మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా? :అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రదీప్ సింగ్, సీనియర్ జర్నలిస్ట్
- హోదా, బీబీసీ కోసం
ఇప్పుడు అమిత్ షా ఒక మెరుస్తున్న నక్షత్రం. కానీ, ఆయన కష్టకాలం కూడా చూశారు. జైల్లో కూడా ఉన్నారు. గుజరాత్ వెళ్లకుండా కోర్టు ఆయనపై నిషేధం కూడా విధించింది. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పాలనలో వచ్చిన ఆరోపణల నుంచి నిర్దోషిగా నిలిచారు.
బీజేపీలో కూడా అమిత్ షాకు దూరంగా ఉండాలనుకున్న వారి సంఖ్య తక్కువేం లేదు.
పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో సుష్మా స్వరాజ్ అప్పటి పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వైపు చూస్తూ "అయినా, మనం ఇంకా ఎంతకాలం అమిత్ షాను భరించాలి" అన్నారు.
ఆ సమావేశంలోనే ఉన్న నరేంద్ర మోదీ గట్టిగా సమాధానం ఇచ్చారు. "ఏమంటున్నారు. పార్టీ కోసం అమిత్ భాగస్వామ్యాన్ని ఎలా మర్చిపోగలం" అన్నారు.
మోదీ, అరుణ్ జైట్లీ వైపు చూస్తూ "అరుణ్ గారూ మీరు జైల్లో ఉన్న అమిత్ షాను కలవండి పార్టీ తన వెంట ఉందని ఆయనకు అనిపించాలి" అన్నారు. ఆ తర్వాత ఆ అంశంపై సమావేశంలో ఎవరూ ఏం మాట్లాడలేదు.
అరుణ్ జైట్లీ, అమిత్ షా ఉన్న జైలుకు వెళ్లారు. ఆయన్ను కలిశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కోర్టు గుజరాత్ వెళ్లకుండా నిషేధం విధించడంతో షా దిల్లీ వచ్చేశారు.
దిల్లీలో అమిత్ షాకు పెద్దగా తెలిసినవారు లేరు. రాజకీయాలు తప్ప ఆయనకు వేరే ఇష్టాలు కూడా లేవు. దాంతో, అరుణ్ జైట్లీ రోజంతా కనీసం ఇద్దరు అమిత్ షాతో ఉండేలా పార్టీలోని ఏడెనిమిది యువ నేతలకు బాధ్యతలు అప్పగించారు.

ఫొటో సోర్స్, Getty Images
అపరిచిత రాజకీయ వీధుల్లో...
అమిత్ షా దిల్లీలో ఉన్నన్ని రోజులూ మధ్యాహ్న భోజనం అరుణ్ జైట్లీ ఇంట్లోనే చేసేవారు. అప్పుడు రాజ్‌నాథ్ స్థానంలో నితిన్ గడ్కరీ పార్టీ అధ్యక్షుడు అయ్యారు.
అమిత్ షా ఆయన్ను కలవడానికి వెళ్లినప్పుడు, రెండు మూడు గంటలపాటు బయటే వేచిచూడాల్సి వచ్చేది. కానీ అమిత్ ఎప్పుడూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దిల్లీలో ఉంటున్నప్పటికీ ఆయనకు దిల్లీ రాజకీయాల గురించి పెద్దగా తెలిసేది కాదు.
2013 రాగానే రాజ్‌నాథ్ సింగ్ మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. మోదీ చెప్పడంతో రాజ్‌నాథ్ అమిత్ షాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు.
ఆయనకు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు ఇచ్చినపుడు, "ఆ రాష్ట్రం గురించి ఆయనకేం తెలుసు" అని పార్టీలోనే ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతలతో జరిగిన తొలి సమావేశంలోనే ఆయనంటే ఏంటో అక్కడి నేతలకు అర్థమైంది.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
ఉత్తరప్రదేశ్‌లో విజయం
సమావేశం ప్రారంభం కాగానే స్థానిక నేతలందరూ ఏయే లోక్‌సభ స్థానాలు గెలుచుకోవచ్చో చెబుతున్నారు. అమిత్ షా వారితో "మీరు ఏ సీటూ గెలిపించాల్సిన పనిలేదు. ఎవరు ఎన్ని బూత్‌లు గెలిపించగలరో చెప్పండి. నాకు బూత్ గెలిపించే వాళ్లు కావాలి. సీట్లు గెలిపించే వారు కాదు" అన్నారు.
ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అమిత్ షాను జాతీయ వేదికపైకి తీసుకొచ్చాయి. ఆ విజయం ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేసింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఆయన పార్టీ మొత్తం కార్య సంస్కృతినే మార్చేశారు. పార్టీలో పదాధికారులకంటే బూత్ కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
రాష్ట్రాల బాధ్యతలు తీసుకునే జాతీయ ప్రధాన కార్యదర్శులు సాధారణంగా రాష్ట్ర రాజధానికి లేదంటే కొన్ని ప్రధాన నగరాలకు వెళ్లేవారు. పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడు బూత్ స్థాయి కార్యకర్తలను కలవడమే కాదు, వారి ఇంటికి భోజనానికి వెళ్లడం కూడా అందరూ చూశారు.
హైదరాబాద్‌లో అలాంటి ఒక పర్యటన నుంచి తిరిగొచ్చిన అమిత్ షాను "పార్టీ జాతీయ అధ్యక్షుడు బూత్ స్థాయి కార్యకర్త ఇంటికి వెళ్లడం సబబేనా? అని జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ప్రశ్నించారు.
దానికి అమిత్ షా ఠపీమని సమాధానం చెప్పారు. "పార్టీ రాజ్యాంగంలో జాతీయ అధ్యక్షుడు కార్యకర్తల ఇళ్లకు వెళ్లకూడదని ఏమైనా రాసుందా"? అన్నారు. అది పదాధికారులకు ఒక సందేశం, అది వారికి చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ పండితుల అంచనాలు తలకిందులు
అమిత్ షా ఏ రాష్ట్రంలో సమావేశాలకు వెళ్లినా అక్కడి స్థానిక నాయకులకు చెమటలు పట్టించేవారు. కారణం ఏంటంటే ఆ రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గం, కీలక కార్యకర్తలు, స్థానిక సమస్యల గురించి వారి దగ్గర కంటే షా దగ్గరే ఎక్కువ సమాచారం ఉండేది.
ఆ వివరాల కోసం ఆయనకు లాప్‌టాప్ లేదా నోట్‌బుక్ చూడాల్సిన అవసరమే ఉండేది కాదు ఎన్నికల సమయంలో ఆయన పార్టీ వ్యూహానికి భిన్నంగా తనదైన ఒక ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించేవారు. అందులో బూత్ కార్యకర్తల నుంచి కాల్ సెంటర్ల వరకూ అందరూ ఉండేవారు.
ఆ పని కోసం జనాలను ఎంపిక చేసేందుకు ఆయన రెండు విషయాలు దృష్టిలో పెట్టుకునేవారు. మొదటిది, వీలైనంత ఎక్కువ మంది యవతను పార్టీతో జోడించడం. రెండోది, ప్రతి ఒక్కరి సైద్ధాంతిక నిబద్ధత సందేహం లేకుండా ఉండడం.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. దాంతో అందరూ ఆ రాష్ట్రంలో బీజేపీ పనైపోయిందనే అనుకున్నారు.
పార్టీలో ఒక వర్గం అయితే ఆ కూటమిని ఎట్టి పరిస్థితుల్లో తెంపడానికి ప్రయత్నించాలని భావించారు. కానీ అమిత్ షా మాత్రం "పోరాటం, ప్రయత్నం స్థాయిని పెంచండి. పెద్దగా నష్టమేమీ జరగదు. సీటు గురించి ఆలోచనలు వదిలేయండి. 50 శాతం ఓట్లు లక్ష్యంగా పెట్టుకోండి" అన్నారు.
అలా, ఆయన రాజకీయ పండితుల అంచనా తప్పని నిరూపించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం ఆయనను హోమంత్రి పదవిలో కూర్చోపెట్టింది.
