ప్రపంచ కప్ క్రికెట్ 2019: "ధోనీని చూడాలంటే ఏం చేయాలి"

- రచయిత, శివకుమార్ ఉలగనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి, లండన్ నుంచి
2019 ప్రపంచకప్ వేటను భారత్ విజయంతో ఘనంగా ప్రారంభించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది.
వెస్ట్ఎండ్ గేట్ నుంచి స్టేడియానికి రావడానికి ప్రేక్షకులు చాలా దూరం నడవాల్సి వచ్చింది.
భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరిగిన హ్యాంప్‌షైర్ బౌల్ స్టేడియం ఇంగ్లండ్‌లోని ఇతర మైదానాల కన్నా భిన్నంగా ఉంటుంది. సౌతాంప్టన్ సిటీ సెంట్రల్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో, నగరానికి దూరంగా ఉంటుంది. స్టేడియం చుట్టుపక్కల ట్యాక్సీలు, షాపులు, రెస్టారెంట్ల వంటివేమీ కనిపించవు. స్టేడియానికి వచ్చేవారంతా తమ సొంత వాహనాల్లో రావాల్సిందే. దగ్గరలో రైల్వే స్టేషన్ కూడా లేదు. ఈ మార్గంలో వెళ్లే బస్సులు కూడా చాలా తక్కువే.

కానీ ఇవేమీ అభిమానులను ఆపలేకపోయాయి
"ఉదయం 8 గంటలకే నేను ట్రైన్‌లో సౌతాంప్టన్‌కు చేరుకున్నా. కానీ నాకు వెంటనే ట్యాక్సీ దొరకలేదు. నేను స్టేడియానికి వెళ్లేసరికి టాస్ పూర్తవుతుందేమోనని భయపడ్డాను" అని లండన్‌లో ఉంటున్న వినీత్ సక్సేనా అన్నారు. సౌతాంప్టన్‌లో ఉండేవారంతా సిటీ సెంట్రల్‌లో నివాసం ఉంటుంటారు. ఎందుకంటే స్టేడియం దగ్గరలో హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటివి తక్కువ. మ్యాచ్ 10.30కు మొదలైనా ప్రేక్షకులు 7.30కే అక్కడకు రావడం మొదలైంది.

"ఈ మ్యాచ్ కోసం మేం సింగపూర్ నుంచి వచ్చాం. ఒక్క బాల్ కూడా మిస్ కావడానికి వీల్లేదు. రద్దీ ఎక్కువగా ఉంటుందని మాకు తెలుసు. అందుకే ఉదయాన్నే ఇక్కడకు చేరుకున్నాం" అని కుటుంబంతో సహా మ్యాచ్ చూడటానికి వచ్చిన వివేక్ చెప్పారు. ఆయన లాగే ఎందరో క్రికెట్ అభిమానులు, టీమిండియా అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను, వారి విన్యాసాలను చూడాలని ఉదయానికల్లా స్టేడియం దగ్గరకు చేరుకున్నారు. ఒక్క బాల్ కాదు, టాస్ వెయ్యడాన్ని కూడా మిస్ కాకూడదనేదే వారందరి లక్ష్యం.
"మా బాస్ ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వడం కుదరదు అని చెప్పారు. దీంతో నేను ఏదో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అలా చేయడం తప్పని తెలుసు. ధోనీని చూడాలంటే ఇలాంటివి చేయడం తప్పేం కాదు" అని పేరు వెల్లడించని, ఫొటో తీసుకోవడానికి నిరాకరించిన ఓ అభిమాని చెప్పారు.
"ధోనీ మరో వరల్డ్ కప్‌లో ఆడకపోవచ్చు. అందుకే అతడిని ఇప్పుడే చూడాలి" అని ఆయన అన్నారు.

స్టేడియానికి దారితీసే రోడ్డుపై గస్తీలో ఉన్న పోలీసులకు ఇదంతా కొత్తగా కనిపిస్తోంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానుల సందోహాన్ని ఊహించొచ్చు. రకరకాల సంగీత వాయిద్యాలు, కోలాహలం కనిపిస్తుంది.
"ఎవరెవరి మధ్య మ్యాచ్ జరుగుతోందో నాకు తెలియదు. కానీ ఈ హడావుడి, జనసందోహం, వాద్యాల శబ్దాలను బట్టి కళ్లుమూసుకుని చెప్పొచ్చు... రెండు జట్లలో ఆసియా ఖండానికి చెందిన జట్టు ఉంది అని" అని భద్రతా సిబ్బందిలోని ఓ వ్యక్తి నవ్వుతూ వ్యాఖ్యానించారు. భారత్ ఆడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో ప్రేక్షకుల సంఖ్య మరింత ఎక్కువైందని ఆయనన్నారు.

