ఒమిక్రాన్: భారత్‌ ఆమోదించిన కోవోవ్యాక్స్, కోర్బెవ్యాక్స్‌ కోవిడ్-19 వ్యాక్సీన్ల గురించి మనకు ఏం తెలుసు?

కోవిడ్-19 వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళనల నడుమ తాజాగా మరో రెండు కొత్త వ్యాక్సీన్లకు భారత్ ఆమోదం తెలిపింది.

భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవోవ్యాక్స్, బయోలాజికల్ ఈ సంస్థ తయారుచేసిన కోర్బెవ్యాక్స్‌లకు తాజాగా అత్యవసర వినియోగానికి అనుమతుల జారీచేశారు.

భారత్‌లో ప్రస్తుతం మొత్తంగా ఆమోదించిన వ్యాక్సీన్ల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. వీటిలో మూడింటిని భారత్‌లోనే అభివృద్ధి చేశారు.

దేశంలో ఇప్పటివరకు 163 కోట్ల డోసుల వ్యాక్సీన్లను ప్రజలకు ఇచ్చారు.

2021నాటికి మొత్తంగా ప్రజలందరికీ వ్యాక్సీన్లు వేయాలని భారత్ లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు. కేవలం 68 శాతం మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నారు. ఒక డోసు వ్యాక్సీన్ తీసుకున్న వయోజనులు 90 శాతం వరకు ఉన్నారు.

ఆరోగ్య సిబ్బందికి, అనారోగ్యాలతో బాధపడుతున్న 60ఏళ్లకు పైబడిన వృద్ధులకు జనవరి 10 నుంచి బూస్టర్ డోసు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు.

15 నుంచి 18ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు జనవరి 3 నుంచి వ్యాక్సీన్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

బూస్టర్ డోసు అనేది ఇదివరకు తీసుకున్న వ్యాక్సీన్ ఇస్తారా? లేదా వేరే వ్యాక్సీన్ ఇస్తారా? అనే విషయంలో ఇప్పటివరకు స్పష్టతలేదు.

వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

కొత్త వ్యాక్సీన్లు ఎలా పనిచేస్తున్నాయి?

అమెరికాకు చెందిన డైనావ్యాక్స్, బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ సంస్థల భాగస్వామ్యంలో భారత ఫార్మా సంస్థ బయోలాజికల్-ఈ కోర్బెవ్యాక్స్‌ను అభివృద్ధి చేసింది.

భారత్‌లో అభివృద్ధి చేసిన తొలి ప్రోటీన్ సబ్-యూనిట్ వ్యాక్సీన్ ఇది అని ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. దీన్ని కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్‌తో తయారుచేశారు. మానవ కణాల్లో ప్రవేశించేందుకు ఈ ప్రోటీన్ వైరస్‌కు సాయం చేస్తుంది.

నోవోవ్యాక్స్ స్థానిక నామమే కోవోవ్యాక్స్. దీన్ని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. కోవిషీల్డ్‌ను తయారుచేసిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ద్వయమే ఈ టీకాను కూడా అభివృద్ధి చేశాయి.

అమెరికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో 90 శాతం సామర్థ్యంతో తమ టీకా పనిచేస్తోందని నోవోవ్యాక్స్ తెలిపింది.

18ఏళ్లలోపు వారికి ఇచ్చేందుకు తొలి టీకాను భారత్ ఇదివరకు ఆమోదించింది. మూడు డోసుల్లో ఇచ్చే జైకోవ్-డీ వ్యాక్సీన్.. కోవిడ్-19 సోకే ముప్పును 66 శాతం వరకు తగ్గిస్తుందని తాము చేపట్టిన అధ్యయనంలో తేలినట్లు వ్యాక్సీన్ తయారీ సంస్థ క్యాడిలా హెల్త్‌కేర్ తెలిపింది.

భారత్‌లో పిల్లలపై ప్రయోగ పరీక్షలు చేపట్టిన తొలి వ్యాక్సీన్ తమదేనని క్యాడిలా చెబుతోంది. పిల్లలపై ఈ వ్యాక్సీన్ చక్కగా పనిచేస్తోందని, ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించడంలేదని సంస్థ వివరిస్తోంది.

