పార్లమెంటుపై దాడికి 22 ఏళ్లు: ఆ రోజు సరిగ్గా ఏం జరిగిందంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ, 2001 డిసెంబర్ 13. ఉదయం 11 గంటలకు రాజధాని నగరంలో గోరువెచ్చని ఎండ కాస్తోంది.
దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల హడావిడి మధ్య శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అప్పటికి గత కొన్నిరోజులుగా సభలో కలకలం కొనసాగుతోంది.
పార్లమెంటు పరిసరాల్లో ఉన్న జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు.. దేశ రాజకీయాలు, విదేశాల విశేషాల గురించి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ వాహనాల ప్రవాహం
పార్లమెంటులో ఆ సమయంలో ఎంతోమంది ఎంపీలతోపాటూ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియాగాంధీ కూడా ఉన్నారు.
తర్వాత 11.02 నిమిషాలకు లోక్‌సభ వాయిదా పడింది. ప్రధాని వాజ్‌పేయి, సోనియాగాంధీ తమ తమ వాహనాల్లో పార్లమెంటు నుంచి బయల్దేరారు.
పార్లమెంటు నుంచి వచ్చే ఎంపీలను తీసుకువెళ్లడానికి గేట్ల బయట ప్రభుత్వ వాహనాల హడావిడి మొదలైంది.
దేశ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కాన్వాయ్ కూడా పార్లమెంటు గేట్ నంబర్ 12 దగ్గర బయల్దేరడానికి సిద్ధంగా ఉంది.
కారును గేటు దగ్గరికి తీసుకొచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఉపరాష్ట్రపతి రాక కోసం ఎదురుచూస్తున్నారు.
సభ నుంచి బయటకు వస్తున్న నేతలు, జర్నలిస్టుల మధ్య అప్పటి రాజకీయాలకు సంబంధించిన అనధికారిక సంభాషణలు నడుస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
కారులో దూసుకొచ్చిన మిలిటెంట్లు
సీనియర్ జర్నలిస్ట్ సుమిత్ అవస్థి అదే సమయంలో గేట్ నంబర్ వన్ బయట అప్పటి కేంద్ర మంత్రి మదన్‌లాల్ ఖురానాతో మాట్లాడుతున్నారు.
"నేను, కొంతమంది నా సహచరులు కేంద్ర మంత్రి మదన్ లాల్ ఖురానాను అడిగి మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కొంత సమాచారం తీసుకోవాలనుకున్నాం. బిల్లు సభలో ప్రవేశపెట్టారా, లేదా.. దానిపై చర్చ జరుగుతుందా, లేదా తెలుసుకోవాలనుకున్నాం. అప్పుడే మాకొక శబ్దం వినిపించింది. అది కాల్పుల శబ్దం" అని సుమిత్ అవస్థి బీబీసీకి చెప్పారు.
11.30 అవుతోంది. ఉపరాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బంది ఇంకా ఆయన తెల్ల అంబాసిడర్ కారు దగ్గర నిలబడి ఉన్నారు.
అప్పుడే DL-3CJ-1527 నంబరున్న ఒక తెల్ల అంబాసిడర్ కారు వేగంగా గేట్ నంబర్ 12 వైపు దూసుకెళ్లింది. పార్లమెంటు లోపల కదిలే ప్రభుత్వ వాహనాల కంటే ఆ కారు కాస్త వేగంగా వెళ్తున్నట్టు అనిపించింది.
అది అంత వేగంగా వెళ్తుండడం చూడగానే పార్లమెంట్ వాచ్ అండ్ వార్డ్ డ్యూటీలో ఆయుధాలు లేకుండా గస్తీ కాస్తున్న జగదీశ్ ప్రసాద్ యాదవ్ హడావిడిగా కారు వైపు పరిగెత్తారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి తూటా పేలగానే...
ప్రజాస్వామ్య ఆలయంగా భావించే దేశ పార్లమెంటులో సాయుధ సెక్యూరిటీ గార్డులను మోహరించే సంప్రదాయం అప్పట్లో లేదు. పార్లమెంటు భద్రత విధుల్లో ఉండే సెక్యూరిటీ సిబ్బందిని పార్లమెంట్ హౌస్ వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ అనేవారు.
