కోవిడ్-19: కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాక గుండె పోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

గుండె పోటు

ఫొటో సోర్స్, Thinkstock

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బహుశా, మీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఇలా జరిగుండొచ్చు. కరోనావైరస్‌ ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్నారు... కానీ, ఆ తరువాత చనిపోయారనే వార్త వినాల్సి రావొచ్చు.

కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర ఇన్ఫెక్షన్లతో కొందరు ఇలా మరణిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది?

గుండె పోటు

ఫొటో సోర్స్, Thinkstock

గుండెతో సంబంధం ఏమిటి?

ఈ మరణాలు ఎలా సంభవిస్తున్నాయో తెలుసుకోవాలంటే, ముందు మనం గుండెపై కోవిడ్-19 ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థంచేసుకోవాలి.

గుండెపై కోవిడ్-19 చూపే ప్రభావాన్ని వివరిస్తూ అమెరికాకు చెందిన నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్‌స్టిట్యూట్ ఓ వీడియోను ‌విడుదల చేసింది.

గుండె పనిచేయాలంటే ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని శరీరంలోని మిగతాభాగాలకు గుండె సరఫరా చేస్తుంది. ఈ ఆక్సిజన్ గుండెకు ఊపిరితిత్తుల నుంచి అందుతుంది.

కరోనావైరస్ నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ ఇన్ఫెక్షన్ సోకితే, చాలా మంది రోగుల్లో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతుంటాయి. ఈ ప్రభావం కొందరిలో గుండెపై కూడా పడుతుంది. ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో గుండెలోని కండరాలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా ఆ కండరాలు దెబ్బతింటాయి.

శరీరంలోని మిగతా భాగాల్లోని ఇన్‌ఫ్లమేషన్ ప్రభావం కూడా గుండెపై పడుతుంది. రక్తాన్ని సరఫరాచేసే సామర్థ్యం తగ్గిపోవడంతో, గుండె వేగంగా పనిచేయడం మొదలుపెడుతుంది. ఫలితంగా హృద్రోగ సమస్యలు చుట్టుముడతాయి. ముందే, ఈ సమస్యలు ఉంటే, ఇప్పుడు మరింత ఎక్కువవుతాయి.

అయితే, తమ గుండెపై ప్రభావం పడుతుందో లేదో కోవిడ్-19 రోగులు గుర్తించడం ఎలా? అందరు రోగుల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తుందా? ఎవరు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి.

ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రముఖ హృద్రోగ నిపుణులను బీబీసీ సంప్రదించింది.

గుండె పోటు

ఫొటో సోర్స్, SPL

ఎవరు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి?

మధుమేహం,, ఊబకాయం, రక్తపోటు ఉన్నవారిలో కోవిడ్-19 అనంతరం హృద్రోగ సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఫోర్టిస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ అశోక్ సేత్‌తో బీబీసీ మాట్లాడింది.

కోవిడ్-19 ఇన్ఫెక్షన్ తీవ్రమైన వారిలో 20 నుంచి 25 శాతం మందిలో ఇలాంటి గుండె జబ్బులు వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు.

ఈ విషయాన్ని చదివిన తర్వాత మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

80 నుంచి 90 శాతం మంది కోవిడ్ రోగులు ఇంటిలోనే కోలుకుంటున్నారు. కేవలం పది నుంచి 20 శాతం మందిలో మాత్రమే ఇన్ఫెక్షన్ తీవ్రం అవుతుంది. ఇందులో 20 శాతం మందికి మాత్రమే హృద్రోగాల ముప్పు ఉంటుంది.

చాలా మందికి హృద్రోగాలు చుట్టుముట్టినట్లు ఆసుపత్రిలో ఉన్నప్పుడే తెలుస్తుంది. కొందరిలో ఇంటికి వచ్చిన మూడు నెలల తర్వాత కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎంత తీవ్రమైతే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అంత ఎక్కువని డాక్టర్ అశోక్ తెలిపారు.

అయితే, ఇంటిలో ఉండి కోలుకునేవారు కూడా అప్రమత్తంగా ఉండాలని అశోక్ సూచిస్తున్నారు.

గుండె పోటు

ఫొటో సోర్స్, iStock

ఎలా తెలుస్తుంది?

ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • ఛాతి నొప్పి
  • ఒక్కసారిగా గుండె వేగం పెరగడం

ఈ మూడు లక్షణాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆశ్రద్ధ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

గుండె పోటు

ఫొటో సోర్స్, iStock

ఎలా మొదలవుతోంది?

‘‘ఛాతిలో నొప్పికి రక్తం గడ్డకట్టడం కారణం కావొచ్చు. దీని వల్ల గుండె పోటు వచ్చే ముప్పుంటుంది’’అని అశోక్ వివరించారు.

