అంత్యక్రియలు సంప్రదాయ పద్ధతుల్లో జరగాలని కోరుకునే వారు తగ్గిపోతున్నారు

ఫొటో సోర్స్, ETERNAL REEFS
- రచయిత, బెర్న్డ్ డెబుస్మాన్ జూనియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 'ఎటెర్నల్ రీఫ్' సంస్థ చనిపోయిన వారి అస్థికలను ఓ కొత్త పద్ధతిలో కృత్రిమ సముద్రపు రాళ్లు (రీఫ్)గా మార్చి సముద్రంలోకి జారవిడుస్తుంది.
కరోనా మహమ్మారి ముంచుకొచ్చిన దగ్గర నుంచి తమ సంస్థ అందించే ఈ అసాధారణ సేవలకు డిమాండ్ బాగా పెరిగిపోయిందని ఆ సంస్థ చెబుతోంది.
1998 నుంచి ఎటెర్నల్ రీఫ్ సంస్థ ఈ సేవలను అందిస్తోంది.
ఈ పద్ధతిలో, చనిపోయినవారి భస్మాలను పర్యావరణ అనుకూల కాంక్రీట్ మిశ్రమంలో కలిపి పెద్ద పెద్ద రాళ్లల్లా తయారుచేస్తారు. వాటిని జాగ్రత్తగా సముద్రంలో జారవిడుస్తారు.
"కోవిడ్ సమయంలో మా సేవలపై ఆసక్తి బాగా పెరిగిపోయింది" అని ఎటెర్నల్ రీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రాంకెల్ తెలిపారు.
పలువురు దీన్ని 'ప్రకృతికి వెనక్కు ఇచ్చేయడం' గా చూస్తున్నారని ఆయన అన్నారు.
గత ఏడాది వరకూ ఈ సంస్థ తయారుచేసిన 2,000లకు పైగా రీఫ్‌లను అమెరికా ఈస్ట్ కోస్ట్‌లోని 25 ప్రదేశాల్లో జారవిడిచారు.

ఫొటో సోర్స్, IMAGE COPYRIGHTETERNAL REEFS
'హ్యూమన్ కంపోస్టింగ్' ప్రక్రియ
కోవిడ్ 19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది తమ ఆత్మీయులను కోల్పోయారు.
ఒక జీవితం ఎంత చిన్నదో కూడా ఈ మహమ్మారి మనందరికీ మరోసారి గుర్తు చేసింది.
దాంతో, చనిపోయిన తరువాత తమ శరీరాలను, అస్థికలను మరింత సృజనాత్మకంగా వినియోగించాలని అనేకమంది ఆశపడుతున్నారు.
ఆ దిశలో సముద్రంలో కాకుండా నేలపైనే తమ అస్థికలు ఉండాలనుకునేవారు సియాటెల్‌కు చెందిన 'రీకంపోజ్' సంస్థ వైపు దృష్టి సారిస్తున్నారు.
రీకంపోజ్ సంస్థ మృతదేహాలను మట్టిగా మార్చే "హ్యూమన్ కంపోస్టింగ్" (మానవ ఎరువు) టెక్నాలజీని అభివృద్ధి పరిచింది.
ఈ పద్ధతిలో, మృతదేహాన్ని ఒక స్టీల్ సిలిండర్‌లో ఉంచి, దానిపై కలప, ఎండుగడ్డి, అల్ఫాల్ఫా అనే పప్పుధాన్యాల మొక్కల ఆకులు, కొమ్మలు చల్లి గట్టిగా మూత బిగిస్తారు.
లోపల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనువుగా, సిలిండర్ ట్యూబ్‌లో కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్, వేడి, తేమ తగు స్థాయిల్లో ఉండేలా రీకంపోజ్ సంస్థ చర్యలు తీసుకుంటుంది.
30 రోజుల తరువాత కంపోస్టింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. తరువాత, సిలిండర్ లోపల మూడు క్యూబిక్ అడుగుల (84,951 క్యూబిక్ సెంటీమీటర్లు) మట్టిని తవ్వి బయటికి తీసి, మరో కొన్ని వారాలు మూత బిగించి ఉంచుతారు. ఆ ఖాళీలో గాలి నిండి మంచి ఎరువు తయారవడానికి ఈ ప్రక్రియ సహకరిస్తుంది.
ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత ఆ మట్టిని వాషింగ్టన్ రాష్ట్రంలోని అడవిలో చల్లుతారు. లేదా ఆత్మీయులకు అందజేస్తారు. ఒక్కోసారి సగం మట్టిని అడవిలో చల్లడానికి తీసుకెళితే, మిగతా సగం వారి ఆత్మీయులు తీసుకెళతారని రీకంపోజ్ తెలిపింది.
ఈ సంస్థను 2017లో కత్రినా స్పేడ్ ప్రారంభించారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి తమ సేవలకు డిమాండ్ పెరిగిందని ఆమె తెలిపారు.
"చనిపోయిన తరువాత ఈ గ్రహానికి ఉపయోగపడే విధంగా మారాలని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఎక్కువమంది ఈ ప్రక్రియ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది వారికి ఆశ, ఓదార్పు కలిగిస్తోందని చాలామంది మాకు చెప్పారు" అని కత్రినా స్పేడ్ వివరించారు.

