కోవిడ్: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే, వారు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లే

ఫొటో సోర్స్, SOPA Images/gettyimages
- రచయిత, డాక్టర్ శైలజ చందు
- హోదా, బీబీసీ కోసం
కోవిడ్ పరిణామాల వల్ల దాదాపు ఒక ఏడాదిగా పిల్లలు అసాధారాణ పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
సంవత్సరానికి పైగా ఇళ్లలో మగ్గిపోతున్నారు. చదువులు లేవు. స్కూళ్లో చదువులు లేవు.
కబుర్లు చెప్పుకునేందుకు స్నేహితులు లేరు. ఆట పాటలు లేవు.
ఈ పర్యవసానాల వల్ల వారిలో ఒత్తిడి పెరుగుతోంది.
ఇంట్లో తల్లిదండ్రుల కోపతాపాలకు గురవుతున్నారు.
చదువుకుని పరిణతి చెందిన పెద్దవారు సైతం కోవిడ్ సంక్షోభంలో ఒత్తిడికి గురవుతున్నారు.
కానీ ఆందోళన, ఒత్తిడి పదాలు సైతం తెలియని చిన్నారుల మాటేమిటి?
వాళ్లను కాపాడుకోవడం ఎలా? పిల్లలందరూ ఒత్తిడికి ఒకేలా స్పందించరు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కింది లక్షణాలున్నాయేమో గమనించండి.
1. చిన్న పిల్లలలో అధికంగా ఏడుపు లేదా చికాకు.
2. టాయిలెట్ ఆక్సిడెంట్స్ అవుతున్నాయా? (ఉదా: బెడ్ వెట్టింగ్).
3. విచారంగా గడుపుతున్నారా?
4. అతిగా ఆహారం తీసుకోవడం లేదా ఎక్కువగా నిద్ర పోవడం.
5. టీనేజర్లలో చిరాకు, కోపం , అతిగా స్పందించడం.
6. తలనొప్పి లేదా ఇతర శరీర భాగాలలో నొప్పి.
7. మద్యం, పొగాకు లేదా డ్రగ్స్ వాడకం.

ఫొటో సోర్స్, Getty Images
భయాందోళనలు పిల్లలను కబళించకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి.
1. కరోనావైరస్ గురించి తల్లిదండ్రులు తమ పిల్లలతో నిజాలు చెప్పడమే మంచిది. ప్రశాంతంగా మాట్లాడాలి. వ్యాధి లక్షణాలు, జలుబు లేదా ఫ్లూతో సమానంగా ఉంటాయని, వీటి గురించి వారు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని తెలియ జేయాలి.
భయపెట్టడం కన్నా భరోసా ఇవ్వడం మంచిది.
2. వారి సమయాన్ని షెడ్యూల్ చేయడం ముఖ్యం.
పిల్లల విషయంలో, రోజు గడవడానికి ఒక ప్రణాళిక, టైం టేబుల్ ఏర్పాటు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఎంత వరకు చదువుకోవాలి, ఎంత సేపు ఫోనులో స్నేహితులతో మాట్లాడుకోవాలి, ఆటపాటలకూ, ఇంటిపనికి విడివిడిగా సమయం కేటాయించడం వల్ల వారికి నియమబద్ధమైన జీవితం గడుపుతున్న భావన కలుగుతుంది.
3. పాఠశాల మూసివేతలతో స్కూలు కార్యక్రమాలు, ఆట పాటలు, తప్పిపోయినందుకు పిల్లలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బాల్యంలో ఇటువంటివి కోల్పోవడం వారికి జీవితకాలపు నష్టం లా పరిగణించాలి. సైకాలజిస్టుల యొక్క సలహా ఏమిటంటే వారిని విచారంగా ఉండనివ్వండి. మీ బిడ్డని తన భావోద్వేగాలను అనుభవించనివ్వండి.
వారి దుఃఖాన్నీ, నైరాశ్యాన్నీ అర్థం చేసుకుని ఆసరాగా నిలబడండి.
4. కరోనావైరస్ వ్యాధి గురించి చాలా తప్పుడు సమాచారం అందుబాటులో వుంది. అది మీ బిడ్డకు చేరుతున్నదేమో జాగ్రత్తగా పడండి.
ఒకవేళ పెద్దవారికి కూడా సందేహాలుంటే, పిల్లలతో కలిసి సమాధానాలు అన్వేషించడం మంచిది. సమాచార వనరుల కోసం యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి విశ్వసనీయ సంస్థల వెబ్‌సైట్‌లను ఉపయోగించండి.
