వెంకీమామ సినిమా రివ్యూ: వెంకటేష్, నాగచైతన్య కలిసి హిట్టు కొట్టారా?

ఫొటో సోర్స్, facebook/SureshProductions
- రచయిత, శతపత్ర మంజరి
- హోదా, బీబీసీ కోసం
నిజ జీవితంలో మామా అల్లుళ్లైన దగ్గుబాటి మామ విక్టరీ వెంకటేష్, అక్కినేని అల్లుడు నాగచైతన్యల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'వెంకీ మామ'. తెలుగు చిత్రసీమలో తమకంటూ స్థానాన్ని కల్పించుకున్న అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వారసుల కలయికలో రూపొంది.. వెంకటేష్ పుట్టినరోజునే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే..
కథ:
గోదావరి తీరంలో సాధారణ మోతుబరి అయిన వెంకటరత్నం నాయుడు (వెంకటేష్) తన తండ్రి రామ్ నారాయణ (నాజర్) జాతకాలు కలవడం లేదని వారిస్తున్నా వినిపించుకోకుండా తన అక్క ప్రేమ వివాహాన్ని ముందు నిలబడి జరిపిస్తాడు. వారి కుమారుడే కార్తీక్ (నాగచైతన్య).
అయితే రామ్ నారాయణ భయపడిన విధంగానే కార్తీక్ పుట్టిన ఏడాదికే కారు ప్రమాదంలో అక్క, బావ ఇద్దరూ చనిపోతారు. అప్పటి నుంచి మేనమామ అయిన వెంకటరత్నమే కార్తీక్ నాన్న తరపు బంధువులతో తగవుపడి మరీ మేనల్లుడికి అమ్మానాన్నలా మారి అతడిని పెంచుకుంటాడు.
ఆర్మీ ఉద్యోగం చేయాలని కలలు కన్న వెంకటరత్నం.. మేనల్లుడు కోసం ఉద్యోగానికి వెళ్లకుండా ఆగిపోతాడు. దాంతో అందరూ వెంకటరత్నాన్ని మిలటరీ నాయుడు అని అంటుంటారు.
తాను వివాహం చేసుకుంటే తనకొచ్చే భార్య, మేనల్లుడిని ఎక్కడ ప్రేమగా చూసుకోదో అన్న అనుమానంతో వెంకటరత్నం పెళ్లి చేసుకోవడమే మానేస్తాడు.
అదే విధంగా కార్తీక్ మేనమామ కోసం తన తండ్రి తరపు నుంచి వచ్చే కోట్ల సంపదను, తనతోపాటు లండన్ వచ్చేయాలని షరతు పెట్టిన గర్ల్‌ఫ్రెండ్‌ని వదులుకుంటాడు.
ఒకరి త్యాగాల గురించి మరొకరు తెలుసుకున్న మామ-అల్లుళ్లు.. వెంకటరత్నం కోసం వెన్నెల (పాయల్ రాజ్‌పుత్) అనే హిందీ టీచర్‌ని ఎంచుకుని వారిద్దరిని కలపడానికి కార్తీక్ ప్రయత్నిస్తుండగా.. కార్తీక్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ అయిన హారిక (రాశీఖన్నా)కు నచ్చజెప్పి ఇద్దరిని కలపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తుంటాడు.
ఇలా సరదాసరదాగా సాగిపోయే కథ అనుహ్యంగా మలుపు తిరిగి కార్తీక్... వెంకటరత్నం మామకు ఒక్కమాటైనా చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మిలటరీలో చేరతాడు.