జైకోవ్-డీ

ఫొటో సోర్స్, ZYDUS CADILLA

కొత్త వ్యాక్సీన్ ఎలా పనిచేస్తుంది?

జైకోవ్-డీ ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 డీఎన్‌ఏ వ్యాక్సీన్. మిగతా వ్యాక్సీన్ల కంటే ఇది భిన్నమైనది.

కరోనావైరస్‌తో ఎలా పోరాడాలో మన రోగ నిరోధక వ్యవస్థకు ఈ డీఎన్‌ఏ వ్యాక్సీన్ నేర్పిస్తుంది.

ప్లాస్మిడ్‌లుగా పిలిచే, వైరస్ జన్యు సమాచారాన్ని కలిగిన, చిన్న డీఎన్‌ఏ రింగులను ఈ వ్యాక్సీన్‌లో ఉపయోగించారు. వీటిని చర్మంలోని పొరల మధ్య ఇస్తారు.

భారత్‌లో సాధారణంగా వ్యాక్సీన్లు ఇచ్చే సూది అవసరం లేకుండా ఇచ్చే తొలి కోవిడ్-19 వ్యాక్సీన్ ఇది. దీన్ని చర్మంలోకి ఎక్కించేందుకు డీస్పోజబుల్ నీడిల్-ఫ్రీ ఇంజెక్టర్‌ను ఉపయోగిస్తారు.

భారత్‌లో ఇప్పటివరకు తాము చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ట్రయల్సే పెద్దవని క్యాడిలా తెలిపింది. 50కిపైగా కేంద్రాల్లో 28,000 మందిపై ఈ ప్రయోగాలు చేపట్టామని పేర్కొంది.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో జైకోవ్-డీ మూడో దశ పరీక్షలు చేపట్టారు. వైరస్ కొత్త వేరియంట్లపై కూడా ఈ వ్యాక్సీన్ సమర్థంగా పనిచేస్తుందని క్యాడిలా చెబుతోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌పైనా పనిచేస్తుందని వివరిస్తోంది.

ఇదివరకు అభివృద్ధి చేసిన డీఎన్‌ఏ వ్యాక్సీన్లు మనుషులపై కంటే జంతువులపై మంచి ఫలితాలు ఇచ్చాయి.

ముఖ్యంగా వ్యాక్సీన్‌లో ఉపయోగించిన ప్లాస్మిడ్ డీఎన్‌ఏ మానవ కణాల్లో ఎలా ప్రవేశపెట్టాలనే విషయంలో తమకు పెద్ద సవాల్ ఎదురైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మూడు డోసుల్లో ఈ వ్యాక్సీన్‌ను ప్రజలకు ఇవ్వడం కూడా మరో ప్రధాన సమస్య. భారత్‌లో ఇప్పుడిస్తున్న ఎక్కువ వ్యాక్సీన్లను రెండు డోసుల్లోనే వేస్తున్నారు. జైకోవ్-డీని కూడా రెండు డోసుల్లో ఇచ్చేందుకు ప్రయోగాలు చేపడుతున్నామని క్యాడిలా తెలిపింది.

భారత్ దేశీయంగా తయారుచేసిన రెండో వ్యాక్సీన్ అయిన జైకోవ్-డీని ఏటా 12 కోట్ల డోసులకుపైగా ఉత్పత్తి చేయాలని క్యాడిలా ప్రణాళికలు రచిస్తోంది. సెప్టెంబరు నాటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

జాన్సన్ అండ్ జాన్సన్

ఫొటో సోర్స్, Getty Images

జాన్సన్ అండ్ జాన్సన్‌కూ

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సీన్‌కు కూడా భారత్ ఆమోదం తెలిపింది.

85 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్న ఈ సింగిల్ డోసు వ్యాక్సీన్‌ను సరఫరా చేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్‌తో భారత్ దేశీయ సంస్థ బయోలాజికల్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్‌లో ఈ వ్యాక్సీన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో ఎలాంటి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. మరోవైపు, ఎప్పటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందో ఇప్పుడే చెప్పలేమని జాన్సన్ అండ్ జాన్సన్ వివరించింది.

