కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?

ఫొటో సోర్స్, Money SHARMA / AFP
- రచయిత, చింకీ సిన్హా
- హోదా, బీబీసీ ప్రతినిధి
హరిద్వారాలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చినవారిలో ఏప్రిల్ 10 నుంచి 14 లోపల 1701 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
ఓ పక్క ఆస్పత్రుల ముందు బారులు తీరి నిల్చున్న జనం కనిపిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, ఆస్పత్రుల్లో పడకలు దొరకక కోవిడ్ బాధితులు అల్లాడిపోతున్నారు.
కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ, తాత్కాలిక లాక్‌డౌన్ నిబంధనలు విధించారు. మళ్లీ వలస కూలీలు ఇంటి బాట పట్టారు. సామాజిక, వ్యక్తిగత కార్యక్రమాల్లో గుంపుగా పాల్గొనకూడదని ఆంక్షలు విధించారు.
మరో పక్క కుంభమేళాలో కిక్కిరిసిన జనం గంగానదిలో పవిత్ర స్నానాలు చేయడానికి క్యూలు కడుతున్నారు.
నదిలో పాపాలు కడుక్కుంటున్నారని, ప్రక్షాళన అని మెయిన్‌స్ట్రీమ్ మీడియా దీన్ని వర్ణిస్తోంది.
కుంభమేళా సురక్షితం అని రాజకీయ నాయకులు అంటున్నారు. ఇందులో పాల్గొన్నవారిపై దేవుడి కృప ఉంటుందని, వారికేమీ కాదని వారి నమ్మకం.
అయితే, కరోనా మాత్రం మునుపెన్నడూ లేని విధంగా తుఫాను వేగంతో కబళిస్తోంది.

ఫొటో సోర్స్, Money SHARMA / AFP
మానవ బాంబు vs ప్రక్షాళన
గత ఏడాది ఇలాంటి మతపరమైన కార్యక్రమం 'తబ్లీగీ జమాత్' దిల్లిలో జరిగింది. ఏడాది తరువాత కూడా, ఇప్పటికీ కరోనా వ్యాప్తికి తబ్లీగీ జమాతే కారణమంటూ అనేకమంది ఆరోపిస్తున్నారు. మీడియా, రాజకీయనాయకులు అందరూ ఇందులో పాల్గొన్నవారిని వేలెత్తి చూపారు. ప్రధాన స్రవంతి మీడియా వారిని 'మానవ బాంబు 'లని అని పిలిచింది.
అదే మీడియా ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా కార్యక్రమాన్ని 'ప్రక్షాళన' అంటోంది.
గత ఏడాది దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌ను, ప్రస్తుతం హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాతో పోల్చవద్దని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ్ సింగ్ రావత్ అన్నారు.
ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, "తబ్లీగీ జమాత్‌కు వచ్చినవారు పెద్ద సంఖ్యలో ఒక భవనంలో గుమికూడారు. ఇప్పుడు కుంభమేళాలో ప్రజలు బహిరంగ ప్రదేశంలో ఉన్నారు. ఇక్కడ తల్లిలాంటి గంగా నది ప్రవహిస్తోంది. ఆమె ఆశీర్వాదాలతో కరోనా మన దగ్గరకు కూడా రాదు. దీన్ని, తబ్లీగీ జమాత్‌తో పోల్చలేం" అని అన్నారు.
గత ఏడాది ఏప్రిల్‌లో కొన్ని మీడియా ఛానళ్లు నిజాముద్దీన్ మర్కజ్‌ను లక్ష్యంగా చేసుకుని "కరోనాజిహాద్" అనే హ్యాష్‌టాగ్ నడిపాయి.
ఈ సమావేశాన్ని బాధ్యతారాహిత్యంగా అభివర్ణిస్తూ, వాళ్లను "తాలిబన్లు" అని పిలిచారు. మర్కజ్ కోవిడ్ హాట్‌స్పాట్ అనీ, కరోనా వ్యాప్తికి వారే కారణమని అభియోగాలు మోపారు.

ఫొటో సోర్స్, Ritesh Shukla/NurPhoto via Getty Image
ఈ సంఘటన తరువాత అనేక చోట్ల ముస్లిం దుకాణదారులను బహిష్కరించారు. ఎక్కడ చూసినా ముస్లింలపై విద్వేష పూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలు కనిపించాయి. మర్కజ్‌లో పాల్గొన్నవారికి కఠిన శిక్షలు విధించాలని ప్రధాన స్రవంతి టీవీ మీడియా అభ్యర్థించింది.