భారత్ 9, దక్షిణాఫ్రికా 1
టాస్ దక్షిణాఫ్రికా గెలిచి ఉండొచ్చు కానీ, అభిమానుల మద్దతు, కేరింతలు, కోలాహలం విషయంలో మాత్రం గెలుపు భారత్‌దే. స్టేడియంలోని ప్రేక్షకుల్లో ఒకవంతే దక్షిణాఫ్రికా, తొమ్మిది వంతుల మంది భారత అభిమానులే. భారత ఆటగాళ్లకు ఉత్సాహాన్నిచ్చేలా వారి అరుపులు, కేరింతలు, చప్పట్లతో స్టేడియం మారుమోగిపోయింది. ఈ కోలాహలమంతా పక్కనే ఉన్న హోటల్లోని ప్రెస్ బాక్స్ వరకూ వినబడింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ఇది అలానే కొనసాగింది. ఈ హడావుడి అంతా ధోనీ కోసమో, కోహ్లీ కోసమో కాదు... బుమ్రా బౌలింగ్‌కు రాగానే "బుమ్రా, బుమ్రా, బుమ్రా" అంటున్న అభిమానుల అరుపులతో అక్కడ మరేమీ వినబడలేదు.
"మాది గుజరాత్. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆడట్లేదని తెలిసి చాలా నిరుత్సాహపడ్డాం. కానీ బుమ్రా మాకు ఈరోజును ఓ గుర్తుండిపోయే రోజుగా మార్చేశాడు. రోహిత్, చాహల్ చాలా బాగా ఆడారు" అంటూ ఆనందంతో చెప్పారు దీపక్, ఆయన స్నేహితుల బృందం. వీరంతా ప్రపంచ కప్ మ్యాచ్‌లు చూడాలని అమెరికా నుంచి ఇక్కడకు వచ్చారు.

ఈ విజయం సాధికారికం కాదు
అయితే, భారత విజయం అభిమానులందరికీ సంతోషాన్నివ్వలేదు. విజయవాడ నుంచి వచ్చి లండన్ శివార్లలోని ఓ హోటల్లో పనిచేస్తున్నారు వరుణ్. భారత విజయంపై ఆయన స్పందన భిన్నంగా ఉంది.
"విజయంతో టోర్నీని ప్రారంభించడం బాగుంది. కానీ ఇది సాధికారిక విజయం కాదు. దక్షిణాఫ్రికా వరసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ మ్యాచ్‌కు ముందు వారి ప్రధాన బౌలర్లు ఇద్దరు అందుబాటులో లేకుండాపోయారు. ఇవి వారి విజయావకాశాలను కచ్చితంగా దెబ్బతీశాయి. మొదటి ఇన్నింగ్స్‌లో వారు ఇంకా మంచి స్కోరు సాధించి ఉంటే భారత్‌కు ఛేదన కష్టమై ఉండేది" అంటారు వరుణ్.
ధావన్ అనవసరంగా వికెట్ పారేసుకోవడం, కోహ్లీ పెద్ద స్కోరు సాధించలేకపోవడం కూడా ఆందోళన కలిగించే అంశాలే. కోహ్లీ తన ఫేవరెట్ ఆస్ట్రేలియాతో జరిగే తర్వాత మ్యాచ్‌లో ఈ లోటును పూడ్చుకుంటాడని చాలామంది ఆశిస్తున్నారు.

