'నాలుగు రోజుల్లో 10 ఉరితాళ్లు సిద్ధం' చేయాలంటూ బక్సర్ జైలుకు ఆదేశాలు: నిర్భయ దోషుల కోసమేనని ఊహాగానాలు - ప్రెస్ రివ్యూ

ఉరితాడు

ఫొటో సోర్స్, Getty Images

ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత నిర్భయ దోషులను త్వరలో ఉరితీయనున్నారా? ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగిపోతున్నాయా? ఇటీవలి పరిణామాలు అవునంటున్నాయని 'సాక్షి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఉరితాళ్లను తయారు చేసే కేంద్రంగా బీహార్‌లోని బక్సర్‌ జైలుకు పేరుంది. డిసెంబర్‌ 14వ తేదీకల్లా పది ఉరితాళ్లను సిద్ధంగా ఉంచాలని తమకు జైళ్లశాఖ డైరెక్టరేట్‌ నుంచి ఆదేశాలు వచ్చాయని, వీటిని ఎక్కడ ఉపయోగిస్తారో మాత్రం తెలియదని జైలు సూపరింటెండెంట్‌ విజయ్‌ అరోరా తెలిపారు.

ఒక్కో ఉరితాడు తయారీకి కనీసం మూడు రోజులు పడుతుందని, దాదాపు పెద్ద యంత్రాలేవీ వాడకుండా చేతులతోనే వీటిని తయారుచేస్తారని విజయ్‌ వివరించారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్‌ గురును ఉరితీసిన తాడు కూడా ఈ బక్సర్‌ జైలులోనే తయారైందని చెప్పారు.

2016-17లో పటియాలా జైలు నుంచి కూడా ఉరితాళ్లు కావాలంటూ తమకు ఆర్డర్లు వచ్చాయని, కాకపోతే వినియోగించేది ఎక్కడ అనేది మాత్రం తెలియలేదని విజయ్‌ చెప్పారు. చివరిసారిగా తాము సరఫరా చేసిన ఒక్కో ఉరితాడుకు రూ. 1,725 రూపాయలు ఖర్చయిందని, ఇనుము, ఇత్తడి ధరల్లో మార్పులను బట్టి ఉరితాడు ధర మారుతుందని తెలిపారు.

తాళ్లను పురివేసి ఉరితాడుగా మార్చేటపుడు ఈ లోహాల తీగలనూ వినియోగిస్తారు. మెడచుట్టూ ఉరి బిగుతుగా ఉండేందుకు ఉరితాడులోని ఈ లోహాల తీగలు సాయపడతాయని, దోషి శరీరం వేలాడేటప్పుడు ముడి విడిపోకుండా చేస్తాయని విజయ్‌ వివరించారు.

ఒక ఉరితాడు తయారుచేయడానికి సుమారు ఐదారుగురు పనివాళ్లు అవసరమవుతారని విజయ్‌ అరోరా తెలిపారు. ఉరితాడు తయారీ ప్రక్రియలో భాగంగా మొదటగా 152 పోగులను పెనవేసి ఒక చిన్నపాటి తాడుగా చేస్తారని విజయ్‌ చెప్పారు. ఇలాంటి తాళ్లను పురివేసి ఉరితాడును తయారుచేస్తారు.

మొత్తంగా చూస్తే ఒక ఉరితాడు తయారీలో దాదాపు 7000 పోగులను వినియోగిస్తారని తెలిపారు. ఈసారి నిర్దేశిత సమయంలోపే ఉరితాళ్లను సిద్ధం చేయగలమని, అనుభవజ్ఞులైన సిబ్బంది తగినంత మంది ఉన్నారని చెప్పారు. తాము తయారు చేసే ఉరితాళ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పాడైపోతాయని స్పష్టం చేశారు.

నిర్భయ దోషులను ఈ నెల పదహారున ఉరితీయనున్నారని ఒక వర్గం మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఉరితాడు తయారీ వార్తకు ప్రాధాన్యమేర్పడింది.

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు

హైదరాబాద్ యువతి దిశ అత్యాచారం, హత్య కేసులో.. ప్రధాన నిందితుడు మినహా మిగిలిన ముగ్గురు నిందితుల వయసు దాదాపు 20 సంవత్సరాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారని.. కానీ, నిందితుల్లో ఏ3, ఏ4 మైనర్లని చెప్తున్న కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. తమ బిడ్డలు మైనర్లంటూ ఏ3, ఏ4 కుటుంబ సభ్యులు ఎన్‌హెచ్‌ఆర్సీకి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు, వారి వయసు ధ్రువీకరణకు సంబంధించిన బోనఫైడ్‌ సర్టిఫికెట్లను కూడా సమర్పించినట్లు తెలుస్తోంది.