‘‘కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లాక 4 నుంచి 6 వారాల వరకు ఈ లక్షణాలు కనిపించే అవకాశముంది. కోవిడ్ తర్వాత మొదటి నెల చాలా కీలకం. ఇలాంటి లక్షణాలు ఉండేవారికి 4 నుంచి 6 వారాలపాటు వైద్యులు రక్తాన్ని పలుచన చేసే ఔషధాలు ఇస్తుంటారు. అయితే, వైద్యుల్ని సంప్రదించకుండా ఇలాంటి ఔషధాలను తీసుకోకూడదు’’.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వల్ల కూడా కొందరిలో గుండెపోటు వస్తుంది.

మరికొందరిలో కోవిడ్ వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతంది. ఫలితంగా గుండెకు సంబంధించిన కొత్త వ్యాధులు వస్తాయి. మరికొందరిలో గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. అందుకే గుండె వేగాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

గుండె పోటు

ఫొటో సోర్స్, iStock

స్టెరాయిడ్లు కూడా కారణమా?

‘‘కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రమైన వారు కోలుకోవడంలో స్టెరాయిడ్లు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఎప్పుడు వీటిని ఇస్తున్నాం అనేది కూడా చాలా కీలకమైన అంశం’’అని మ్యాక్స్ హాస్పిటల్ కార్డియాక్ సైన్సెస్ విభాగం ఛైర్మన్ డాక్టర్ బల్‌బీర్ సింగ్ చెప్పారు.

‘‘అందరు రోగులకు స్టెరాయిడ్లను ఇవ్వకూడదు. ఎందుకంటే దీనితో చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉండేవారిపై ఇవి చాలా దుష్ప్రభావాలకు కారణం అవతాయి. వీటి వల్ల బ్యాక్టీరియా, ఫంగస్‌లు మన శరీరంలోకి చేరతాయి. బ్లాక్ ఫంగస్ వ్యాధికి కూడా చాలావరకు ఇవే కారణం’’.

‘‘శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే వారికే ఈ స్టెరాయిడ్లను ఇవ్వాలి. అంటే కేవలం 10 నుంచి 15 శాతం మంది రోగులకే దీని అవసరం ఉంటుంది. మరోవైపు కోవిడ్ సోకిన 7 రోజుల తర్వాత మాత్రమే ఇవ్వాలి. అది కూడా వైద్యుల సమక్షంలో మాత్రమే ఇవ్వాలి. ఇవి ఎక్కువ డోసులో తీసుకుంటే ప్రాణాలకే ముప్పు’’.

గుండె పోటు

ఫొటో సోర్స్, iStock

టెస్టులు ఏమైనా చేయించుకోవాలా?

‘‘కోవిడ్ సోకిన మొదటి వారంలో వైరస్ దాని సంఖ్యను రెట్టింపు చేసుకుంటుంది. ఈ సమయంలో దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి లాంటి లక్షణాలు కనిపించే అవకాశం తక్కువ. ఇవి 8 నుంచి 10 రోజుల తర్వాత మొదలవుతాయి’’అని బల్‌బీర్ వివరించారు.

‌‘‘అందుకే వారం రోజుల తర్వాత డీ-డైమర్, సీబీసీ-సీఆర్‌పీ, ఐఎల్6 లాంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తారు’’.

‘‘వీటిలో ఏమైనా తేడా కనిపిస్తే, ఇన్ఫెక్షన్ మిగతా ప్రాంతాలకూ విస్తరించిందని అర్థం. ఆసుపత్రిలో ఎప్పుడు చేర్పించాలి? స్టెరాయిడ్లు ఎప్పుడు ఇవ్వాలి? లాంటివి తెలుసుకోవడానికి ఈ రిపోర్టులు చాలా కీలకంగా మారతాయి’’.

గుండె జబ్బు

ఫొటో సోర్స్, SPL

గుండెను రక్షించుకోవడం ఎలా..

ఈ విషయంపై డాక్టర్ అశోక్, డాక్టర్ బల్‌బీర్ కొన్ని సూచనలు ఇచ్చారు.

  • వైద్యులు సూచించినప్పుడు తప్పనిసరిగా రక్తాన్ని పలుచనచేసే ఔషధాలు తీసుకోవాలి
  • మద్యం, ధూమపానం లాంటి అలవాట్లు ఉంటే, కొన్ని రోజులపాటు వాటిని పక్కనపెట్టేయాలి
  • ఆహారం విషయంలో చాలా ప్రమత్తంగా ఉండాలి. పళ్లు, కూరగాయలతోపాటు ఇంటిలో వండిన ఆహారాన్నే తినాలి
  • మంచి నీరు ఎక్కువగా తాగాలి. శరీరంలో నీటి శాతం తక్కువైతే, రక్తం గడ్డకట్టే ముప్పు ఎక్కువవుతుంది
  • ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైతే, ఈసీజీ, కార్డియోగ్రామ్ లాంటి టెస్టులు చేయించుకోవాలి
  • ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినవారు, వ్యాయామం మరీ ఎక్కువగా చేయకూడదు.
  • ఇంటికి వెళ్లిన తర్వాత, రోజంతా పడుకునే ఉండకూడదు. అప్పపుడప్పుడు యోగా చేయాలి. నీరసంగా అనిపించినప్పుడు పడుకోవాలి.
హార్ట్ సర్జరీ

ఫొటో సోర్స్, AMUR GOVERNOR/REUTERS

6 నిమిషాలు నడిచిన తర్వాత..