సాధారణంగా హోంమంత్రిని ప్రభుత్వంలో నంబర్ టూగా భావిస్తారు. దాంతో, రాజ్‌నాథ్ సింగ్‌ను ఆ పాత్ర నుంచి పక్కనపెట్టారా, ఆయన అవసరం లేదని మోదీ, షా ఇద్దరూ నిర్ణయించుకున్నారా?అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ వారసుడు
ఆగస్టు 5న రాజ్యసభలో జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయాలనే బిల్లు ప్రవేశపెట్టినపుడు, ప్రధానమంత్రి తన రాజకీయ వారసుడు ఎవరో మొత్తం దేశానికి చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఈ బిల్లును తీసుకురావడానికి సన్నాహాలు జరిగాయి. బిల్లు ముసాయిదా నుంచి పీడీపీతో బంధం ఎప్పుడు, ఎలా తెంచుకోవాలో వరకూ, మొత్తం వ్యూహాన్ని అరుణ్ జైట్లీ, అమిత్ షా, మోదీ రూపొందించారు.
జైట్లీ అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మూడు సార్లు పిలిపించి మొత్తం బిల్లు ముసాయిదా గురించి అర్థమయ్యేలా వివరించారు. సభలో ఏం మాట్లాడాలో కూడా చెప్పారు. కానీ అదే సమయంలో పుల్వామా దాడి జరిగింది. ప్రభుత్వం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించింది. దాంతో, ఆ బిల్లును పక్కన పెట్టారు.

ఫొటో సోర్స్, Pti
మోదీ 'ఆల్టర్ ఇగో'
ప్రధానమంత్రి రాజ్యాంగ సవరణ బిల్లు పగ్గాలు అమిత్ షాకు అప్పగించారు. స్వయంగా నేపథ్యంలో నిలిచారు.
పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి, అది ఆమోదం పొందినపుడు ప్రధానమంత్రి పార్లమెంటుకే రాలేదు. అమిత్ షా పరోక్షంగా సభలో పార్టీ నేత పాత్రను పోషించారు.
అమిత్ షా ఈ రెండు సందర్భాల్లో పార్టీని, దేశ ప్రజలను తన పార్లమెంటరీ నైపుణ్యాలతో ఆశ్చర్యపరిచారు. పార్లమెంటు ఉభయసభల్లో ఆయన ప్రదర్శన మొదటిసారి దేశానికి తెలిసింది.
మోదీ షా సంబంధాలను సాధారణ రాజకీయ పదబంధాలతో చెప్పడం కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే షా మోదీ 'ఆల్టర్ ఇగో'(ప్రత్యామ్నాయ ఆత్మ)
షా మీద మోదీకి అచంచల విశ్వాసం ఉంది. మోదీ సైగలను షా అర్థం చేసుకోగలరు రాజకీయాల్లో ఇలాంటి జోడీ కనిపించడం చాలా కష్టం.
గత ఆరు నెలల్లో అమిత్ షా జాతీయ వేదికపై ఎలా ఆవిర్భవించారో చూస్తుంటే.. మోదీ నీడ నుంచి బయటపడి ఆయన తన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని పరిచయం చేశారని చెప్పడంలో తప్పు లేదనే అనిపిస్తోంది..
( ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం)
ఇవి కూడా చదవండి:
- 'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం
- గ్రౌండ్ రిపోర్ట్: మియన్మార్‌లో హిందువులను హతమార్చిందెవరు?
- 'పౌరసత్వ బిల్లుపై అమెరికా కమిషన్ ప్రకటన అసంబద్ధం' - భారత విదేశాంగ శాఖ
- హ్యూమన్ రైట్స్ డే: మానవుడిగా మీ హక్కులు మీకు తెలుసా...
- భారతదేశ కొత్త 'ముస్లిం వ్యతిరేక' చట్టం మీద ఆందోళనలు ఎందుకు?
- రోహింజ్యాల మారణహోమం ఆరోపణలపై అంతర్జాతీయ కోర్టుకు ఆంగ్ సాన్ సూచీ
- బెంగళూరులో బొమ్మ పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ
- మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్ ప్రశ్న, సమాధానం ఏంటి?
- భారత 'యూనికార్న్'లు మరీ శక్తిమంతంగా ఎదుగుతున్నాయా?
- కశ్మీర్ వేర్పాటువాది మక్బూల్ భట్: ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








