పర్వేజ్ ముషరఫ్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష

పర్వేజ్ ముషారఫ్

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్‌కు తీవ్ర దేశద్రోహం కేసులో ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానానికి చెందిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక బెంచ్ మరణశిక్ష విధించింది.

ప్రస్తుతం ముషరఫ్ పాకిస్తాన్‌లో లేరు. ఆయన దుబాయిలో వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ముషరఫ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి ఒక వీడియో విడుదల చేశారు. విచారణ కమిటీ తన వద్దకు వచ్చి ఆరోగ్య పరిస్థితిని చూడాలని ఆయన ఆ వీడియోలో కోరారు.

రాజ్యాంగ అవహేళన, తీవ్ర దేశద్రోహం కేసులపై మాట్లాడిన ఆయన "ఈ కేసు పూర్తిగా నిరాధారమైనది. దేశద్రోహం విషయం పక్కనపెట్టండి, నేను ఈ దేశానికి ఎంతో సేవలు అందించాను. యుద్ధంలో పోరాడాను. పదేళ్లు దేశానికి సేవ చేశాను" అని అన్నారు.

ముషరఫ్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ చరిత్రలో రాజ్యాంగ అవహేళన కేసులో విచారణను ఎదుర్కొన్న, మరణశిక్ష పడిన మొట్టమొదటి సైనిక నియంత ముషరఫ్.

జస్టిస్ వకార్ సేఠ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్‌లో ఇద్దరు మరణశిక్ష వేయాలనగా, ఒకరు మాత్రం విభేదించారు.

ఈ కేసు విచారణలో ముషరఫ్ ఒకేసారి కోర్టుకు హాజరయ్యారు.

కోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి ముషరఫ్‌కు నెల రోజుల సమయం ఉంటుంది. అయితే, ఇందుకోసం ఆయన కోర్టుకు స్వయంగా రావాల్సి ఉంటుంది.

ముషరఫ్

ఫొటో సోర్స్, Getty Images

నిజానికి, 2013 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అనంతరం మాజీ అధ్యక్షుడు అయిన పర్వేజ్ ముషరఫ్‌పై రాజ్యాంగాన్ని అవమానించారనే కేసు నమోదైంది.

ఈ మాజీ సైన్యాధ్యక్షుడికి వ్యతిరేకంగా మరో తీవ్ర దేశద్రోహం కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టుకు నలుగురు చీఫ్‌ జస్టిస్‌లను మార్చారు.

నిందితుడు పర్వేజ్ ముషరఫ్ తనపై ఆరోపణలు నమోదైనప్పుడు ఒక్కసారి మాత్రమే ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదు.

ఈలోపు, 2016 మార్చిలో అనారోగ్య కారణాలు చూపించి ముషరఫ్ విదేశాలకు వెళ్లారు.

అప్పుడు అధికారంలో ఉన్న ముస్లిం లీగ్(నూన్) ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్‌ నుంచి ఆయన పేరును తొలగించింది. ఆ తర్వాత ఆయన దేశం వదిలి వెళ్లడానికి అనుమతించింది.

వీడియో చిత్రం
ఫొటో క్యాప్షన్, వీడియో చిత్రం

ముషరఫ్ ఉత్థాన పతనాలు

జనరల్ పర్వేజ్ ముషరఫ్ 1999 అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటుతో పాకిస్తాన్‌లో అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు.

2001 జూన్‌లో ముషరఫ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు తనను తాను అధ్యక్షుడుగా ప్రకటించుకున్నారు.

2002 ఏప్రిల్‌లో ఒక వివాదాస్పద జనాభిప్రాయ సేకరణ ద్వారా ముషరఫ్ మరో ఐదేళ్లు అధ్యక్షుడుగా కొనాసాగారు.

2007 అక్టోబర్-నవంబర్‌లో ఆయన మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. కానీ ఆయన ఎన్నికలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత ముషరఫ్ దేశంలో అత్యవసర స్థితి విధించారు. చీఫ్ జస్టిస్ జస్టిస్ ఇఫ్తికార్ చౌధరి స్థానంలో కొత్త చీఫ్ జస్టిస్‌ను నియమించారు. ఆయన ముషరఫ్ ఎన్నికకు ఆమోదముద్ర వేశారు.

2008 ఆగస్టులో ముషరఫ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అధికారంలో ఉన్న రెండు ప్రముఖ పార్టీలు తనకు వ్యతిరేకంగా మహాభియోగ తీర్మానం తీసుకురావాలని ఏకాభిప్రాయానికి రావడంతో పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)