గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?

గుండె పోటు

ఫొటో సోర్స్, BOY_ANUPONG/GETTYIMAGES

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల కాలంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తుల వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

ఒక వీడియోలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోతూ కనిపించారు. మరొక వీడియోలో చేతిలో పూలు పట్టుకొని కనిపిస్తున్న పెళ్లి కూతురు ఉన్నట్లుండి నేలపై పడిపోయారు.

మరొక వీడియోలో స్నేహితులతో కలిసి నడుస్తున్న ఓ వ్యక్తి నేలపై కుప్పకూలి మరణించారు.

ఈ వీడియోల నడుమ ట్విటర్‌లో #heartattack పేరుతో ఒక హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

గుండె పోటు

ఫొటో సోర్స్, KATERYNA KON/SCIENCE PHOTO LIBRARY

ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తూ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా గుండె పోటుతో మరణించారు.

మరోవైపు హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ కూడా ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతూ గుండె పోటుతో కుప్పకూలారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత ఆయన మరణించారు.

ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు.

ఈ విషయంపై నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లోని చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఓపీ యాదవ్ బీబీసీతో మాట్లాడారు. ఏదైనా ఊహించని సంకేతాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని ఆయన సూచించారు.

గుండె పోటు

ఫొటో సోర్స్, PETER DAZELEY/GETTYIMAGES

ఏమిటి ఆ లక్షణాలు?

  • కడుపులో తీవ్రమైన నొప్పి
  • పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం
  • కడుపులో గ్యాస్ పెరిగినట్లు, లేదా అసిడిటీగా అనిపించడం
  • ఛాతిపై ఒత్తిడి పేరుకున్నట్లు అనిపించడం
  • గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం
  • శరీరం మొరాయిస్తున్నట్లుగా అనిపించడం, చాలా అలసటగా ఉండటం
  • గుండె నుంచి వెన్నువైపుగా నొప్పి కదులుతున్నట్లు అనిపించడం, దీన్ని నడుం నొప్పిగా భావించి అసలు అశ్రద్ధ చేయకూడదు
  • కుటుంబంలో ఎవరైనా 30 లేదా 40ల వయసులో ఒక్కసారిగా గుండె పోటుతో మరణించడం (వెంటనే కుటుంబంలో అందరూ హృద్రోగ పరీక్షలు చేయించుకోవాలి)
గుండె పోటు

ఫొటో సోర్స్, ALEKSANDR ZUBKOV/GETTYIMAGES

ఎలా మొదలవుతుంది?

గుండె పోటు వచ్చేటప్పుడు మొదటగా అరగంట లేదా అంతకంటే ముందు ఛాతీలో నొప్పి మొదలవుతుందని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ వివేక్ కుమార్ చెప్పారు.

‘‘సాధారణంగా ఎడమ చేతిలోనూ నొప్పి వస్తుంది. ఆ వెంటనే విపరీతంగా చెమటలు పడతాయి. వెంటనే మనం గుర్తించకపోతే గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది’’అని ఆయన చెప్పారు.

హాస్పిటల్‌కు బయట గుండెపోటు వచ్చే వారిలో కేవలం 3 నుంచి 8 శాతం మంది మాత్రమే బతికి బయటపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

గుండె పోటు

ఫొటో సోర్స్, Thinkstock

కరోనావైరస్‌తో సంబంధముందా?

కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ఇలాంటి గుండె పోటు కేసులు పెరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు కోవిడ్-19 వ్యాక్సీన్‌ తీసుకున్న తర్వాత ఈ కేసులు మరింత ఎక్కువ అవుతున్నట్లు కొందరు చెబుతున్నారు.

అయితే, కరోనావైరస్ వల్ల రక్త నాళాలు పూడుకుపోవడం అనే సమస్య ఎక్కువవుతోందని ఇటు డాక్టర్ ఓపీ యాదవ్, అటు డాక్టర్ వివేక్ కుమార్ ఇద్దరూ చెప్పారు. ‘‘ఊపిరితిత్తులు, గుండె, మెదడు లాంటి అవయవాల్లో రక్తం గడ్డ కడుతోంది. అయితే, కోవిడ్-19 చికిత్సలో భాగంగా రక్తాన్ని పలుచబరిచే ఔషధాలు కూడా ఇస్తున్నారు’’అని వారు చెప్పారు.