భారత్‌లో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన విదేశీ వ్యాక్సీన్లలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సీన్ రెండోది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తోపాటు అమెరికా, ఐరోపా సమాఖ్య, బ్రిటన్, జపాన్‌లలోని ఆరోగ్య ప్రాధికార సంస్థలు ఇప్పటికే ఆమోదం తెలిపిన వ్యాక్సీన్లకు స్థానికంగా మళ్లీ క్లినికల్ ట్రయల్స్ చేపట్టాల్సిన అవసరంలేదని భారత్ ఇటీవల కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

గత జూన్‌లో మోడెర్నా వ్యాక్సీన్‌ను దిగుమతి చేసుకునేందుకు దేశీయ సంస్థ సిప్లాకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ టీకా 95 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ టీకాలు ఇప్పటివరకు భారత్‌కు చేరుకోలేదు.

వ్యాక్సీన్లతో ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తితే చెల్లించాల్సిన రుసుముల నుంచి తమకు రక్షణ ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని మోడెర్నా కోరుతోంది. అయితే, ఇలాంటి మినహాయింపులు ఇప్పటివరకు ఏ సంస్థకూ భారత్ ఇవ్వలేదు.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, EPA/ABIR SULTAN

నోవావ్యాక్స్ కూడా..

మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ టీకా 90 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని తేలినట్లు అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ తెలిపింది.

మరోవైపు భారత సంస్థ బయోలాజికల్-ఈ తయారుచేస్తున్న మరో వ్యాక్సీన్‌ను కూడా 300 డోసులను ప్రభుత్వం ఆర్డరు చేసింది.

నోవావ్యాక్స్

ఫొటో సోర్స్, Reuters

కోవోవ్యాక్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

మొత్తంగా 200 కోట్ల వ్యాక్సీన్లను ఉత్పత్తి చేసేందుకు నోవోవ్యాక్స్‌తో భారత్‌కు చెందిన ఎస్‌ఐఐ ఒప్పందం కుదుర్చుకుంది.

స్థానికంగా ఈ వ్యాక్సీన్‌ను కోవోవ్యాక్స్‌గా పిలుస్తున్నారు. నోవోవ్యాక్స్‌ టీకాను కూడా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకకుండా ఇది వంద శాతం రక్షణ కల్పిస్తుందని అమెరికాలో నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో తేలింది.

30 కోట్ల వ్యాక్సీన్ల కోసం బయోలాజికల్-ఈతో కూడా భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో వ్యాక్సీన్లు తయారీ చేస్తున్న తొలి ప్రైవేటు సంస్థ ఇదే.

అత్యవసర వినియోగానికి అనుమతులు జారీచేయకముందే, 206 మిలియన్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన డైనావ్యాక్స్, బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి బయోలాజికల్-ఈ ఈ టీకాను అభివృద్ధి చేసింది.

స్పుత్నిక్ వి కోవిడ్ టీకా

ఫొటో సోర్స్, Getty Images

స్పుత్నిక్ వి గురించి మనకు ఎంత తెలుసు

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు వేగంగా పెరుగుతున్న సమయంలో రష్యా వ్యాక్సీన్‌కు అనుమతి లభించింది.

రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకా సురక్షితమైనదని, ఇది భారత్‌లో కోవిషీల్డ్ పేరుతో తయారవుతున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌లాగే పనిచేస్తుందని భావిస్తున్నారు.

స్పుత్నిక్ వి వ్యాక్సీన్ కోవిడ్-19 నుంచి దాదాపు 92 శాతం రక్షణ కల్పించగలదని 'ది లాన్సెట్‌'లో ప్రచురించిన మూడో దశ ట్రయల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది.

మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సీన్‌‌ చివరి ట్రయల్స్ ఫలితాలు రాక ముందు కాస్త వివాదాస్పదమైంది.

కానీ ఈ వ్యాక్సీన్‌తో ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పుడు నిరూపితమయ్యిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది ఒక కోల్డ్ టైప్ వైరస్‌ను ఉపయోగిస్తుంది. అది శరీరానికి కరోనావైరస్ చిన్న భాగాన్ని అందించే ఒక కారియర్‌లా, ఎలాంటి హాని కలిగించకుండా పనిచేస్తుంది.