2020 మార్చి 25 నాటికి దేశంలో రోజుకు సుమారు 250 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాంటి సమయంలో తబ్లిగీ జమాత్‌లో అంతమంది గుమికూడడం నేరమని బీజేపీ ఐటీ సెల్ అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 14న అమిత్ మాలవీయ ఒక ట్వీట్ చేశారు. "గత 24 గంటల్లో దిల్లీలో 13,468 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది, ముంబైలో నమోదైన 7,873 కేసులకు రెట్టింపు. దిల్లీలో ఎన్నికలు లేవు. కుంభ్ లేదు. దిల్లీలో కేవలం చేతకాని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉండడం వల్లే ఇలా జరుగుతోంది" అని అందులో రాశారు.
గురువారం దేశంలో అత్యధికంగా రెండు లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. బుధవారం 1,84,372 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం కొత్త ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 2,00,739కు చేరుకుంది.
ఏప్రిల్ 12, 14 తేదీల్లో కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. 12న సోమవతి అమావాస్య రోజున, 14న మేష సంక్రాంతి రోజున విశేష సంఖ్యలో భక్తులు గంగానదిలో స్నానాలు చేశారు.
ఈ రెండు రోజుల్లో 48.51 లక్షలమంది గంగానదిలో పవిత్ర స్నానాలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
వీరెవ్వరూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు.
ఈ కుంభమేళా మరో రెండు వారాలు కొనసాగుతుంది. ఏప్రిల్ 1న ప్రారంభమైన ఈ కుంభమేళా ఏప్రిల్ 30న ముగుస్తుంది.
ఏప్రిల్ 5న దేశంలో తొలిసారిగా ఒక్క రోజులో లక్ష కేసులు నమోదయ్యయి. ఏప్రిల్ 6న ఉత్తరాఖండ్ సీఎం తీర్థ్ సింగ్ రావత్ కుంభమేళాలో కనిపించారు. ఆయన మాస్క్ గడ్డం కిందకు జారి ఉంది.
కుంభమేళాలో పాల్గొనేందుకు అందరినీ అనుమతించాలని ఆయన అన్నారు. మార్చి 20న రావత్ చేసిన ఒక ప్రకటనలో.. "కరోనా పేరు చెప్పి కుంభమేళాకు రాకుండా ఎవరినీ ఆపకూడదు. దేవుడిపై విశ్వాసం వైరస్‌ను హతమారుస్తుందనే నమ్మకం నాకుంది" అని అన్నారు.
మరో పక్క, ఒక టివీ ఛానల్, ఆన్‌లైన్ మీడియా వ్యాఖ్యాత ప్రధాని నరేంద్ర మోదీని "వ్యాక్సీన్ గురు" అని సంబోధిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.
కానీ, ప్రధానికి కుంభమేళాలో అంతమంది జనం గుమికూడడం ప్రమాదకరంగా కనిపించట్లేదు.
అక్కడ కోవిడ్ నిబంధనలన్నీ గాలికి కొట్టుకుపోయాయని స్పష్టంగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, BIPLOV BHUYAN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
మీడియా వైఖరి
ఏప్రిల్ 30 వరకు కుంభమేళా కొనసాగించడంపై మెజారిటీ మీడియా ఎలాంటి అభ్యంతరాలూ లేవనెత్తలేదు.
కానీ, విదేశీ మీడియాలో దీన్ని 'స్పూపర్ స్ప్రెడర్'గా సంబోధిస్తున్నారు. కుంభమేళాలో కోవిడ్ నిబంధనలు గంగలో కొట్టుకుపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కుంభమేళాలో బలవంతంగా భౌతిక దూరం పాటించేట్లు చేస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ ఇన్‌స్పెక్ఠర్ జనరల్ సంజయ్ గుంజ్యాల్ గతంలో ఏఎన్‌ఐకి తెలిపారు.
అయితే, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినవారిని పట్టుకునేందుకు కృత్రిమ మేధ సహాయం తీసుకుంటున్నామని ఇదే పోలీసులు చెబుతున్నారు.
దీనికోసం హరిద్వార్‌లో 350 సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేశారని, వీటిల్లో 100 కన్నా ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్లను అమర్చారని తెలిపారు.
అయితే, కుంభమేళాలో మాస్కులు లేకుండా ఎంతోమంది తిరుగుతున్నారని ఈ కెమేరాలు చూపిస్తున్నాయి. భౌతిక దూరం జాడే లేదు.
