పౌరసత్వ సవరణ బిల్లు: 'అమెరికా కమిషన్ ప్రకటన అసంబద్ధం, అనవసరం' - భారత విదేశాంగ శాఖ

అమెరికా కమిషన్ ప్రకటన

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్(USCIRF) చేసిన ప్రకటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ ప్రకటన అనవసరమని, ఆ ప్రకటన కచ్చితంగా కూడా లేదని భారత విదేశాంగ శాఖ చెప్పింది.

పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్ఆర్సీ ప్రక్రియ వల్ల, ఏ మతాన్ని విశ్వసించే వారైనా భారత పౌరుల పౌరసత్వాన్ని అంతం చేయడం జరగదని చెప్పింది.

అమెరికా కమిషన్ ప్రకటన

ఫొటో సోర్స్, Mea

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగ శాఖ ప్రకటన

"యుఎస్‌సిఐఆర్ఎఫ్ ఇలాంటి అంశంలో పక్షపాతంతో మాట్లాడడం విచారకరం. దీనిపై ఏదైనా చెప్పేందుకు దానికి అధికారం లేదు" అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు.

యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం(యుఎస్‌సిఐఆర్ఎఫ్) భారత పార్లమెంటులోని దిగువ సభలో పౌరసత్వ సంరక్షణ బిల్లు ఆమోదం పొందడం గురించి ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికా కమిషన్ ప్రకటన

ఫొటో సోర్స్, USCIRF

"ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే, భారత హోంమంత్రి అమిత్ షా, మిగతా ప్రముఖ నేతలపై ఆంక్షలు విధించడం గురించి అమెరికా ప్రభుత్వం ఆలోచించాలి" అని కమిషన్ ఒక పత్రికా ప్రకటనలో చెప్పింది.

సోమవారం అర్థరాత్రి లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు దీనిని రాజ్యసభలో ప్రవేశపెడతారు.

ఈ బిల్లులో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌కు చెందిన ఆరు మైనారిటీ సమాజాలకు ( హిందు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు, సిక్కులు) సంబంధించిన వారికి భారత పౌరసత్వం అందించాలనే ప్రతిపాదన ఉంది.

అమెరికా కమిషన్ ప్రకటన

ఫొటో సోర్స్, EPA

సమానత్వ హామీకి భంగకరమా...

"భారత సెక్యులర్ చరిత్రకు, ఎలాంటి మత వివక్ష లేకుండ సమానత్వం హామీని అందించే భారత రాజ్యాంగానికి ఈ బిల్లు వ్యతిరేకం" అని అమెరికా కమిషన్ అంటోంది.

కాబ్‌తో పాటు అసోంలో ఎన్ఆర్సీ ప్రక్రియ నడుస్తోంది. భారత హోంమంత్రి అమిత్ షా దీనిని భారతదేశం అంతటా అమలు చేయాలని భావిస్తున్నారు.

భారత పౌరసత్వం కోసం మతపరమైన పరీక్ష పాస్ కావాల్సి ఉంటుందని, దానివల్ల లక్షలాది ముస్లింల పౌరసత్వం ప్రమాదంలో పడుతుందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

2019 జనవరిలో మొదటిసారి పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. కానీ దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో రాజ్యసభలో ఓటింగుకు ముందే ప్రభుత్వం దీనిని వెనక్కు తీసుకుంది.

తర్వాత కొత్త ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ మోదీ ప్రభుత్వమే రావడంతో, బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అక్కడ దానికి ఆమోదం లభించింది.

చట్టం చేయడానికి ముందు ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడం తప్పనిసరి.

అమెరికా కమిషన్ ప్రకటన

లోక్‌సభలో బిల్లు ఆమోదం

సోమవారం అర్థరాత్రి వరకూ జరిగిన చర్చ తర్వాత భారత పార్లమెంటు దిగువ సభ లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. అందులో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి.

బిల్లు ఆమోదం పొందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశంసిస్తూ "ఇది భారత శతాబ్దాల పురాతన సంప్రదాయానికి, మానవ విలువలపై ఉన్న విశ్వాసానికి అనుగుణంగా ఉంది" అన్నారు.

కానీ లోక్‌సభలో చర్చ సమయంలో బిల్లును చించి పారేసిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ట్వీట్‌లో "అర్థరాత్రి మొత్తం ప్రపంచం నిద్రపోతున్నప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం పట్ల భారతదేశ ఆదర్శాలకు ఒకే దెబ్బతో ద్రోహం చేశారు" అన్నారు.

కాంగ్రెస్ సహా చాలా విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీనిని భారత రాజ్యాంగ భావనలకు వ్యతిరేకమని చెప్పాయి. ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)