5. కరోనావైరస్ వ్యాధి పిల్లలు పాఠశాలలో లేదా ఆన్‌లైన్‌లో బెదిరింపులనెదుర్కొంటున్నారు. మీ పిల్లలు బెదిరింపులకు గురి అవుతుంటే, వాటి గురించి పిల్లలు మాట్లాడేలా వారిని ప్రోత్సహించండి. మీరు వారికి అండగా వున్నారన్న భరోసా ఇవ్వండి.
6. టీనేజ్ పిల్లలకు ఎంతో ఖాళీ టైము దొరుకుతోంది. ఆ సమయాన్ని ఎక్కువగా స్క్రీన్ టైము, సోషల్ మీడియా పైన ఖర్చు పెడుతున్నారు.
తలిదండ్రులు ఆ విషయాన్ని వారితో నేరుగా చర్చించడం మంచిది. స్క్రీన్ టైముకు, సోషల్ మీడియాకు ఒక ప్రణాళిక ప్రకారం సమాయాన్ని వాడుకోవాలని సూచించండి.
కుటుంబంలో పెద్దలు , పిల్లలు కలిపి వంట చేసుకోవడం వత్తిడి నుండి ఆటవిడుపులా వుంటుంది.
6. మీ ప్రవర్తనను మీరు గమనించుకోండి.
అన్నిటికన్నా ముఖ్యమైనది, మిమ్మల్ని మీరు వత్తిడి నుండి కాపాడుకోండి.
కరోనా కబళిస్తున్న తీరుతో తల్లిదండ్రులు కూడా తీవ్రమైనా ఆందోళనకు లోనవుతున్నారు. తమ పిల్లల భద్రత పట్ల చాలా కంగారు పడుతున్నారు. "మేము ఆందోళనగా డ్రైవ్ చేస్తున్న కారులో మా పిల్లలు ప్రయాణిస్తున్నారు. అది సురక్షితం కాదని అర్థమవుతోంది." అని ఒక తండ్రి బాధ పడుతున్నాడు.
ఫోన్ల ద్వారా, వీడియోల ద్వారా సన్నిహితులతో సంబంధాలు కలిగి వుండడం వల్ల వత్తిడి ఎదుర్కోవచ్చు.
'వత్తిడికి లోను కావొద్దు' అని ఎవరో చెప్పడం ద్వారా అది తగ్గిపోదు. మానసికంగా మీరు రిలాక్స్ కావడానికి ఎన్నో పద్ధతులు అందుబాటులో వున్నాయి. వాటిని ఆచరించండి.
శ్వాస వ్యాయామాలు (Breathing excersizes) , యోగా, సంగీతం, తోటపని ద్వారా ఆందోళనను తగ్గించుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్యవంత మైన ఆహారం, వ్యాయామం, ప్రశాంతమైన నిద్ర ఒత్తిడి నుండి కాపాడతాయి.
వీటిని మించి , మానవీయత, సరైన ఆలోచనా దృక్పథం, ప్రతి వారికీ చాలా అవసరం . ఆరోగ్యకరమైన ఆలోచనలు వత్తిడిని దూరం చేస్తాయి.
అందరం జీవించాలనే కోరుకుంటాం. ఆ జీవించడంలో ఒక హుందాతనాన్ని పోగొట్టుకోకూడదు.
కోవిడ్ సోకిన వారిని, టెస్ట్ పాజిటివ్ వచ్చిన వారిని వెలివేయడం తప్పు అని తెలుసుకుందాం.
వెలి వేస్తారేమోనన్న భయంతో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు సాధారణం గా తిరగడం వల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందుతోంది.
తోటి వారిపై సానుభూతి కలిగి వుండడం, వత్తిడిని దూరం చేస్తుంది.
ఒకరికి సహాయమందించిన నాడు మనిషి పొందే ప్రశాంతత చాలా విలువైంది.
ప్రతి క్షణం "నేనెలా, నా కుటుంబమెలా?" అన్న ఆలోచన నుండి బయటపడి ఎవరికైనా ఒక చిన్న మంచి మాట చెప్పండి. వీలైన సహాయం చేయండి.
అది అంతులేని సంతృప్తి నిస్తుంది. వేరొకరిని ఆదుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరికొకరు తోడున్నామన్న భావన ధైర్యాన్నిస్తుంది. ఒకరికి భయపడకండి అని చెప్పడం వల్ల ధైర్యం పెరుగుతుంది.
సమస్య పెద్దదే. సమస్యనెదుర్కుంటున్న సమూహమూ పెద్దదే.
ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








