బోరిస్ జాన్సన్: ఒక జర్నలిస్టు.. బ్రిటన్ ప్రధాని ఎలా అయ్యారు?

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో, ప్రధానిగా బోరిస్ జాన్సన్ కొనసాగనున్నారు.
దిగువ సభ 'హౌస్ ఆఫ్ కామన్స్'లో మొత్తం 650 స్థానాలు ఉన్నాయి. మెజారిటీ సాధించాలంటే కనీసం 326 స్థానాల్లో గెలవాలి. కన్జర్వేటివ్ పార్టీ 364 స్థానాలు సాధించింది.
మూడు దశాబ్దాల కాలంలో సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి ఇంత భారీ మెజార్టీ సాధించడం ఇదే తొలిసారి.
ఇప్పుడు పార్లమెంటులో ఎలాంటి అడ్డంకులు లేకుండా బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలం బోరిస్ సాధించారు.
కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా థెరిసా మే స్థానంలో బోరిస్ జాన్సన్ ఎన్నికైన తర్వాత 2019 జూలైలో ఆయన బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజల మద్దతు లేకుండానే జాన్సన్ ప్రధాని పీఠం ఎక్కారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శించారు.
తాజా ఎన్నికల ఫలితాలతో ఆ విమర్శలు పటాపంచలయ్యాయి. 1987లో మార్గరెట్ థాచర్ విజయం తర్వాత కన్జర్వేటివ్ పార్టీకి ఇంత భారీ మెజార్టీ రావడం ఇదే తొలిసారి.

ఫొటో సోర్స్, AFP
బోరిస్ జాన్సన్ ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేశారు, ఆ తరువాత రాజకీయల్లోకి ప్రవేశించారు.
కన్జర్వేటివ్ పార్టీకి నాయకుడిగా, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆ హోదాలో కూర్చునేందుకు ఆయనకు తగిన అర్హతలు లేవంటూ చాలా మంది విమర్శలు చేశారు.
ఆ మాటలన్నీ తప్పు అని తాజా ఎన్నికలతో ఆయన నిరూపించారు.

ఫొటో సోర్స్, Reuters
టర్కిష్ పూర్వీకులు
బోరిస్ జాన్సన్ తనను తాను 'యూరోసెప్టిక్' అని చెప్పుకుంటారు.
ఆయన పూర్వీకులది టర్కీ. తాత జర్నలిస్టు. తండ్రి దౌత్య అధికారి, తల్లి కళాకారిణి. వారి కుటుంబం న్యూయార్క్‌లో నివాసం ఉన్నప్పుడు 1964 జూన్ 19న బోరిస్ జాన్సన్ జన్మించారు. తర్వాత వారి కుటుంబం యూకేలో స్థిరపడింది.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రాచీన సాహిత్యం చదివారు. 'ఆక్స్‌ఫర్డ్ యూనియన్ డిబేటింగ్' సొసైటీకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
చదువు పూర్తయ్యాక జర్నలిజంలో కెరీర్ ప్రారంభించారు. మొదట ది టైమ్స్ పత్రికలో పనిచేశారు. అయితే, ఒకరి వ్యాఖ్యను వక్రీకరించారన్న ఆరోపణతో ఆ పత్రిక ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది.
కన్సర్వేటివ్ పార్టీకి అనుకూలమైన ది డైలీ టెలీగ్రాఫ్ పత్రికకు బ్రస్సెల్స్‌లో ప్రతినిధిగా చేరారు.

ఫొటో సోర్స్, Reuters
రచయితగా
ఆ తర్వాత యూకేలో టెలిగ్రాఫ్ పత్రిక కోసం ప్రత్యేక రచయితగా పనిచేశారు. ఆ తరువాత మితవాద అనుకూల మ్యాగజైన్ 'ది స్పెక్టేటర్' సంపాదకుడు అయ్యారు.
ఆ పత్రికలో ఆఫ్రికన్లు, ఒంటరి తల్లుల గురించి ఆయన వాడిన పదజాలంపై విమర్శలు వచ్చాయి. అయినా, ఆ పత్రిక సర్క్యులేషన్ బాగానే పెంచగలిగారు.
"హావ్ ఐ గాట్ న్యూస్ ఫర్ యు?" అనే ప్రముఖ బీబీసీ కార్యక్రమంలో క్రమం తప్పకుండా కనిపించడం ప్రారంభించిన తర్వాత అయన అనేక మందికి పరిచయమ్యారు. ఆ కార్యక్రమంలో ప్యానెలిస్టులు ఒక వారంలో వచ్చిన వార్తల మీద చమత్కారంతో కూడిన జోకులు వేసేందుకు ప్రయత్నిస్తారు.
ఆయన మాటలు, అభిప్రాయాలు విమర్శలకు కారణమవ్వడంతో పాటు, ఆయనను రాజకీయ ప్రముఖుడినీ చేశాయన్నది ఆయన జీవిత చరిత్ర రాసిన సోనియా పర్నెల్ సహా చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం.