‘‘కోవిడ్-19 తర్వాత గుండె పోటు వచ్చే ముప్పు కొంతవరకు పెరుగుతోందని, ఈ రెండింటికీ మధ్య సంబంధముందని కొందరు చెబుతున్నారు. దీనికి రక్తం గడ్డకట్టడమే కొంతవరకు కారణం కావొచ్చని మేం భావిస్తున్నాం. అయితే, ఇక్కడ ప్రతి గుండెపోటునూ కోవిడ్-19 వల్లే వచ్చిందని చెప్పలేం’’అని ఓపీ యాదవ్ చెప్పారు.

‘‘ఇక్కడ కరోనా వ్యాక్సీన్‌ను కూడా కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌గానే చూడాలి. దీని వల్ల రక్తం గడ్డకట్టే ముప్పు కొంతవరకు పెరగొచ్చు. కానీ, ఒత్తిడి, ధూమపానం, మద్యం సేవించడం లాంటి అంశాలు కూడా గుండె పోటుకు కారణం కావచ్చు. ఈ గుండె పోటు అనేది కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వల్లో లేదా వ్యాక్సీన్ వల్లే వచ్చిందని మనం చెప్పలేం’’అని వివేక్ కుమార్ అన్నారు.

వీడియో క్యాప్షన్, గుండె మార్పిడి చికిత్స: ఆగిన గుండెను కొట్టుకునేలా చేసే సాధనం

పురుషుల్లో ఎక్కువ..

మహిళల్లో ఈస్ట్రోజెన్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్‌లు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో రుతుచక్రం కొనసాగేటప్పుడు రక్తంలో ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

రుతుచక్రం అనేది గుండె పోటు నుంచి మహిళలకు కొంతవరకు రక్షణలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

‘’45 ఏళ్లకు పైబడిన మహిళలతో పోలిస్తే పురుషులకు ఎక్కువగా గుండె పోటు వస్తుంది. ఈ రెండు వర్గాల మధ్య గుండె పోటు నిష్పత్తి 1:10గా ఉంటుంది. అంటే ఒక మహిళకు గుండెపోటు వస్తే అటువైపు పది మంది పురుషులకు గుండె పోటు వస్తోంది’’అని డాక్టర్ ఓపీ యాదవ్ వివరించారు.

‘‘మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయిలు తగ్గిపోయినప్పుడు మెనోపాజ్ వస్తుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అంటే దాదాపు 60ల వయసులో రెండు వర్గాల మధ్య గుండెపోటు ముప్పు ఒకేలా ఉంటుంది. 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ గుండె పోటులు వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి’’అని యాదవ్ చెప్పారు.

అందుకే ఇటు మహిళలు, అటు పురుషులూ.. రెండు వర్గాలూ తీసుకునే ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

యువకుల్లో గుండె పోటుకు కారణాలపై డాక్టర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘జీవన శైలిలో మార్పులే దీనికి కారణంగా చెప్పుకోవాలి. ధూమపానం, మద్యం సేవించడం, మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లాంటివి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి’’అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఇది ఎందుకు ప్రాణాలు తీస్తోంది?

జిమ్‌తో సంబంధం ఏమిటి?

జిమ్‌కు వెళ్లే అలవాటు లేనప్పుడు.. ఒక్కసారిగా జిమ్‌కు వెళ్లి పెద్దపెద్ద బరువులు ఎత్తాలని ప్రయత్నిస్తే సమస్యలు తలెత్తొచ్చని వైద్యులు చెబుతున్నారు.

నెమ్మదిగా బరువులు పెంచుకుంటూ వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘‘ఒకవేళ ఏదైనా బరువులు ఎత్తే పోటీకి వెళ్లాలని అనుకుంటే, ముందుగా అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి’’అని వారు సూచిస్తున్నారు.

‘‘విపరీతంగా చెమటలు పడితే, నీరు ఎక్కువగా తీసుకోవాలి. మరోవైపు శరీరంలో సోడియం స్థాయిలు పడిపోకుండా జాగ్రత్త వహించాలి. మద్యం, ధూమపానం, డ్రగ్స్‌కు కూడా దూరంగా ఉండాలి’’అని వివేక్ సూచించారు.

‘‘జిమ్‌కు వెళ్లేటప్పుడు తీసుకునే సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింక్‌ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి వీటిలో స్టెరాయిడ్స్‌ను కలుపుతుంటారు. వీటిలోని కృత్రిమ రసాయనాలు కూడా మీకు హానికరంగా మారొచ్చు’’అని వివేక్ చెప్పారు.

సంతులిత ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)