గత కొద్ది నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతపరమైన కార్యక్రమాలకు అనుమతిస్తున్నాయి. వీటన్నింట్లో పెద్ద సంఖ్యలో జనం గుమికూడుతున్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ప్రభుత్వ చర్యలపై మెయిన్‌స్ట్రీమ్ మీడియా గొంతు విప్పకపోయినా సోషల్ మీడియాలో పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
కొన్ని మీడియా సంస్థలు మాత్రం తబ్లిగీ జమాత్‌ను గుర్తు చేస్తూ మైనారిటీల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపించాయి.
ధార్మిక సంస్థల నాయకులకు భయపడి ప్రధాని కుంభమేళాను నిరోధించలేకపోయారా? అంటూ అల్-జజీరా ఒక నివేదికలో పేర్కొంది.
ఈ అంశంలో స్వదేశీ మీడియా అధిక భాగం మౌనం వహిస్తోంది.
ఇప్పుడిప్పుడే కొంతమంది సంపాదకులు దీనిపై ప్రశ్నించడం ప్రారంభించారు.
"కుంభమేళా లాంటి కార్యక్రమాలపై ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించాలి. రాజకీయ పార్టీల ర్యాలీలకు కూడా అనుమతించకూడదు. అత్యంగ వేగంతో కరోనా ప్రబలుతున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఆత్మహత్యా సదృశం అవుతాయి. ఇలాంటి మూర్ఖత్వాన్ని ఏ దేవుడూ క్షమించడు. వోటు కన్నా జీవితం ఎంతో విలువైనది" అని ఇండియా టుడే గ్రూప్‌కు చెందిన జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ గురువారం ట్వీట్ చేశారు.
జర్నలిస్టుల వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చింది, ఎందుకంటే కరోనా వారిలో చాలామంది ఇళ్ల తలుపు తట్టిందని సీనియర్ జర్నలిస్ట్ అభిసార్ శర్మ అన్నారు.
బిహార్, ఉత్తర ప్రదేశ్‌లాంటి ప్రాంతాల్లో ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాలు ఎలా కుదేలైపోయాయో వారి కళ్లతో వారు చూస్తున్నారు.
ప్రధాన స్రవంతి మీడియా కుంభమేళాను మతం, సంప్రదాయం దృష్టితో చూస్తోందే తప్ప వైద్య, ఆరోగ్య దృష్టితో చూడట్లేదని ఆయన అన్నారు.
"తబ్లిగీ జమాత్‌కు ముందు రెండు సంఘటనలు జరిగాయి. షాహీన్ బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు, దిల్లీలో జరిగిన అల్లర్లు. ప్రధాన స్రవంతి మీడియా చాలా వరకు వీటన్నిటినీ అధికార పార్టీ కళ్లతోనే చూపించింది. బీజేపీ ప్రచార యంత్రాంగం ముస్లింలను సామాజిక బహిష్కరణకు గురి చేయడమే లక్ష్యంగా పని చేసింది.
కుంభమేళా విషయంలో కూడా ప్రధాన మీడియా ఇదే పద్ధతి పాటిస్తోంది. మొత్తం విషయాన్ని అధికార పార్టీ ఎజెండాలకు అనుగుణంగా చూపిస్తోంది. రంజాన్ సందర్భంగా ఏదైనా కార్యక్రమం జరిగి ఉంటే ఇదే మీడియా గొంతు చించుకుని అరిచి ఉండేది. ఇప్పుడు కుంభమేళా విషయంలో భక్తి, పవిత్ర స్నానాలు అంటూ మతపరమైన కోణాన్ని చూపిస్తోంది.
దేశంలోని మీడియాలో డైవర్సిటీ లేకపోవడమే ఇందుకు కారణం. ఇండియాలోని న్యూస్‌రూముల్లో అధికశాతం ఉన్నత కులాలకు చెందినవారే ఉంటారు. వారంతా బీజేపీకి కొమ్ము కాస్తారు. జర్నలిస్టుల్లో భయం కూడా ఉంటుంది. బీజేపీ అనేక రకాలుగా వాళ్లపై ఒత్తిడి తేవొచ్చు" అని అభిసార్ శర్మ అభిప్రాయపడ్డారు.