పంచప్రాణాలుగా బతికే మామ-అల్లుళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి? రామ్ నారాయణ నమ్మే జాతకం ప్రభావం సినిమాపై ఎంత వరకు ఉంటుంది? ఎమ్మెల్యేగా పనిచేసే రావు రమేష్ విలనిజం సినిమాకు ఎంత వరకు ఉపయోగపడింది? లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

ఫొటో సోర్స్, facebook/SureshProductions
కథనం - విశ్లేషణ:
ఇరవై ఏళ్ళ నాటి కథకు తగ్గట్టుగానే ముత్యాల సుబ్బయ్య మార్క్ కమర్షియల్ డ్రామను మేళవించి.. కామెడీ కోసం కొన్ని ద్వంద్వార్థాలతో కూడుకున్న సన్నివేశాలు, అందాలు ఆరబోస్తూ... అవసరమైనప్పుడు ఆడిపాడి పోవడానికి ఇద్దరు హీరోయిన్లు, ఫైట్లు చేసుకోవడానికి, హీరోయిజం చూపుకోవడానికి ఒక ఆపోజిట్ బ్యాచ్ ఉండడం... ఇంతకంటే గొప్పగా రాయడానికి సినిమాలో ఏం కనపడలేదు.
జాతకాన్ని నమ్మొచ్చా? లేదా? అనే విషయం పక్కనపెడితే...అసలు దర్శకుడు ఏం చెప్పదల్చుకున్నాడనే విషయంలోనే గందరగోళం ఏర్పడింది.
'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలోలాగా 'ఆత్మ' అనే కాన్సెప్ట్ ఉంటేనయినా.. ఈ జాతకాల్లాంటి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఉండేదేమో.. పోనీ గతంలో పూర్తిగా జాతకమనే అంశంపైనే ఆధారపడి నిర్మించి.. విజయాన్ని దక్కించుకున్న 'మురారి' వంటి పకడ్బందీ లాజికల్ కథనమైనా ఉండి ఉంటే బాగుండేది.
కానీ ఇవేవీ కాకుండా ఓవైపు మిలటరీ-టెర్రరిస్టులు- సర్జికల్ స్ట్రైక్స్ లాంటి సీరియస్ ట్రాక్ చూపిస్తూ.. మరో వైపు అసలు ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేని జాతకాలు-జ్యోతిష్యం చూపించడం అస్సలు పొసగనట్లుగా అనిపిస్తుంది.
సినిమా మొదలవ్వగానే మిలటరీ వాతవరణం, వెంకటేష్ నటన, మాటల్లో ఇంటెన్సిటీ.. చూసి రామానాయుడు కలలుగన్నట్లుగానే వెంకీ-చైతూ కాంబినేషన్లో ఒక గొప్ప సినిమా చూడబోతున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది.
కానీ ఆ అనుభూతిని ఎంతో సేపు నిలబడనివ్వలేదు దర్శకుడు బాబీ. కామెడీ పేరిట చేసేదంతా జబర్దస్త్ స్కిట్స్ అని ఏమాత్రం కామన్ సెన్స్ పనిచేసే ప్రేక్షకుడైనా తేల్చేస్తాడు. అయితే ఆ జోనర్ కామెడీని ఎంజాయ్ చేసే ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకునే సినిమా తీస్తే అది వేరే విషయం. కానీ అభిరుచి కలిగిన ప్రేక్షకుడికైతే ఇది నచ్చదనే చెప్పవచ్చు.
వెనక్కి, ముందుకు చేసి, వెంకటేష్ కామెడీ టైమింగ్స్‌ని చక్కగా ఉపయోగించి ప్రథమార్థం ఫర్వాలేదనిపించినా.. ద్వితీయార్ధంలో కశ్మీర్ బ్యాక్‌డ్రాప్లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీరియస్ సీన్లు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి.
'యురి.. ది సర్జికల్ స్ట్రైక్స్' లాంటి సినిమాలపై అవగాహన ఉన్న ప్రేక్షకులకైతే కామెడీ పేరిట చేసిన అరాచకానికి ఏడుపు, ఎమోషనల్ సీన్స్ పండాల్సిన చోట నవ్వును తెప్పిస్తాయి.

ఫొటో సోర్స్, facebook/SureshProductions
దర్శకుడి కొత్తదనం ఏది?
కథను ఫ్లాష్ బ్యాక్‌ల రూపంలో కట్ చేసి ముందుకు - వెనక్కి చెప్పడం తప్పితే కథనం పరంగా దర్శకుడు బాబీ చేసిందేమీ లేదని చెప్పవచ్చు.
