ఉన్నావ్ రేప్ కేసు: కులదీప్ సింగ్ సెంగర్‌ను బీజేపీ నుంచి ఎందుకు తప్పించడం లేదు?

ఫొటో సోర్స్, FACEBOOK/IKULDEEPSENGAR
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ వల్ల సరిగ్గా 15 నెలల తర్వాత మరోసారి కలకలం నెలకొంది.
కులదీప్ సెంగర్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన బాధితురాలి కారును రాయ్‌బరేలీలో జులై 28న ఒక ట్రక్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బాధితురాలి పిన్ని, అత్త చనిపోయారు. బాధితురాలి తరపు న్యాయవాది ప్రస్తుతం లైఫ్ సపోర్టుపై ఉన్నారు. ఈ కేసుపై విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి.
వీటిలో ముఖ్యంగా ఈ కేసులో బాధితురాలితోపాటు ఉన్న సెక్యూరిటీ ఆరోజు ఏమయ్యింది అనే ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. ప్రమాదం తర్వాత మీడియా ముందుకు వచ్చిన యూపీ డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ ఈ ప్రశ్నకు తగిన సమాధానం ఇవ్వలేదు, కానీ "చూస్తుంటే ఈ ప్రమాదం ఓవర్ స్పీడ్ వల్ల జరిగినట్లు అనిపిస్తోంది" అన్నారు.
సరిగ్గా 15 నెలల క్రితం కూడా కులదీప్ సింగ్ సెంగర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు అని అడిగితే ఓపీ సింగ్ ఇలాంటి సమాధానమే చెప్పారు. "గౌరవ ఎమ్మెల్యే గారిపై ఇప్పుడు వచ్చింది ఆరోపణలే కదా" అన్నారు.
ఈ రెండు పరిస్థితుల మధ్య కచ్చితంగా ఒక తేడా ఉంది. ఇప్పుడు కులదీప్ సింగ్ సెంగర్ జైల్లో ఉన్నారు. కానీ జైల్లో ఉండడం వల్ల ఆయనను పార్టీ తొలగించిందా, అంటే అలాంటిదేం జరగలేదు.
ప్రమాదంపై వస్తున్న అన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఒకటే. ఇంత జరిగినా కులదీప్ సింగ్ సెంగర్‌ను పార్టీలోనే ఎందుకు ఉంచారు?

ఫొటో సోర్స్, Getty Images
కులదీప్ సింగ్ సెంగర్ పార్టీలో ఎందుకున్నారు
దీని గురించి మీడియా పార్లమెంటు బయట బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషిని అడిగింది. దానిని తోసిపుచ్చినట్లు మాట్లాడిన ఆమె "బీజేపీ నేరస్థులకు సంరక్షణ ఇవ్వదు" అన్నారు.
ఇటీవల యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ కూడా "కులదీప్ సింగ్ సెంగర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఇప్పుడు కూడా సస్పెన్షన్లోనే ఉన్నారు" అన్నారు.
కానీ కులదీప్ సింగ్ సెంగర్ ఎప్పటివరకూ పార్టీలో ఉంటారు, ఇంకా పార్టీలో ఎందుకు ఉంచారనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. జాతీయ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉన్న ఒక సీనియర్ బీజేపీ నేత "అతడి వల్ల పార్టీకి పబ్లిగ్గా నష్టం జరిగిందనే మాట నిజమే, కానీ పార్టీ ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటుందో, వెల్లడిస్తాం" అన్నారు.
నిజానికి దీన్నంతా ఒక వరుసక్రమంలో చూస్తే కులదీప్ సింగ్ సెంగర్‌ను పార్టీ నుంచి బహిష్కరించే విషయంలో మొదట యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ నిస్సహాయ స్థితిలో పడినట్లు తెలుసుకోవడం కష్టం కాదు.
నిజానికి కులదీపి సింగ్ సెంగర్ బీజేపీ టికెట్‌పై ఉన్నావ్ జిల్లా బాంగరమౌ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యాక ఇది మొదలైంది. ఆయన గ్రామం మాఖీలోని ఒక మైనర్ బాలిక 2017 జూన్ 4న కులదీప్ సింగ్ సెంగర్ తనను రేప్ చేశారని ఆరోపించింది. కానీ ఎమ్మెల్యేపై ఎలాంటి కేసు నమోదు చేయించలేకపోయింది.
ఆ తర్వాత ఆమె తండ్రిని ఉన్నావ్ పోలీసులు ఆర్మ్స్ యాక్ట్‌లో అరెస్టు చేయడం, తర్వాత బాధితురాలు ముఖ్యమంత్రి నివాసం ముందు ఆత్మహత్యాయత్నం చేయడం, తర్వాత బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మృతిచెందడం జరిగింది. తర్వాత సోషల్ మీడియాలో కనిపించిన ఫొటోలు, వీడియోతో అధికారం మన చేతుల్లో ఉంటే సిస్టం ఎలా అపహాస్యం పాలవుతుందో అందరికీ తెలిసింది. అధికారం ముందు సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో చూపించింది.