"దేశంలో ఎన్నో మతాలున్నాయి. వాటి మధ్య విభేదాలు ఉన్నాయి. గుంపులుగా కూడుతున్న విషయాన్ని అడ్డం పెట్టుకుని మతాలను తూలనాడడం తగదు. కుంభమేళాలో మాత్రమే జనం గుమికూడలేదు. వైశాఖి సందర్భంగా సిక్కులు, రంజాన్ సందర్భంగా ముస్లింలు కూడా మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యారు. నిరోధిస్తే అన్నిటినీ నిరోధించాలి. లేదా అన్నిటినీ అనుమతించాలి" అని మితవాద మాస పత్రిక "స్వరాజ్య్" సీనియర్ ఎడిటర్ స్వాతి గోయల్ శర్మ అన్నారు.
బోర్డు పరీక్షలే వాయిదా వేస్తుంటే కుంభమేళాలో అన్ని లక్షలమందిని అనుమతించడం ఎంతవరకు భావ్యం అని ఎన్‌డీటీవీ ప్రశ్నించింది.

ఫొటో సోర్స్, Sanchit Khanna/Hindustan Times via Getty Images
విషయాన్ని హిందూ-ముస్లిం కళ్లద్దాల నుంచి చూస్తున్న మీడియా
"మీడియా కాషాయం ధరించింది. కరోనా వ్యాప్తి గురించి వారికి ఎటువంటి చింత లేదు. అధికార పార్టీ ఎజెండాలను ముందుకు తీసుకెళ్లడమే వారి లక్ష్యం. మీడియా, విషయాలను హిందు-ముస్లిం కళ్లజోడు పెట్టుకుని చూస్తోంది. తబ్లిగీ జమాత్ అప్పుడు ముస్లింలను విమర్శిస్తూ చెలరేగిపోయింది. ఇప్పుడేమో హిందూ పండుగలు, పవిత్ర స్నానాలు అంటూ నీళ్లు నములుతున్నారు.
అయితే కుంభమేళాలాంటి కార్యక్రమాలు అధిక శాతం హిందువులకే ప్రమాదకరంగా పరిణమిస్తాయని వారికెందుకు బోధపడట్లేదో తెలీదు. అక్కడికి వెళ్ళినవారికే ముందు కరోనా వస్తుంది.
మీడియాలో ఎప్పుడూ ముస్లిం వ్యతిరేక ధోరణి ఉంటూనే ఉంది. కానీ, జాతీయ మీడియాలో కొన్ని నియమాలు పాటించేవారు. ఇప్పుడు అవేమీ లేవు. హిట్లర్ పాలనలో ఉన్న జర్మనీలో ఉన్నామా అనిపిస్తోంది" అని మఖన్‌లాల్ చతుర్వేది యూనివర్సిటీ ప్రొఫెసర్ ముఖేష్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP via Getty Images
ప్రజల్లో మీడియా ప్రజల విశ్వాసం సన్నగిల్లిందని, ప్రత్యామ్నాయ మీడియావైపు ప్రజలు దృష్టి మరలిస్తున్నారని అభిసార్ శర్మ అన్నారు.
ప్రింట్ మీడియా, టీవీ మీడియా కన్నా సోషల్ డిజిటల్ మీడియా నిజాలు చెబుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడిప్పుడే ప్రధాన మీడియా తన వైఖరిని మార్చుకుంటోంది. టైమ్స్ నౌ #StopSuperSpreader అనే పేరుతో వార్తలు ప్రచురిస్తోంది.
ప్రధాన మీడియాలో మార్పు అయితే కనిపిస్తోందిగానీ కుంభమేళాకు వెళ్లినవారిని మానవ బాంబులు, కరోనా జిహాద్ వంటి పేర్లు పెట్టి పిలవడానికి ఇంకా సాహసించట్లేదు.
వాళ్లను భక్తులు, యాత్రికులు అని గౌరవంగానే పిలుస్తున్నారు. ప్రభుత్వం గురించి నిజాలు చెప్పడం అనేది గతించిన మాటగా మారిందని పేరు చెప్పడం ఇష్టం లేని ఒక జర్నలిస్ట్ అన్నారు.
"ప్రజల చావులను కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా వ్యాక్సీన్ వేయించుకునేందుకు భారతీయులు నేపాల్ ఎందుకు వెళ్తున్నారు
- కుంభ మేళా: 'కుంభ్' సంప్రదాయం ఎప్పుడు మొదలైంది... ఈ మేళా చరిత్ర ఏమిటి?
- కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ తీవ్రత ఎలా ఉంది... కేసులు ఇలాగే పెరిగితే ప్రభుత్వ ఏర్పాట్లు సరిపోతాయా?
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- టిప్పు సుల్తాన్ హిందువులకు శత్రువా?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








