ఇంటర్నెట్ నిలిపివేత: పాకిస్తాన్, ఇథియోపియా కన్నా భారత్‌లోనే ఎక్కువ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షాదాబ్ నజ్మీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
"భారత పౌరసత్వ చట్టం సవరణ బిల్లు (సీఏబీ) ఆమోదంతో ఆందోళన చెందాల్సిందేమీ లేదని అస్సాంలోని నా సోదర సోదరీమణులకు భరోసా ఇస్తున్నా. మీ హక్కులు, విశిష్టమైన గుర్తింపు, అందమైన సంస్కృతిని ఎవరూ మీకు దూరం చేయలేరని వారికి భరోసా ఇస్తున్నా. మీ సంస్కృతి మరింతగా వికసిస్తుంది" అని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న ట్విటర్‌లో రాశారు. అస్సాం ప్రజలకు ఇక్కడో సమస్య ఉంది. అస్సాం ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ఈ మాటలు చెబుతున్న రోజు వారికి ఇంటర్నెట్టే లేదు.
ఈ నెల 11న రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర సహా ఈశాన్య భారతంలో దీనికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసనలు పెల్లుబికాయి. ఆందోళనల నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో ఇంటర్నెట్‌పై ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.
త్రిపుర ప్రభుత్వ అదనపు కార్యదర్శి డిసెంబరు 10 మధ్యాహ్నం 2 నుంచి 48 గంటలపాటు ఎస్‌ఎంఎస్ సేవలపైనా నిషేధం విధించారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ చర్య తీసుకొన్నారు.
సీఏబీపై నిరసనలు వార్తలు వెలువడిన తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్‌లోనూ డిసెంబరు 13 సాయంత్రం ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.
ఈ ఏడాది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 91 సందర్భాల్లో ఇంటర్నెట్‌పై ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.
సమాచారం తెలుసుకోవడంలో ఎవరికీ, ఎలాంటి హద్దుల్లేని డిజిటల్ భారతాన్ని కలగన్నాను.
ఇంటర్నెట్ షట్‌డౌన్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం- 2015లో ఇలా కేవలం 15 సార్లే జరిగింది. ఆ తర్వాతి ఏడాది ఈ సంఖ్య 31కి, 2017లో 79కి పెరిగింది.
2018లో ఇది ఏకంగా 134కి పెరిగింది. ఇది నిరుడు ప్రపంచంలోనే అత్యధికం. ఈ 134 సందర్భాల్లో అత్యధికంగా 65 సార్లు ఒక్క జమ్మూకశ్మీర్‌లోనే ఇంటర్నెట్ నిలిపేశారు. 2019లో 91 సందర్భాల్లో అత్యధికంగా 55 సార్లు జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు విధించారు.
'స్టేట్ ఆఫ్ ఇంటర్నెట్ షట్‌డౌన్స్' నివేదిక ప్రకారం- ఇంటర్నెట్ నిలిపివేతల్లో 2018లో భారత్ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ ఉంది. పాకిస్తాన్లో కేవలం 12 సందర్భాల్లోనే దీనిని నిలిపేశారు.
సీఏబీకి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలుకావడానికి ముందు, అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారతలోని వివిధ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.
భారత్, పాకిస్తాన్ తర్వాతి స్థానాల్లో ఇరాక్ (7 సందర్భాలు), యెమెన్ (7), ఇథియోపియా (6), బంగ్లాదేశ్ (5), రష్యా (2) ఉన్నాయి.

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
అత్యంత సుదీర్ఘ ఆంక్షలు జమ్మూకశ్మీర్‌లోనే
ఇంటర్నెట్ షట్‌డౌన్ ట్రాకర్ గణాంకాల ప్రకారం- అత్యంత సుదీర్ఘమైన ఆంక్షలు జమ్మూకశ్మీర్‌లో 2016లో అమలయ్యాయి. 2016లో జులై 8 నుంచి నవంబరు 19 వరకు అక్కడ ఇంటర్నెట్ నిలిపేశారు. 2016 జులై 8న బుర్హాన్ వనీని భారత భద్రతా బలగాలు చంపేసిన తర్వాత ఈ ఆంక్షలు విధించారు. మొబైల్ ఇంటర్నెట్‌ను పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 2016 నవంబరు 19న, ప్రిపెయిడ్ వాడకందార్లకు 2017 జనవరిలో పునరుద్ధరించారు.
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి తొలగింపు, రాష్ట్ర విభజన నేపథ్యంలో 2019 ఆగస్టు 4 నుంచి జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఇంటర్నెట్‌ను నిలిపేశారు. అక్కడ ఆంక్షలు విధించి వంద రోజుల పైనే అయ్యింది.
జమ్మూకశ్మీర్ తర్వాత మూడో అత్యంత సుదీర్ఘ నిలిపివేత పశ్చిమ బెంగాల్లో నమోదైంది. ప్రత్యేక గూర్ఖాల్యాండ్ ఉద్యమం నేపథ్యంలో 2017 జూన్ 18 నుంచి సెప్టెంబరు 25 వరకు డార్జిలింగ్‌లో ఇంటర్నెట్ ఆపేశారు. డార్జిలింగ్‌లో సుమారు వంద రోజులు ఆంక్షలు అమలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఏ ప్రాంతంలో ఎక్కువ?
2012 నుంచి మొత్తం 363 సందర్భాల్లో భారత్‌లో ఇంటర్నెట్ నిలిపేశారు. ఒక్క జమ్మూకశ్మీర్లోనే 180 సార్లు ఆంక్షలు విధించారు. 67 సందర్భాలతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. ఉత్తర్ ప్రదేశ్‌లో దాదాపు 18 సార్లు ఇంటర్నెట్ నిలిపేశారు.
జిల్లాలు, రాష్ట్రాల్లో ఇంటర్నెట్ నిలిపివేతకు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ) 1973, భారత టెలిగ్రాఫ్ చట్టం 1885, టెలికాం సేవల తాత్కాలిక నిలిపివేత (ప్రజా అత్యవసర పరిస్థితి లేదా ప్రజా భద్రత) నిబంధనలు-2017 ప్రభుత్వాలకు అధికారాలను దఖలు పరుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్: ఫోన్ కూడా లేని ఇంటి నుంచి గూగుల్ బాస్‌గా ఎదిగిన చెన్నై కుర్రాడు
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- గురజాడ అప్పారావు... ఆధునిక స్త్రీ ఆయన ప్రతినిధి
- జస్టిస్ సుదర్శన రెడ్డి: ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్కౌంటర్ చేయడం సాధ్యమేనా?
- వెంకీమామ సినిమా రివ్యూ: వెంకటేష్, నాగచైతన్య కలిసి హిట్టు కొట్టారా?
- మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- ఫేస్‌బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