అలా ఈ టీకా వైరస్ జెనెటిక్ కోడ్‌కు తగ్గట్టు శరీరాన్ని సురక్షితంగా ఎక్స్‌పోజ్ చేస్తుంది. ముప్పును గుర్తించి, అనారోగ్యానికి గురవకుండా దానితో ఎలా పోరాడాలో గుర్తిస్తుంది.

టీకా వేసుకున్నాక శరీరం యాంటీ బాడీస్‌ను, ముఖ్యంగా కరోనావైరస్‌తో పోరాడే యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.

అంటే, కరోనావైరస్ నిజంగానే వ్యాపించినపుడు, రోగనిరోధక శక్తి దానితో పోరాడేలా సిద్ధంగా ఉంటుంది.

స్పుత్నిక్ వ్యాక్సీన్‌ను 2 నుంచి 8 సెంటీగ్రేడ్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య (సాధారణ ఫ్రిజ్‌ ఉష్ణోగ్రత) నిల్వ చేయవచ్చు.

రిపోర్టుల ప్రకారం ఈ టీకాను మార్కెటింగ్ చేస్తున్న రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) భారత్‌లోని ఆరు వ్యాక్సీన్ తయారీదారులతో కలిసి 75 కోట్ల డోసుల ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంది.

స్పుత్నిక్ వి కోవిడ్ టీకా

ఫొటో సోర్స్, EPA

కానీ దీని రెండో డోస్ భిన్నంగా ఉంటుంది

స్పుత్నిక్ టీకా రెండు డోసులు వేరువేరుగా ఉంటాయి.

ఈ టీకా మొదటి డోసు వేసుకున్న 21 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలి.

కానీ దీని వెర్షన్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

రెండు డోసులూ కరోనావైరస్ స్పైక్‌ లక్ష్యంగా పనిచేస్తాయి. కానీ రెండు వేరు వేరు వెక్టర్స్(రోగ వాహకాలు) ఉపయోగిస్తాయి. న్యూట్రలైజ్ చేసిన వైరస్ శరీరంలోకి స్పైక్‌ను తీసుకెళ్తుంది.

ఒకే వెర్షన్‌ను రెండు సార్లు ఉపయోగించడానికి బదులు, రోగనిరోధక శక్తిని పెంచడానికి రెండు వేరు వేరు ఫార్ములాలు ఉపయోగించాలనే ఈ ఆలోచన కరోనా వైరస్ నుంచి శరీరానికి దీర్ఘకాలిక రక్షణను అందించవచ్చు.

సమర్థమైనదని నిరూపితం కావడంతోపాటూ ట్రయల్ సమయంలో స్పుత్నిక్ వ్యాక్సీన్ వల్ల ఎలాంటి సీరియస్ రియాక్షన్లు కలగలేదని, ఇది సురక్షితమైనది తేలింది.

ఈ వ్యాక్సీన్ వల్ల కొన్ని సైడ్ ఎపెక్ట్స్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, అవి చాలా తక్కువ. చెయ్యి నొప్పి, అలసట, తేలికపాటి జ్వరం లాంటివి ఉండచ్చు.

ఈ వ్యాక్సీన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో ఎవరికీ తీవ్ర అనారోగ్య సమస్యలు రావడం, చనిపోవడం జరగలేదు.

స్పుత్నిక్ వి టీకాను రష్యాతోపాటూ అర్జెంటీనా, పాలస్తీనా, వెనెజ్వెలా, హంగరీ, యూఏఈ, ఇరాన్ ఇంకా చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు.

భారత్‌లో స్పుత్నిక్ వి టీకా వేయడం కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైంది.

కోవాగ్జిన్

ఫొటో సోర్స్, Getty Images

కోవాగ్జిన్ గురించి మనకు ఏం తెలుసు?

అచేతనం చేసిన కరోనావైరస్ సాయంతో కోవాగ్జిన్‌ను తయారుచేశారు. వైరస్‌ను అచేతనం చేయడంతో దీన్ని శరీరంలోకి ఎక్కించినా మనకు ఎలాంటి హానీ జరగదు.

