మీద కూడా భారతీయులు బాగానే ఆశలు పెట్టుకున్నారు.
లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిని సైనా నెహ్వాల్ ఇప్పుడు టోక్యో కోసం సిద్ధమవుతోంది. ఆమెకు ఒలింపిక్స్ స్థాయిలో అనుభవం ఉంది. గతంలో ఆమె ప్రపంచ నంబర్ 1. ఇప్పటి వరకు 24 టైటిల్స్ సాధించింది. 2019లో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో సైనా సింధును ఓడించింది.
బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, సైనాలతో పాటు, కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, సాత్విక్‌సాయిరాజ్& చిరాగ్ శెట్టి ( డబుల్స్ జంట) కూడా ఒలింపిక్ అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక రెజ్లర్లు కూడా తమదైన ముద్ర వేయాలన్న ఆసక్తితో ఉన్నారు.

అండర్ 17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్
అండర్ 17 ఫుట్‌బాల్ మహిళల ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు ఈ టోర్నమెంటు జరుగుతుంది.
ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. భువనేశ్వర్, కోల్‌కతా, గువహాటి, అహ్మదాబాద్ నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.
అండర్ 17 మహిళల టోర్నమెంట్ 2008లో ప్రారంభమైంది. స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్. ఇప్పుడు భారత్‌లో జరగబోయేది 7వ ప్రపంచకప్. ఉత్తర కొరియా రెండుసార్లు కప్ గెలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
టీ-20 ప్రపంచ కప్ ఆఫ్ క్రికెట్ (మహిళలు & పురుషులు)
టీ -20 ఉమెన్స్ వరల్డ్ కప్ యొక్క ట్రోఫీ గెలవాలని భారత మహిళా క్రికెట్ జట్టు పట్టుదలతో ఉంది. ఇది రెండేళ్లకోసారి జరిగే టోర్నమెంట్. మహిళల టీ -20 ప్రపంచ కప్‌ను భారత్ ఎప్పుడూ గెలవలేదు. భారత జట్టు ఇప్పటి వరకు 2009, 2010 & 2018లో సెమీ-ఫైనల్ దాకా వెళ్లింది.
ఆస్ట్రేలియాలో ఫిబ్రవరి 21 నుంసీ మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు గ్రూప్ ఎలో భారత్ ఉంది.
విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత పురుషుల జట్టు టీ -20 ప్రపంచ కప్ కొట్టుకొస్తామని గట్టి నమ్మకంతో ఉంది. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరిగే ఈ టోర్నీలో... 18 జట్లు పాల్గొంటాయి. మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, మరో రెండు జట్లతో పాటు భారత్ ఉంది.
2007లో ప్రారంభ టోర్నమెంట్‌ను ధోని నాయకత్వంలో భారత్ గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్‌ను బాధించే విషయం ఏంటి?
- కన్సోల్ యుద్ధాలు.. ట్రంప్ కష్టాలు.. సూపర్ హీరోల సినిమాలు.. 2020 ఎలా ఉండబోతోంది
- ఉత్తర కొరియా: అమెరికా మొత్తం మా క్షిపణి పరిధిలో ఉంది
- నువ్వు పిచ్చోడివి.. కాదు నువ్వే : ట్రంప్-కిమ్
- పోకిరీల వేధింపులపై మహిళల వినూత్న పోరాటం
- కారును అడ్డగించి, తుపాకి గురిపెట్టి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
- ఝార్ఖండ్ మూక హత్య: 'మా అల్లుడి మరణంతో నా బిడ్డ జీవితం నాశనమైంది'
- "అమ్మను చూడగానే కన్నీళ్లొచ్చాయి" - పన్నెండేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న భవానీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