ఏ3, ఏ4 నిందితులు 18 ఏళ్లలోపే ఉన్నట్లు వారి బోనఫైడ్‌ సర్టిఫికెట్లు స్పష్టం చేస్తున్నాయి. ఏ3, ఏ4 నిందితులు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్లలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఆ పాఠశాల జారీ చేసిన బోనఫైడ్‌ సర్టిఫికెట్ల ప్రకారం.. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు నాటికి ఏ3 నిందితుడి వయసు 17 ఏళ్ల 3 నెలల 21 రోజులు కాగా, ఏ4 నిందితుడి వయసు 15 ఏళ్ల 7 నెలల 26 రోజులుగా ఉంది.

వీరిలో ఏ4 నిందితుడు 2014 జూలై నుంచి 2015 ఏప్రిల్‌ వరకు ఆరో తరగతి చదివాడని బోనఫైడ్‌ సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు. అతని పుట్టిన తేదీని 10.4.2004గా పేర్కొన్నారు. ఏ4 నిందితుడు కిడ్నీ వ్యాధి చికిత్స నిమిత్తం 2018 సెప్టెంబరు 18నే బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏ4కు ఇప్పటికే పెళ్లయింది. అతడి భార్య ప్రస్తుతం గర్భవతి.

మరొక నిందితుడు ఏ3 బోనఫైడ్‌ సర్టిఫికెట్‌లో అతను 2002 ఆగస్టు 15న జన్మించినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ సర్టిఫికెట్‌ను అతని తల్లిదండ్రులు సోమవారమే తీసుకున్నారు.

అత్యాచారం, హత్య తదితర తీవ్రమైన కేసుల్లో నిందితుల వయసును పాఠశాల మంజూరు చేసే బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదా ఎస్సెస్సీ సర్టిఫికెట్‌లో పేర్కొన్న పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. పంచాయతీ, మునిసిపల్‌ శాఖ జారీ చేసిన బర్త్‌ సర్టిఫికెట్‌ ప్రకారం వయసును లెక్కగడతారు.

ఎలాంటి సర్టిఫికెట్‌ లేకపోతే, కోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల్లోగా వయసు నిర్ధారణ పరీక్షలు చేయాలి. అయితే, నిందితుల వాగ్మూలం ప్రకారం వయసును ప్రాథమికంగా నమోదు చేసినట్లు ఓ పోలీస్‌ అధికారి చెప్పారు.

ఆధార్‌ కార్డుల్లో తేడా:

ఏ3, ఏ4 నిందితుల వయసు ఆధార్‌ కార్డుల్లో మాత్రం భిన్నంగా ఉంది. వారిద్దరూ 2012 డిసెంబరు 30న ఆధార్‌ కార్డులు పొందారు. అందులో వారు 2001లో జన్మించినట్లు ఉంది. వారిద్దరికీ ఓటరు గుర్తింపు కార్డులూ లేవని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఏ3, ఏ4 నిందితులకు ఓటు హక్కు సంబంధిత వివరాలు లేవు.

'దిశ' హత్యాచార నిందితుల వయసు విషయంపై ఆ కేసు దర్యాప్తు అధికారి, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ను 'ఆంధ్రజ్యోతి' ఫోన్‌లో సంప్రదించింది. నిందితుల వయసు విషయం తనకు తెలియదని ఆయన సమాధానం ఇచ్చారు.

లింగాపూర్ బాధితురాలి పేరు ‘సమత’గా మార్పు

కుమురం భీం జిల్లా ఎల్లాపటార్‌లో ఇటీవల జరిగిన హత్యాచారం కేసులో బాధిరాలి పేరును ‘సమత’గా మార్చినట్లు జిల్లా ఎస్‌పీ మల్లారెడ్డి ప్రకటించారని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. గత నెల 24వ తేదీన లింగాపూర్ మండలం ఎల్లాపటార్ వద్ద ముగ్గురు వ్యక్తులు ఓ మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హతమార్చారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి పేరు మార్చాలని పోలీసులు వారి కుటుంబ సభ్యులను సంప్రదించారు. పేరు మార్చటానికి తొలుత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. చివరికి పోలీసుల విజ్ఞప్తితో అంగీకరించటంతో ‘సమత’గా మార్చారు.

ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరోవైపు ‘సమత’ హత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ‘దిశ’ కంటే మూడు రోజుల ముందే ఈ ఘటన జరిగిందన్నారు. న్యాయం అందరికీ సమానంగా ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ, ఆమె భర్త ఆరేళ్లుగా జైనూరు మండలంలో ఉంటున్నారు. రోజూ తలో దిక్కుకు వెళ్లి వంట పాత్రలు, చిన్నపిల్లల ఆట వస్తువులు విక్రయిస్తూ జీవిస్తున్నారు.

గత నెల 24న ఉదయం పది గంటలకు భార్యను 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగాపూర్ మండలంలోని ఓ గ్రామంలో వదిలిపెట్టిన భర్త.. తను మరో గ్రామానికి వెళ్లాడు. సాయంత్రం మళ్లీ ఆయన జైనూరు వచ్చేసరికి ఇంటి వద్ద భార్య లేదు. ఆమె సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోమవారం ఉదయం పోలీసులు గాలించగా.. ఎల్లాపటార్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఆ మహిళ విగతజీవిగా కనిపించింది. మృతదేహం తీరును చూసిన పోలీసులు.. ఆమెపై నిందితులు సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారని భావించి విచారణ చేపట్టారు. అదే రోజు మధ్యాహ్నానికి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

యువతి

బీహార్‌లో లైంగికదాడి ప్రతిఘటించిన యువతిపై కిరోసిన్‌ పోసి నిప్పు..

ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావో బాధితురాలి చితి మంటలు ఆరకముందే.. బీహార్‌ ముజఫర్‌పూర్‌ జిల్లా నజిర్‌పుర్‌ ప్రాంతంలో మరో యువతిని ఓ కిరాతకుడు కిరోసిన్‌ పోసి నిప్పటించిన ఘటన వెలుగుచూసిందని.. లైంగికదాడిని ప్రతిఘటించినందుకు ఆమెపై దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఆ యువతికి 90 శాతం కాలిన గాయాలయ్యాయనీ, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నదని వైద్యులు తెలిపారు.

బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన పొరుగింటి వ్యక్తి రాజారారు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆమెపై రారు కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. వెంటనే బాధితురాలిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు.

'నిందితుడు రాజారారు మూడేండ్లుగా నా కూతురిని వేధిస్తున్నాడు. 12వ తరగతి తర్వాత నా కూతురు చదువు మాన్పించాను. ఇంట్లోనే ఉంచాను. అతడి వేధింపులపై పోలీసులకు పలుసార్లు ఫిర్యాదు చేశాం. అహయ్యాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు ఐదుసార్లు వెళ్ళాను. చూద్దాం.. చూద్దాం.. అంటూ పంపించివేశారు. శనివారం ఇంట్లోకి చొరబడి దారుణానికి ఒడిగట్టాడు. ఇక ఇప్పుడు పోలీసులు వచ్చి ఏం చేస్తారు..? నా కూతుర్ని నాకు ప్రాణాలతో ఇవ్వగలరా?’’ అంటూ ఆ తల్లి కన్నీటిపర్యంతమైంది.

పోలీసులు నిందితుడిపై కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌‌లో మరో సామూహిక అత్యాచారం: యూపీలోని ఔరాయ జిల్లాలో ఓ యువతిపై కొందరు దుండగులు కారులో తిప్పుతూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితుల ఫిర్యాదు ప్రకారం.. నవంబర్ 29న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై కోచింగ్‌కు వెళ్తున్న ఓ యువతిని.. నలుగురు దుండగులు అడ్డగించి బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. రెండు గంటల పాటు కారులో తిప్పుతూ, పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి, నిర్జన ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు.

అక్కడ్నుంచి ఇంటికెళ్లిన బాధితురాలు.. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు సమీపంలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. వీరి నిర్లక్ష్యాన్ని ఎస్‌హెచ్‌వోకు దృష్టికి తీసుకెళ్లగా.. అక్కడా నిరాశే ఎదురైంది. దీంతో జిల్లా ఎస్పీని సంప్రదించగా, ఎట్టకేలకు ఈ నెల 7న కేసు నమోదు చేశారు.

అయితే నిందితుల్లో ఓ జవాన్‌, ఆయన సోదరుడు సహా మరో ఇద్దరు ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని పలు కోణాల్లో విచారణ చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే కేసు నమోదు చేయడంలో జాప్యం జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)