జగదీశ్ యాదవ్ కూడా అదే టీంలో ఒక భాగంగా ఉండేవారు. ఏదైనా జరగరానిది జరిగిందేమో అని ఆయన ఆ కారు వైపు పరిగెత్తారు. ఆయన పరిగెత్తడం చూసిన మిగతా సెక్యూరిటీ సిబ్బంది కూడా కారును అడ్డుకోడానికి పరుగులు తీశారు. అదే సమయంలో ఆ తెల్ల అంబాసిడర్, ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కారును ఢీకొట్టింది.
ఉపరాష్ట్రపతి కారును ఢీకొనగానే అందులోంచి దిగిన మిలిటెంట్లు విచక్షణారహితంగా ఫైరింగ్ ప్రారంభించారు. మిలిటెంట్ల చేతుల్లో ఏకే 47, హ్యాండ్ గ్రెనేడ్ లాంటివి ఉన్నాయి.
పార్లమెంటు పరిసరాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరూ బుల్లెట్ల శబ్దం విని, ఏదేదో అనుకున్నారు. కొంతమంది దగ్గరే ఉన్న గురుద్వారాలో ఎవరో కాల్పులు జరిపారని అనుకుంటే, ఇంకొందరు సమీపంలో ఎక్కడో టపాకాయలు పేల్చారని అనుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏం జరుగుతోందో ఎవరికీ తెలీదు
ఫోటోగ్రాఫర్లు, వాచ్ అండ్ వార్డ్ టీమ్ సభ్యులు అందరూ కాల్పుల శబ్దం వచ్చిన వైపు పరిగెత్తారు. అక్కడ అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అనుకున్నారు.
"మొదటి బుల్లెట్ శబ్దం వినగానే నేను ఖురానాతో, "ఏమైంది, ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది", అన్నాను. ఆయన, "ఆ.. ఇది చాలా వింతగా ఉందే... పార్లమెంటు పరిసరాల్లో ఇలాంటి శబ్దాలు ఎందుకొస్తున్నాయి?" అన్నారు. అప్పుడక్కడ నిలబడ్డ ఒక వాచ్ అండ్ వార్డ్ గార్డ్ 'సర్ పక్షులను తరమడానికి గాల్లో ఫైర్ చేశారేమో' అన్నాడు" అని సుమిత్ అవస్థి చెప్పారు.
"కానీ, మరు క్షణంలోనే రాజ్యసభ గేట్ నుంచి ఒక యువకుడు ఆర్మీ యూనిఫాం ప్యాంట్, నల్ల టీషర్ట్‌తో చేతిలో ఒక పెద్ద తుపాకీ పట్టుకుని గాల్లో కాల్పులు జరుపుతూ గేట్ నంబర్ 1 వైపు పరిగెత్తుతూ రావడం కనిపించింది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంటు దిశగా...
పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు చాలా మంది జర్నలిస్టులు ఆ చుట్టుపక్కలే ఉన్నారు. ఓబీ వ్యాన్‌తో కొందరు నేతలతో లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు.
"పార్లమెంటుపై దాడికి ముందు నేను ఓబీ వ్యాన్ నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను. అప్పుడు నాతో శివరాజ్ సింగ్ చౌహాన్, మరో కాంగ్రెస్ నేత ఉన్నారు. నేను వారిద్దరినీ డ్రాప్ చేయడానికి నా మారుతీ వ్యాన్‌లో లోపలికి వెళ్లాను. డ్రాప్ చేసిన తర్వాత గేట్ నుంచి బయటకు రాగానే, నాకు మొదటి కాల్పుల శబ్దం వినిపించింది" అని 2001లో స్టార్ న్యూస్ చానల్ కోసం రిపోర్టింగ్ చేస్తున్న మనోరంజన్ భారతి బీబీసీకి చెప్పారు.
