అసోం ఎన్ఆర్సీ వివాదం: సనావుల్లా భారత సైనికుడా, విదేశీయుడా

ఫొటో సోర్స్, Sanaullah family
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది మే 27వ తేదీ సాయంత్రం. 52ఏళ్ల మొహమ్మద్ సనావుల్లా అప్పుడే ఇంటికి వచ్చారు. 30ఏళ్లపాటు భారత సైన్యంలో పనిచేసి, 2017లో ఆయన రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బోర్డర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లను అడ్డుకోవడం ఆయన పని. కానీ సనావుల్లా భారతీయుడు కాదని ఎన్ఆర్సీ అంటోంది.
భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య భారతంలోకి గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న 'అక్రమ చొరబాట్లు' ఆందోళనకరంగా ఉన్నాయి.
సనావుల్లా ఇంటికి చేరుకున్నాక, పోలీస్ సూపరింటెండెంట్ నుంచి ఫోన్ వచ్చింది. నాలుగు రోజుల క్రితమే, 'సనావుల్లా విదేశీయుడు' అని ఫారినర్స్ ట్రిబ్యునల్ నిర్ధరించింది.
సనావుల్లా తరపు లాయర్, తన అల్లుడు అయిన షహీదుల్ ఇస్లామ్, గువాహటిలో సనావుల్లా అరెస్ట్ అయినపుడు అక్కడే ఉన్నారు.
ఆరోజు రాత్రి సనావుల్లా పోలీసు కస్టడీలో గడిపారు. మరుసటి రోజు ఆయన్ను, అక్రమంగా దేశంలోకి చొరబడిన విదేశీయులను ఉంచే నిర్బంధ కేంద్రానికి పంపారు.

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
ఆ కేంద్రంలో దాదాపు 900మంది విదేశీయులు ఉన్నారు. అసోంలో ఉన్న 6 నిర్బంధ కేంద్రాల్లో బెంగాలీ మాట్లాడే ముస్లింలే ఎక్కువగా ఉన్నారు.
గతేడాది వెలువడిన 'జాతీయ పౌరుల పట్టిక' (ఎన్ఆర్సీ) జాబితాలో అసోంలోని 40 లక్షల మంది పౌరులకు చోటు దక్కలేదు. ఈ పరిణామంతో బెంగాలీ మాట్లాడే ముస్లింల కోసం వేట మొదలైంది. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం ఖండించింది. కానీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది. బెంగాలీ మాట్లాడే కొందరు హిందువులు కూడా విదేశీయుల జాబితాలో ఉన్నారు.
బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం ప్రకటించిన 1971 మార్చి నెలలో తాము భారత్‌కు వచ్చినట్లు రుజువు చేసే ధృవీకరణ పత్రాలను సమర్పించేందుకు ప్రజలకు చాలా సమయం ఇచ్చారు.
కానీ వీరి భవిష్యత్తు గురించి ఒక స్పష్టత లేదు. వీరిని తిరిగి దేశంలోకి అనుమతించబోమంటూ ఇప్పటికే బంగ్లాదేశ్ కొన్ని సంకేతాలు చేసింది.
నిర్బంధ కేంద్రంలో 3 సంవత్సరాలు గడిపిన వారిని, కొన్ని షరతులతో విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఫొటో సోర్స్, Sanaullah Family
సనావుల్లా కోసం పోరాడేందుకు లాయర్ సిద్ధమవుతుండగా, సనావుల్లా కేసును దర్యాప్తు చేసిన చంద్రమల్ దాస్ అనే అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
2008-09 సంవత్సరాలకు చెందిన ఈ కేసు డాక్యుమెంట్లలో, సనావుల్లా పొరుగు గ్రామస్థులైన ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని చెబుతున్నారు. సనావుల్లా, తాను బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దగ్గరలోని కాసింపూర్ గ్రామం నుంచి భారత్‌కు వచ్చానని అంగీకరించినట్లు డాక్యుమెంట్లలో ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
సనావుల్లా కేసులో ఖురాన్ అలీ, అమ్జాద్ అలీ, సొబహాన్ అలీ సాక్షులు. కానీ, సనావుల్లాకు వ్యతిరేకంగా తాము ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని వీరు చెబుతున్నారు.
''సనావుల్లా మా కుటుంబ సభ్యుడి లాంటివాడు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఎందుకిస్తాను? చంద్రమల్ దాస్‌ను నేనెప్పుడూ కలవలేదు, ఆయన పేరు కూడా ఎప్పుడూ వినలేదు'' అని సనావుల్లా ఇంటికి కిలోమీటరు దూరంలో నివసించే రైతు సొబహాన్ అలీ బెంగాలీ భాషలో నాకు వివరించారు.
''2008-09 ప్రాంతంలో నేను నీటి కాలుష్య నియంత్రణ మండలిలో పని చేస్తూ ఉండేవాడిని. ఈ వాంగ్మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలీదు'' అని, 68 ఏళ్ల ఖురాన్ అలీ నాకు ఫోన్‌లో చెప్పారు.
నేరాన్ని అంగీకరిస్తూ సనావుల్లా వాంగ్మూలం ఇవ్వలేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
''సనావుల్లా కేసులో దర్యాప్తు అధికారి చంద్రమల్ దాస్, సనావుల్లాకు వ్యతిరేకంగా తాము సాక్ష్యం చెప్పినట్లు తమ పేర్లను వాడారని, తమ సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని ఈ ముగ్గురు వ్యక్తులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు'' అని సీనియర్ పోలీస్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ సైకియా అన్నారు.
చంద్రమల్ దాస్ గత ఏడాది రిటైర్ అయ్యారు. "రిపోర్టులన్నీ తారుమారయ్యాయి. తాను సనావుల్లా అనే వ్యక్తి గురించి దర్యాప్తు చేశాను, కానీ మొహమ్మద్ సనావుల్లా గురించి కాదు" అని ఎన్డీటీవీతో మాట్లాడుతూ అన్నారు.

