ఉన్నావ్ రేప్ కేసు: 'ఒక్కొక్కరినీ చంపుకుంటూ వస్తామన్నారు' -బీబీసీ ఇంటర్వ్యూలో బాధితురాలి సోదరి

ఉన్నావ్ రేప్ కేసు
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌ చుట్టూ రోజురోజుకూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనపై న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రాయ్‌బరేలీలో ఆదివారం ప్రమాదానికి గురైంది. వారి కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది.

ఈ ఘటనలో బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్రగాయాల పాలయ్యారు. ఆమె దగ్గరి బంధువులు ఇద్దరు మృతిచెందారు.

ఈ ఘటనకు సంబంధించి సెంగర్ సహా 10 మందిపై హత్య కేసు నమోదైంది.

విచారణ బాధ్యతలను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

కుల్దీప్ సింగ్ సెంగర్ విషయమై విపక్షాలు బీజేపీపై విమర్శల దాడి చేస్తున్నాయి.

ఇప్పటికే సెంగర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, ఆ సస్పెన్షన్ అలాగే కొనసాగుతోందని యూపీ బీజేపీ వెల్లడించింది.

ఈ ఘటనల నేపథ్యంలో బాధితురాలి చిన్నాన్న కుమార్తె బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

మా సోదరి పరిస్థతి విషమంగా ఉంది. లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటున్నారు. ఆమె తలకు గాయమైంది.

అత్యాచార కేసుకు సంబంధించి ఏడాదిగా దర్యాప్తు సాగుతోంది. సీబీఐ ఒక నెలలో రెండు సార్లు మా సోదరి వాంగ్మూలాలు నమోదు చేసింది. సెంగర్ అంటే భయంతో మా సోదరి దిల్లీలో చిన్నాన్న ఇంట్లోనే ఉంటున్నారు. అక్కడైతే సీసీ కెమెరాలు ఉన్నాయి. భద్రత ఉంది.

మా చిన్నాన్నని కూడా తప్పుడు కేసులో ఇరికించారు. తొమ్మిది నెలల నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. అప్పటి నుంచి దిక్కుతోచకుండా తిరుగుతున్నాం. కేసు వాపసు తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

మా సోదరి ఉన్నవ్ వెళ్లినప్పుడు కూడా సెంగర్ మనుషులు బెదిరింపులకు దిగారు. 'మీ చిన్నాన్నని జైలుకు మాత్రమే పంపించాం. అంతం చేయడం మిగిలుంది. నిన్ను కూడా అంతం చేస్తాం' అని ఆమెను హెచ్చరించారు.

'కేసు వాపసు తీసుకోవడం లేదుగా. ధైర్యవంతురాలిని అనుకుంటున్నావు. ప్రాణాలు తీస్తే గానీ నువ్వు శాంతించవు' అంటూ బెదిరించారు. ఈ విషయాలన్నింటినీ మా చిన్నమ్మకి మా సోదరి చెప్పారు.

'వాంగ్మూలం ఇవ్వడం పూర్తయ్యాక తిరిగి ఇంటికి వచ్చేయ్. అక్కడ ఉండటం మంచిది కాదు' అని మా చిన్నమ్మ ఆమెతో అన్నారు. ఆదివారం చిన్నాన్నను కలిసి వచ్చేస్తానని మా సోదరి చెప్పారు. అంతలోనే ఆమెను అంతం చేసే ప్రయత్నం జరిగింది. మా అమ్మ, చిన్నమ్మ ఇద్దరూ చనిపోయారు.

ఉన్నావ్ రేప్ కేసు

ఫొటో సోర్స్, AFP

'మాకు న్యాయం జరగదు'

ఇది యాక్సిడెంట్ కాదు. కేసును సీబీఐకి అప్పగించడం పట్ల సంతృప్తితో ఉన్నా. కానీ, ఉన్నావ్ పోలీసుల తీరు అస్సలు బాగాలేదు.

కోర్టులోనూ అంతా అన్యాయమే. విచారణ మాటిమాటికి వాయిదా పడుతూ ఉంటుంది. ఎందుకంటే మా సోదరిని అంతం చేసేందుకు వారు ప్లాన్‌లు వేసుకుంటున్నారు.

ఉన్నావ్‌ అంటే నాకు ద్వేషం. అక్కడ మా సోదరికి గానీ, చిన్నాన్నకి గానీ న్యాయం జరగదు.

కుల్దీప్ మనుషులు పగలబడి నవ్వుతుంటారు. వాళ్ల వైపు పెద్ద ముఠా ఉంది. మా వైపు మేం ముగ్గురం మహిళలమే.

మా సోదరికి మొదట్లో భద్రత కల్పించారు. ఆ భద్రత సిబ్బంది ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు కుల్దీప్ మనుషులు వచ్చి బెదిరించేవారు.

మా చిన్నాన్న జైలుకు వెళ్లినప్పటి నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. మా చిన్నమ్మను కూడా రోడ్డుపై ఆపి బెదిరించేవారు.

బెదిరించేవాళ్లలో కొంతమందిని మా చిన్నమ్మ గుర్తుపడుతుంది. వాళ్ల గురించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిలకు లేఖలు రాసినా ఎలాంటి చర్యలూ లేవు.

సెంగర్‌

ఫొటో సోర్స్, FACEBOOK/IKULDEEPSENGAR

ఫొటో క్యాప్షన్, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌

'ఎక్కడికి వెళ్లినా, మమ్మల్ని చంపేస్తారు'

బీజేపీ నేత సాక్షి మహారాజ్ సెంగర్‌ను కలిసేందుకు వెళ్లారు. మా సోదరిని కలిసేందుకు మాత్రం రాలేదు. మా చిన్నాన్న లేకుండా మేం ఎక్కడ ఉండాలి? ఎక్కడికి వెళ్లినా, మమ్మల్ని చంపేస్తారు.

ప్రధాన మంత్రికి మా గోడు వినిపించేలా చేయండి. తప్పుడు కేసులు తీయించండి.

మా చిన్నాన్న మీద కొందరు కాల్పులు జరిపారు. అయినా వారిపై ఎలాంటి కేసులూ లేవు.

కుల్దీప్ సెంగర్ ఇలాగే ఉంటే మా కుటుంబం మిగలదు. ఆయన్ను అసలు ఇంకా పార్టీలోనే ఎందుకు ఉంచుకున్నారు?

కేవలం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వచ్చి, మమ్మల్ని ఓదార్చి వెళ్లారు.

వాళ్లు బెదిరింపులకు దిగినప్పుడే నేను పోలీసులకు ఫిర్యాదు చేశా. అప్పుడే వారిని అరెస్టు చేసి ఉంటే, ఇప్పుడు ఈ ఘటన జరిగి ఉండేది కాదు.

మిమ్మల్ని ఒక్కొక్కర్నీ చంపుతామని వాళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. మాకు భద్రత కల్పించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)