తెలుగు ప్రేక్షకులకు అలవాటైన అదే కథ, అదే కథనం, అవే కమర్షియల్ ఎలిమెంట్స్.. వెరసి ఎన్నోసార్లు చూసిన మసాలా సినిమాల్లాగే తయారైంది 'వెంకీ మామ'. కాగడా వేసి వెతికినా కొత్తదనం అన్నది కనిపించదు.
మామ వెంకటేష్
సినిమా చూస్తున్నంత సేపు 'ఎఫ్2' లాంటి విజయం తరువాత వెంకటేష్ పూర్తిగా డీగ్రేడ్ కామెడీపై ఆధారపడ్డాడా అన్న అనుమానం కలుగుతుంది.
వెంకటేష్ మార్క్ కామెడీ, ఎమోషన్స్, ఎనర్జిటిక్ డ్రామా పడకపోతే సినిమా ఈమాత్రం అంచనాలనైనా అందుకోలేకపోయేదనేది తిరుగులేని వాస్తవమే అయినప్పటికీ... వెంకటేష్ లాంటి సీనియర్ నటులు కూడా వెకిలితనాన్ని నమ్ముకోవడం బాధాకరంగా అనిపిస్తుంది.
అల్లుడు నాగచైతన్య
నాగచైతన్య నటనలో మునుపటి కంటే మెరుగుగ్గా కనిపించినప్పటికీ మామ వెంకీని బీట్ చేయలేకపోయాడనే చెప్పుకోవాలి. మామ-అల్లుళ్ళ కెమిస్ట్రీ బాగా కుదిరినా.. ఇద్దరూ స్క్రీన్ పంచుకున్న ప్రతి ఫ్రేమ్‌లో వెంకటేషే ఎక్కువ మార్కులు కొట్టేశాడు.
పాయల్-రాశీ
గత చిత్రాల్లో యూత్‌ను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు ఇరవై ఏళ్ళ కిందటి పాత్రనిచ్చారు. రాశీ మాత్రం కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో ఒకేలా నటించాలని కంకణం కట్టుకుందా? అన్న అనుమానం కలిగించేలా నటించింది.
నాజర్, చారుహాసన్, ప్రకాష్ రాజ్, గీత, రావురమేష్... లాంటి సీనియర్స్ ఎవరి పరిధిలో వాళ్ళు బాగానే నటించారు. హైపర్ ఆది, రోలర్ రఘు, చమ్మక్ చంద్ర, విద్యుల్లేఖ... కామెడీ పేరిట ఏడిపించారు. దాసరి ఆది చాలాకాలం తరువాత స్క్రీన్ మీద కనిపించాడు. ఇంతకంటే అతని గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.
తమన్ సంగీతంలో వెంకీ, పాయల్ మధ్య వచ్చే రెట్రో సాంగ్, కోకో కోలా పెప్సీ సాంగ్ బావుంది. నేపథ్య సంగీతం ఓకే. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం బావుంది. కశ్మీర్‌లో జరిగే క్లైమాక్స్ ఫైట్స్‌లో కెమెరా పనితనం గొప్పగా కనిపిస్తుంది. నిర్మాత దగ్గుబాటి సురేశ్ ఖర్చులకు ఎక్కడా వెనకాడలేదని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండి:
- షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ: ‘అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. నేను మళ్లీ వస్తా’
- కమలం జాతీయ పుష్పమా? పాస్‌పోర్టులపై కమలం ఎందుకు ముద్రిస్తున్నారు?
- స్పీడ్ రీడింగ్ కోర్సు: 5 నిమిషాల్లో లక్ష పదాలు చదవడం సాధ్యమేనా?
- బోరిస్ జాన్సన్: ఒక జర్నలిస్టు.. బ్రిటన్ ప్రధాని ఎలా అయ్యారు?
- మార్కెట్లోకి ఏడాది పాటు నిల్వ ఉండే కొత్త రకం ఆపిల్
- ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు
- రజినీకాంత్ జీవితంలో అరుదైన కోణాలు
- అజ్ఞాతంలో ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు.. గాలిస్తున్న లాహోర్ పోలీసులు
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








