శ్రీకాకుళం భవానీ: "అమ్మను, అన్నలను పన్నెండేళ్ళ తరువాత చూడగానే ఒక్కసారిగా కన్నీళ్లొచ్చేశాయి"

భవానీ
ఫొటో క్యాప్షన్, భవానీ
    • రచయిత, విజయ్ గజం, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

"అన్నయ్యలు గుర్తొచ్చినప్పుడు ఏడుపొచ్చింది. వాళ్ల కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏదోలే అనుకున్నాను. కానీ వాళ్ల గురించి తెలిసినప్పుడే నాకు ఏడుపు వచ్చేసింది. నాకు ఊరు ఏదీ గుర్తు లేదు. కానీ, అమ్మ, అన్నలను చూడగానే ఒక్కసారిగా కన్నీళ్లొచ్చేశాయి. నిజానికి నా వాళ్ల జాడ తెలిసినా నన్ను పంపడానికి జయమ్మ మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏడుస్తోంది. నాకు జాగ్రత్తలు చెబుతోంది''- పన్నెండేళ్ల తర్వాత కన్నతల్లిని కలిసిన భవానీ భావోద్వేగమిది.

శ్రీకాకుళం జిల్లా మెళియపుట్టి మండలంలోని చీపురుపల్లి ఆమె స్వగ్రామం. అన్నతో బడికెళ్లాలని పోయి 12 ఏళ్ల క్రితం తప్పిపోయిన భవానీ ఇప్పుడు తిరిగి రావడంతో ఆమె కుటుంబంతోపాటు ఊళ్లో సందడి నెలకొంది.

ఎలా తప్పిపోయింది?

కోడిపెంట్ల వరలక్ష్మి, మాధవరావు దంపతులు కూలి పనుల కోసం దాదాపు 13 ఏళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లారు. బోరబండలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారికి ముగ్గురు సంతానం- సంతోష్, గోపీ, భవానీ. అందరి కన్నా భవానీ చిన్న.

ఓ రోజు తన రెండో అన్న గోపితో కలిసి పాఠశాలకు వెళ్తానని భవానీ మారాం చేసింది. గోపి తీసుకు వెళ్లకపోవడంతో అతణ్ని అనుసరించి దారి తప్పిపోయింది. అక్కడే పనిచేసుకుంటున్న జయమ్మ అనే మహిళ భవానీని చేరదీసింది. పోలీసులను సంప్రదించినా, చుట్టుపక్కల వాళ్లను అడిగినా భవానీ వివరాలు తెలియలేదు.

ఇదే సమయంలో భాగ్యలక్ష్మి, మాధవరావు హైదరాబాద్‌లో అనేక చోట్ల భవానీ కోసం వెతికారు. ఆ రోజు ఏం జరిగిందో భవానీ తల్లి వరలక్ష్మి గుర్తుచేసుకున్నారు.

వరలక్ష్మి
ఫొటో క్యాప్షన్, భవానీ తల్లి వరలక్ష్మి

''12, 13 సంవత్సరాల క్రితం అనుకుంటాను. డిసెంబర్ 4న మేం బతకడానికి హైదరాబాద్ బోరబండ వెళ్లాం. పిల్లలను అక్కడే ప్రభుత్వ పాఠశాల్లో చేర్చాం. ఓ రోజు మా రెండో వాడు స్కూలు నుంచి ఇంటికి వచ్చాడు. వాడితో స్కూలుకు వెళ్తా అంటే వద్దన్నాం. వాళ్ల నాన్న రూపాయి ఇచ్చాడు. ఆ రూపాయి పట్టుకొని వాళ్ల అన్నను వెతుక్కుంటూ వెళ్లిపోయింది. పిల్లలు స్కూలు నుంచి వచ్చాక చెల్లేది అని అడిగితే మాకు తెలియదన్నారు. చాలా వెతికాం. కోఠి, అనాథాశ్రమాలు వెతికారు. పోలీసు స్టేషన్ లో కూడా వెతికాం. పాప వెళ్లిపోయాక వాళ్ల నాన్న తాగుడికి అలవాటు పడ్డాడు. తాగి బాధపడేవాడు. ఇక పాప రాదని భవానీ ఫొటోలు చించేశాం. అయినా మూడేళ్ల కిందటి వరకు కూడా వెతుకులాడాం" అని ఆమె వివరించారు.