ఫొటో సోర్స్, RECOMPOSE
ఈ ఏడాది గ్లోబల్ డెత్ కేర్ సేవల రంగం విలువ 110 బిలియన్ డాలర్లు ఉంటుందని 'ది బిజినెస్ రిసెర్చ్ కంపెనీ' తెలిపింది.
2025 నాటికి ఈ రంగం విలువ 148 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
రాను రాను ఎక్కువమంది సాంప్రదాయక అంత్యక్రియలను కోరుకోవడం లేదని, ఫలితంగా ఈ రంగంలో వినూత్న సాంకేతిక పద్ధతులు అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
బ్రిటన్‌కు చెందిన పీటర్ బిల్లింగం 'డెత్ గోస్ డిజిటల్' అనే ఒక పాడ్‌కాస్ట్ నడుపుతున్నారు.
'అంత్యక్రియలు, మరణానంత జీవితం' అంశంలో నిపుణులైన బిల్లింగం, కోవిడ్ మహమ్మరి కారణంగా ఈ రంగంలో టెక్నాలజీ ఆమోదం, వినియోగం పెరిగిందని అంటున్నారు.

ఫొటో సోర్స్, TRIBUCAST
అంత్యక్రియల లైవ్ టెలికాస్టింగ్
కనక్టికట్‌కు చెందిన 'ట్రిబ్యుకాస్ట్' అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
కోవిడ్ కారణంగా ఆత్మీయుల అంత్యక్రియలకు హాజరు కాలేనివారికి ఆ కార్యక్రమాలను లైవ్ చూపించడమే ఈ సంస్థ లక్ష్యం.
ఈ లైవ్ ద్వారా దేశ, విదేశాల్లో ఉన్నవారు కూడా ఆత్మీయుల అంత్యక్రియలను వీక్షించవచ్చు.
లైవ్‌లో చూస్తూ ఉంటే పక్కనే నిల్చుని అన్ని కార్యక్రమాలకు హాజరైనట్లు ఉంటోందని, అది గొప్ప ఓదార్పు కలిగిస్తోందని ఈ సంస్థ సేవలు వినియోగించుకున్నవారు చెబుతున్నారు.
"మా బిజినెస్ నాటకీయంగా పెరిగిపోయింది. ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే వస్తోందని అనుకున్నాం. కానీ, మహమ్మారి కారణంగా మా సేవలకు డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది" అని ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బ్రూస్ లిక్లీ తెలిపారు.
'ట్రిబ్యుకాస్ట్' సంస్థను 2017లో స్థాపించారు.

ఫొటో సోర్స్, JOHN KRAUSE
అంతరిక్షంలోకి అస్థికలు
కొందరు తమ ఆత్మీయుల అంత్యక్రియలను బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ వీక్షించాలని కోరుకుంటే, కొందరు తమవారి అస్థికలు ఉపయోగకరంగా మారాలని కోరుకుంటున్నారు.
మరికొంతమంది అస్థికల వినియోగం నాటకీయంగా ఉండాలని కోరుకుంటున్నారు.
అలాంటివారికి అమెరికాకు చెందిన 'సెలెస్టిస్' సంస్థ గత 20 ఏళ్లుగా సేవలను అందిస్తోంది ఈ సంస్థ చనిపోయినవారి అస్థికలను స్పేస్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతుంది.
"ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ఎక్స్‌లాంటి కమర్షియల్ స్పేస్ ఆపరేటర్ల పుణ్యమా అని, ఈ రంగంలో వస్తున్న అభివృద్ధి కారణంగా మేము ఏడాదికి రెండు లేదా మూడు సార్లు అస్థికలను స్పేస్ మిషన్ల సహాయంతో అంతరిక్షంలోకి పంపుతున్నాం. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్యను మరింత పెంచుతాం" అని సెలెస్టిస్ సహ వ్యవస్థాపకుడు చార్లెస్ షాఫర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: కోవిడ్ కారణంగా తెలుగు రాష్ట్రాల బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత
- డాక్టర్ గురుమూర్తి: తిరుపతి లోక్‌సభ ఎంపీగా గెలిచిన ఫిజియో థెరపిస్ట్
- ఈటల రాజేందర్‌కు ఉద్వాసన... మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగిస్తూ ఆదేశాలు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- నాసా స్పేస్ మిషన్ కమాండర్‌గా హైదరాబాదీ రాజాచారి
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు...
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