24ఏళ్లుగా 16కుపైగా వ్యాక్సీన్లను తయారుచేసిన చరిత్ర గల భారత్ బయోటెక్ దీన్ని అభివృద్ధి చేసింది. 123కుపైగా దేశాలకు సంస్థ వ్యాక్సీన్లను ఎగుమతి చేస్తోంది. భారత్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి సేకరించిన అచేతనమైన వైరస్ సాయంతో సంస్థ తాజా వ్యాక్సీన్‌ను తయారుచేసింది.

ఈ వ్యాక్సీన్‌ను తీసుకున్నవెంటనే, దీనిలోని వైరస్‌ను రోగ నిరోధక కణాలు గుర్తుపడతాయి. దీంతో వైరస్‌తో పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి.

నాలుగు వారాల తేడాలో రెండు డోసులను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సీన్‌ను 2 రెండు నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇది 81 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక పరీక్షల్లో తేలింది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకముందే, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు, ఈ వ్యాక్సీన్‌కు భారత్‌ ఆమోదముద్ర వేసింది. దీనిపై చాలా మంది సందేహాలు వ్యక్తంచేశారు.

తమ దగ్గర 2 కోట్ల డోసుల వ్యాక్సీన్లు సిద్ధంగా ఉన్నాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని రెండు పరిశ్రమల్లో మొత్తంగా 70 కోట్ల వ్యాక్సీన్లు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది.

కోవాగ్జిన్

ఫొటో సోర్స్, Getty Images

కోవాగ్జిన్‌పై వివాదం ఏమిటి?

ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి కోవాగ్జిన్‌కు అనుమతులు జారీ చేసినట్లు భారత ఔషధ ప్రాధికార సంస్థ జనవరిలో ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది.

పరీక్షలు పూర్తికాకముందే ఎలా అనుమతులు జారీచేస్తారని, లక్షల మందికి ఆ వ్యాక్సీన్లు ఎలా వేస్తారని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. దీని వెనుక లాజిక్ ఏమిటో తమకు అసలు అర్థం కావడంలేదని ద ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ వ్యాఖ్యానించింది. వ్యాక్సీన్ సామర్థ్యంపై సరైన సమాచారం లేకుండా అనుమతులు జారీచేయడంపై ఆందోళన వ్యక్తంచేసింది.

అటు ఔషధ ప్రాధికార సంస్థ, ఇటు భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ను సమర్థించాయి. ''ఇది సురక్షితమైన వ్యాక్సీన్. శక్తిమంతమై రోగ నిరోధక స్పందనలను ఇది కలుగజేస్తోంది''అని చెప్పుకొచ్చాయి.

కోవీషీల్డ్

ఫొటో సోర్స్, Getty Images

కోవిషీల్డ్ మాటేమిటి?

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ను భారత్‌లో ద సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ. నెలకు ఆరు కోట్లకుపైగా వ్యాక్సీన్లను తాము తయారుచేస్తామని సంస్థ వివరిస్తోంది.

చింపాంజీల నుంచి సేకరించిన సాధారణ జలుబు వైరస్ (అడెనోవైరస్)ను బలహీన పరచడం ద్వారా ఈ వ్యాక్సీన్‌ను తయారుచేశారు. ఈ జలుబు వైరస్‌ను కరోనావైరస్ మాదిరిగా పనిచేసేలా మార్పులు చేశారు. అయితే, దీనితో ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకదు.

ఈ వ్యాక్సీన్‌ను తీసుకున్న వెంటనే, దీనిలోని డమ్మీ వైరస్‌ను కరోనావైరస్‌గా శరీరం భావిస్తుంది. వెంటనే ఇన్ఫెక్షన్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది.

12 వారాల తేడాతో ఈ వ్యాక్సీన్ రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సీన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నిల్వ చేయాల్సి ఉంటుంది.

భారత్‌లో ఎక్కువ మందికి కోవిషీల్డే ఇస్తున్నారు. అయితే, ఈ ఆస్ట్రాజెనెకా దేశీయ వ్యాక్సీన్‌ను వేసుకున్న భారతీయులపై యూకేలో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ వ్యాక్సీన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ, పది రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి. దీనిపై భారత్ నిరసన వ్యక్తం చేయడంతో, తమ విదేశీ ప్రయాణాకుల మార్గదర్శకాలను బ్రిటన్ సవరించింది. కోవిషీల్డ్‌ తీసుకుంటే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరంలేదని బ్రిటన్ స్పష్టంచేసింది.