ఇప్పుడు కూడా వరలక్ష్మి, మాధవరావు దంపతులు భవానీ తప్పిపోయిన బోరబండ బస్తీలోనే ఉంటున్నారు.

"ఖాళీగా ఉన్న ప్రతిసారీ భవానీ కోసం వెతుకుతూనే ఉండేవాళ్లం. గోకుల్ థియోటర్ దగ్గర, యాదగిరి గుట్టలోనూ వెతికాం. ఇక పాప దొరకదని ఆశ వదిలేసుకున్నాను. ఏ శనివారం మా పాప తప్పిపొయిందో అదే రోజు మళ్లీ నా దగ్గరకు వచ్చింది'' అని సంతోషం వ్యక్తంచేశారు వరలక్ష్మి.

తనను జయమ్మ దగ్గరకు తీసుకున్న సందర్భం భవానీకి నేటికీ గుర్తుంది.

భవానీ కుటుంబ సభ్యులు
ఫొటో క్యాప్షన్, భవానీ కుటుంబ సభ్యులు

''నాకు అప్పుడు నాలుగేళ్లు ఉంటాయేమో. అన్న ఇంటికి ఎందుకో వచ్చాడు. నేను స్కూలుకు వస్తానంటే వద్దన్నాడు. అన్నకు తెలియకుండా వెనుకే వెళ్లా. స్కూలు మర్చిపొయ్యా. అలా ఎక్కడికో వెళ్లిపోయాను. అప్పుడు వర్షం పడుతోంది. జీవరత్నం (భవానీని పెంచిన జయమ్మ భర్త) నన్ను చూసి ఎవరో అనుకున్నారు. వర్షం నుంచి తప్పించుకోవడానికి జయమ్మ వాళ్ల ఇంటి దగ్గర ఉండిపోయాను. ఆయన తిరిగి వచ్చే సరికి మళ్లీ అక్కడే ఉన్నాను. జయమ్మను పిలిచి లోపలికి తీసుకెళ్లారు. స్నానం చేయించి స్నాక్స్ పెట్టారు. ఉదయం సైకిల్ మీద కూర్చోపెట్టుకొని ఆ దగ్గర్లోని ఇళ్లకు తీసుకెళ్లి 'పాప మీ పాపేనా' అని అందరినీ అడిగారు. ఎవ్వరూ మాకు తెలియదని చెప్పడంతో వాళ్లే పెంచుకున్నారు'' అని భవానీ తెలిపింది.

అప్పటికే ఇద్దరు కుమార్తెలున్న జయమ్మ తనకు మూడో కూతురు వచ్చిందని తన కుమార్తెలతోపాటే చూసింది, చదివించింది.

జయమ్మది పేద కుటుంబం.

కాలక్రమంలో జయమ్మ, జీవరత్నం విజయవాడ చేరారు. భవానీ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నానమ్మ (జీవరత్నం తల్లి) వద్ద ఉంటూ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు చదువుకుంది.

వాళ్ల నానమ్మ తిట్టిందని విజయవాడ వచ్చింది భవానీ. తనకు చదువుపై ఆసక్తి లేదని జయమ్మకు చెప్పింది. ఇదే సమయంలో జయమ్మకు ఆరోగ్యం బాగోకపోవడంతో విజయవాడలో మోహన్ వంశీ అనే స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో పనికి కుదిర్చింది.

''అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ల ప్రస్తావన వచ్చేది. అమ్మ వాళ్ల గురించి అడిగేవారు. కానీ జయమ్మకు వాళ్ల పనులతోనే సరిపోయేది. నా మాటలు చిన్నపిల్ల ఏదో చెబుతోందిలే అనుకునేలా ఉండేవి. కానీ అన్నయ్యలు గుర్తొచ్చినప్పుడు మాత్రం ఏడుపొచ్చేది'' అని భవానీ చెప్పింది.