ఫుడ్ అదిరింది, ఇంటర్నెట్ మాత్రం లేదు
మ్యాచ్ భారత్ వైపు మొగ్గగానే స్టేడియంలో అందుబాటులో ఉన్న ఫుడ్ సెల్లర్స్‌పై దృష్టి పడింది. వారికి బ్రహ్మాండమైన వ్యాపారం జరిగింది. పనీర్ బటర్ మసాలా, ఆలూ టిక్కాల్లాంటి భారతీయ ఫుడ్ వెరైటీలు బాగా అమ్ముడుపోయాయి.
అక్కడ మాటలు వింటుంటే... "ఈ మధ్యాహ్నం భోజనంలో జీరా పులావ్ దొరికింది. రైతా, హల్వా కూడా ఫర్వాలేదు" అంటున్నారు ఓ మధ్యవయసు మహిళ.
వేల సంఖ్యలో చేరిన ప్రేక్షకులంతా ఇంటర్నెట్ వినియోగిస్తుండటంతో స్టేడియంలో నెట్ సౌకర్యం విషయంలో కొద్దిగా ఇబ్బంది ఎదురైంది. "త్రివేండ్రమ్‌లో ఉంటున్న నా సోదరుడితో స్కైప్ ద్వారా వీడియో కాల్ మాట్లడాదామనుకున్నా. కానీ ఇక్కడ నెట్ కనెక్టివిటీ దారుణంగా ఉంది" అని తన ఇబ్బందిని వివరించారు ఆనంద్. స్టేడియం బయట రోడ్డు పక్కన నిలబడి లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి జర్నలిస్టులు సైతం చాలా ఇబ్బంది పడ్డారు.

క్రికెట్ గెలిచింది
భారతీయులు తాము ఆరాధించే వారిని ఓ రోల్ మోడల్‌గా, అంతకన్నా ఎక్కువగానే చూస్తారు. గతంలో తమ అభిమాన రాజకీయ నాయకుల ప్రసంగాలను, మాటలను వినడానికి చాలామంది పొరుగుదేశాలకు వెళ్లడాన్ని మనం చూశాం. అలాగే ఆధ్యాత్మిక ప్రసంగాలకోసం విదేశీ పర్యటనలు చేసినవారినీ చూశాం. ఈ కాలంలో కూడా అభిమాన నటుడి సినిమా తమ దగ్గర విడుదల కాకపోతే పక్క ఊళ్లకు వెళ్లేవారు ఎందరో ఉన్నారు. క్రికెట్, క్రికెటర్లు దీనికి ఏమాత్ర తీసిపోరనిపిస్తోంది.
నాతో మాట్లాడినవారిలో చాలామంది యూరప్‌లోని చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ఇంకా భారత్, అమెరికా వంటి సుదూర దేశాల నుంచి కూడా వచ్చారు. కారణం ఏమై ఉండొచ్చు?
"మనం భాషలు వేరు, సంస్కృతులు వేరు, ఆహారం వేరు, కానీ మనందరిదీ ఒకటే మతం.. అదే క్రికెట్. ఎవరు ఆడినా, ఎవరు ఓడినా, గెలిచేది మాత్రం క్రికెట్" అంటున్నారు విశాల్.
"ఇక్కడ చూస్తుంటే, ఇదో మినీ భారత్‌లా అనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల ప్రజలనూ ఇక్కడ చూడొచ్చు. ఎప్పటికీ ఇలానే ఆనందంగా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది" అని జాసన్ అభిప్రాయపడ్డారు.
అభిమానుంలంతా స్టేడియం నుంచి వెళ్లిపోయిన రెండు గంటల తర్వాత మేమూ బయటపడ్డాం. కానీ మా చెవుల్లో ఇంకా "ఇండియా, ఇండియా, ఇండియా" అనే నినాదాలు మారుమోగుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి.
- ఇండియాVsదక్షిణాఫ్రికా: రోహిత్ శర్మ సెంచరీ, 6 వికెట్ల తేడాతో భారత్ విజయం
- ఇండియా ఆడే మొదటి మ్యాచ్ టోర్నీ స్వరూపమే మార్చేస్తుంది
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- వరల్డ్ కప్‌లో 10 జట్లే ఉండటానికి బీసీసీఐ అత్యాశే కారణమా
- లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే... ఆంధ్రప్రదేశ్‌లోనూ జోరుగా సాగు
- ప్రజలు ఏం చూసి ఓటు వేస్తారు..? పార్టీయా, ముఖ్యమంత్రి అభ్యర్థా, స్థానిక అభ్యర్థా... ఏడీఆర్ సర్వే ఏం చెబుతోంది...
- సౌదీ కథలు: 'ఆ నరకం భరించలేక ఏందన్నా తాగి సచ్చిపోదాం అనిపిస్తుంది సార్’
- గాంధీ హత్యకు పది రోజుల ముందు గాడ్సే, ఆప్టే ఏం చేశారు...
- భగత్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ పోలీస్ స్టేషన్లోనే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