చాలా దేశాలు ఇప్పటికే ప్రజలకు ఇస్తున్న ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌ను మైనస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. భారత్‌లో వేసవిలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సంగతి తెలిసిందే.

కోవీషీల్డ్

ఫొటో సోర్స్, Getty Images

కోవిషీల్డ్ ఎంత సామర్థ్యంతో పనిచేస్తుంది?

మొదట సగం డోసు, తర్వాత ఫుల్ డోసు తీసుకుంటే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ 90 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.

ఈ సగం-ఫుల్ డోసుల ఐడియాను సమర్థించేందుకు తగిన డేటా అందుబాటులో లేదు.

అయితే, రెండు డోసుల మధ్య ఎక్కువ సమయం ఉంటే, టీకా సామర్థ్యం పెరుగుతందని ఓ అధ్యయనంలో తేలింది. 70 శాతం సామర్థ్యంతో ఇది పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

''బ్రెజిల్, బ్రిటన్‌లలో నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సీన్ మంచి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు తేలింది''అని భారత్‌లో ఈ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ వ్యాఖ్యానించింది. వ్యాక్సీన్ శక్తిమంతమైన రోగ నిరోధక స్పందనలను కలగచేయగలదా? దీని వల్ల ఏమైనా దుష్ప్రభావాలు వస్తాయా? లాంటి అంశాలు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తెలుస్తాయి.

అయితే, భారతీయులపై ''బ్రిడ్జింగ్ స్టడీ'' చేపట్టకుండానే ఆగమేఘాలపై ఈ వ్యాక్సీన్‌కు ఆమోదం తెలిపారని హక్కుల సంస్థ ఆల్ ఇండి డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ వ్యాఖ్యానించింది.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

ఇతర వ్యాక్సీన్లు ఇవీ...

భారత్‌లో పరీక్షల దశలోనున్న ఇతర వ్యాక్సీన్ల వివరాలు ఇవీ

1 జైకోవ్-డీ వ్యాక్సీన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన జైడస్-క్యాడిలా అభివృద్ధి చేస్తోంది.

2 హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ అమెరికాకు చెందిన డైనావ్యాక్స్, బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి ఓ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తోంది.

3 భారత్‌లో తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్‌ హెచ్‌జీసీవో19ను సియాటెల్‌కు చెందిన హెచ్‌డీటీ సంస్థతో కలిసి పుణెకు చెందిన జెనోవా సంస్థ అభివృద్ధి చేసింది. వ్యాధి నిరోధక స్పందనలను ప్రేరేపించేందుకు దీనిలో జన్యు కోడ్‌ను ఉపయోగించారు.

4 ముక్కు ద్వారా వేసే ఓ వ్యాక్సీన్‌ను కూడా భారత్ బయోటెక్ సిద్ధం చేస్తోంది.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

ఏఏ దేశాలకు భారత్ వ్యాక్సీన్లు అందిస్తోంది?

లాటిన్ అమెరికా, కరీబియన్ దీవులు, ఆసియా, ఆఫ్రికాల్లోని 86 దేశాల కోసం 6.4 కోట్ల డోసులను భారత్ అందించింది. మరోవైపు అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో తదితర దేశాలకూ భారత్ వ్యాక్సీన్లను సరఫరా చేసింది.

కొన్ని కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సీన్‌లను గిఫ్ట్‌ల రూపంలో భారత్ అందిస్తోంది. మరికొన్నింటిని వాణిజ్య ఒప్పందాల రూపంలో వ్యాక్సీన్ తయారీ సంస్థలు ఎగుమతి చేస్తున్నాయి. ఇంకొన్నింటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమం కోవాక్స్ కింద సరఫరా చేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి 190 దేశాలకు రెండు బిలియన్ డోసులను కోవాక్స్ కింద సరఫరా చేయాలని డబ్ల్యూహెచ్‌వో భావిస్తోంది.

మార్చిలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ఎగుమతులపై భారత్ తాత్కాలికంగా నిలుపుదల విధించింది. భారత్‌లో కేసుల పెరుగుతుండటంతో డిమాండ్‌కు అనుగుణంగా దేశీయ అందుబాటు పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

(ఈ కథనాలు హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)