ఫొటో సోర్స్, Shehnaz Akhtar
కానీ, 2008-09 మధ్య భారత సైన్యంలో పని చేసిన మొహమ్మద్ సనావుల్లా గురించి పోలీసులు దర్యాప్తు చేయడానికి గల కారణంలో స్పష్టత లేదు.
''2018లో వెలువడిన జాతీయ పౌరుల పట్టికలో మా నాన్న పేరు లేదు. అప్పుడే, తనపై జరుగుతున్న దర్యాప్తు గురించి మా నాన్నకు తెలిసింది'' అని మొహమ్మద్ సనావుల్లా కుమార్తె హెహనాజ్ అఖ్తర్ అన్నారు.
''ఆ తర్వాత మా నాన్న ఎన్ఆర్సీ ఆఫీసుకు వెళ్లి, గత పదేళ్లుగా తనపై దర్యాప్తు జరుగుతోందని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు.''
బోర్డర్ పోలీసులకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ''సుమోటో ఆధారంగా ఒక వ్యక్తి జాతీయత గురించి దర్యాప్తు చేసే అధికారం బోర్డర్ పోలీసులకు ఉంటుంది'' అని బోర్డర్ పోలీస్ మాజీ అధికారి ఒకరన్నారు.
అసోంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఒక బోర్డర్ పోలీస్ యూనిట్ ఉంటుంది.
''నిర్బంధ కేంద్రాల్లో వందలాదిమంది సనావుల్లాలు నలిగిపోతున్నారు'' అని గువాహటి కోర్టు సీనియర్ లాయర్ హఫీజ్ రషీద్ అహ్మద్ చౌధరి అన్నారు.
''దర్యాప్తు సంస్థల జాప్యం వల్ల వందలాదిమంది నిర్బంధ కేంద్రాల్లో గడుపుతున్నారు. కొందరు పోలీసు అధికారులకు తగిన అవగాహన లేదు. మరికొందరు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఫారిన్ ట్రిబ్యునళ్లలో తీర్పునిచ్చేవారికి అనుభవం చాలా తక్కువగా ఉంది. ట్రిబ్యునల్‌లో సభ్యత్వం కోసం 7సంవత్సరాల అనుభవం ఉంటే సరిపోతుంది'' అని చౌధరి అన్నారు.
జూన్ 7న మొహమ్మద్ సనావుల్లా కేసు విచారణకు రానుంది.
ఇవి కూడా చదవండి
- అసోం: అనుమానిత ఓటరు జాబితాలో కార్గిల్ యుద్ధ సైనికులు.. పౌరసత్వంపై ప్రశ్నలు
- కార్గిల్ యుద్ధంలో పోరాడిన మాజీ సైనికుడిపై 'విదేశీయుడు' అనే ముద్ర
- అభిప్రాయం: సమస్యల తుట్టెను మళ్లీ కదిపిన ఎన్ఆర్సీ
- ‘ఎన్ఆర్సీ కేవలం హిందూ-ముస్లిం సమస్య కాదు... అసలు రాజకీయం వేరే ఉంది’
- భానుడి భగభగలు.. తప్పించుకునేందుకు జనాల అగచాట్లు
- భగత్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ పోలీస్ స్టేషన్లోనే
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- ఎంపీలకు ప్రభుత్వ కార్లు ఉండవు.. అద్దె చెల్లిస్తేనే గవర్నమెంట్ క్వార్టర్
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