ఫొటో సోర్స్, Getty Images
2001లో జాన్సన్ ఎంపీ అయ్యారు.
2007లో లండన్ మేయర్‌గా ఎన్నికయ్యారు.
జూలై 2010లో ప్రవేశపెట్టిన "బోరిస్ బైక్" అనే అద్దె సైకిళ్ల కార్యక్రమం ఆయన ప్రారంభించిన అత్యంత ప్రతిష్ఠాత్మక రవాణా కార్యక్రమాలలో ఒకటి.
అందరూ ఆయన్ను సింపుల్‌గా బోరిస్ అని పిలుస్తారు.
జాన్సన్ విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.
యువరాణి డయానా జ్ఞాపకార్థం థేమ్స్ నదిపై ప్రతిష్ఠాత్మక గార్డెన్ బ్రిడ్జి నిర్మించేందుకు చేసిన ప్రణాళికలను జాన్సన్ వారసుడు సాదిక్ ఖాన్ చేత రద్దు చేశారు. ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం దాదాపు 70 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిన తరువాత రద్దు చేయడం విమర్శలకు దారితీసింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రెగ్జిట్ ఛాంపియన్
2016లో ఈయూ నుంచి యూకే బయటకు వచ్చే అంశం (బ్రెగ్జిట్) పై రెఫరెండం ఓటింగ్ జరిగింది. అయితే, బ్రెగ్జిట్ మీద మొదట్లో బోరిస్ జాన్సన్ వైఖరి అస్పష్టంగా ఉండేది. యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలగాలనడాన్ని విభేదిస్తూ ఒక వార్తాపత్రికకు ఆయన కథనాన్ని కూడా రాశారు. బ్రిటన్ ఈయూలోనే ఉండాలని చెప్పారు.
కానీ, చివరికి సొంత పార్టీ (కన్జర్వేటివ్ పార్టీ) నాయకుడు కేమరూన్ నిర్ణయానికి వ్యతిరేకిస్తున్న బ్రెగ్జిట్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
రెఫరెండం పోల్స్‌లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఎక్కువ ఓట్లు రావడంతో కేమరూన్ రాజీనామా చేశారు. దాంతో, కన్జర్వేటివ్ పార్టీ అధినాయకుడి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బోరిస్ జాన్సన్ ప్రయత్నించారు.
కానీ, ఆయనకు బదులుగా థెరిసా మే విజేతగా నిలిచారు. బ్రెగ్జిట్ ఛాంపియన్‌గా పేరు తెచ్చుకున్న బోరిస్ జాన్సన్‌ను విదేశాంగ మంత్రిగా థెరిసా మే నియమించారు.

ఫొటో సోర్స్, Getty Images
థెరిసా మే స్థానంలో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యాక 2019 జూలైలో ఆయన బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
తాజా సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే 2020 జనవరి 21 నాటికి యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చేస్తుందని ఎన్నికల ప్రచారంలో బోరిస్ జాన్సన్ అన్నారు.
ఇప్పటికే ఈయూతో ఒప్పందానికి అంగీకారం కుదిరింది. ఇప్పుడు దిగువ సభలో కన్జర్వేటివ్ పార్టీ భారీ మెజార్టీ సాధించింది.
బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తిచేసి, వచ్చే నెలలో ఈయూ నుంచి బ్రిటన్‌ను బయటకు తీసుకు రావడానికి ప్రజలు తమకు శక్తిమంతమైన అధికారాన్ని ఇచ్చారని జాన్సన్ తాజాగా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ ప్రస్తావన ఎందుకు వస్తోంది... మతం ప్రధానాంశంగా ఎలా మారింది?
- బ్రెగ్జిట్: ఎందుకింత సంక్లిష్టం.. ఈయూ, బ్రిటన్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి
- బ్యాంకుల విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం
- పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనా? శరణార్థికి, చొరబాటుదారుడికి అమిత్ షా ఇచ్చిన నిర్వచనం సరైనదేనా?
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- తెలుగు భాష ఎప్పటిది? ద్రవిడ భాషలు ఎన్నాళ్ల నాటివి?
- ఉదారవాదానికి కాలం చెల్లిందా? పుతిన్ మాట నిజమేనా?
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...
- సనా మారిన్: పదిహేనేళ్లప్పుడు బేకరీలో ఉద్యోగి.. 34 ఏళ్లకు దేశ ప్రధాని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








