కెఫే కాఫీ డే సిద్ధార్థ: సీసీడీ అంటే కాఫీ మాత్రమే కాదు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
స్టైలిష్‌గా డిజైన్ చేసిన కెఫేలలో కాఫీని విక్రయించటం ద్వారా.. టీ తాగే భారతదేశపు ప్రజలను ముఖ్యంగా యువతను కాఫీ ప్రియులుగా మార్చారాయన. ఆయన పేరు వీజీ సిద్ధార్థ. 59 ఏళ్ల వయసులో మంగళవారం నాడు మంగళూరులోని నేత్రావతి నది వంతెన సమీపంలో కనిపించకుండా పోయారు.
ప్రధానంగా దక్షిణ భారత రెస్టారెంట్లలో విక్రయించే కాఫీతో పోలిస్తే.. కెఫే కాఫీ డే (సీసీడీ)ని భారతదేశంలోని అతి పెద్ద బ్రాండ్లలో ఒకటిగా మార్చారు సిద్ధార్థ. స్టార్ బక్స్ వంటి ప్రత్యర్థుల ప్రవేశాన్ని తిప్పికొడుతూ.. వివిధ నగరాల్లో ప్రైమ్ లొకేషన్లలో కెఫేలను ఏర్పాటుచేశారు.
అయితే.. దేశంలో కాఫీ వినియోగాన్ని పెంచటం.. నిలకడలేని అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతుల మీద పూర్తిగా ఆధారపడిన చిన్న, అల్పాదాయ కాఫీ ఉత్పత్తిదారులకు ప్రత్యామ్నాయం కల్పించి ప్రోత్సహించటం ఆయన చేసిన అతిపెద్ద కృషి.
''ఇండియాలో దేశీయ కాఫీ వినియోగం పెరగటానికి కారణం ఆయన ఒక్కరే. అందులో సందేహం అవసరం లేదు. ఆ రోజుల్లో మేం పూర్తిగా ఎగుమతి మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాం. కాఫీ విక్రయం మీద భారీ నియంత్రణలు ఉండేవి'' అని ఇండియన్ కాఫీ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎస్.ఎం.కావేరప్ప బీబీసీతో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''కొన్ని సంవత్సరాల పాటు.. దేశీయ కాఫీ వినియోగం ఏటా రెండు శాతం చొప్పున పెరుగుతూ పోయింది. అందుకు కారణం సిద్ధార్థ అని గట్టిగా చెప్పొచ్చు'' అని కొడగు ప్రాంతానికి చెందిన కాఫీ ఉత్పత్తిదారు కూడా అయిన కావేరప్ప చెప్పారు.
కొడగు కాఫీ గ్రోయర్స్ కార్పొరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు ఎం.బి.దేవయ్య మాట్లాడుతూ.. ''కొన్నేళ్ల కిందట నేను వైష్ణోదేవి మందిరానికి వెళ్లినపుడు అక్కడ ఐదు రూపాయలకు కాఫీ తాగగలిగాను'' అని చెప్పారు.
చిక్కమంగళూరులో కాఫీ పెంపకందార్ల కుటుంబం నుంచి వచ్చారు సిద్ధార్థ. మంగళూరు యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసిన వెంటనే.. మల్నాడ్ ప్రాంతానికి చెందిన చాలా మంది లాగానే ఆయన కూడా కర్ణాటక నుంచి ముంబైకి వెళ్లారు. కొంత కాలం ఒక పెట్టుబడి సంస్థలో పనిచేశారు. అనంతరం బెంగళూరు తిరిగివచ్చి తన సొంత కంపెనీ సివాన్ సెక్యూరిటీస్‌ని స్థాపించారు.
సిద్ధార్థ 1996లో బెంగళూరులో అత్యంత జనసమ్మర్థమైన వీధుల్లో ఒకటైన బ్రిగేడ్ రోడ్‌లో తొలి కెఫే కాఫీ డే ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. బెంగళూరులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విప్లవం ఊపందుకుంటున్న కాలమది. ఇంటర్నెట్ అనేది ఇప్పటిలా అప్పుడు అందరికీ ఉచితంగా లభించే వస్తువు కాదు.
ఇంటర్నెట్ ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ ఒక కప్పు కేపూచినో తాగటం చాలా మందికి 'స్ఫూర్తి'దాయక అనుభవంగా ఉండేది. వారిలో నేను కూడా ఉన్నాను.