కాల్పుల శబ్దం వినగానే నేను బయటకు పరిగెత్తుకుని వచ్చి లైవ్ ఇవ్వడం ప్రారంభించాను. నా వెనక ములాయం సింగ్ యాదవ్ బ్లాక్ క్యాట్ కమెండో ఉన్నారు. నేను ఆయనతో 'బాస్, నేను పార్లమెంటు వైపు వీపు పెట్టి రిపోర్టింగ్ చేస్తున్నా. అక్కడ నుంచి ఎవరైనా తీవ్రవాది వస్తారేమో చూస్తుండండి' అన్నాను. ఆయన సరే అన్నారు. లోపల ఉద్ధృతంగా కాల్పులు జరుగుతున్నాయి. పేలుళ్ల శబ్దం వస్తోంది".

ఫొటో సోర్స్, Getty Images
ఖురానా కింద పడ్డారు
పార్లమెంటు పరిసరాల్లో మిలిటెంట్ల ఆటోమేటిక్ ఏకే-47 తుపాకుల నుంచి దూసుకొస్తున్న బుల్లెట్ల శబ్దం వినగానే నేతలతోపాటు అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు.
సభ లోపల, బయట కలకలం నెలకొంది. అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. అందరూ అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అదే సమయంలో సభలో హోంమంత్రి లాల్ కృష్ణ అడ్వాణీ, ప్రమోద్ మహాజన్ సహా చాలా మంది అగ్ర నేతలు కూడా ఉన్నారు. కానీ అసలు ఏ జరుగుతోందో ఎవరికీ తెలీదు.
పార్లమెంట్ భవనం గేట్ నంబర్ 1 బయట కేంద్ర మంత్రి మదన్ లాల్ ఖురానాతో మాట్లాడుతున్న సుమిత్ అవస్థి అప్పుడు తనకు ఏమనిపించిందో చెప్పారు.
"నేను మదన్ లాల్ ఖురానాతో 'ఆ సెక్యూరిటీ గార్డుకు ఏమైందో.. అలా కాల్పులెందుకు జరుపుతున్నాడు?' అన్నాను. అతడు ఎవరికైనా బాడీగార్డేమో అని నేననుకున్నా. ఖురానా వెనక్కు తిరిగి చూసేలోపే, ఒక వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ మెంబర్ ఖురానా గారి చేయి పట్టుకుని పక్కకు లాగారు. ఆయన కారు తలుపుమీద చెయ్యి పెట్టి నాతో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా లాగడంతో నేలపై పడిపోయారు. తర్వాత స్టాఫ్ నా చేయి పట్టుకుని, ఎవరో కాల్పులు జరుపుతున్నారు, కిందికి వంగండి అన్నారు. వంగి నడుస్తూ లోపలికి వెళ్లండి. లేదంటే బుల్లెట్ తగులుతుంది అన్నారు".

ఫొటో సోర్స్, Getty Images
మొదటి మిలిటెంట్ పేలుడు
పార్లమెంటు పరిసరాల్లో కాల్పుల శబ్దం వినగానే కలకలం రేగింది.
"పార్లమెంటులో అప్పట్లో సాయుధ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించేవారు కాదు. పార్లమెంటులో ఒక సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఉండేది. వారు ఘటనాస్థలానికి చేరుకోవాలంటే దాదాపు అర కిలోమీటర్ రావాలి. అక్కడ కాల్పుల శబ్దం రాగానే వారంతా పరిగెత్తుకుని వచ్చారు" అని మనోరంజన్ భారతి చెప్పారు.
"ఉపరాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బంది, మిలిటెంట్ల మధ్య కాల్పులు జరుగుతున్నప్పడు ఆయుధాలు లేకుండా ఉన్న సెక్యూరిటీ గార్డ్ మాత్బర్ సింగ్ ప్రాణాలకు తెగించి గేట్ నంబర్ 11ను మూసేశారు.

ఫొటో సోర్స్, Getty Images
గేట్ నంబర్-1
మాత్బర్ సింగ్ గేటు మూస్తుండడం చూసిన మిలిటెంట్లు ఆయనపై కాల్పులు ప్రారంభించారు.
అయినా, వెనక్కు తగ్గని సింగ్ తన వాకీటాకీతో అందరినీ అప్రమత్తం చేశారు. పార్లమెంటుకు ఉన్న అన్ని తలుపులూ అప్పటికప్పుడే మూసేయించారు.
