పోకిరీల వేధింపులపై కెన్యా మహిళల వినూత్న పోరాటం

వీధుల్లో రాస్తున్న మహిళలు

ఫొటో సోర్స్, PLAN INTERNATIONAL

    • రచయిత, ఎస్తేర్ అకెలో ఒగోలా
    • హోదా, ఉమెన్ అఫైర్స్ జర్నలిస్ట్, బీబీసీ న్యూస్, నైరోబీ

ఆఫ్రికాలోని అతిపెద్ద అక్రమ నివాస ప్రాంతాల్లో ఒకటైన కిబెరాకు చెందిన యువతులు, బాలికలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను వీధుల్లో రోడ్లపైన, గోడలపైనా రాస్తున్నారు.

జుబేదా యూసఫ్ కెన్యా రాజధాని నైరోబీలోని కిబెరాలోనే తన జీవితం గడిపారు. వీధుల్లో వేధింపులకు గురికావడమన్నది అక్కడ సర్వసాధారణం అంటారామె.

''అక్కడి మగవాళ్లు అనేక రకాలుగా వేధిస్తారు.. 'నువ్వు కొవ్వెక్కి ఉన్నావు.. దేవుడు తన దగ్గర ఉన్న మట్టి అంతా వాడేసి నిన్ను తయారుచేసినట్లున్నాడు, అందుకే నీకు ముందూ వెనుకా అంతా భారీగా ఉంది' అంటూ మాటలతో వేధిస్తార''ని చెప్పారు 22 ఏళ్ల జుబేదా.

అయితే, ఇలాంటివాటిని ఎదుర్కోవడం ఎలాగో స్వయంగా నేర్చుకోవడంతోపాటు నిస్సహాయులం అనుకునే ఇతర యువతులకూ ఆమె సహాయపడుతున్నారు.

సుద్దముక్కలు, మార్కర్లు వాడుతూ 'చాక్ బ్యాక్' పేరుతో ఒక ప్రచార కార్యక్రమం చేపట్టారు జుబేదా. ఇందులో భాగంగా ఆమె, మిగతా యువతులు కిబెరా వీధుల్లో తాము ఎదుర్కొంటున్న వేధింపుల బాధలను రోడ్లపైనా, గోడలపైనా రాస్తూ అందరికీ తెలిసేలా చేస్తున్నారు.

వీధుల్లో లైంగిక వేధింపుల వల్ల కలిగే నష్టంపై అందరూ మాట్లాడుకునేలా ఈ రాతలు సాయపడతాయని వారు భావిస్తున్నారు.

''ఇప్పుడు మగవాళ్లు నన్ను అవమానకరమైన మాటలతో వేధిస్తే నేను ఆగి ఎందుకు వేధిస్తున్నారంటూ ముఖంపైనే అడుగుతున్నాను. అయితే, వయసు తక్కువ ఉండే బాలికలు ఇలా పోరాడలేకపోవచ్చు'' అన్నారు జుబేదా.

''అందుకే ఇలాంటి ప్రచారాలు అవసరమవుతున్నాయి. ఆడవాళ్లతో ఇలా మాట్లాడడం సరికాదని అందరూ చెప్పాలి''

గోడలపై రాతలు

షాకింగ్ మెసేజ్‌లు

''నా శరీరానికి గౌరవం ఇవ్వండి'' అంటూ ఒక సందేశం రోడ్డుపై కనిపిస్తుంది. మరికొందరు స్వాహిలి భాషలో తమ బాధాకరమైన అనుభవాలను రాశారు.

''నువ్వింకా కన్యవే.. మాకు బాగా పనికొస్తావు కదా?'' అంటూ తమకు ఎదురైన కామెంట్లను కొందరు రాశారు.

''ఏదో ఒక వికారపు మాట వినకుండా వీధులు దాటలేరంటే నమ్మండి. ఒక్కోసారి మమ్మల్ని జంతువులతో కూడా పోల్చుతారు'' అంటారు 20 ఏళ్ల కరోలినా మికాలీ.

''ఇది ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. అంత పనికిరాని మనిషినా? వేధింపులకు గురిచేసేవారు అన్నట్లుగా అంత అంద విహీనంగా ఉంటానా? అని ఆశ్చర్యపోతాను''

ఇదంతా కేవలం భావోద్వేగాల వ్యవహారం కాదు నిజంగా ఇదో సమస్య.

కాన్వాస్‌పై రాతలు

ఫొటో సోర్స్, PLAN INTERNATIONAl

మహిళలు వెళ్లకూడని ప్రాంతాలు

బహిరంగ ప్రదేశాల్లో బాలికలు, మహిళల భద్రత సమస్యపై పోరాడేటప్పుడు వీధి వేధింపులకు సంబంధించి వివిధ దేశాల్లో తులనాత్మక, కచ్చితమైన డాటా, విధానాలు లేకపోవడం పెద్ద సవాలేనని ఐరాస అభిప్రాయపడింది.

వీధుల్లో వేధింపులకు సంబంధించిన 2019లో 5 నగరాల్లో ప్లాన్ ఇంటర్నేషనల్ జరిపిన సర్వే ప్రకారం.. ఆ సర్వేలో మాట్లాడిన మహిళల్లో కనీసం పదిమందిలో ఒకరు కూడా తాము ఎదుర్కొన్న వేధింపులపై అధికారులకు ఫిర్యాదు చేయలేదని తేలింది.

ఇందుకుకారణం.. అధికారులు ఏం చేయగలరో కచ్చితంగా తెలియకపోవడం, వీధి వేధింపులు తీవ్రమైన నేరమో కాదో తెలియకపోవడం.

''ఎక్కడైనా ఎక్కువ మంది మగవారు గుమిగూడి కనిపిస్తే అలాంటి సందర్భాలు, ప్రదేశాలకు వెళ్లను'' అంటారు మికాలీ.

''ముఖ్యంగా సాయంత్రం దాటాక నేను బయటకు వెళ్లను. అలాంటి కొన్ని ప్రాంతాల్లో మహిళలు అత్యాచారాలకు గురయ్యారు'' అని చెప్పారామె.

వీధుల్లో రాతలు

ఫొటో సోర్స్, PLAN INTERNATIONAL

మికాలీ, ఇతర యువతులు కిబెరా వీధుల్లో రాస్తున్నప్పుడు కొందరు పురుషులు అక్కడికి వచ్చి... మహిళలు ఈ రీతిలో బయటపెట్టడం వల్ల తమ కళ్లు తెరుచుకున్నాయని చెబుతున్నారు.

''ఆడవాళ్లను ఏమైనా అనొచ్చన్నట్లుగానే చాలాకాలంగా మా మనస్తత్వం ఉంది. మేం ఎవరైనా ఒక అమ్మాయితో మాట్లాడితే ఆమె తిరిగి మాట్లాడి తీరాలనుకుంటాం. అది సరికాదని ఇటీవలే తెలిసింది. మెల్లమెల్లగా ఇదంతా నేర్చుకుంటున్నాం'' అని చెప్పారు విల్సన్ మైనా అనే పాతికేళ్ల యువకుడు.

''ఇప్పుడు మాకు కొంత తెలిసింది. మహిళలపై హింస, లైంగిక వేధింపుల చుట్టూ ఉన్న అంశాలపై చైతన్యం వచ్చింది'' అన్నారు 26 ఏళ్ల జైరస్ ఒములాండో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)