ఫొటో సోర్స్, Getty Images
ఒక కప్పు కాఫీ తీసుకుని ఒక గంట గడపటానికి 60 రూపాయలు ఖర్చయ్యేది. బ్రిగేడ్ రోడ్‌లో మొదలైన ఈ కఫేలు.. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ తెరుచుకున్నాయి. 2001లో సిద్ధార్థ పాత వ్యాపార సహచరుడు నరేష్ మల్హోత్రా ఈ కాఫీ వ్యాపారంలో ఆయనతో జతకట్టారు.
వారిద్దరూ కలిసి దేశమంతటా సీసీడీ ఔట్‌లెట్లు తెరిచారు. ''అమృత్‌సర్ వాసులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో టీ బదులు కాఫీ తాగాలని మల్హోత్రా కోరుకున్నారు'' అని సిద్ధార్థ ఒకసారి నాతో చెప్పారు.
ఇప్పుడు సమాజంలోని అనేక వర్గాల వారికి సీసీడీలు మీటింగ్ పాయింట్లుగా మారాయి. దేశవ్యాప్తంగా 1,700 పైగా ఉన్న ఈ ఔట్‌లెట్లు.. యువ ప్రొఫెషనల్స్ సమావేశాలు మొదలుకుని పెళ్లిచూపుల కలయికల వరకూ.. పని చేసుకునే ప్రదేశాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి.
''ఒక కొత్త భవనంలో సీసీడీని తెరిస్తే.. ఇతర వ్యాపారాలు కూడా అక్కడికి ఆకర్షితమవుతాయి'' అని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేరు వెల్లడించరాదన్న షరతుతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఆయన కార్పొరేట్ ప్రపంచంలోని ఇతరుల తరహాలో ఉండరు. తన బంధువులను, శతాబ్దానికి పైగా కొనసాగిన తమ కాఫీ ఎస్టేట్ ఉన్న తన గ్రామ ప్రజలను ఆయన నిరంతరం కలుస్తుండేవారు'' అని కాఫీ ఎస్టేట్ కుటుంబానికే చెందిన ఒక జర్నలిస్ట్ పేర్కొన్నారు. ఆ జర్నలిస్టు కూడా తన పేరు ప్రచురించటానికి ఇష్టపడలేదు.
''ఆయన ఒక మంచి మనిషి అని.. కానీ లాభనష్టాలు లెక్కించకుండా సీసీడీలు తెరవటంలో కాస్త తొందరపాటు ఉన్న వ్యక్తి అని అందరూ భావిస్తారు. ఉదాహరణకు.. మదీకెరీ - మంగళూరు మధ్య హైవే మీద గ్రామీణ ప్రాంతంలో రెండు ఔట్‌లెట్లు ఉన్నాయని కాఫీ పెంచే నా మిత్రుడొకరు చెప్పారు'' అని డాక్టర్ కావేరప్ప పేర్కొన్నారు.
సీసీడీ 2019 మార్చిలో 1,814 కోట్ల రూపాయల ఆదాయం లెక్క చూపింది. మైండ్ ట్రీ కన్సల్టింగ్‌లో సిద్ధార్థ తన వాటాను గత ఏడాది ఎల్ అండ్ టీకి విక్రయించిన తర్వాత.. 2,858 కోట్ల రూపాయలు లాభంగా నివేదించారు. 2017లో ఆయన అధికారిక నివాసాల్లో ఆదాయ పన్ను విభాగం సోదాలు జరిపింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి ఎస్.ఎం.కృష్ణ అల్లుడు సిద్ధార్థ.
''కాఫీ పెంపకందార్లకు ఇంత మేలు చేసిన సిద్ధార్థ వంటి వ్యక్తి ఎందుకు కుంగిపోతాడు'' అని ప్రశ్నించారు దేవయ్య.
ఇవి కూడా చదవండి:
- వీజీ సిద్ధార్ధ: కెఫే కాఫీ డే యజమాని ఆత్మహత్య చేసుకున్నారా
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- బైట్‌డాన్స్: సొంతంగా స్మార్ట్‌ఫోన్ తయారు చేస్తున్న టిక్‌టాక్ కంపెనీ
- Man vs Wild: డిస్కవరీ చానల్ షోలో బియర్ గ్రిల్స్‌తో ప్రధాని మోదీ అరణ్యయాత్ర
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- కశ్మీర్ లోయలో అదనపు బలగాల మోహరింపు దేనికి సంకేతం
- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