వీడియో క్యాప్షన్, 12 సంవత్సరాల తరువాత కుటుంబాన్ని కలుసుకున్న భవానీ

ఇద్దరు కూతుళ్లతో సమానంగా పెంచాను: జయమ్మ

తన ఇద్దరు కూతుళ్లతో సమానంగా భవానీని పెంచానని జయమ్మ (జయమణి) చెప్పారు.

"భవానీ హైదరాబాద్‌లో ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్ ద‌గ్గ‌ర‌లో నాకు క‌నిపించింది. ఎవ‌ర‌ని అడిగితే చెప్ప‌లేదు. అయినా పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశాను. త‌ల్లిదండ్రులు ఎవ‌రూ రాలేదు. చివ‌ర‌కు నా ఇద్ద‌రు కూతుళ్లతో స‌మానంగా పెంచాను. విజ‌య‌వాడ వ‌చ్చిన త‌ర్వాత కూడా భ‌వానీ చ‌దువుకోవ‌డానికి ఎలాంటి ఆటంకం లేకుండా చేశాను. ఇంట‌ర్ చ‌దివిన త‌ర్వాత ఏదైనా ప‌నిలో పెట్టాల‌ని అనుకుని తీసుకెళ్తే క‌న్న‌వారి ఆచూకీ దొరికింది. మొద‌ట అనుమానమొచ్చి డీఎన్ఏ పరీక్ష చేయాల‌ని అడిగాను. చివ‌ర‌కు ఇద్ద‌రు త‌ల్లుల ద‌గ్గ‌ర ఉంటాన‌ని భ‌వానీ చెప్ప‌డంతో సంతోషంగా పంపించాం" అని ఆమె తెలిపారు.

ఫేస్‌బుక్‌తో భవానీని కుటుంబం చెంతకు చేర్చిన మోహన్ వంశీ

భవానీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇతర వివరాలను మోహన్ వంశీ అడిగారు. తన వద్ద అవేవీ లేవని, తాను జయమ్మకు దొరికానని భవానీ చెప్పడంతో ఆమెకు గుర్తున్న విషయాలు, వారి అన్నల వివరాలు లాంటి సమాచారంతో మోహన్ వంశీ, ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో వెదికారు.

భవానీ అన్న సంతోష్ వివరాలు తెలుసుకొని ఫోన్ చేశారు మోహన్ వంశీ.

చీపురుపల్లి

సంతోష్ అప్పుడు 'నేవల్ డాక్‌యార్డ్' పరీక్ష రాయడానికి వెళ్తున్నారు. తన చెల్లి దొరికిందనే ఆనందాన్ని వెంటనే తల్లితో పంచుకున్నారు. వాట్సప్ వీడియో కాల్ చేశారు మోహన్ వంశీ.

''అందరూ అడుగుతుంటారు. అలాగే మోహన్ వంశీ కూడా అడుగుతున్నారు అనుకున్నాను. కానీ ఆయన అన్నయ్య గురించి కనుక్కున్నప్పుడు ఏడుపు వచ్చేసింది. కన్నీళ్లాగలేదు'' అని భవానీ చెప్పింది.

''అప్పుడు నాకు ఫేస్‌బుక్‌లో ఒక మెసేజ్ వచ్చింది. మోహన్ వంశీ నా గ్రామ వివరాలు, నా పేరు అడిగారు. ఆయనే చెల్లి వారి దగ్గర ఉందని చెప్పారు. పరీక్ష వదిలేసి, అమ్మ దగ్గరకు వచ్చి చెల్లి దొరికిందని చెప్పాను" అని సంతోష్ తెలిపారు. విజయవాడలో తమ చెల్లిని, అమ్మ చెప్పిన ఆనవాలు ప్రకారం గుర్తుపట్టామని, ఈ నెల 10న భవానీని చీపురుపల్లి తీసుకొచ్చామని వివరించారు.