నేరస్థులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చెప్పినా, రాష్ట్ర హోంమంత్రి, యూపీ డీజీపీ కులదీప్ సింగ్ సెంగర్‌ను శాసనసభ్యులు గారు , గౌరవ శాసన సభ్యులు అంటూ మాట్లాడారు. దీనిపై జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేసినా, ఇప్పుడు ఆయన దోషి కాదు, ఆయనపై ఆరోపణలు మాత్రమే చేశారని వెనకేసుకొచ్చారు.
కులదీప్ సింగ్ సెంగర్‌పై బాధితురాలి తండ్రి మృతి కేసులో చార్జిషీటు దాఖలైంది. తర్వాత ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదైంది. పోస్కో యాక్ట్ కింద కూడా ఈ కేసు నమోదైంది. తర్వాత సీబీఐ అతడిని వరసగా 16 గంటలు విచారించి, అరెస్టు చేసింది. అదే రోజు బాధితురాలి తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేశారని కులదీప్‌పై కేసు నమోదు చేసింది.
కానీ ఈ కేసుల్లో ఒక్క దానిలో కూడా ఇప్పటివరకూ ఎలాంటి విచారణ ప్రారంభించలేదు.

ఫొటో సోర్స్, AFP
ప్రభావానికి కారణం
తర్వాత బాధితురాలి కుటుంబానికి బెదిరింపులు వస్తున్న విషయం కూడా బయటపడింది. బాలిక చిన్నాన్నను ఒక పాత కేసులో జైల్లో పెట్టారు. ఉన్నావ్ కేసులో ఒక సాక్షి అనుమానాస్పద స్థితిలో మరణించారు.
ఇప్పుడు రాయ్‌బరేలీ ఘటన తర్వాత ఆయనపై మరోసారి హత్య, హత్యాయత్నంతోపాటు చాలా కేసులు నమోదయ్యాయి. కానీ పార్టీలో వాటి గురించి ఎలాంటి ప్రశ్నలూ రావడం లేదు.
కులదీప్ సింగ్ సెంగర్ సంప్రదాయం ప్రకారం బీజేపీలోని సుశిక్షిత నేత కాదు. ఆయన సంఘ్ శాఖల నుంచి రాలేదు, బీజేపీ విలువలపై ఆయనకు ఎలాంటి విశ్వాసం లేదు. ఆయన పూర్తిగా అవకాశవాద రాజకీయాలకు ముఖచిత్రం. అందుకే రాష్ట్రంలో తన హవాను కొనసాగిస్తున్నారు.
కులదీప్ మొదట 2002లో బీఎస్పీ ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2007, 2012లో ఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2017లో సరిగ్గా ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
గత 17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, 50 ఏళ్ల నుంచీ పంచాయతీ, సర్పంచ్ పదవుల్లో ఉన్న కులదీప్ సింగ్ సెంగర్ ఆ అధికార బలంతో తనపై అత్యాచార ఆరోపణలు వచ్చినా, ఒకసారి ముఖ్యమంత్రి సచివాలయంలో, ఇంకోసారి లక్నోలోని సీనియర్ పోలీస్ డీజీపీ నివాసం బయట నవ్వుతూ కనిపించారు. "వచ్చింది ఆరోపణలే, నేను పారిపోలేదుగా" అన్నారు.
దీనికి, రెండు బలమైన కారణాలు కనిపిస్తాయి. ఒకటి కులదీప్ సింగ్ సెంగర్, యోగీ ఆదిత్యనాథ్ సముదాయానికి చెందినవారు. దీనికి తోడు బాధితురాలు అత్యాచార కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ అధికారి నుంచి, జిల్లా పోలీస్ చీఫ్, రాష్ట్ర డీజీపీ వరకూ అందరూ ఠాకూర్లే కావడం యాదృచ్చికం.
రాష్ట్ర రాజకీయాలను నిశితంగా గమనించే సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా "యూపీ ముఖ్యమంత్రితోపాటు, డీజీపీ కూడా ఠాకూరే, కులదీప్ సింగ్ సెంగర్ కూడా అదే. అలాంటప్పుడు అన్నీ ఆయనకు అనుకూలంగా ఉంటాయని చెప్పడం కష్టం కాదు. ఎందుకంటే యూపీ రాజకీయాల్లో కులం కీలక పాత్ర పోషించడం ఎప్పుడూ కనిపిస్తుంటుంది" అన్నారు.
