చంద్రయాన్ 2: నేడు ఆర్బిటర్ నుంచి విడిపోనున్న ల్యాండర్

ఫొటో సోర్స్, iSRO
చంద్రయాన్ 2 ప్రయాణంలో నేడు కీలక ఘట్టం. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్యలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోనుంది. ఇంతకీ చంద్రయాన్ 2 ద్వారా భారత్ సాధించేదేమిటి? చంద్రయాన్ 2 ల్యాండింగ్ దక్షిణ దృవంపైనే ఎందుకు చేస్తున్నారు?
శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2.. చందమామపై అడుగుపెట్టాలనే భారతీయుల కలలను కూడా మోసుకెళ్లింది.
చంద్రుడిపై భారత్‌కు ఇది రెండో మిషన్. జాబిల్లిపై అపోలో 11 వెళ్లి 50 యేళ్లైన సంబరాలు జరుపుకుటుంన్న సమయంలోనే భారత్ చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించింది.
భారత్ చంద్రయాన్-2ను ఇప్పటివరకూ ఎవరూ చేరని దక్షిణ ధ్రువానికి పంపింది. ఇది సెప్టంబర్ మొదటి వారంలో చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం చంద్రుడిపై ఉన్నఈ ప్రాంతం చాలా క్లిష్టమైనది. ఇక్కడ నీళ్లు, శిలాజాల ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ముంబైలో ఉన్న థింక్ ట్యాంక్ గేట్‌వే హౌస్‌లో 'స్పేస్ అండ్ ఓషన్ స్టడీస్ ప్రోగ్రాం'కు చెందిన రీసెర్చర్ చైతన్య గిరి వాషింగ్టన్ పోస్ట్‌తో "చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొట్టమొదటిసారి ఒక అంతరిక్షనౌక దిగుతోంది. ఈ మిషన్‌లో ల్యాండర్‌కు విక్రం అని, రోవర్‌కు ప్రజ్ఞాన్ అని పేరు పెట్టారు. భారత అంతరిక్ష కార్యక్రమం మొదటి చీఫ్ పేరున విక్రమ్ అని పెట్టారు" అన్నారు.

ఫొటో సోర్స్, iSro
రోవర్‌ను తీసుకెళ్లిన ల్యాండర్
ల్యాండర్ అంటే దాని ద్వారా చంద్రుడిపైకి చేరే వాహనం. రోవర్ అంటే ఆ వాహనం నుంచి చంద్రుడి పైకి చేరుకుని, అక్కడ అన్వేషిస్తుంది. అంటే ల్యాండర్ రోవర్‌ను తీసుకుని చంద్రుడిపై దిగుతుంది.
చంద్రయాన్-2 విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశించింది. ఇది అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగితే చంద్రుడి గురించి మరింత బాగా తెలుసుకోగలం అని ఇస్రో చెబుతోంది.
ఎన్డీటీవీతో మాట్లాడిన ఇస్రో ఛైర్మన్ శివన్ "విక్రమ్ ల్యాండ్ అయ్యే సమయంలో మొదటి 15 నిమిషాలు చాలా క్లిష్టంగా ఉంటుందని, ఇప్పటివరకూ ఇంత క్లిష్టమైన మిషన్‌ను ఇస్రో ఎప్పుడూ చేయలేదని" అన్నారు.
భారత్ 2008లో చంద్రయాన్-1 లాంచ్ చేసింది. 1960వ దశకంలో అంతరిక్ష కార్యక్రమం ప్రారంభించింది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఎజెండాలో దీనికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు.
2022 నాటికి భారత్ చంద్రుడిపై వ్యోమగామిని పంపాలనే ప్రణాళికతో భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అంతరిక్ష శాస్త్రంపై పుస్తకం రాసిన మార్క్ విటింగ్టన్ సీఎన్ఎన్‌తో "భారత్ నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. దీనివల్ల అది అంతరిక్షంలో ఒక మహా శక్తిగా ఆవిర్భవిస్తుంది. అంతరిక్షంలో చాలా కార్యక్రమాలను అభివృద్ధి చేయాల్సిన సమయం వచ్చిందని భారత్‌కు ఇప్పుడు అర్థమైంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2022లో చంద్రుడిపైకి ఇండియన్
భారత్ చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు చేస్తున్న తొలి ప్రయత్నం చంద్రయాన్-2. ఇంతకు ముందు రష్యా, అమెరికా, చైనా ఈ ప్రయోగాలు చేశాయి. నాలుగు టన్నుల బరువున్న ఈ అంతరిక్షయాత్రలో ఒక లూనార్ ఆర్బిటర్, ఒక ల్యాండర్, ఒక రోవర్ ఉన్నాయి.