''నిజానికి నాకు ఊరు ఏదీ గుర్తుకు లేదు. కానీ అమ్మ, అన్నలను చూడగానే నా వాళ్లే అని ఏడుపు వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇద్దరు తల్లులు. నిజానికి నా వాళ్ల జాడ తెలిసినా నన్ను పంపడానికి జయమ్మ ఒప్పుకోలేదు. డీఎన్‌ఏ పరీక్ష చేయించాలంది. కానీ తర్వాత ఒప్పుకొంది. ఇప్పటికీ రోజూ మాట్లాడుతుంది. ఫోన్ చేస్తే ఏడుస్తోంది. నాకు జాగ్రత్తలు చెబుతోంది. మా అక్కలు(జయమ్మ కుమార్తెలు) కూడా బాగా చూసుకునే వారు'' అని భవానీ చెప్పింది.

భవానీకి మూడేళ్ల వయసులో వేడిగా ఉన్న పాయసం కాలి మీద పడి గాయమైంది. ఈ గాయం మచ్చ తల్లి వరలక్ష్మికి గుర్తుంది. దీని ఆధారంగానే భవానీని గుర్తుపట్టారు.

వారిద్దరు చెప్పిన వివరాలు సరిపోలాయి: మోహన్ వంశీ

భవానీతో మాట్లాడినప్పుడు ఆమె చిన్నప్పటి సంగతి తెలిసిందని మోహన్ వంశీ చెప్పారు.

"నేను రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. ఆఫీసులో ఏదైనా ప‌ని ఉంటుందా అంటూ జ‌య‌మ్మ కూతురిని పంపించింది. ఆమెతో మాట్లాడిన‌ప్పుడు చిన్న‌ప్ప‌టి సంగ‌తి తెలిసింది. దాంతో ఫేస్ బుక్‌లో ప్ర‌య‌త్నం చేశాను. వాళ్ల అన్న‌య్య ఫోన్ చేశారు. అత‌ను చెప్పిన వివ‌రాలు, భ‌వానీ చెప్పిన వివ‌రాలు స‌రిపోవ‌డంతో వారికి వీడియో కాల్ చేశాం. భ‌వానీ మాట్లాడింది. సంతోష‌ప‌డింది. ఆ త‌ర్వాత వాళ్లు విజ‌య‌వాడ వ‌చ్చి పోలీసుల‌తో మాట్లాడిన త‌ర్వాత స‌మ‌స్య ప‌రిష్కారమైంది" అని ఆయన తెలిపారు.

కాలిన గాయం మచ్చ ఆధారంగా
ఫొటో క్యాప్షన్, కాలిన గాయం మచ్చ ఆధారంగా భవానీని కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు

డీఎన్‌ఏ పరీక్ష చేయించే ఆలోచనలో పోలీసులు

భవానీని చూడటానికి వరలక్ష్మి బంధువులు అందరూ చీపురుపల్లి వస్తున్నారు. ఊరు ఊరంతా వచ్చి భవానీని చూసింది.

తనకు పెంచిన తల్లి జయమ్మ కూడా కావాలని, తనను చూడకుండా జయమ్మ ఉండలేదని భవానీ చెబుతోంది. నెలలో కొన్ని రోజులు పెంచిన తల్లి దగ్గర, కొన్ని రోజులు కన్న తల్లి దగ్గర ఉంటానని అంటోంది.

విజయవాడ పోలీసులు భవానీకి డీఎన్ఏ పరీక్ష చేయించే ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ రాకుండా ఉండాలంటే భవానీకి ఈ పరీక్ష చేయించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని వారు భావిస్తున్నారు.

డీఎన్ఏ పరీక్షకు సిద్ధమని భవానీ అంటోంది. "నా మనసుకు సొంత అమ్మానాన్న అని తట్టింది కాబట్టే ఇక్కడకు వచ్చా. కొత్త వాళ్లు అందరూ వస్తున్నారు, వాళ్లను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అని ఆమె చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)