అంతే కాదు, ప్రస్తుతం బీజేపీకి రాష్ట్రంలో ఎక్కువ మద్దతు రాజ్‌పుత్ లేదా ఠాకూర్ల నుంచే లభిస్తోంది. అందుకే ఆ పార్టీ ఒక బలమైన ఠాకూర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా విచారణ చేయించి తమకు మద్దతిచ్చే వారికి కోపం తెప్పించే చిక్కుల్లో పడాలని అనుకోదు.
అయితే, యోగీ ఆదిత్యనాథ్ ప్రత్యర్థులుగా భావించే రాష్ట్ర మంత్రి సునీల్ బన్సల్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య గ్రూపు నుంచే కులదీప్ సింగ్ సెంగర్‌ను బీజేపీలోకి వచ్చారని భావిస్తారు.
సెంగర్‌కు తన ప్రాంతంపై చాలా మంచి పట్టుండడమే బీజేపీలోకి ఆయన్ను తీసుకురావడానికి కారణం.

ఫొటో సోర్స్, FACEBOOK/IKULDEEPSENGAR
సెంగర్ ప్రత్యేకత
కులదీప్ సింగ్ సెంగర్ 2002లో మొదటిసారి ఉన్నావ్ సదర్ నుంచి బీఎస్పీ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యారు. ఈ స్థానంలో బీఎస్పీ విజయం సాధించడం అదే మొదటిసారి.
తర్వాత బాంగర్‌మౌ నుంచి 2007లో ఎస్పీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2012లో భగవంతనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయ్యారు.
అంటే గత 17 ఏళ్లలో ఉన్నావ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాల నుంచీ మూడు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించారు. అందుకే జిల్లా అంతటా కులదీప్ సెంగర్‌కు మంచి పట్టుంది.
ఉన్నావ్ నుంచి ఎంపీగా ఎన్నికైన తర్వాత సాక్షి మహరాజ్ జైల్లో ఆయన్ను కలిసి ధన్యవాదాలు చెప్పడానికి కూడా ఇదే కారణం.
ఉన్నావ్ ఎంపీ స్థానంపై కులదీప్ సింగ్ ప్రభావం ఎంతగా ఉంటుందంటే "ఆయన ఎవరినైనా ఓడించగలరు, గెలిపించగలరు" అంటారు శరద్ గుప్తా చెప్పారు.
సెంగర్ కుటుంబంతో రాష్ట్రంలోని కొన్ని ఠాకూర్ రాజకీయ కుటుంబాలతో బంధుత్వాలు కూడా ఉన్నాయి. దాంతో వేరే పార్టీల్లో కూడా ఆయన బంధువులు ఉన్నారు.
నిజానికి కులదీప్ సింగ్ తన ప్రాంతంలో చాలా పాపులర్ నేత. అందుకే పార్టీ హై కమాండ్ గురించి ఆయన పెద్దగా పట్టించుకోరు అని శరద్ గుప్తా చెప్పారు.
"రాజకీయాలతోపాటూ కాంట్రాక్టులపై కూడా పట్టు సాధించిన కులదీప్ సింగ్ సెంగర్ తను సంపాదించిన డబ్బును, నియోజకవర్గంలో ప్రజలకు స్వయంగా పంచుతారు. తన ప్రాంతంలో ఏదైనా కార్యక్రమాలు జరిగితే అక్కడికి స్వయంగా వెళ్లి వారికి ఏదో ఒక సాయం చేసేవారు" అని గుప్తా చెప్పారు.
కానీ బీజేపీకి ఆయన అంత ముఖ్యం ఎందుకయ్యారు అనే ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం ఇచ్చిన ఒక బీజేపీ నేత "ఆయన జైల్లో ఉన్నారు. సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. పార్టీ నుంచి తొలగించడానికి ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు కదా" అన్నారు.
కానీ నిపుణులు మాత్రం కులదీప్ సింగ్ సెంగర్ వల్ల, "బేటీ పఢావో, బేటీ బచావో" నినాదంతో ముందుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ ఇమేజ్‌కు దేమంతటా నష్టం జరుగుతోందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- "యోగి ఆదిత్యనాథ్‌ని యూపీ సీఎం చేస్తామంటే అంతా వద్దన్నారు, కానీ..."
- పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కినందుకు దళితుల సామాజిక బహిష్కరణ
- అనంతపురం: ఆలయంలో అడుగుపెట్టారని దళిత కుటుంబానికి జరిమానా
- చంద్రయాన్-2 భూకక్ష్యలోకి చేరింది.. దీనివల్ల భారత్‌కు ఏం లభిస్తుంది?
- కర్ణాటక ముఖ్యమంత్రి: అడ్వాణీకి వర్తించిన రూల్ యడ్యూరప్పకు వర్తించదా
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