వీటన్నింటితోపాటు 6 మినిట్ వాక్ టెస్ట్ కూడా చేసుకోవాలి. దీంతో మన గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం తెలుస్తుంది. ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారు ఈ టెస్ట్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

గుండె ఎలా ఉందో ఈ పరీక్షలో ఇట్టే తెలుస్తుందని డాక్టర్ బల్‌బీర్ చెప్పారు. ఈ టెస్టు ఎలా చేసుకోవాలో మెదాంతా ఆసుపత్రికి చెందిన ఊపిరితిత్తుల నిపుణుడు డాక్టర్ అరవింద్ కుమార్ ఒక వీడియోను చేసి, ఆన్‌లైన్‌లో పెట్టారు.

‘‘ఈ టెస్టుకు ముందు రోగులు ఆక్సీమీటర్‌తో తమ ఆక్సిజన్ స్థాయిలను రికార్డు చేసుకోవాలి. తర్వాత ఓ మోస్తారు వేగంతో ఆరు నిమిషాలపాటు ఆగకుండా నడవాలి. ఆ తర్వాత మరోసారి ఆక్సిజన్ స్థాయిలను రికార్డు చేసుకోవాలి’’.

ఆక్సిజన్ స్థాయిలు ఒకేలా ఉంటే, మీ గుండె, ఊపిరిత్తులు ఆరోగ్యంగా ఉన్నట్లే’’.

మీరు ఆరు నిమిషాలు కూడా నడవలేకపోతే, వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి.

‘‘ఒకవేళ ఆక్సిజన్ స్థాయిలు భారీగా పడిపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఈ టెస్టుతో మన గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు’’అని అరవింద్ చెప్పారు.

గుండె పోటు

ఫొటో సోర్స్, SPL

ఊపిరితిత్తులను రక్షించుకోవడం ఎలా?

శ్వాసను బిగపట్టి ఉంచే వ్యాయామం చేస్తే, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్ అరవింద్ చెప్పారు. ‘‘మొదట దీర్ఘ శ్వాస తీసుకోవాలి. 25 సెకన్లపాటు శ్వాసను బిగపట్టి ఉంచాలి. ఆ తర్వాత గాలిని బయటకు వదలాలి. ఇలా కనీసం ఆరు నెలలు చేయాలి. అప్పుడు ఊపిరిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది’’.

‘‘ఊపిరిత్తులు బూరల్లాంటివి. సాధారణంగా గాలి పీలిస్తే, ఊపిరితిత్తుల బయట పొరల్లోకి గాలి చేరుకోలేదు. ఈ వ్యాయామంతో ఊపిరిత్తులు ఉబ్బుతాయి. ఫలితంగా అన్ని పొరల్లోకి గాలి వెళ్తుంది’’.

‘‘కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రమైన వారిలో లంగ్ ఫిబ్రోసిస్ అనే వ్యాధి వచ్చే ముప్పు ఉంటుంది. అంటే ఊపిరితిత్తులు కుంచించికుపోయినట్లు అవుతాయి. ఆరు నెలల వరకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వ్యాయామం చేయాలి’’.

‘‘సీటీ స్కాన్‌తో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. అయితే, ఇన్ఫెక్షన్ సోకిన 7 రోజుల తర్వాత ఈ పరీక్ష చేయించుకోవాలి’’అని బీఎల్‌కే ఆసుపత్రిలోని సీనియర్ డాక్టర్ సందీప్ నాయర్ చెప్పారు.

‘‘సీటీ స్కోర్ 10/25 ఉంటే ఇన్ఫెక్షన్ ఒక మోస్తరుగా ఉన్నట్లు. ఒకవేళ ఇది 15/25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ తీవ్రమైన వారికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయించాలి. ఆసుపత్రి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన రెండు నెలల తర్వాత మరోసారి టెస్ట్ చేయించాలి’’.

‘‘యోగా, ప్రాణాయామాలు చేయడంతో చాలా ఉపయోగం ఉంటుంది. ఆవిరి పట్టడం, నీళ్లను పుక్కలించడం, మాస్క్ పెట్టుకోవడం లాంటివి ఆపకూడదు. ఆహారంలో కారం, మసాలా దినుసులు తగ్గించాలి’’.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)