చంద్రుడిపై ప్రపంచవ్యాప్తంగా అన్వేషణలు కొనసాగుతున్నాయి. చంద్రయాన్-2 తర్వాత భారత్ 2022లో చంద్రుడిపై వ్యోమగామిని పంపించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.
"మేం చంద్రుడిపై ఉన్న బండరాళ్లను పరిశీలించి, వాటిలో మెగ్నీషియం, కాల్షియం, లోహాలు లాంటివి ఉన్నాయేమో అన్వేషించడానికి ప్రయత్నిస్తాం. దానితోపాటు అక్కడ నీళ్లున్నాయా అనే సంకేతాలు కూడా వెతుకుతాం. చంద్రుడి బయటి ఉపరితలాన్ని కూడా పరిశీలిస్తాం" అని ఇస్రో చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
చంద్రుడిపై అన్వేషణ
చంద్రయాన్-2లో భాగమైన ఆర్బిటర్, ల్యాండర్ భూమిని నేరుగా సంప్రదిస్తాయి. కానీ రోవర్ అలా చేయలేదు. ఇది పదేళ్లలో చంద్రుడిపైకి పంపించిన రెండో మిషన్.
చంద్రయాన్-1 భారత మొట్టమొదటి మిషన్. ఇది దాదాపు ఏడాది(2008 అక్టోబర్ నుంచి 2009 సెప్టంబర్) పాటు నడిచింది. దీనిని కూడా 2008 అక్టోబర్‌లో షార్ నుంచే ప్రయోగించారు.
ఇది 2008 నవంబర్ 8న చంద్రుడిపైకి వెళ్లింది. ఈ ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలో 312 రోజుల పాటు తిరిగింది. అప్పటి ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ చంద్రయాన్ మిషన్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు.
చంద్రయాన్-1 అన్వేషణలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రయాన్-2ను పంపించారు. చంద్రయాన్-1 అన్వేషించిన నీటి అణువుల ఆధారాల తర్వాత చంద్రుడి ఉపరితలంపై, దాని దిగువన, బయటి వాతావరణంలో ఉన్న నీటి అణువుల పరిధిని ఇది పరిశోధించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, EPA
దక్షిణ ధ్రువంపైనే ల్యాండింగ్ ఎందుకు
చంద్రయాన్-2ను దక్షిణ ధ్రువంపైనే ఎందుకు ల్యాండ్ చేస్తున్నారు, చంద్రుడిపై అన్వేషణకు దానికి అంత ప్రాధాన్యం ఎందుకిస్తున్నారని ఎవరికైనా సందేహం రావచ్చు.
నిజానికి, చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇప్పటివరకూ ఎవరూ పరిశోధనలు చేయలేదు. అందుకే ఇక్కడ ఏదైనా కొత్త విషయాలు గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం నీడలో ఉంటుంది. సూర్యుడి కిరణాలు పడకపోవడం వల్ల ఇక్కడ ఎక్కువగా శీతలంగా ఉంటుంది.
ఎప్పుడూ నీడలో ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో నీళ్లు, ఖనిజాలు ఉండే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇటీవల కొన్ని ఆర్బిట్ మిషన్లలో అది నిరూపితం కూడా అయ్యింది.
నీళ్లున్న చంద్రుడి దక్షిణ ధ్రువం భవిష్యత్తులో మనుషులు ఉండడానికి అనువుగా ఉండచ్చు. ఇక్కడ ఉపరితలంపై పరిశోధన వల్ల చంద్రుడి నిర్మాణం, లోతుల గురించి తెలుసుకోడానికి వీలవుతుంది. దానితోపాటూ భవిష్యత్ మిషన్లలో దీనిని వనరులుగా కూడా ఉపయోగించుకోవచ్చా అనేది కూడా తెలుసుకోగలం.
ఇవి కూడా చదవండి:
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- కర్ణాటక అసెంబ్లీ: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. కుమారస్వామి రాజీనామాను ఆమోదించిన గవర్నర్
- బోరిస్ జాన్సన్: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి
- చంద్రయాన్ మిషన్ 2- చంద్రుని మీదకు ఉపగ్రహ యాత్ర ఎలా సాగుతుంది
- ఇంట్లో ప్రవేశించి మంచమెక్కి పడుకున్న పులి
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