తర్వాత మిలిటెంట్లు పార్లమెంటులోకి చొరబడ్డానికి గేట్ నంబర్ 1 వైపు వెళ్లారు. కాల్పుల శబ్దం వినగానే సెక్యూరిటీ సిబ్బంది గేట్ నంబర్ 1 దగ్గర ఉన్న అందరినీ సమీపంలో ఉన్న గదిలో దాచేశారు. మిలిటెంట్లను ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అందరిలో ఆందోళన
ఆ గదిలో ఉన్న వారిలో జర్నలిస్ట్ సుమిత్ అవస్థి కూడా ఉన్నారు.
"మదన్ లాల్ ఖురానాతోపాటూ నన్ను కూడా గేట్ నంబర్ 1 లోపలికి పంపించి తలుపు మూసేశారు. సభలో నాకు హోంమంత్రి లాల్ కృష్ణ అడ్వాణీ ఎక్కడికో వెళ్తూ కనిపించారు. ఆయన ముఖం చాలా సీరియస్‌గా, కాస్త ఆందోళనగా ఉన్నట్టు అనిపించింది. నేను ఆయనతో ఏమైందని అడిగాను. కానీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే ఆయన ముందుకు వెళ్లిపోయారు" అని చెప్పారు.
"ఆ తర్వాత ఎంపీలను సెంట్రల్ హాల్‌కు, మిగతావారిని మరో ప్రాంతానికి షిఫ్ట్ చేశారు. అప్పుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, సోనియాగాంధీ ఎలా ఉన్నారో అని నాకు ఆందోళన కలిగింది. ఎందుకంటే హోంమంత్రి అడ్వాణీ సురక్షితంగా ఉండడం నాకు కనిపించింది. మిలిటెంట్లపై ఎదురుదాడి అడ్వాణీ పర్యవేక్షణలో జరుగుతోందని నాకు తర్వాత తెలిసింది".

ఫొటో సోర్స్, Getty Images
నేతలందరూ సురక్షితం
భారత పార్లమెంటుపై దాడి జరిగిందనే వార్త టీవీల ద్వారా అప్పటికే ప్రపంచమంతా చేరిపోయింది.
"కానీ దేశ నేతలందరూ సురక్షితంగా ఉన్నారా, లేదా అనే విషయం ఎవరికీ తెలీదు. ఎందుకంటే సభ చుట్టుపక్కల, లోపల ఉన్న జర్నలిస్టులకు, ఎంపీలు, కేంద్ర మంత్రులకు సంబంధించిన ఏ సమాచారం టీవీల్లో ఇవ్వడం లేదు".
ఆలోపు మిలిటెంట్లు పార్లమెంటు భవనం గేట్ నంబర్ 1 నుంచి సభలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. భద్రతాదళాలు వారిలో ఒక మిలిటెంటును కాల్చి చంపాయి.
కాల్పులు జరుగుతున్నప్పుడు మిలిటెంట్ శరీరానికి కట్టుకుని ఉన్న పేలుడు పదార్థాలు పేలిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
జర్నలిస్టుల పైకి బుల్లెట్లు
"మేం ఒక గదిలో ఉన్నాం. అక్కడ నాతో మరో ముప్ఫై, నలభై మందిని ఉంచారు. జామర్లు ఆన్ చేయడం వల్లో.. ఏమో మా మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదు. దాంతో మాకు, బయటి ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. రెండు, రెండున్నర గంటల తర్వాత ఒక పేలుడు శబ్దం వినిపించింది. గేట్ నంబర్ వన్ దగ్గర ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడని తర్వాత తెలిసింది" అని అవస్థి చెప్పారు.
గేట్ నంబర్ 1 దగ్గర ఒక మిలిటెంట్‌ను కాల్చి చంపిన తర్వాత మరో మిలిటెంట్ జర్నలిస్టులపై కాల్పులు జరపడం ప్రారంభించాడని.. అప్పుడు పార్లమెంటు దగ్గర జరిగిన మొత్తం ఘటనను తన కెమెరాలో బంధిస్తున్న కెమెరా పర్సన్ అనామికా చక్లాదార్ చెప్పారు.
