CAB 'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం సర్బానంద్ సోనోవాల్‌తో బీబీసీ ఇంటర్వ్యూ

ఫొటో సోర్స్, FACEBOOK/SARBANANDA SONOWAL
- రచయిత, రవిప్రకాశ్
- హోదా, గువహాటి నుంచి, బీబీసీ కోసం
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులతో చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అస్సాం సీఎం సర్బానంద్ సోనోవాల్ అన్నారు.
ప్రస్తుత పరిస్థితులపై నివేదిక ఇచ్చేందుకు, సమస్యకు రాజ్యాంగపరమైన పరిష్కారం చూపేందుకు గువహాటి హైకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ బిప్లబ్ శర్మ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని వేసినట్లు తెలిపారు.
గురువారం బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ సర్బానంద్ సోనోవాల్ ఈ విషయాలను వెల్లడించారు. ఇంకా, ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.
అస్సాంలో హింస చెలరేగడానికి కారణం ఏంటి?
ప్రజాస్వామ్యంలో హింసాత్మక ఆందోళనల వల్ల దుష్ప్రభావం ఉంటుంది. శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి ఆందోళనలకు ప్రజాస్వామ్య సమాజం వ్యతిరేకం. శాంతిని పునఃస్థాపించడం అస్సాంకు, ఇక్కడి ప్రజలకు చాలా ముఖ్యం. ఆందోళనకారులతో చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. అస్సాం అస్తిత్వ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని, కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. మనకెలాంటి భ్రమలూ అక్కర్లేదు. శాంతిపూర్వకంగా ఈ విషయాన్ని పరిష్కరించుకునేందుకు కొంత సమయం ఇవ్వాలి.

ప్రధాని కూడా ఇదే విషయం చెబుతూ ట్వీట్ చేశారు. మీరు దీన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకువెళ్లలేకపోతున్నారు?
కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నిజాలు బయటకు రావడం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాల వల్లే ఈ ఆందోళనలన్నీ జరుగుతున్నాయి. వాస్తవం ఏంటన్నది వారు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంత మందికి పౌరసత్వం వస్తుందంటూ ఒక్కొక్కరూ ఒక్కో సంఖ్య చెబుతున్నారు. వీటన్నింటి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. పౌరసత్వ చట్టానికి సవరణ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు ప్రభుత్వాలు కూడా తొమ్మిది సార్లు సవరణలు చేశాయి.

ఇంటర్నెట్ ఆపేసి, కర్ఫ్యూ విధించి ఎంత కాలం ప్రభుత్వం నడపగలుగుతారు? పోలీస్, సాయుధ బలగాలు, ఇంటెలిజెన్స్ ఉన్నా, సైన్యం అవసరం ఎందుకు ఏర్పడింది?
ఈ ఆందోళనల్లో అందరూ భాగం కావట్లేదు. చట్ట వ్యవస్థ కొన్ని ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఎలా వెళ్లగలదు? ఇదంతా వ్యవస్థ శాంతియుతంగా నడిచేందుకే. జనాలను గందరగోళానికి గురిచేసేందుకు కాదు. ప్రజలు మాకు సహకరించాలి.

ఫొటో సోర్స్, EPA
పౌరసత్వ సవరణ బిల్లుపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయా?
ఈ అంశంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలేవీ లేవు. అసోం ఒప్పందం తర్వాత 34 ఏళ్లకు ఒక ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది అసోం అస్తిత్వం కోసం తీసుకున్న నిర్ణయం. భిన్నాభిప్రాయాలు ఎలా ఉంటాయి?

ఫొటో సోర్స్, Reuters
భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే కలిసి డిసెంబర్ 15న అస్సాంలో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఆ కార్యక్రమం వాయిదా పడుతుందా?
దాని గురించి నేనేమీ చెప్పను. మరో సందర్భంలో మాట్లాడతా.
ఇవి కూడా చదవండి:
- ఆసిఫాబాద్ మహిళ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు.. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- 'పౌరసత్వ బిల్లుపై అమెరికా కమిషన్ ప్రకటన అసంబద్ధం' - భారత విదేశాంగ శాఖ
- భారతదేశ కొత్త 'ముస్లిం వ్యతిరేక' చట్టం మీద ఆందోళనలు ఎందుకు?
- కశ్మీర్ వేర్పాటువాది మక్బూల్ భట్: ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి
- శివసేన హిందుత్వం, కాంగ్రెస్ లౌకికవాదం ఇప్పుడు ఏమవుతాయి?
- పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు
- పౌరసత్వ సవరణ బిల్లు: అస్సాం ఎందుకు రగులుతోంది? ప్రజల్లో భయం దేనికి?
- ‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