"ఒక బుల్లెట్ ఏఎన్ఐ కెమెరా పర్సన్ విక్రమ్ బిష్ట్ మెడకు తగిలింది. మరో బుల్లెట్ నా కెమెరాకు తగిలింది. ఒక గ్రెనేడ్ మాకు దగ్గరగా పడింది. కానీ అది పేలలేదు. సాయంత్రం 4 గంటలకు వచ్చిన భద్రతాదళాలు మా ముందే దాన్ని డిటొనేట్ చేశాయి" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంటుకు భారీగా భద్రతాదళాలు
తీవ్రంగా గాయపడిన ఏఎన్ఐ కెమెరాపర్సన్‌ను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ కాసేపటి తర్వాత ఆయన మృతిచెందారు.
"ఆ తర్వాత నలుగురు మిలిటెంట్లు గేట్ నంబర్ 9 వైపు వెళ్లారు. అప్పుడు ముగ్గురు మిలిటెంట్లను కాల్చి చంపారు. ఒక మిలిటెంట్ గేట్ నంబర్ 5 వైపు పరిగెత్తాడు. పార్లమెంట్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ భద్రతాదళాలు అతడిని కూడా నేలకూల్చాయి".
పార్లమెంటు భద్రతా సిబ్బంది, మిలిటెంట్ల మధ్య ఉదయం దాదాపు 11.30కు మొదలైన కాల్పులు దాదాపు సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగాయి.
ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి 5 మధ్యలో భద్రతాదళాలు భారీగా పార్లమెంటు దగ్గరికి చేరుకున్నాయి. ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు చేపట్టాయి.
పార్లమెంటుపై మిలిటెంట్ల దాడిలో దిల్లీ పోలీస్‌కు చెందిన ఐదుగురు భద్రతా సిబ్బంది, సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళానికి చెందిన ఒక మహిళా కానిస్టేబుల్, రాజ్యసభ సచివాలయానికి చెందిన సిబ్బంది ఇద్దరు, ఒక తోటమాలి చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్జల్ గురుకు ఉరి
భారత పార్లమెంటుపై దాడి కేసులో పోలీసులు నలుగురు మిలిటెంట్లను అరెస్ట్ చేశారు.
తర్వాత దిల్లీ పోటా కోర్టు 2002 డిసెంబర్ 16న మహమ్మద్ అఫ్జల్, షౌకత్ హుసేన్, నవజోత్ సంధు ఉర్ఫ్ అఫ్సాన్ గురు, ప్రొఫెసర్ సయ్యద్ అబ్దుల్ రహమాన్ గిలానీలను దోషిగా ఖరారు చేసింది.
సుప్రీంకోర్టు వారిలో ప్రొఫెసర్ సయ్యద్ అబ్దుల్ రహమాన్ గిలానీ, నవజోత్ సంధు ఉర్ఫ్ అఫ్సాన్ గురును నిర్దోషులుగా చెప్పింది. మహమ్మద్ అఫ్జల్ మరణశిక్షను కొనసాగించింది. షౌకత్ హుసేన్ మరణశిక్షను పదేళ్ల జైలు శిక్షగా తగ్గించింది.
ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురును దిల్లీలోని తీహార్ జైలులో ఉదయం 8 గంటలకు ఉరితీశారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్- 'అమ్మాయిలు సైకిల్ తొక్కడం ‘అశ్లీలం’, మత సంప్రదాయాలకు విరుద్ధం'
- బీటీఎస్- దక్షిణ కొరియా మిలటరీలోకి జిన్.. అక్కడ జిన్ మిలటరీలో ఏం చేస్తారు
- ఫుట్-బాల్ వరల్డ్-కప్ 2022- చివరి దశకు పోరు.. అర్జెంటీనాను మెస్సీ ఫైనల్స్-కు తీసుకెళ్తాడా
- ఇండియా, చైనా సైనికుల మధ్య మళ్లీ ఘర్షణ.. రెండు దేశాల సైనికులకూ గాయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








